Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-3
కర్ణుఁడు జనియించి సూతగృహంబు సేరుట
చ.
సలలిత మైన పుట్టుఁ గవచంబు నిసర్గజ మైనకుండలం
బులయుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం
డలమొకొ భూతలంబున బెడం గయి దీప్తిసహస్రకంబుతో
వెలిఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగు చుండఁగాన్. 26

సహజమైన కవచకుండలాలతో సూర్యమండలమే భూమి మీదకు అవతరించిందా అన్నట్లుగా సహస్రకిరణాలతో ప్రకాశిస్తూ కర్ణుడు పుట్టాడట.
వ.
అంత నాదిత్యుం డాకాశంబున కరిఁగిన గొడుకుంజూచి కుంతి తద్దయు విస్మయంబంది యెద్దియునుం చేయునది నేరక. 27

ఈ ఘట్టంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి గారిని తలుచుకోకుండా వుండటం సాధ్యం కావటం లేదు.
వారి కుంతీ కుమారిలో ఇదే ఘట్టాన్ని వారు ఎంత హృదయంగమంగా పెంచి పోషించి వ్రాసారో ఓసారి చూద్దాం.
చ.
అది రమణీయ పుష్పవన - మావనమం దొక మేడ - మేడ పై
నది యెక మాఱుమూలగది - ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడి కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్. 1

నన్నయ గారి కుంతిని సినిమాలో ఓ అందమైన సీనరీని చూపిస్తున్నట్లుగా ప్రతి చిన్న డిటెయిలును మిస్ కాకుండా
కరుణరస పూరితంగా ఓ క్రమాన్ని పాటిస్తూ అలతి అలతి పదాలతో ప్రారంభం చేసారు పాపయ్య శాస్త్రిగారు. ఆంధ్రజాతి ఈ ఇద్దరు కవులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతుందో నాకు తెలియదు. ఇంకా చెప్తున్నారు చూడండి.
ఉ.
కన్నియలాగె వాలకము కన్పడుచున్నది - కాదు కాదు - ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో - పసిబిడ్డ డున్నయ
ట్లున్నది - ఏమి కావలయునోగద ఆమెకు - అచ్చుగుద్దిన
ట్లున్నవి - రూపు రేక - లెవరో యనరా దత డామె బిడ్డయే ! 2

మన తెలుగు నుడికారాన్ని తెలుగు తనాన్ని ఎంత బాగా ఆవిష్కరించారో చూడండి. పోలికలు అచ్చుగుద్దినట్లున్నవట. అందుచేత ఆ బిడ్డ ఎవరో అనాల్సిన పని లేదట. అతడామె బిడ్డయే నట. ఎంతబాగా చెప్పారో చూడండి.
గీ.
దొరలు నానంద బాష్పాలొ - పొరలు దుఃఖ
బాష్పములొ గాని గుర్తుపట్టలేము:
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కు టద్దాల మీద! 3

చూడండి సస్పెన్సును ఎంతందంగా మెయిన్ టెయిన్ చేస్తున్నారో. ఇప్పటికింకా ఆమె ఎవరో ఆమె పేరేమిటో ఇంకా మనకు చెప్పలేదాయన.
ఉ.
పొత్తులలోని బిడ్డనికి పుట్టియుపుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుం గవచకుండలముల్ గయిసేసినారు ! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చలి యెచ్చటి కేగుచున్నదో! 4

పొత్తులలోని బిడ్డ - నెత్తురుకందు - మేల్ పుత్తడి తమ్మి మొగ్గ - ముద్దులు మూటగట్టు - ఈ ముద్దులు మూటలు గట్టే పదబంధాలతో మనల్నందరినీ కట్టి పడేస్తున్నారు శాస్త్రిగారు. ఇప్పటికి కథ మనకు కొంచెం కొంచెం అర్థం అవుతోంది. చెప్పబోయేది కర్ణుడిని గురించని.
గీ.
గాలితాకున జలతారు మేలిముసుగు
జాఱె నొక్కింత - అదిగొ ! చిన్నారి మోము !
పోల్చుకొన్నాములే ! కుంతిభోజ పుత్త్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీ కుమారి !! 5

అమ్మయ్య ! చివరి కెలాగయితేనేం సస్పెన్సు విడిపోయింది. ఆవిడెవరో మనందరం పోల్చుకోగలిగాం. ఎవరో కాదు ఆ స్నిగ్ధసుకుమారి(ఎంత సుకుమారమైన పదబంధం) కుంతి భోజుని కూతురు కుంతీకుమారి యే! మనకు బాగా తెలిసిన మనమ్మాయే !
మ.
కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ, ఆ తోట వెం
బడి పాఱుచున్నయది బ్రహ్మాండమ్ముగా - అల్ల దే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంగూడ ని
య్యెడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్. 6

ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి మళ్ళీ నన్నయ గారి దగ్గర కెళ్దాం. ఆయనేం చెప్పారో కూడా చూద్దాం.

తరువోజ.
ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్ర శక్తి యే నెఱుఁగంగ వేఁడి
యేల పుత్త్రకుఁ గోరి యెంతయుభక్తి నినుఁ దలంచితిఁ బ్రీతి నినుఁడును నాకు
నేల సద్యోగర్భ మిచ్చెఁ గుమారుఁ డేల యప్పుడ యుదయించె నిం కెట్టు
లీలోకపరివాద మే నుడిగింతు నింతకు నింతయు నెఱుఁగరె జనులు. 28

నన్నయగారు తరువోజ నెన్నుకున్నారు. దానికి మన శాస్త్రిగారు మత్తేభా న్నెన్నుకున్నారు.
మ.
" ముని మంత్రమ్ము నొసంగ నేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితినిబో ఆతండు రానేల ? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల ? ప
ట్టెనుబో పట్టి నొసంగనేల ? అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్. 7

నన్నయ్యగారి తరువోజకు శాస్త్రిగారద్దిన మెరుగులు చూడండి. నన్నయ గారు కర్ణుడిని కన్నియకు పుట్టిన కానీనుడన్నారు. కాని మన శాస్త్రిగారు మటుకు సూర్యుడు కుంతిని చేపట్టినట్లుగనే వ్రాసారు. కానీనుడుగా కర్ణుడిని చూపటం ఆయనకిష్టం లేదల్లే ఉంది. ఈలోకపరివాదాన్నెలా ఉడిగించగలనని నన్నయగారి కుంతి వాపోతే శాస్త్రిగారి కుంతి మటుకు అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ అని వాపోతుంది. మన తెలుగు పలుకుబడిని మరింతందంగా చెప్పారు శాస్త్రిగారు. మళ్ళీ నన్నయ గారి దగ్గర కెళ్దాం. ఈసారి ఆయన వసంత తిలకాన్నెత్తుకున్నాడు.
వసంత తిలకము.
ఈబాలు నెత్తికొని యింటికిఁ జన్న నన్నున్
నాబంధు లందఱు మనంబున నే మనారె
ట్లీబాలు సూర్యనిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధి వుట్టు నని కన్య మనంబులోనన్.29
అనారు=అనరు
కర్ణుడిని అక్కడే వదలి వెళ్ళిపోదామనుకుంది నన్నయ గారి కుంతి.
కాని శాస్త్రిగారి కుంతి ఇంకోలా అనుకుంది చూడండి.
ఉ.
ఏయెడ దాచుకొందు నిపు డీ కసిగందును ! కన్నతండ్రి "చీ
చీ" యనకుండునే ? పరిహసింపరె బంధువు ? లాత్మ గౌరవ
శ్రీ యిక దక్కునే ? జనులు చేతులు చూపరె ? దైవయోగమున్
ద్రోయగరాదు - ఈ శిశువుతో నొడిగట్టితి లోకనిందకున్.8

ఇంకా ఇలా కూడా అనుకుంటుంది శాస్త్రిగారి కుంతి.
గీ.
"ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీ మేను మోతు ? గంగాభవాని
కలుషహారిణి - ఈ తల్లి కడుపులోన
కలిసిపోయెద - నా కన్న కడుపుతోడ."9

ఇక్కడ శాస్త్రిగారు మూలాన్ని అధిగమించి కుంతి బేలతనాన్ని ఆవిష్కరించారు. నన్నయ గారి కుంతి పిల్లాడిని వదలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటే దాన్ని పరిహరించి తను చేసిన తప్పునకు(కుతూహలంతో మంత్రశక్తిని పరీక్షించి చూద్దామని అనుకోవడం) పరిహారంగా తన కన్నకడుపుతో కూడా కలుషహారిణి అయిన గంగాభవానిలో కలిసి పోదా మని అను కుంటుంది శాస్త్రి గారి కుంతి.
గీ.
అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు
కుంతి దిగినది నదిలోన - అంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలి తేలి వచ్చు ! 10

ఇంక మళ్ళీ మనం నన్నయగారి మూలం దగ్గరికి వస్తే..
వ.
వందురి వగచుచున్న దానిపుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్ఘ రత్న వసుభరితం బయిన యొక్క మంజసము నదీప్రవాహవేగంబునం దన యొద్దకు వచ్చిన దానిలో చెచ్చెరఁ దనకొడుకుం బెట్టి కుంతి నిజగృహంబునకుం జనియె నంత. 30

