Unknown
అరణ్య పర్వముప్రథమాశ్వాసము-1
క.
తిలలును నీళ్ళును వస్త్రం, బులుఁ బుష్పసుగంధవాసమున సౌరభముం
బొలు పెసఁగ దాల్చుఁ గావున, నలయక సత్సంగమమున నగు సద్గుణముల్.6
పాండవులు నిజాయుధములు ధరించి ద్రౌపదీ సహితముగ అరణ్యవాసమునకు బయలు దేరినప్పుడు పౌరులెల్లరు దుఃఖితులై ఇలా అంటున్నారు. నువ్వులు, నీళ్ళు, వస్త్రములు పుష్పముల సుగంధం చేత సౌరభాన్ని తాల్చుతాయి.అలానే సత్సంగము వలన అలుపు లేకయె సద్గుణములు కలుగుతాయి.

శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

క.
శోకభయస్థానంబు , నేకంబులు గలిగినను విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి, వేకముగలవాఁడు బుద్ధివికలుండగునే.20

శోకము, భయము కలుగు స్థానంబులు అనేకమున్నా వివేకం లేనివాఁడు వ్యాకులత్వము నొందినట్లుగా వివేకము కలవాఁడు వ్యాకులత్వము నొందునే.
Unknown
సభాపర్వము-ప్రథమాశ్వాసము-1
మయుడు మయసభను నిర్మించి పాండవులకిచ్చి వెళ్ళిన తరువాత చాలా మంది మునీశ్వరులు ధర్మరాజును చూడటానికి వస్తారు.
సీ.
సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్యగోపతి గోపవేష మైత్రేయ పవిత్ర పాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞ్యవల్క్య
ఆ.
వాయుభక్ష భార్గవవ్యాస జైమిని, శుక సుమంతు పైల సువ్ర తాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు, రమ్య మయిన ధర్మరాజుసభకు.21

నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట
ఉ.
నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడునొక్కొ యంచు వి
స్మేరమనస్కు లై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి సురేంద్ర మందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్.23

ప్రజలంతా నీరజమిత్రుడు భూమి మీదకు ఎందుకు వచ్చాడో అని ఆశ్చర్యమనస్కులై ఆతని ప్రకాశాన్ని మెచ్చుకొని చూస్తుండగా ఆకాశ మార్గము నుండి నారదుడు ఇంద్రునిమందిరాన్నే తన విలాసముతో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్న అర్జునుని ఇంటికి ప్రేమతో వచ్చాడు.

పర్వత పారిజాత రైవత సుముఖు లను మహా మునులతో కలసి వచ్చాడట నారదుఁడు.25
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౧

సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంప గూడ దని చెప్పుట
చ.
పలికిన చందముల్ నెఱపి పైతృక మై చను రాజ్యభాగ మి
మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్ నెఱపం గడంగు వీ
రలు నొరు వేఁడఁ బోదురె యరాతులు సాధుల మెత్తురే రణం
బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొక రాజధర్మముల్. 26

విరాటు కొలువులో అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తదుపరి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలో నిర్ణయించడానికి కూడిన సభలో సాత్యకి ' అన్నమాట ప్రకారం నడచుకొని పిత్రార్జితమైన రాజ్యభాగం కోసం బలమూ చలమూ కలిగిన ఈ పాండవులు ఒకరిని యాచించబోరు.శత్రువులు సాధువులైనవారిని మెచ్చుకుంటారా? యుద్ధములో జయలక్ష్మిని చేకొనుటను యింకో రాజధర్మమేదయినా పోలునా?' అంటాడు.

యుద్ధము వలనగాని రాజ్యభాగము సిద్ధించదు అంటూ ద్రుపదుడు ఇలా అంటాడు.
క.
మృదుభాషణములదుర్జన, హృదయములు ప్రసన్నతామహిమఁబొందునె యె
ల్లిదముగఁ గొని యంతంతకు, మద మెక్కుంగాక దురభిమానము పేర్మిన్. 35

మెత్తనిమాటల వలన దుర్జనులైన కౌరవుల హృదయాలు ప్రసన్నం కావు. తేలికగా తీసుకుని అంతకంతకూ దురభిమానంతో మద మెక్కుతారు.