ఇలా ఈ విధంగా నన్నయగారో చిన్న వచనంలో కథను తేల్చి వేసారు. ఇది మన శాస్త్రిగారి కాట్టే నచ్చలేదు. అందుకని మన పుణ్యం కొద్దీ శాస్త్రిగారు కధను పెంచి మన కోసం మరింత రసవత్తరంగా తీర్చి దిద్దారు. ఆ విధానాన్ని ఆయన పద్యాల్లోనే చూద్దాం పదండి.
గీ.
మందసము రాక గనెనేమొ - ముందు కిడిన
యడుగు వెనుకకుబెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెఱయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ.11
గీ.
దూరదూరాల ప్రాణబంధువు విధాన
అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మదినేమి తోచినదియొ ? 12
గీ.
"ఆత్మహత్యయు శిశుహత్య యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలిమీద
భువనబంధునకే జాలి పుట్టెనేమొ
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు." 13
గీ.
"ఇట్టులున్నది కాబోలు నీశ్వరేఛ్ఛ"
యనుచు విభ్రాంతిమై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్ల మెల్ల గా దరికి తెచ్చి- 14
గీ.
ఒత్తుగా పూలగుత్తుల నెత్తు పెట్టి -
పై చెఱగు చింపి మెత్తగా ప్రక్క పఱచి -
క్రొత్తనెత్తలిరాకుల గూర్చి పేర్చి -
ఒత్తుకొనకుండ చేతితో నొత్తి చూచి - 15
గీ.
ఎట్టకేలకు దడదడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళనిండ జూచి -
బాష్పముల సాము తడిసిన ప్రక్కమీద
చిట్టి బాబును బజ్జుండబెట్టె తల్లి. 16
గీ.
చిన్ని పెదవుల ముత్యాలు చిందిపడగ
కలకలమటంచును నవ్వునే గాని, కన్న
యమ్మ కష్టము - తన యదృష్టమ్ముకూడ
నెఱుగ డింతయు నా యమాయకపు బిడ్డ. 17
గీ.
చెదరు హృదయము రాయిచేసికొని పెట్టె
నలలలో త్రోయబోవును - వలపు నిలువ
లేక - చెయిరాక - సుతు కౌగిలించి వెక్కి
వెక్కి యేడ్చును - కన్నీరు గ్రుక్కుకొనును. 18
గీ.
"భోగభాగ్యాలతో తులతూగుచున్న
కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు పట్టెడన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన."19
ఉ.
నన్నతి పేర్మి మై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్ని విధాల - కన్న కడుపన్నది కాంతల కింత తీపియే! 20
ఉ.
పెట్టియలోన నొత్తిగలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి ! యిక నీకును నాకు ఋణంబుదీరె, మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే ! 21
ఉ.
"పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము నే
నెన్నటికైన చూతునె! మఱే ! దురదృష్టము గప్పిగొన్న నా
కన్నుల కంతభాగ్యమును కల్గునె ? ఏ యమయైన ఇంత నీ
కన్నము పెట్టి ఆయు విడినప్పటి మాటగదోయి నాయనా ! "22
గీ.
పాలబుగ్గల చిక్కదనాల తండ్రి !
వాలుగన్నుల చక్కదనాల తండ్రి !
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి !
కాలుచెయి రాని తండ్రి ! నా కన్న తండ్రి ! 23
గీ.
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి -
చిన్ని నాన్నకు కన్నులు చేరడేసి -
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి -
చిట్టి బాబు మై నిగనిగల్ పెట్టెడేసి - 24
గీ.
బాలభానుని బోలు నా బాలు నీదు
గర్భమున నుంచుచుంటి గంగాభవాని !
వీని నే తల్లి చేతిలోనైన బెట్టి
మాట మన్నింపుమమ్మ ! నమస్సులమ్మ ! 25
గీ.
దిక్కులను చూచి భూదేవి దిక్కు చూచి
గంగదెస చూచి బిడ్డ మొగమ్ము చూచి -
సజల నయనాలతో ఒక్కసారి "కలువ
కంటి" తలయెత్తి బాలభాస్కరుని చూచె - 26
గీ.
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి. 27
గీ.
ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర
మొండు బంగారుతండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు
మూతిపై కట్టకడపటి ముద్దు నుంచి. 28
గీ.
"నన్ను విడిపోవుచుండె మా నాన్న " యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తములతోడ కాంక్ష లల్లాడ, కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె. 29
గీ.
ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె. 30

జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ఈ కుంతీ కుమారిని ఎన్నిసార్లు చదివినాగానీ వ్రాసినాగానీ ప్రతీసారీ కూడా కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఆ ఆర్ద్రత ఆ కథలో ఉందో, ఆయన శైలిలో ఉందో లేక రెంటిలోనూ ఉందో నా కయితే తెలీదు.
తిరిగి మనం నన్నయగారి దగ్గరకి వచ్చేద్దాం.
ఆ.
ఘనభుజుండు రాధ యనుదానిపతి యొక్క, సూతుఁ డరుగుదెంచి చూచి రత్న
పుంజభరిత మయిన మందసలో నున్న, కొడుకు దానితోన కొనుచు వచ్చి. 31
క.
తనభార్యకు రాధకు ని, చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం
గని చన్నులు సేఁపి ముదం, బునఁ బెనిచెను సుహృదు లెట్టి పుణ్యమొ యనఁగన్. 32
వ.
ఇట్లు వసునివహంబుతో వచ్చుటం జేసి వసుషేణుం డనునామంబునం బరఁగి కర్ణుండు రాధేయుం డై సూతగృహంబునం బెరుఁగు చుండె నంత నిట.33
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-2
కుంతి చరిత్రము
సీ.
వేదంబులందుఁ బ్రవీణుఁడై మఱి సర్వ శాస్త్రంబులందుఁ గౌశలము మెఱసి
యసికుంత కార్ముకాద్యాయుధవిద్యలయందు జితశ్రముఁ డై తురంగ
సింధురారోహణశిక్షల దక్షుఁ డై నీతి ప్రయోగముల్ నెఱయ నేర్చి
యతిమనోహర నవయౌవనారూఢుఁ డై కఱ(డ) లేని హిమరశ్మి కాంతి దాల్చి
ఆ.
పెరుఁగు చున్న కొడుకుఁ బృథువక్షునాయత, బాహు దీర్ఘ దేహుఁ బాండుఁ జూచి
వీనివలనఁ గులము వెలుఁగు నంచును నెడ్డ, జాహ్నవీసుతుండు సంతసిల్లి. 15
నెడ్డన్=హృదయమందు
ధృతరాష్ట్రునికి గాంధారిని పెళ్ళి చేసిన తర్వాత పాండురాజుకు కూడా పెండ్లి చేయాలని సంకల్పించాడు భీష్ముఢు.
వ.
ఇక్కుమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించు చుండె నంత దొల్లి. 16

కుంతి చరిత్రము

సీ.
యాదవకులవిభుఁ డగుశూరుఁ డనునాతఁ డాత్మ తనూజలయందుఁ బెద్ద
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలిఁ బృథ యను చెలువఁ బ్రీతిఁ
దన మేనయత్త నందనుఁ డపుత్త్రకుఁ డైన యా కుంతిభోజున కర్థితోడఁ
గూఁతుఁగా నిచ్చినఁ గోమలి యాతనియింటఁ దా నుండి యనేక విప్ర
తే.
వరుల కతిథిజనులకు నవారితముగఁ, దండ్రి పని నిష్టాన్న దాన మొనరఁ
జేయుచున్న దుర్వాసుఁ డన్ సిద్ధమునియు, వచ్చె నతిథి యై భోజన వాంఛఁ జేసి.17

శూరుని కూతురు, వసుదేవుని చెల్లెలు పృథ, కుంతి భోజుని పెంపుడు కూతురు . ఓ సారి దూర్వాస మహాముని కుంతిభోజునింటికి అతిథి గా వచ్చి పృథ చేసిన సత్కారానికి మెచ్చి ఓ వరం ఇచ్చాడామెకి.
వ.
కుంతియు నమ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె. నీమంత్రంబున నీ వెయ్యేని వేల్పు నారాధించి తవ్వేల్పు నీ కోరినయట్టి పుత్త్రకుల నిచ్చు నని యాపద్ధర్మంబుగా నొక్క దివ్యమంత్రంబుఁ బ్రసాదించి చనిన నమ్మంత్రశక్తి యెఱుంగ వేఁడి కుంతి యొక్కనాఁ డేకాంతంబ గంగకుం జని గంగనీళ్ళఁ గాళ్ళుమొగంబుఁ గడిగికొని. 18

ఆ వర ప్రభావంతో ఆమె ఏ దేవత నైనా ప్రార్థిస్తే ఆ దేవత ఆమెకు సంతానాన్ని ప్రసాదిస్తాడు అని. ఆ వరం ఎంత నిజమో
తెలుసుకోవాలనే కుతూహలంతో సూర్యుని ప్రార్థిస్తుంది కుంతి.
క.
అమ్మంత్రము దన దగుహృద, యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క
ర్ఘ్యమ్మెత్తి నాకు నిమ్ము ప్రి, యమ్మున నీ యట్టికొడుకు నంబుజమిత్రా. 19

నీలాంటి కొడుకు నిమ్మని సూర్యుని కుంతి ప్రార్థించింది.
క.
అని కేలు మొగిచి మ్రొక్కిన, వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం
బుననుండి కమలమిత్రుఁడు, తనతీవ్ర కరత్వ ముడిగి తరుణద్యుతితోన్. 20

వెంటనే సూర్యుడు తన తీక్ష్ణత్త్వాన్ని వదలిపెట్టి యౌవనరూపముతో ఆమె ముందు ప్రత్యక్షమౌతాడు.
వ.
అక్కన్యయు నట్టి తేజోరూపంబు సూచి విస్మయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడు నడంకుచున్న దాని నోడ కుండు మని సూర్యుండు ప్రసన్నుం డై నీ కోరినవరం బీవచ్చితి ననిన లజ్జావనతవదన యై యొక్క బ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెఱుంగ వేఁడి యజ్ఞానంబున నిన్నుం ద్రిలో కైక దీపకుం ద్రిపురుషమూర్తిఁ ద్రి వేదమయు రావించిన యీ యపరాధంబు నాకు సహింపవలయు. 21
ఆ.
ఎఱుకలేమిఁ జేసి యింతు లెప్పుడు నప, రాధయుతలు సాపరాధ లయిన
వారిఁ గరుణ నెల్ల వారును రక్షింతు, రనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కె. 22

ఆడవారు ఎప్పుడూ తెలివి లేని వారై అపరాధాల్ని చేస్తూంటారు. కాని వారిని దయతో యెల్లవారూ రక్షిస్తూ ఉంటారు. అని సూర్యునకు మొక్కింది కుంతి.
వ.
సూర్యుండును నీకు దుర్వాసుం డిచ్చినవరంబును మంత్రంబు శక్తియు నెఱుంగుదు మదీయ దర్శనంబు వృథ గాదు నీ యభిమతంబు సేయుదు ననిన గుంతి యిట్లనియె. 23
ఆ.
ఏను మంత్రశక్తి యెఱుఁగక కోరితిఁ, గన్య కిదియు గుణము గాదు నాక
నాకు గర్భ మయిన నా తల్లిదండ్రులుఁ, జుట్టములును నన్నుఁ జూచి నగరె. 24

మంత్రశక్తి తెలియగోరి తెలివితక్కువగా అడిగాను. ఇప్పుడు నాకు గర్భమయితే నా తల్లిదండ్రులు ఏమంటారు, నలుగురూ నన్ను చూచి నవ్వరా అంది కుంతి.
వ.
అనిన విని సూర్యుండు దానికిఁ గరుణించి నీకు సద్యోగర్భంబునఁ బుత్త్రుఁ డుద్భవిల్లు నీ కన్యాత్వంబును దూషితంబు గా దని వరం బిచ్చినఁ దత్క్షణంబ యక్కన్యకకు నంశుమంతు నంశంబునం గానీనుం డై. 25

ఈ సద్యోగర్భ మనే దొకటి. అప్పటికప్పుడు కన్యాత్వం దూషితం కాకుండా పిల్లలు పుట్టేస్తారన్నమాట. అలా పుట్టాడంట కుంతికి కర్ణుడు. (కానీనుడు=కన్యకు పుట్టినవాడు)
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-౧
ధృతరాష్ట్ర పాండు కుమారులు పెరుఁగుట
ధృతరాష్ట్ర పాండు కుమారులు భీష్ముని కనుసన్నల్లో పెరుగుతూ ఉండగా--
సీ.
అమరాపగా సూను ననుశాసనంబునఁ గౌరవరాజ్యంబు గడు వెలింగెఁ
గురుభూము లుత్తర కురువుల కంటెను నధిక లక్ష్మీయుక్తి నతిశయిల్లె

ధర్మాభిసంరక్షితంబైన భూప్రజ కెంతయు నభివృద్ధి యెసఁగు చుండె

వలసినయప్పుడు వానలు గురియుట సస్యసమృద్ధి ప్రశస్తమయ్యెఁ

ఆ.
బాడి సేఁపె బుష్పఫల భరితంబులై, తరువనంబు లొప్పె ధర్మకర్మ నిరతిఁ
జేసి కరము నెమ్మితో నన్యోన్య, హితముఁ జేయుచుండి రెల్లజనులు.


భీష్ముని పరిపాలనలో దేశమంతా ఎంత సుభిక్షంగా అలరారుతుందో వివరిస్తున్నారిక్కడ. భూములన్నీసస్యస్యామలమై పాడి పంటలతో అలరారుతున్నాయట. కావలసినప్పుడు కావలసినంత వర్షం మాత్రమే కురుస్తోందట. పశువులన్నీ పుష్కలమైన పాడిని యిస్తున్నాయట. తోటలన్నీ ఫలపుష్పాలతో శోభిస్తున్నాయట. జనులందరూ ఒకరి కొకరు సహాయము చేసుకుంటూ జీవిస్తున్నారట. ఎంత అందమైన పరిపాలన!
వ.
ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజావృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులు గా రాజ్యంబు రక్షించు చున్నంత.
ఆంబికేయు=అంబిక కుమారుడు
ఉ.
ఆయము గర్వమున్ విడిచి యన్యపతుల్ పనిసేయ నిట్లు గాం
గేయ భుజాబలంబున నికృత్త విరోధి సమాజుఁడై కుమా
రాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె
త్యాయత కీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగాన్.
నికృత్త =నఱుకబడిన
హస్తినా పురాన్ని రాజధానిగా చేసుకుని ధృతరాష్ట్రుడు చక్కగా రాజ్యపాలన సాగిస్తున్నాడట.
వ.
ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి యయిన సుబలుకూఁతు గాంధారి యనుదాని నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె.
క.
ఈ వంశము విచ్ఛేదము, గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ
దేవి వచనమున సంతతి, గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్. ౮

వ్యాస మహాముని దయవలన సత్యవతీ దేవి మాట మీద వంశం నిలబెట్టబడింది పూర్వం.
క.
ఈకులము వివర్ధింపఁగ, నా కభిమత మేను వింటి నలినేక్షణ దా
నేక శతసుతులఁ బడయఁగ, నా కన్యక వరమువడసె నట హరు చేతన్. ౯

ఈ వంశం వృద్ధిచెందడమే నా అభిమతం. ఈ గాంధారి నూటొక్క సంతానాన్ని శివునివద్దనుండి వరంగా పొందిందని విన్నాను.
వ.
కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము గాంధారపతి మన తోడి సంబంధమునకుం దగు నని నిశ్చయించి సుబలుపాలికిఁ దగు ముదుసళ్ళం బంచిన సుబలుండును సుముఖుం డై కురుకుల విస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి ననిన వాని బంధు జనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి. ౧౦

గుడ్డివాడికి పిల్లనిచ్చేసాను అని చెప్పి తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండన్నాడన్నమాట.

తే.
అంగముల లోన మేలుత్తమాంగమందు, నుత్తమంబులు గన్నుల యుర్విజనుల
కట్టి కన్నులు లే వను టంతెకాక, యుత్తముఁడు గాడె సద్గుణయుక్తి నతడు. ౧౧

శరీరావయవాలన్నిటి యందు ఉత్తమమయినది శిరస్సు. దానిలో మళ్ళీ ఉత్తమమైనవి కళ్ళు. అటువంటి కనులు లేవనే లోపం ఒక్కటేగాని మిగిలిన అన్నివిషయాల్లోనూ ధృతరాష్ట్రుడు మంచి వరుడే కదా అనుకున్నారట ఆ నగరంలోని ప్రజలు.
ధృతరాష్ట్రుఁడు గాంధారిని వివాహంబు సేసికొనుట.
వ.
అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకు పితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి నాకుఁ బతి యమ్మహీపతియ కాని యొరుల నొల్లనని పరమపతివ్రత పర పురుష సందర్శనంబు పరిహరించి తన పతి కనుగుణంబుగా నేత్రపట్టంబు గట్టికొనియుండె నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండయిన శకుని మహావిభూతితో హస్తినాపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుఁడును బరమోత్సవంబున గాంధారిని వివాహం బై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు సంభవయు దశార్ణయు నను పదుండ్ర నొక్క లగ్నంబున వివాహంబయి మఱియును. ౧౨
క.
కులమును రూపము శీలముఁ, గలకన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుం డీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల, తిలకుండు వివాహమయ్యె దేవీశతమున్. ౧౩

భీష్ముడు తన పరాక్రమంతో ఇంకో వందమంది కుల రూప గుణవతులయిన కన్యలను తెచ్చి ఇస్తే వారందరినీ కూడా పెళ్ళాడంట ధృతరాష్ట్రుడు. ఈయన కింత సీనుందని మనకిదివరకు తెలియదు.

ఈ పోస్టు శ్రీమదాంధ్రమహాభారతంలో నూఱవ పోస్టు. ఏమిటో కాకతాళీయమే కావచ్చు గాక. ధృతరాష్ట్రుడు వందమంది కన్యకలను వివాహమాడిన సందర్భం ఈ నూఱవపోస్టులో జరగడం ఒక వింతనిపిస్తున్నది నామటుకు నాకు. ఈ సందర్భంగా ఈ నా బ్లాగు వీక్షకులందరికీ నా శుభాభినందనలు ముందుగా తెలియపరుస్తున్నాను. ధృతరాష్ట్రుని మిగిలిన ఈ అందరి భార్యలకూ (గాంధారి కాక) సంతానం కలిగిందో లేదో నాకు తెలియదు. ముందు ముందు చూద్దాం వివరాలు తెలుస్తాయేమో.





Unknown
ఆది పర్వము- చతుర్థాశ్వాసము-౧౬
మాండవ్యోపాఖ్యానము
ఆ.
చండకోపుఁ డయిన మాండవ్యమునివరు, శాపమున జముండు సంభవిల్లె
విదురుఁడనఁగ ధర్మవిదుఁడు పారాశర్యు, వీర్యమున నవార్యవీర్యబలుఁడు. ౨౫౯
వ.
అనిన విని జనమేజయుండు వైశంపాయునున కి ట్లనియె.౨౬౦
ఆ.
సకలజీవరాశి సుకృత దుష్కృతఫల, మెఱిఁగి నడపుచున్న యిట్టి ధర్ముఁ
డొంద శూద్రయోనియందు మాండవ్యుచే, శప్తుఁడై యదేల సంభవించె. ౨౬౧

యమధర్మరాజు, సమవర్తి. అటువంటి గొప్పవానికి శూద్రయోని యందు పుట్టే అగత్యం ఎందువల్ల కలిగింది- అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు.
వ.
అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె మాండవ్యుండను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున కెడగలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌన వ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమానులై మాండవ్యు సమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాగినవారి వెనుదగిలి వచ్చిన యా రెకు లమ్మునింగని రాజధనాపహారులయిన చోరులు నీయొద్దన పాఱి రెటవోయి రెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్న న య్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నా మ్రుచ్చులం బట్టికొని, ౨౬౨
ఆ.
తాన చోరులకును దాపికాఁ డై వేష, ధారి మిన్న కేని తపముసేయు
చున్నయట్లు పలుక కున్నవాఁడని యెగ్గు, లాడి యారెకులు నయంబు లేక. ౨౬౩
యారెకులు=తలారులు
తనే చోరులతో కూర్చువాడై వేషం ధరించి మిన్నకుండా తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడని తలారులున్యాయాన్ని తలవకుండా ఉన్నవారై,
వ.
మాండవ్యు నా మ్రుచ్చులతోన కట్టికొనివచ్చి రాజునకుంజూపి ధనం బొప్పించిన రాజు నా మ్రుచ్చులంజంపించి తపోవేషంబున నున్న మ్రుచ్చని యమ్మాండవ్యునిఁ బురంబువెలి శూలప్రోతుం జేయించిన. ౨౬౪
క.
మునివరుఁ డట్లుండియుఁ దన, మనమున నతిశాంతుఁ డయి సమత్వమునఁ దప
మ్మొనరించె ననశనుం డ, య్యును బహుకాలంబు ప్రాణయుక్తుం డగుచున్. ౨౬౫

మునివరుడు శూలప్రోతు డయి వుండి కూడా తన మనస్సులో అతి శాంతిపరుడు కావున సమత్వాన్ని వహించి ఆహారం తీసుకోకుండా తపస్సు చేస్తూ బహుకాలం ప్రాణాలు ధరించి వున్నాడట పాపం.
వ.
ఇట్లు శరీరదుఃఖంబు దలంపక తపంబు సేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రి వచ్చి మునీంద్రా యిట్టి మహా తపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వరని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె. ౨౬౬
తే.
ఎఱిఁగి యెఱిఁగి నన్నడుగంగ నేలదీని, సుఖము దుఃఖంబుఁ బ్రాప్తించు చోటనరుఁడు
దగిలి తన కర్మవశమునఁ దనకుఁ దాన, కర్తగా కన్యులకు నేమి కారణంబు. ౨౬౭