దుర్యోధనుడు అర్జునుడు కృష్ణ సహాయాన్నర్థించి వచ్చిన ఘట్టంలో నారాయణాభిధానులు పది వేల సైన్యం ఒకవైపు (వారందరూ యుద్ధం చేస్తారు) , తా నొకడూ ఒకవైపుగా(తాను ఆయుధాన్ని పట్టడు) విభాగం చేసి--
క.
వారొక తల యే నొక తల , యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె
వ్వారికిఁ జెప్పుడు తొలితొలి, గోరికొనన్ బాలునికిఁ దగుం బాడిమెయిన్. 75
ముందుగా వయసులో చిన్నవాడైన అర్జునుడు కోరుకోవటం న్యాయం అంటాడు కృష్ణుడు.

ఈ ఘట్టంలో కొస్తే తిరుపతి వేంకటకవుల పాండవ ఉద్యోగ విజయాల పైకే మనసు పరిగెట్టుకు పోతుంది.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-1
ఉ.
శ్రీ యన గౌరి నాఁ బరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబు వైదిక
ధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్. 1
క.
వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్
వా దైన చోటులకు దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్. 4

భారతాన్ని పంచమ వేదం అంటారు. అది వేదములకు, అన్ని స్మృతులయొక్క వాదములకు చాలా పురాణ వర్గములలోని విరోధం కలిగించు చోటులకు, ధర్మార్థకామమోక్షాలకు, ప్రమాణము వంటిది.

ఉ.
ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశ పర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వవిశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్. 6


ఆదరింపదగినదై సారవంతమై వివిధములైన అర్థములను ప్రాప్తించు స్ఫురణము కలిగి పదునెనిమిది పర్వములతో శోభించుచున్నదై వుండగా దానిలో ఆదిపర్వము మొదలు మూడు పర్వములను ఆంధ్రకవిత్వ విశారదుడు,విద్యాదయితుడు, మహితాత్ముడు ఐన నన్నయభట్టు దక్షతతో తెలుగు చేసాడు.


మ.
హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జన సంప్రార్థ్యంబు లై పెంపునం
దుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్. 7

హృదయాహ్లాదాన్ని కలిగించి గొప్పదైన నాల్గవ కథతోకూడుకున్నవిరాట పర్వము ఉద్యోగ పర్వము మొదలుగాగల మిగిలిన పదిహేను పర్వాలను తెనుఁగు బాసలో జనులచే ప్రార్థింపబడినవై పెంపు వహించేలా చివరివరకూ రచియించటం ఒప్పుతుంది. అలా చేస్తే పండితులందరూ సంతోషిస్తారు.అని తిక్కన సోమయాజి గారు నిర్ణయించుకొన్నారు.
Unknown
శాంతి ప్వము-ప్రథమాశ్వాసము-4
నకులుడు ధర్మజునకు మనస్తాపోశమంబు చేయుట.
క.
తక్కినమూఁడాశ్రమములు, నొక్క దెస గృహస్థధర్మ మొక దెసఁదులయం
దెక్కింప వానితో , య్యొక్కటి సరిదూగె నందు రుర్వీశ బుధుల్.76

వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు.అవి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమము. వీనిలో ఒక తక్కెడలో గృహస్థం ఒకవేపు, మిగిలిన మూఢు ఒకవేపు ఉంచి తూచితే గృహస్థాశ్రమం మిగిలిన మూడింటితో సమానంగా తూగినదని పెద్దలు చెపుతారు.అదీ గృహస్థాశ్రమం యొక్క గొప్పదనం.అది మిగిలిన ౩ ఆశ్రమాలకీ ఆధారభూతం.కావున గృహస్థధర్మంబు ఆచరణీయం.
క.
జతనంబున నర్థము సం, చితముగఁ గావించి క్రతువిశేషంబుల దే
వతలం దృప్తులఁ జేయమి, యతికిల్బిషకారి యందు రాగమవేదుల్.78