తెలిసి తెలిసి దీనిని గురించి నన్ను అడగటం దేనికి. సుఖము దుఃఖము ప్రాప్తించటానికి నరుడు తాను పూర్వం చేసుకొన్న కర్మ వశం చేతనే కాని ఇతరులెవ్వరూ కూడా దానికి కారణం కాజాలరంటాడు.
వ.
అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికినపలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన రాజునుం బఱ తెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి నా చేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింప వలయు నని శూలంబు వలన నమ్మునిం బాచుచో నది పుచ్చ రాకున్న దాని మొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె దానంజేసి యాముని మాండవ్యుండు నాఁ బరగుచు నమ్మహాముని ఘోరతపంబుసేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యముని పురంబునకుం జని (యమ) ధర్మరాజున కి ట్లనియె. ౨౬౮
క.
దండధర యిట్టిదారుణ, దండమునకు నేమి దుష్కృతముఁ జేసితి ను
గ్రుండవయి తగని దండము, దండింపఁగ బ్రాహ్మణుండఁ దగునే నన్నున్. ౨౬౯

నేనేమి పాపం పూర్వం చేసానని నా కింత కఠిన దండన విధించావు , బ్రాహ్మణుండ నైన నాకు ఇటువంటి క్రూర దండన విధించడం తగునా , దానికి కారణం ఏమిటి అని అడిగాడు యముడిని మాండవ్యుడు. (బ్రాహ్మణులకు అప్పట్లోనే కొన్ని కొన్ని మినహాయింపు లుండేవని ఇందుమూలంగా మనకు తెలుస్తోంది)
వ.
అనిన మాండవ్యునకు ధర్మ రాజి ట్లనియె. ౨౭౦
క.
సొలయక తూనిఁగలం గొ, ఱ్ఱులఁ బెట్టితి నీవు నీ చిఱుతకాలము త
త్ఫల మిప్పు డనుభవించితి, తొలఁగునె హింసాపరులకు దుఃఖ ప్రాప్తుల్. ౨౭౧

నీవు నీ చిన్నప్పుడు తూనీగలను పట్టుకుని వాటిని కొఱ్ఱులకు తగిలించి ఆడుకున్నావు, ఆ పాపం వలన నీ కిలా అయ్యింది . చేసిన పాపానికి శిక్ష అనుభవించి తీరాలి కదా అన్నాడు యమధర్మరాజు.
వ.
అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగాఁ బదునాలుగు వత్సరంబులు దాటునంతకుఁ బురుషుండు బాలుండు వాఁ డెద్దిసేసినఁ బాపంబుం బెద్ద పొరయండు వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు రిది నా చేసిన మర్యాద నీ విట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుఁ జేసిన నాకు బ్రాహ్మణోచితంబు గాని క్రూరదండంబు గావించిన్ వాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టుమని శాపం బిచ్చుటం జేసి వాఁడు విదురుండై పుట్టె. ౨౭౨
భారతంలో చాలా చోట్ల ఇదివరకే చెప్పుకున్నట్లుగా చాలామంది కొన్ని కొన్ని మర్యాదలను ఇదిమొదలుగా అని చెప్పి విధించటం, వాటిని అప్పటినుండి సకల జనులూ పాటిస్తూండటం జరుగుతుండేదని చెప్పుకున్నాం కదా. అటువంటి ఒక మర్యాదను మాండవ్యమహర్షి కూడా ఏర్పాటు చేసాడన్నమాట. మనుష్యుల విషయంలో ౧౪ సంవత్సరాలు వచ్చేవరకూ పురుషుడు బాలుడు, ఏమీ తెలియని అమాయకుడూ కనుక అతను చేసే చెడుకార్యాల ఫలితం పెద్దగా అతడు పొందడనిన్నీ వాని వలన కలిగే పాపం అతనిని అంటదనిన్నీ మర్యాద మాండవ్యమహర్షి చే చేయబడింది. ఆ మర్యాదను లెక్కలోకి తీసుకోకుండా అతనికి యముడు శిక్ష విధించాడు. కనుక మాండవ్యునిచే శాపగ్రస్తు డయ్యాడని మనకు తెలుస్తున్నది. అంతకు పూర్వం మటుకు అటువంటి వెసులుబాటు పిల్లలకు ఉండేది కాదని మనం గ్రహించుకోవాలన్నమాట.
క.
అని మాండవ్యాఖ్యానము, జనమేజయునకు నుదారచరితునకుఁ బ్రియం
బునఁ జెప్పెను వైశంపా, యనుఁ డవితథ పుణ్యవచనుఁడని కడు భక్తిన్. ౨౭౩

ఈ విధంగా మాండవ్యాఖ్యానాన్ని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వివరంగా చెప్పాడు.

శ్రీ మదాంధ్రమహాభారతం ఎన్నో ఆఖ్యానాలకూ ఉపాఖ్యానాలకూ గని వంటిది. ఇటువంటి నీతిబోధకమైన కథలు భారతం నిండా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం మన అదృష్టం కొద్దీ కవిత్రయంవారు భారతాన్ని సంగ్రహరూపంలో- గరికపాటి వారు చెప్పినట్లుగా లక్షకు పైగా వున్న సంస్కృత భారతాన్ని అందం చెడకుండా సుమారు ౨౩౦౦౦ పద్యగద్యాలలో- అనువదించి పెట్టారు. తనివి తీరా గ్రోలటం మన బాధ్యత గా తెలుగువారందరూ భావిస్తే మనమందరం ధన్యుల మవుతాం. అందుకే మన పెద్దలన్నారు . వింటే భారతం వినాలి , తింటే గారెలే తినాలి అని. తెలుగు వారికి గారెలంటే ఎంతిష్టమో మరి.
ఇక్కడితో భారతంలో ఆది పర్వం లోని చతుర్థాశ్వాసం పూర్తయింది.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౬
వేదవ్యాసముని సత్యవతి యొద్దకు వచ్చుట
వ.
అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి కొండొకనాఁడు దను కన్యయై యున్న కాలంబునఁ బరాశరుండు దన్నుఁ గామించుటయు నమ్మునివరంబున దన కన్యాత్వంబు దూషితంబు గా కునికియుఁ దత్ప్రసాదంబునం జేసి యమునాద్వీపంబునఁ గృష్ణద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్భంబునఁ బుట్టి పని గల యప్పుడ తన్నుఁ దలంచునది యని చెప్పి తపోవనంబునకుం జనుటయును భీష్మునకుం జెప్పి నిజతపోదహనదగ్ధసాపేంధనుండయిన కృష్ణద్వైపాయనుండఖిల ధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ యనుమతంబున భవద్భ్రాతృ క్షేత్రంబులయందు సంతానంబు వడయు ననిన సత్యవతి వలన నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకుడున్న దిక్కునకు మ్రొక్కి తొల్లి జగంబు లుత్పాదించిన యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబుగల వేదవ్యాసుం డిక్కురువంశంబుఁ బ్రతిష్ఠించుటయ యెల్లవారికి నభిమతంబ యనిన సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ.

వేదవ్యాసముని సత్యవతి యొద్దకు వచ్చుట
ఉ.
నీలగిరీంద్ర శృంగమున నిర్మల మైన సువర్ణ వల్లరీ
జాలమువోనిపింగళవిశాలజటాచయ మొప్పఁగా వచ
శ్శ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీలవినీలవిగ్ర హా
రాళరుచుల్ వెలుంగఁగ బరాశరసూనుఁడు తల్లి ముందటన్. ౨౪౦.

నీలమైన గిరీంద్రశృంగము మీద నిర్మలమైన బంగారు తీఁగలవలెఁ బచ్చని విశాలమగు జడలమొత్తముతో ప్రకాశించుచూ, వచశ్శ్రీలలితుడైన వ్యాస మహర్షి ఇంద్రనీలములవంటి నల్లనిదేహము యొక్క వికారకాంతులు వెలుగుచుండగా తల్లి ముందఱ ప్రత్యక్షమైనాడట.
వ.
సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యా ప్రథమ పుత్రు నతిహర్షంబునం గౌఁగిలించికొని యవిరళ పయోధర పయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న నమ్మునివరుండును దల్లి బాష్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సర భూసురవరులతో విధిపూర్వకంబుగా భీష్ముండు సేసిన యర్ఘ్యాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న నమ్మాహామునిఁ గుశలం బడిగి సత్యవతి యి ట్లనియె. ౨౪౧
క.
జనకునకును స్వామిత్వము, తనయోద్దేశమునఁ గలిమి తథ్యమ యది య
జ్జననికి గలుగున కావునఁ, జనుఁ బని బంపంగ నిన్ను జననుత నాకున్.
౨౪౨

తండ్రికి అధికారము తనయుడు కలిగినప్పుడే కలగటం తథ్యం. అది ఆతల్లికి కూడా కలుగుతుంది కాబట్టి నిన్ను నేను పనికి నియోగించవచ్చు అని తల్లి కొడుకుతో అంటుంది.

అప్పుడామె భీష్ముని ప్రతిజ్ఞాపాలన గూర్చి కృష్ణద్వ్యైపాయనున కెఱింగించి అతని తమ్ముడైన విచిత్రవీర్య సుక్షేత్రములలో దేవరన్యాయం ద్వారా సంతానాన్ని కలగజేయమంటుంది.
క.
అని సత్యవతి నియోగిం, చిన వేదవ్యాసుఁ డట్ల చేయుదు నిది యెం
దును గలధర్మువ యెప్పుడు, వినఁబడు నానా పురాణవివిధశ్రు
తులన్. ౨౨౭

అలా సత్యవతి పురమాయించగా అలాగే చేస్తాను, ఇది యెల్లెడలా అమలుపరపబడుచున్న ధర్మమే అంటాడు వ్యాసుడు. చాలా పురాణాల్లోను శ్రుతులలోనూ కూడా వినబడేదే అంటాడు.
వ.
ఇక్కాశీరాజదుహితలయందు ధర్మస్థితిం బుత్త్రోత్పత్తి గావించెద వీరలు నా చెప్పిన వ్రతం బొక సంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్పుత్త్రులు పుట్టుదు రనిన సత్యవతి యి ట్లనియె. ౪౮

కాని పాపం ఆవిడ ఈ షరతు కంగీకరించకుండా పిల్లల్ని అర్జంటుగానే పుట్టించాల్సిందని సూచిస్తూ ఆలస్యమయితే రాజ్యం అరాచకం కావటం వగైరా కారణాలు ఏకరువు పెడుతుంది.
వ.
అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబిక కడకుం జని క్షేత్రజ్ఞుండై నవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యదురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు మెల్ల ధర్మంబుల కంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు నేఁటి రాత్రి నీకడకు దేవరుండు వచ్చుం దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది యని కోడలి నొడంబఱిచి యనేక సహస్ర మహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపి యున్న నా రాత్రియందు. ౨౫౨
దేవరుడు=భర్తృభ్రాత(మగని యన్న)
క.
తివిరి సుతజన్మ మెట్టిం, డవునొకొ దేవరుఁడు నాకు ననుచును నవప
ల్లవ కోమలాంగి యంబిక, ధవళేక్షణ విమలశయనతలమున నున్నన్.
౨౫౩

అంబిక తన మగని అన్నద్వారా సంతానం పొందగోరి తెల్లని కన్నులు కలదై తెల్లని శయనతలము మీద వేచి ఉన్నది.
మధ్యాక్కర.
అవసరజ్ఞుం డయి వ్యాసు డేతెంచె నంత త్తపసి
కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
దవిన యన్నువనల్ల నైన దీర్ఘ పుందనువును జూచి
యువిద గన్నుంగవ మొగిచి తెఱవక యుండె భయమున. ౨౫౪

ఆ పని నిర్వర్తించడం కోసమై వ్యాస మహర్షి రాగా ఆ తపసి యొక్క పచ్చని గడ్డాన్నీ, పచ్చని జడలనూ, పచ్చని కన్నులను తగిన యల్పమైన నల్లని పొడవైన శరీరమును చూచి అంబిక తన కన్నులను మూసుకొని తెఱవకుండా భయముతో ఉండిపోయినది.
వ.
కృష్ణద్వైపాయనుండును దానికిం బుత్త్రదానంబు సేసి యా యంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టువాఁడు మాతృదోషంబున నంధుం డగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్క కొడుకుం బడయు మని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనై యున్న నక్కోమలికిం బుత్త్రదానంబు సేసి యీ యంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగు సుపుత్త్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగునని చెప్పి యరిగిన. ౨౫౫

ధృతరాష్ట్ర పాండురాజుల జననము
క.
బలవన్మదనాగాయుత, బలయుతుఁడు సుతుండు పుట్టెఁ బ్రజ్ఞాచక్షుం
డలఘుఁడు ధృతరాష్ట్రుం డా, లలనకు నంబికకుఁ గురుకులప్రవరుం డై. ౨౫౬

మదించిన యేనుగుతో సమాన మైన బలము కలిగినవా డైన కుమారుడు ధృతరాష్ట్రుడు గుడ్డివా డై అంబికకు కురు వంశాన్ని ఉద్ధరించటానికై పుడతాడు.
క.
అంబాలికకును గుణర,త్నాంబుధి పాండురవిరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు గురువం, శంబు ప్రతిష్టింప ధర్మ సర్వజ్ఞుం డై. ౨౫౭

అంబాలికకు కూడా గుణవంతు డైన కుమారుడు, తెల్లని దేహంతో కూడినవా డైన పాండురాజు కురువంశాన్ని ప్రతిష్టించడం కోసమై అన్ని ధర్మాల్నీ యెఱిగిన వాడుగా పుడతాడు.

వ.
ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకర్మాది క్రియ లొనరించి నంత నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె నింక నొక్కకొడుకు రూపవంతుం బడయు మనిన నియతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టు ననవుడు సత్యవతి తొల్లింటి యట్ల కోడలి నియోగించిన నక్కోమలి యమ్మునివరుని వికృతవేష రూపగంధంబుల కోపక రోసి తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుం డై దానికిం బుత్త్రదానంబు సేసిన. ౨౫౮
ఆ.
చండకోపుఁ డయిన మాండవ్య మునివరు, శాపమున జముండు సంభవిల్లె
విదురు డనఁగ ధర్మనిదుఁడు పారాశర్యు, వీర్యమున నవార్యవీర్యబలుఁడు. ౨౫౯.

ఉగ్రమైన కోపం గల మాండవ్యముని శాపకారణంగా యముడు విదురుడుగా ధర్మవిదుడై పారాశర్యుని వీర్యంతో అంబికా దాసికి జన్మిస్తాడు .
ఈ విధంగా ధృతరాష్ట్ర,పాండురాజ, విదురులు జన్మిస్తారు.









వ.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౫
దీర్ఘతముని వృత్తాంతము
వ.
మఱి యదియునుంగాక యుచథ్యుండను మునివరునిపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవర న్యాయంబున నభిలషించినఁ దదీయ గర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మ విరుద్ధంబని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి సర్వభూతేప్సితంబగు యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందు మని శాపం బిచ్చిన వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకల వేదవేదాంగ విదుండయి జాత్యంధుండయ్యును తన విద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యనునొక్క బ్రాహ్మణి వివాహం బయి గౌతమాదు లయిన కొడుకులం బెక్కెండ్రం బడసిన నది లబ్ధపుత్త్ర యై తన్ను మెచ్చకున్న నిట్లేల నన్ను మెచ్చవని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యిట్లనియె.
౨౨౭
భార్య తన గొప్పదనాన్ని గుర్తించకపోతే ఎటువంటి భర్తకైనా బాధగానే ఉంటుంది మరి.

తే.
పతియు భరియించుఁ గావున భర్త యయ్యె
భామ భరియింపఁబడు గాన భార్య యయ్యెఁ

బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను

నేన యెల్లకాలము భరియింతుఁ గాన.
౨౨౮

కారణాన్ని సవివరంగా చెప్పిందావిడ. మనయందు మన బాధ్యతలు మాఱుపడినవి నేనే నిన్నెల్లకాలం భరిస్తున్నాను కాబట్టి అందావిడ. నిజమే కదా.
ఆ.
ఎంత కాల మయిన నిప్పాట భరియింప, నోప నింక నరుగు మొండుగడకు
ననిన నిర్దయాత్మ లని దీర్ఘ తముఁ డల్గి, సతుల కెల్ల నపుడు శాప మిచ్చె.
౨౨౯

ఇలా శాపమివ్వడం అన్యాయంగానే వుంది మరి. సతులు నిర్దయాత్ములుగా వుండకూడదన్నమాట.
క.
పతిహీన లయిన భామిను, లతిధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం
కృత లయ్యెడు మాంగల్యర, హితలయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలుగాన్
. ౨౩౦

పతులను కోల్పోయిన స్త్రీలు ఇప్పటి నుండీ గొప్ప ధనవంతులయినాగానీ మంచి కులం లో పుట్టిన వారైనా గావీ అలంకరించుకోరాదనిన్నీ మాంగల్యానికి దూరమౌతారనీ నింద్యమగు నడవడిచేత కాలం గడుపుతారనీ శాపమిచ్చాడు.
భారతంలో చాలాచోట్ల ఇలా శాపాలు ఇది మొదలుగా అని చెప్పి ఇవ్వటం తఱచుగానే ఉంటోంది. అంటే దానిని బట్టి అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉండేవో మనం అర్ధం చేసుకోవచ్చన్నమాట.
వ.
అని శాపం బిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి యమ్ముదుకని నెటకేనియుం గొనిపొండని తన కొడుకులం బంచిన వారును నయ్యౌచథ్యు నతివృద్ధు జాత్యంధు నింధనములతో బంధించి మోహాంధు లయి గంగలో విడిచిన నమ్మునియును బ్రవాహ వేగంబునఁ బెక్కు దేశంబులు గడచి చనియె నంత నొక్కనాఁడు బలి యను రాజు గంగాభిషేకార్ధంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్తస్వరిత ప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ దరంగఘట్టనంబునం దనయున్నదరిం జేర వచ్చినవాని దీరంబుఁ జేర్చి యింధనబంధనంబులు విడిచి మహర్షి మామతేయుంగా నెఱింగి త న్నెఱింగించి నమస్కారంబు సేసి యిట్లనియె. ౨౩౧
మామతేయున్ కాన్=అభిమానునిగా
క.
ఎందుండి వచ్చి తిందుల, కెందుల కేఁగెదు మహామునీశ్వర విద్వ
ద్వందిత నా పుణ్యంబునఁ, జెందితి ని న్నిష్టఫలముఁ జెందినపాటన్. ౨౩౨

యోగక్షేమాలను విచారించి తన కోరికను తెలియజేసుకుంటున్నాడా రాజు.
వ.
ఏ నపుత్త్రకుండ నై యెవ్విధంబునను సంతానంబు వడయ నేర కున్నవాఁడ నాకు సంతానదానంబు దయసేయు మని యతనిం బూజించి తన పురంబునకుం దోడ్కొని చని ఋతుమతియై యున్న తన దేవి సుదేష్ణ యనుదాని సమర్పించిన నదియును. ౨౩౩

సంతాన దానం చేయమని ఆ రాజు ఆ మునీశ్వరుని ప్రార్థిస్తాడు. పాండవుల జననాని కీవిధంగానే మార్గం ఏర్పడిందన్నమాట.
ఆ.
పుట్టుఁజీకు వృద్ధుఁ బూతిగంధానను, వేదజడునిఁ బొంద వెలది రోసి
తన్నపోనిదానిఁ దన్విఁ గోమలిఁ దన, దాదికూఁతుఁ బంచెఁ దపసికడకు. ౨౩౪

పాపం ఆ రాణీ కూడా తనబదులుగా తనను పోలి వుండే దాది కూతుర్ని ఆ పనికి నియమిస్తుంది. ఇదే పద్ధతి తరువాత విదుర జననంలో కూడా పునరావృతమౌతుంది.
వ.
ఆ దీర్ఘ తముండును దానివలనఁ గాక్షీవదాదుల నేకాదశ పుత్త్రులం బుట్టించిన బలియును సంతసిల్లి వీరలు నా పుత్త్రకులే యనిన నమ్ముని విని కిట్లనియె. ౨౩౫