ప్రయత్నములద్వారా ధనాన్ని బాగుగా కూడబెట్టి క్రతువుల నొనరించుటతో దేవతలను సంతృప్తులను చెయకుండుట ఎక్కువ పాపమును కలిగించునని ఆగమ శాస్త్రవేదులు అంటారు.
క.
పరుల వధింపక యెవ్వఁడు, ధర యేలెం జెపుమ పూర్వ ధరణీశులలోఁ
బొరయరు పాపము సుగతిక, యరిగిరి వా రీవు నట్ల యగు టొప్పు నృపా.81

పూర్వ రాజులలో పరులను వధించకుండా ఏరాజు రాజ్యాన్ని పరిపాలించాడో చెప్పు.వారందరూ సుగతినే పొందారు. నీకూ అలానే చేయటం మంచిది.
క.
రక్ష ప్రజ గోరు నిజయో, గ క్షేమార్థముగ జనసుఖస్థితి నడపన్
దక్షుఁ డగు రాజు నడప కు, పేక్షించినఁ బాప మొందదే కురుముఖ్యా.82

ప్రజలు రాజు వలని రక్షణను కోరుకుంటారు.అందరూ సుఖంగా వుండేలా అందరికి క్షేమం కలిగేలా దక్షుడైన రాజు పరిపాలించాలి, అలా చేయకపోతే పాపము కలుగుతుంది కదా రాజా.
Unknown
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-3
అర్జునుడు ధర్మరాజుకు చేయు ఉపదేశం నుండి--
క.
ఫలములయెడ బ్రహ్మార్పణ, కలనపరుం డగుచుఁ గార్యకర్మము నడపన్
వలయుం తత్త్వజ్ఞానము, తలకొనినం గర్మశమము తానై కలుగున్.69

ఫలితములయెడ బ్రహ్మార్పణ చేయుట కలుగుచు కార్యకర్మముల నిర్వహణ మొనర్చుటకు తత్త్వజ్ఞానము కావలయును. ఆలోచించగా కర్మ తానే శమము ఐ వుంటుంది.
ఒకప్పుడు ఇంద్రుడు గరుడుని రూపములో కొందఱు బ్రాహ్మణులు సత్పథ మేది యని అడిగితే దానికి సమాధానం చెపుతూ ఇలా అంటాడు.
తే.
యనిన నలుగాలివాన గోవును నశేష, శబ్దములమంత్రమును లోహజాతిఁ గాంచ
నమును మనుజుల విప్రుండు సమధికత్వ, భాజనములండ్రు వేద ప్రపంచవిదులు.71

నాలుగు కాళ్ళ జంతువులలో- గోవు, శబ్దచయములో- మంత్రము, లోహములలో- బంగారము, మనుష్యులలో - బ్రాహ్మణుడు ఇవి మిక్కిలి యధికమైనవి అని వేదప్రపంచాన్ని తెలిసిన వారు అంటారు.
వ.
ఇట్లుత్తముం డైన విప్రుం డుత్తమమంత్రోపాశ్రితంబు లగు విహిత కర్మంబులు నడపుట రత్న కాంచనసాంగత్యంబునుబోలె సంస్తుత్యం బై యుండు నాలస్యంబునఁ గ్రోధంబున శోకంబునఁ దదనుష్ఠానంబు విడుచుట పాతకం బజ్ఞానులగు నర్థహీనుల సన్న్యాసకాల వివేకంబు లేక వేగిరపడి యుభయ భష్టు లగుదురు. గృహస్థ ధర్మంబున వర్తించి యతిథి దేవ పితృ సంతృప్తి చేయుచు శిష్టాన్నభోజనపరు లగు పుణ్యులకుం బుణ్యలోకంబు లఱచేతిలోనివి కావె బ్రహ్మార్పితంబయిన సత్కర్మ కలాపంబు మహానందంబుఁ జేయు.72