ఆయనకా సందేహం ఎందుకొచ్చిందో మరి.
క.
వీరలు నీ కులపుత్త్రులు, గారు భవద్దేవిదాదిగాదిలిసుతకున్
భూరిభుజ యుద్భవించిన, వారు మహాధర్మపరు లవారితసత్త్వుల్. ౨౩౬

నీ పిల్లలు కారు . నీ భార్య దాది కూతురు సంతానం అని ఉన్నమాట చెప్పేసేడాయన. ఆ సంతానం మహాధర్మపరులు కూడానంట.
వ.
అనిన నబ్బలి సంతానార్థి గావున వెండియు నమ్మునిం బ్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘ తముండును దాని యంగంబు లెల్ల నంటిచూచి వంశకరుండును మహాసత్త్వుండును నయ్యెడు కొడుకు నీకుం బుట్టు నని యనుగ్రహించిన దానికి నంగరా జను రాజర్షి పుట్టె నివ్విధంబున నుత్తమ క్షత్త్రియ క్షేత్త్రంబులందు ధర్మ మార్గంబున బ్రాహ్మణుల వలనం బుట్టి వంశకరు లయిన క్షత్త్రియు లనేకులు గలరు. ౨౩౭

ఈ కథ అంతా పాండవ ధార్త్రరాష్టుల జననాలకు మూలమైనది , భీష్ముడు సత్యవతికి చెపుతున్నదీను.
క.
కావున నియతాత్ము జగ, త్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణుఁ బడయం
గా వలయు వాఁడు సంతతి, గావించు విచిత్ర వీర్యకక్షేత్త్రములన్.౨౩౮.

వ.
అనిన భీష్ము పలుకులకు సంతోషించి సత్యవతి----------
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౪

భీష్ముఁడు కురు వంశమును నిలుపు ఉపాయం చెప్పుట
ఉ.
లాలిత రూప యౌవనవిలాస విభాసిను లైన యంబికాం
బాలికలన్ వివాహమయి భారతవంశకరుండు గామలీ

లాలలితా సుభోగ రసలాలసుఁ డై నిజరాజ్యభార చిం

తాలసుఁ డయ్యెఁ గామికి నయంబున నొండు దలంపఁ బోలునే.
౨౧౫
చింతాలసుడు=విచారించుటయందు సోమరి

విచిత్రవీర్యుడు కామలాలసు డై భార్యలతోడిదే లోకంగా ఉంటూ నిజరాజ్య పాలనను నిర్లక్ష్యం చేస్తాడు. కాము డైన వానికి నయముతో ఇంకోవిషయం యేమీ పట్టదు గదా.
సీ.
అమల సుధారమ్య హర్మ్యతలంబుల నవకుసుమామోద నందనములఁ
గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ వివిద రత్నోపల వేదికలను
గలహంస కలనాద కమనీయ కమలినీ దీర్ఘి కాసైకత తీరములను
రమియించుచును గామరాగాధికాసక్తిఁ జేసి శోషించి విచిత్రవీర్యుఁ
ఆ.
డమరపురికిఁ జనిన నతనికిఁ బరలోక, విధుల శాస్త్రదృష్టి వెలయఁ జేసె
నాపగా తనూజుఁ డఖిల బాంధవులయు, బ్రాహ్మణులయుఁ దోడ భానునిభుఁడు. ౨౧౭

మేడలలోనూ, నందనవనాల్లోనూ, క్రీడా గృహాలలోనూ, రత్నవేదికలమీదనూ, నదీతీరాల్లోనూ, రమిస్తూ కామరాగాధికా సక్తితో శోషించి పోయి విచిత్రవీర్యుఁడు పిల్లలు పుట్టకుండానే చనిపోతాడు.(అతి సర్వత్ర వర్జయేత్ అంటారు అందుకనే). భీష్ముఁడు అతనికి శ్రాద్ధ కర్మలను పూర్తి చేస్తాడు.తరువాత కొంతకాలానికి ఒకనాడు సత్యవతి భీష్ముని పిలిచి తనను రాజ్యాభిషిక్తుడువు గా కమ్మని పెళ్ళి చేసుకుని వంశాన్ని నిలపమని కోరుతుంది. దానికి భీష్ముడు ఒప్పుకోకుండా ఇలా అంటాడు.
క.
విని భీష్ముఁ డనియె మీ కిట్లని యానతి యీయఁదగునె యమ్మెయి నాప
ల్కిన పల్కును మఱి నా తా, ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుమా. ౨౨౩
క.
హిమకరుఁడు శైత్యమును న,ర్యముఁడు మహాతేజమును హుతాశనుఁ డుష్ణ
త్వము విడిచిరేని గుర్వ,ర్థము నా చేకొనిన స ద్వ్రతంబు విడుతునే. ౨౨౪

నీకిలా చెప్పటం తగునా? నేను నా పలికిన పలుకులు, నా వ్రతము జెఱుపుకోడానికి చిన్నపిల్లాడినేం కాదు గదా.
అంతేకాదు, చంద్రుడు తన చల్లదనాన్ని విడిచి పెడితే పెట్టుగాక, సూర్యుఁడు తన తేజాన్నీ, అగ్ని తన వేడిమినీ విడిచి పెడితే విడిచి పెట్టు గాక. కాని నేను నా వ్రతాన్ని మాత్రం విడిచి పెట్టను. అంటాడు భీష్ముఁడు.
వ.
పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీ శుల్కార్థంబుగా సర్వజన సమక్షంబున నా చేసిన సమయస్థితి విడువ నది యట్లుండె మీ యానతిచ్చినట్లు నా యెఱుంగని ధర్మువులు లేవు శంతను సంతానంబు శాశ్వతంబగునట్లుగా క్షత్త్రధర్మంబు సెప్పెద నా చెప్పిన దాని ధర్మార్థవిదులయి లోకయాత్రానిపుణు లయిన పురోహిత ప్రముఖ నిఖిల బ్రాహ్మణ వరులతో విచారించి చేయునది యని భీష్ముం డందఱు విన నిట్లనియె. ౨౨౫
చ.
పితృవధజాతకోపపరిపీడితుఁ డై జమదగ్ని సూనుఁడు
ద్ధతబలు హైహయున్ సమరదర్పితుఁ జంపి యశేషధారుణీ
పతులను జంపె గర్భగత బాలురు నాదిగ నట్టిచోటఁ ద
త్సతులకుఁ దొల్లి ధర్మ విధి సంతతి నిల్పరె బూసురోత్తముల్. ౨౨౬
హైహయున్=కార్తవీర్యార్జునుని
తండ్రిని చంపిన కోపముతో జమదగ్ని కుమారు డైన పరశురాముడు ముయ్యేడుమార్లు ప్రపంచాన్నంతా చుట్టి చుట్టి క్షత్త్రియు డనేవా డెవడూ మిగలకుండా గర్భంలో నున్న శిశువులతో సహా చంపివేస్తాడు. అటువంటిచోట ఆ క్షత్త్రియ సతులకు పూర్వము ధర్మ మార్గంలో బ్రాహ్మణులు సంతతిని నిలిపినారు కదా. ఆ మార్గాన్నే మనమూ అనుసరించ వచ్చు అన్నట్లుగా అంటాడు భీష్ముఁడు.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౪

సాళ్వుఁడు భీష్మునితో యుద్ధము సేయుట


శంతన మహారాజుకు సత్యవతి వలన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు. ఈ ఇద్దరూ పెద్దవ్వకుండానే శంతనుడు పరలోకగతు డౌతాడు. భీష్ముఁడు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేస్తాడు. అతడు మిక్కిలి చంచలుడై ఎవ్వరిని లెక్కచేయక సుర దనుజ మనుజ గంధర్వాదులను ఆక్షేపిస్తూండేవాడు. దానికి అలిగి చిత్రాంగదు డనే పేరు కలిగిన గంధర్వరాజు అతనితో యుద్ధానికి వచ్చి మాయా యుద్ధంలో చిత్రాంగదుడిని చంపివేస్తాడు. అప్పుడు భీష్ముఁడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేస్తాడు. ఈ విచిత్రవీర్యుడు యౌవనవంతు డయిన ఆతనికి పెళ్ళిచేయాలని భీష్ముఁడు సంకల్పించి కాశీరాజు ముగ్గురు కూతుళ్ళను వారి స్వయంవరానికి వెళ్ళి బలవంతంగా తీసుకొస్తాడు.
క.
నాయనుజునకు వివాహము , సేయగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డం బగువా, రాయతభుజశక్తి నడ్డ మగుఁ డాజిమొనన్. ౧౯౯

నా తమ్మునికి వివాహం చేయటం కొఱకై ఈ ముగ్గురు కన్యలను బలవంతంగా తీసుకుపోతున్నాను. ఎవరైనా అడ్డుకోదలిస్తే యుద్ధంలో నన్ను అడ్డుకోవచ్చు.
వ.
బ్రాహ్మంబు మొదలుగాఁ గల యెనిమిది వివాహములయందు క్షత్త్రియులకు గాంధర్వ రాక్షసంబు లు త్తమంబులు స్వయంవరంబున జయించి వివాహంబగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగిన రాజలోకంబు నెల్ల నోడించి యిక్కన్యలం దోడ్కొని నా చనుట యిది ధర్మంబ యని కాశిరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు. ౨౦౦

గాంధర్వ రాక్షస వివాహాలగురించిన ప్రసక్తి ఇదివరకు శకుంతలోపాఖ్యానంలో కూడా చదివాము.

ఎదిరింపవచ్చిన రాజులనందరినీ భీష్ముఁడు యుద్ధంలో ఓడిస్తాడు. వాని పిఱుంద సాల్వుడనురాజు సమరసన్నద్ధుండై సనుదెంచి భీష్మునితో భీకరమైన యుద్ధం చేసి ఓడిపోయి వెనుదిరిగి తన రాజ్యమునకు వెళ్తాడు.
క.
రథమును రథ్యంబులు సా, రథియును వృథ యైన భగ్నరథుఁడై భాగీ
రథి కొడుకు చేత విమనో, రథుఁడై సాల్వుండు నిజపురంబున కరిగెన్. ౨౧౧

ఈ 'థ' అనుప్రాస యెంత అందగించిందో గమనించండి.

ఈవిధంగా పరాక్రమ లబ్ధలైన అంబ, ఆంబిక, అంబాలిక లను దోడ్కొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబు సేయ నున్న నందు బెద్దయది యైన యంబ యి ట్లనియె. ౨౧౨
ఆ.
పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ, దండ్రిచేతఁ బూర్వదత్తనైతి
నమ్మహీశునకు నయంబున నెయ్యది, ధర్ము వెఱిఁగి దానిఁ దలఁపు మిపుడు. ౨౧౩
వ.
అనిన విని భీష్ముండు ధర్మ విదులైన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజునకిచ్చి పుచ్చి మహోత్సవంబున నయ్యిరువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన. ౨౧౪

అంబ తాను సాల్వునకు తండ్రిచే పూర్వదత్తనైతినని చెప్పగా అమెను సాల్వుదగ్గరకు పంపించి మిగిలిన యిద్దరికి విచిత్రవీర్యునితో వివాహం జరిపిస్తాడు భీష్ముఁడు.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౩
భీష్ముండు బ్రహ్మచర్య వ్రతంబు పూనుట
వ.
బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయ వలయు వివాహం బయ్యెద ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహిత సుహృజ్జనంబులతో విచారించి యోజన గంధి రాజుచిత్తంబునం గలుగుట యెఱింగి యనేక రాజన్యసైన్యసమన్వితుం డయి దాశరాజు కడకుం జని మారాజునకు సత్యవతిని దేవిం గా నిచ్చునది యని యడిగిన నాతండును దేవవ్రతుం బూజించి నీవు ధర్మశీలుండ వర్థానర్థ విదుండవు సకలకార్య సమర్థుండవు గుర్వర్థంబు గన్యార్థి వై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి యీ సత్యవతి నొరుల కీ వలవదు శంతనునక యిచ్చునది యనుటం బేసి తొల్లి యసితుండయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయ నగు. ౧౮౪

దాశరాజు మాటలు కార్యసాధన దిశగా ఎంత పొందికగా ఉన్నాయో గమనించండి. తరువాత యీ 'అసితుండయిన దేవలుండు' అనే మాట భారతంలో ఇదివరకు కూడా ఓసారి వచ్చింది. ఈ పాత్ర కథా కమామీషు ఏమిటో తెలిసిన పెద్ద లెవరైనా వివరిస్తే బావుణ్ణు.
క.
విను మైనను సాపత్న్యం, బను దోషము కలదు దీన నదియును నీచే
తను సంపాద్యము నీ వలి, గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్. ౧౮౫

పురహర అజ కేశవులు=శివో బ్రహ్మ విష్ణువులు
చూడండి వాక్య నిర్మాణం ఎంత పొందికగా వుందో.

దీనిలో సాపత్న్యం అనే దోషం ఉంది. అదీ నీచేతనే పరిష్కరింపబడ గలిగేదే. నీకు కోపమొస్తే శివుడు బ్రహ్మ విష్ణువు కూడా అడ్డుకోలేరు. ( నే ననగా యెంత?) -ఎంత రాజకీయ చతురత్వం ఆ మాటల్లో దాగివుందో గమనించండి.
వ.
ఆ దోషం బెట్లు పరిహృతం బగునట్లుగా నీ చిత్తమునం దలంచి వివాహంబు సేయు మనిన గాంగేయుం డి ట్లనియె. ౧౮౬

భీష్ముఁడు బ్రహ్మచర్య వ్రతంబు

చ.
వినుడు ప్రసిద్ధు లైన పృథివీపతు లిందఱు నే గురు ప్రయో
జనమునఁ జేసితిన్ సమయస్థితి యీ లలితాంగి కుద్భవిం
చినతనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు వాఁడ మాకు నె
ల్లను బతి వాఁడ కౌరవకుల స్థితికారుఁ డుదారసంపదన్. ౧౮౭

అందరూ వినండి. ఈమె సంతానమే రాజ్యాని కర్హత కలిగుంటుంది. వాడే మాకందరికీ రాజు. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ అంటాడు.
వ.
అని సభాసదుల కెల్ల మహాహర్షంబుగా సత్యవ్రతుం డయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశ రా జిట్లనియె. ౧౮౮
క.
నీ వఖిలధర్మవిదుఁడవు, గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్
భావిభవత్సుతు లిట్టిరె, నీవిహితస్థితియు సలుప నేర్తురె యనినన్. ౧౮౯

పొగడ్త ఎంత గొప్పదో చూడండి. ఓ పక్క పొగడుతూ దాశరాజు తనకు కావాల్నిన వన్నీ నోటితో తిన్నగా చెప్పకుండానే ఎలా సాధించుకుంటున్నాడో, ఎంత వాక్చాతుర్యాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో. నీ సంగతి సరేనయ్యా నువ్వు మాటిచ్చాక దానికి తిరుగుంటుందా! కాని భవిష్యత్తనేటొకటుంది చూసావూ మరి నీ కొడుకులు నీ యిచ్చిన యీ మాటను పాటించాలిగా మఱి. అన్నాడు తెలివితేటలుపయోగించి.
క.
ధృతిఁ బూని బ్రహ్మచర్య, వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ ననప
త్యత యైనను లోకము లా, యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై. ౧౯౦

భ్రహ్మచర్య వ్రతాన్ని దాలుస్తున్నాను ఇది మొదలుగా. అనపత్యత అంటారా, నాకు అనుభవయోగ్యము లైన లోకాలు యింకా చాలా చాలా వున్నాయి యేమీ ఫర్వా లేదు అన్నాడు.
వ.
అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్య పరిత్యాగంబును బ్రహ్మచర్యవ్రతపరిగ్రహంబును జేసిన దేవ వ్రతు సత్యవ్రతంబు నకు గురుకార్యధురంధరత్వమునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం బుష్పవృష్టిఁగురిసి భీష్ముం డని పొగడిరి దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత. ౧౯౧

ఇక్కడో విషయం మనం గమనించాల్సి ఉంది. స్వార్ధానికి అంతు అంటూ ఉండదు కామోసు. శంతనునికి భీష్ముడు ఏకపుత్త్రుడూ వీరుడూ కాబట్టి అతని ఉనికి ఖాయం కాదు కాబట్టి " అనఘా నీకు తోడుగ పుత్త్రుల పడయంగ నిష్టమయినది నాకున్." అన్నాడు శంతనుడు. కాని పాపం దేవవ్రతుడు మాత్రం ఎంత పెద్ద త్యాగం చేయాల్సొచ్చిందో చూడండి. ఎంత అన్యాయమో గదా. ఆ రోజుల్లో అలానే ఉండేవారు కామోసు. అది ద్వాపరం, ఇది కలియుగం కాబట్టి మన ఆలోచన లిట్లా ఉంటున్నాయి.
వ.
శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషం బయిన యా భీష్ము సత్యవ్రతంబునకు సంతసిల్లి స్వత్థందమరణంబుగా వరం బిచ్చి సత్యవతి యందు చిత్రాంగద విచిత్రవీర్యు లన నిద్దఱు గొడుకులం బడసి----




Unknown
ఆది పర్వము- చతుర్థాశ్వాసము-౧౧
శంతన సత్యవతుల వివాహము
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్

దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ
డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨

దాని శరీర సౌరభము, దాని చంచలమైన కనుచూపులు, దాని అందమైన శరీరాకృతి, దాని మందహాసముతో కూడిన ముఖకాంతి, దాని విలాసము కడు సంతోషముతో చూచి మదనబాణములచే బాధింపబడిన వాడైన శంతనుడు సత్యవతితో ని ట్లనియె.
ఉ.
ఎందులదాన వేకతమ యియ్యమునానది నోడ సల్పుచున్
సుందరి నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె నావుడున్
మందమనోజ్ఞ హాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం
క్రందనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్. ౧౭౩

ఏమిటిలా ఓడనడుపుతున్నావేమిటి కారణం అని ఆమెను అడుగుతాడు శంతనుడు.
వ.
ఏను దాశరాజు కూఁతురఁ దండ్రినియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుండుదు ననిన దాని యభినవరూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగిన వాఁడై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తన యభిప్రాయం బెఱింగించిన నతండును సంతసిల్లి శంతను నత్యంత భక్తి పూజించి యి ట్లనియె. ౧౭౪
తే.
పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి, వరున కిచ్చుట యిది లోకవర్తనంబు
వసుమతీనాథ నీయట్టివరున కిచ్చి, ధన్యులము గామె యిక్కన్యఁ దద్దపేర్మి. ౧౭౫

పుట్టినప్పుడే కన్యకను తగిన వరున కిచ్చుట అనేది లోకవర్తనము. ఓ రాజా నీ వంటి వరున కిచ్చి చేస్తే మేము ధన్యులమవుతాము. అని దాశరాజు ఇంకా--
వ.
అయినను నాడెందంబునం గలదానిం జెప్పెద నిక్కన్యక నీకు ధర్మపత్నిఁగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నా వేఁడినదాని ని మ్మనిన శంతనుండు దాని నీనగునేని నిచ్చెదఁ గానినాఁ డీ నేర యేది సేప్పుమనిన దాశరా జిట్లనియె.౧౭౬
ఇవ్వగలిగిందయితే ఇస్తాను ఈయరానిదైతే ఇవ్వను అది యేమిటో చెప్పు అంటాడు శంతనుడు.
మధ్యాక్కర.
భూపాల నీకు నిక్కోమలివలనఁ బుట్టినసుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె నెమ్మి ని ట్లీఁ గ
నోపుదే యనిన శంతనుండు గాంగేయు యువరాజుఁ దలచి
యీపల్కు దక్కగ నొండు వేఁడుమ యిచ్చెద ననిన. ౧౭౭

నీ వలన ఈ కన్యయందు పుట్టేవాడే నీ పరోక్షంలో రాజు కావాలి .ఈ వరం ఇస్తే పెండ్లి జరుగుతుంది. లేకపోతే లేదు అంటాడు. అప్పుడు రాజు గాంగేయుని తలచుకొని ఇది కాకుండా వేరే ఏమైనా కోరుకొమ్మంటాడు.
వ.
నా కొండెద్దియు నిష్టంబు లే దనిన విని యద్దాశరాజు చేతం బ్రతిహతమనోరథుం డయి క్రమ్మఱి వచ్చి శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు వీతకార్యావసరుం డయి యున్న నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె. ౧౭౮