ఈవిధంగా ఉత్తముడైన బ్రాహ్మణుడు మంచి మంత్రోపాశనతో కూడిన తనకు విధింపబడిన కర్మములను చేయుట రత్నం బంగారంతో కూడివున్నట్లుగా స్తుతింప దగినదై వుంటుంది. సోమరితనము, కోపము, శోకముల వల్ల ఆ అనుష్ఠానాన్ని విడిచి పెట్టటం పాపము. అజ్ఞానులైన ధనహీనులు విడిచి పెట్టాల్సిన కాల వివేకము లేనివారై ఉభయ భ్రష్టత్వాన్ని పొందుతారు. గృహస్థ ధర్మాన్నిఅనుసరించుచు, అతిథి, దేవ, పితృ దేవతలను సంతృప్తి పరుస్తూ శిష్టాన్న భోజనపరు లైన పుణ్యులకు పుణ్యలోకములు అఱచేతిలోనివే కావా. బ్రహ్మార్పితమైన సత్కర్మ కలాపము మహానందాన్ని కలిగిస్తుంది కదా.
Unknown
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-2
అర్జునుడు ధర్మజున కుచితవచనంబుల మనస్తాపోశమంబుచేయుట
వంశ--
ఆ.
ధర్మ మెడలఁ గృపణకర్మంబుఁ గోరి త,ర్థంబు సువ్వె సకలధర్మ కారి
యొడమి లేనివాఁడు నడపీనుఁ గను నహు,షోక్తి వినమె దాని నూఁదవలదె.49

నీవు వంశధర్మాన్ని(క్షత్రియ ధర్మం) విడిచి పెట్టి నీచమైన ధర్మాన్ని కోరుతున్నావు. ధనమే కదా సకలధర్మాలను కలుగజేసేది. ధనము లేనివాఁడు నడిచే శవము అనే నహుషుని మాట విన్నదే కదా. దాన్నే ప్రమాణంగా స్వీకరించాలి కదా. (డబ్బు లేనివాడు డుబ్బుకు కొఱగాడు -ఇది మన తెలుగు సామెత)
క.
సరిగా నెన్నుదు రార్యులు, దరిద్రునిం బతితునిం గతఘ్నుని జడునిన్
దొరకొను ధర్మముఁ గామముఁ, బరమగతియు నర్థమునన పౌరవముఖ్యా.50

ఓ రాజ్యాధిపతీ - పెద్దలు ధనము గలవానిని సరిగా గుర్తిస్తారు. దరిద్రుని, పతితుడిని, కృతఘ్నుడిని, జడునిని ధర్మము కామము కూడా విడిచిపెడతాయి. ధనము వలననే పరమ ప్రాప్తి కూడా కలుగుతుంది.
క.
కలిమియ చుట్టలఁ జేర్చుంఁ, గలిమియ చెలులను ఘటించుఁ గలిమియ శౌర్యో
జ్జ్వలుఁ డనిపించుం గలిమియ, పలువురు సద్బుద్ధి యనఁగఁ బరఁగం జేయున్.51

కలిమే బంధువులను దగ్గర చేస్తుంది. కలిమే స్నేహితులను కలుపుతుంది. కలిమే అందరిచేతా పరాక్రమ వంతుడనిపించేలా చేస్తుంది.కలిమే ఎక్కువమంది సద్బుద్ధుడని పొగడేలా చేస్తుంది.
క.
ఏవానిబంధుమిత్త్రులు, జీవధనంబులును డప్పిఁ జెందును గృశునిం
గా వాని నెన్నఁగా దగుఁ, గేవలతనుకార్శ్యయుతుఁడు కృశుఁడె నరేంద్రా.52

కేవలం శరీరం మాత్రం కృశించి పోయినవాడు కృశుడుగా పరిగణింప బడడు- ఎవరికి బంధుమిత్రులు, బ్రతకడానికి ఉపయోగపడే ధనము ఉండదో వానినే కృశునిగా ఎన్నుతారు అందరూ.
వ.కావున నర్థోపార్జనంబును బంధుమిత్ర పరితోషణంబును భూపతులకుం బరమ పురుషార్థంబు. అదియునుం గాక ......53

Unknown
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-1 బ్రహ్మాస్త్రదానమునకు అర్హుల గురించి ద్రోణుడు కర్ణునితో--

తే.
వ్రతసమన్వితభూసురవర్యుఁ డొండె, నిరుపమానతపఃపుణ్యనృపతి యొండెఁ
గాని యన్యులు బ్రహ్మాస్త్రదానమునకుబాత్రములు గారు నీకు నీఁ బాడిగాదు.19

వ్రతములను ఆచరించు బ్రాహ్మణుడుగాని, గొప్ప తపఃపుణ్యఫలము కలిగిన రాజు గాని , వీరిరువురు తక్క ఇతరులు బ్రహ్మాస్త్ర దానమునకు అర్హులు కారు.అందుచేత నీకు ఇవ్వటం న్యాయం కాదు. అందుచేత ద్రోణుడు కర్ణునకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పలేదు. కర్ణుడు తరువాత దానిని పరశురాముని దగ్గర పడసినా ఆయన ఇచ్చిన శాపం వలన అది అతనికి ఉపయోగపడలేదు.
నారదుడు ధర్మరాజాదులకు కర్ణుని చావునకు చెప్పిన కారణాలు:
చ.
వినుము నరేంద్ర విప్రుఁ డలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనము చేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁ డర్ధరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్ర రా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డటఁ జంపెఁ గర్ణునిన్.35

రాజా విను.కర్ణుని చావునకు ౭ కారణాలు ఉన్నాయి.
౧.బ్రాహ్మణ శాపము-కర్ణుడు పరశురాముని యొద్ద విద్యాభ్యాసము చేస్తున్నప్పుడు ఒక మహా ద్విజుని ఆవుదూడ కర్ణుని బాణం తగిలి చనిపోతుంది. దానితో అతడు కోపించి శాపమివ్వటం చేత యుద్ధంలో కర్ణుని రథచక్రాలు భూమిలో దిగబడి పోతాయి.
౨.పరశురాముని శాపము- బ్రహ్మాస్త్రం కోసమని కర్ణుడు పరశురామునితో తాను బ్రాహ్మణుడనని అబద్ధమాడి విద్యాభ్యాసం చేస్తుండగా- గ్రస్తుడు అనే రాక్షసుడు కీటకరూపంలో కర్ణుని తొడ క్రిందిభాగాన్ని తొలుస్తుండగా గురునిద్రాభంగానికి వెరచి కర్ణుడు తన తొడమీద తల పెట్టుకుని నిద్రిస్తున్న గురువును నిద్ర లేపడు. తరువాత విషయాన్ని గ్రహించిన భార్గవుడు కర్ణుడు బ్రాహ్మణుడు కాదని అతని ముఖతః తెలుసుకొని నేర్చుకున్న విద్య సమయానికి అతనికి ఉపయోగపడదని శాపం ఇస్తాడు.
౩.ఇంద్రుని వంచన- ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడు.
౪. కుంతి వరమనికోరి కర్ణునకు తన జన్మ వృత్తాంతం చెప్పి అర్జునిని మీది కోపాన్ని తగ్గేలా చేసింది.
౫. భీష్ముడు కర్ణుని అర్థ రథుడని ప్రకటించి అతనిని కించపరచాడు.
౬. శల్యుడు అనుచితమైనమాటలాడి సారధ్యం చేస్తున్నపుడు కర్ణుడిని బలహీన పరుస్తాడు.
౭. శౌరియే విధి అయ్యాడు.
ఈ పై కారణాలన్నింటి వలన అర్జునుడు కర్ణుని చంపగలిగాడు.

ధర్మరాజు స్త్రీలకు రహస్యరక్షణంబు లేకుండా శాపమిచ్చుట

కుంతీ దేవి కర్ణుని జన్మవృత్తాంతమును చివరివరకూ దాచిపెట్టడం వలన కలిగిన అనర్ధాన్ని తలపోసి ధర్మరాజు ---
తే.
అంగనాజనమ్ములకు రహస్యరక్ష, ణంబునందలిశక్తి మనంబులందుఁ
గలుగ కుండెడు మెల్లలోకముల నని శపించె నాధర్మ దేవతా ప్రియసుతుండు.41

స్త్రీలకు రహస్యాన్ని మనసులో దాచిపెట్ట గలిగిన శక్తి ఇదిమొదలుగా కలుగకుండా ఉండుగాక అని ధర్మదేవత ప్రియపుత్రుడైన ధర్మరాజు అన్ని లోకములవారికి శాపమిస్తాడు. అప్పటి నుండే 'ఆడవారి నోటిలో నువ్వుగింజ నానదు/దాగదు' అనే సామెత వాడుకలో కొచ్చిందనుకుంటాను.