తలచిన పని జరగలేదు కాబట్టి రాజు ఇంటికి తిరిగి వచ్చినా ఆమెను మరవలేక బాధపడుతుంటాడు.
చ.
భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు వసుధా ప్రజ కెల్ల ననంతసంతతో
త్సవముల రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు నిట్లు మా
నవవృషభేంద్ర యేలొకొ మనఃపరితాపముఁ బొంది యుండఁగన్. ౧౭౯

నీచే రక్షించబడి యున్న రాజ్యమునకు బాధ కలిగించగలిగినట్టి శత్రుసమూహమేమీ లేదు. భూప్రజలలెల్లరూ ఎల్లప్పుడూ ఉత్సవములే గా ఉన్నారు. రాజు లందరూ నీకు విధేయులు గానే ఉన్నారు. అలాంటప్పుడో రాజా నీ విషాదానికి హేతు వేమిటో చెప్పమని అడిగాడు గాంగేయుడు రాజుని.
వ.
అనిన విని బెద్దయుం బ్రొద్దుచింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె. ౧౮౦
క.
వినవయ్య యేక పుత్త్రుఁడు, ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్
విని నీకుఁ దోడు పుత్త్రుల, ననఘా పడయంగ నిష్ట మయినది నాకున్. ౧౮౧
క.
జనవినుత యగ్నిహోత్రం,బును సంతానంబును వేదములు నెడ తెగఁగాఁ
జన దుత్తమవంశజులకు, ననిరి మహాధర్మ నిపుణు లైన మునీంద్రుల్. ౧౮౨.
క.
నీ వస్త్రశస్త్ర నిద్యా, కోవిదుఁడవు రణములందుఁ గ్రూరుఁడ వరివి
ద్రావణసాహసికుండవు, గావున నీ యునికి నమ్మఁగా నోప నెదన్. ౧౮౩

వినవయ్య! ఒక్కకొడుకు, అనపత్యుడు(పిల్లలు లేనివాడు) ఒక్కరూపే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుచేత నీకు తోడుగా ఇంకా పిల్లలని పొందాలని ఉందయ్యా. పైగా అగ్నిహోత్రం, సంతానము వీటిని ఉత్తమవంశజులు విడిచి పెట్టరాదు. అలా అని గొప్ప ధర్మాల్ని యెఱిగిన మునీశ్వరులు చెప్తారు. నీవేమో గొప్ప పరాక్రమ శాలివి, అనేక యుద్ధాలలో పాల్గొంటుంటావు. గొప్ప సాహసికుడవు కూడా. అంచేత నీ ఉనికి శాశ్వతమని నమ్మటానికి లేదు.
వ.
బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు వివాహం బయ్యెద ననిన విని.

ఎదిగిన కొడుకుకు పెళ్ళి చేయకుండా తానే మళ్ళీ పెళ్ళికి సిద్ధపడటం ఏ విధంగా ధర్మబద్ధం అవుతుందో తెలియదు.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౦
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ
డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨

శంతన మహారాజు యోజనగంధి యైన సత్యవతిని చూచిన ఘట్టంలోని పద్యం. ఎంత మనోహరంగానూ సుందరం గానూ ఉందో చూడండి.

గంగా శంతనుల సమయము
ప్రతీపుడామెను నీవు నా కుఱువెందు కెక్కావు అని అడగ్గా నేను నీ సద్గుణాలకు మెచ్చి నీకు భార్య కావాలని వచ్చాను.
నన్ను పెళ్ళి చేసుకో అంటుంది.
చ.
అనినఁ బ్రతీపుఁ డి ట్లనియె నంబురుహానన యాగ్ని సాక్షికం
బునఁ బరిణీత యైనసతిఁ బొల్పుగ నొక్కతఁ గాని యన్యలన్

మనముననేనియుం దలఁప మానిని యిట్టిజితాత్ము నన్ను
ని
ట్లని పలుకంగ నీ కగునె యన్యులఁ బల్కినయట్ల బేల వై. ౧౩౮

నేను ఏకపత్నీవ్రతుడిని. నాతో ఇతరులతో పలికినట్లుగా ఇలా మట్లాడటం తగునా అంటాడామెతో ప్రతీపుడు.
వ.
మఱి యదియునుం గాక స్త్రీభాగం బయిన డాపలికుఱు వెక్కక పురుషభాగం బై పుత్త్రారోహణయోగ్యం బైన నా వలపలికుఱు వెక్కితి గావున నాపుత్త్రునకు భార్యవగు మనిన నదియు నట్ల చేయుదు నని యదృశ్య యయ్యె నంతం బ్రతీపుండును బుత్త్రార్థి యై సకలతీర్థంబులయందు సునందా దేవియుం దానును వేదవిహిత వ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు తపంబు సేసిన. ౧౩౯

స్త్రీ భాగమైన ఎడమ తొడ మీద గాకుండా పురుషభాగమైన కుడి తొడమీద ఎక్కావు కావున నా కొడుకుకు భార్యవు కమ్మని చెప్పగా అలానే అంగీకరించి అదృశ్యమైంది గంగాదేవి. తరువాత ప్రతీపుడు భార్యతో కలసి సంతానం కోరి వ్రతాలూ పూజలూ చేయగా వారికి శంతనుడు పుడతాడు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాక అతనిని రాజ్యాభిషిక్తుని చేసి యిలా అంటాడు.
మధ్యాక్కర.
తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున
నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టికమనీయరూప
వొనర నాసుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య

కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.
౧౪౨

తానిచ్చిన మాటప్రకారం గంగను వివాహమాడమని కొడుకుకు చెప్తాడు ప్రతీపుడు.
వ.
మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని చెప్పి తపస్సు చేసుకోడానికి వెళ్తాడు.
ఒకరోజు శంతనుడు వనములో విహరిస్తుండగా ఒక అందమైన కన్యక అతనికి దృగ్గోచరమౌతుంది. ఆమెను చూచి.
చ.
కని మునికన్యయో దనుజకన్యకయో భుజగేంద్ర కన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ

వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య.యంచు న

య్యనఘుఁడు దాని జిత్తమున నాదటవోవక చూచెఁ బ్రీతితోన్
. ౧౪౫

ఆమెనాతడు తనివితీరా చూస్తుండి పోయాడట. అప్పుడామె అతనితో
క.
భూనాధ నీకు భార్యం, గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము, మానుగ నా కిష్ట మయినమార్గముఁ బ్రీతిన్
. ౧౪౯
సమయంబు =సంకేతము
గంగా శంతనుల సమయము
వ.
అది యె ట్లంటేని యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను నప్రియంబులు వలుకక యుండను వలయు నట్లైన నీకు భార్య నై యభిమత సుఖంబు లొనరింతు నటు గాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె గంగయు మనుష్యస్త్రీరూపధారిణి యై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె నంత. ౧౫౦

నోరుమూసుకుని తాను చెప్పినట్లే వినాలని ముందే ఒప్పందం ఖరారు చేసుకుందావిడ.

అలా నియమించుకున్న తరువాత తనకు పుట్టిన పిల్లల్ని వరుసగా ౭ గురి వరకూ పుట్టీపుట్టగానే గంగానదిలో పడవేస్తుండే దావిడ. అదంతా సహించిన శంతనుడు 8వ సారి మాత్రం ఆమెకు అడ్డు చెప్తాడు.
క.
పడయంగ రానికొడుకులఁ, గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతిని వై తీ
కొడుకు నుదయార్క తేజుని, విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్.
౧౫౩
వ.
దాని నప్రియంబులు వలికి వారించిన నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచి నీతోడిసంగతి నాకు నింతియ యేను బుణ్యజలప్రవాహ పవిత్రతం ద్రిభువన పావని యనం బరఁగిన గంగఁ జు మ్మీవసువులు వసిష్టు శాపంబున వసుమతిం బుట్ట వచ్చుచుండి యే మొండు చోట జన్మింపనోపము నీ యంద పుట్టెదము మర్త్యంబునం బెద్దకాలంబుండ కుండ మమ్ము ముక్తులం జేయుమని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి దీన నీకుం బుణ్యలోకంబు లక్షయ్యంబులగు మఱియు నియ్యష్టమ పుత్త్రండు వసువులయం దొక్కొక్కళ్ల చతుర్థార్ధంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు లోక హితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలంబుండు ననిన గంగకు శంతనుం డి ట్లనియె. ౧౫౪

వసువులనేవారు దేవతలు వారికి వసిష్టముని శాపమెందు కిచ్చాడు, అష్టమ వసువు అందరికంటె వేరుగా ఎక్కువకాలం భూమి మీద జీవించటానికి కారణమేమిటని శంతనుడామెను అడిగాడు. అప్పుడామె ౮ గురు వసువులు వసిష్టుని ఆశ్రమానికి భార్యలతో సహితంగా క్రీడార్ధం వచ్చారు. వారిలో అష్టమ వసువైన ప్రభాసుని భార్య ఆశ్రమంలోని నందిని అనే ధేనువును చూచి ముచ్చటపడి దానిని తన చెలియలి నుశీనరనరపతి కూతురు జితవతికి బహుమానంగా ఇద్దామని అంటే వసువులందరూ కలసి ఆ హోమధేనువుని అపహరిస్తారు. ఆ విషయం దివ్యదృష్టితో గ్రహించిన వసిష్టమహర్షి వారిని మనుష్యయోని పుట్టాల్సిందని శాపమిస్తాడు. అప్పుడు వారంతా మునికాళ్లమీదపడి ప్రార్ధించగా ఎక్కువకాలం మనుష్యులుగా వారందరూ ఉండక్కరలేదని అనుగ్రహిస్తూ అష్టమ వసువు అయిన ప్రభాసుడు నేరం ఎక్కువగా చేసాడు కాబట్టి అతను దీర్ఘకాలం మనుష్యలోకంలో ఉంటాడనిన్నీ మరియు అనపత్యుడుగా కూడా వుంటాడని అనుగ్రహిస్తాడు వసిష్టమహాముని.

ఈ కథ అంతా చెప్పి గంగాదేవి కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ తనతోనే ఉంటాడని తీసుకుని వెళుతుంది.
కొంతకాలం జరిగాక శంతనుడు గంగానది చెంతకు వాహ్యాళికి వెళ్ళగా అక్కడ
తరలము.
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్ ధను వభ్యసించుచు బాణసంహతి సేతుగా

ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న

త్యనఘు నాత్మ సమాను నాత్మజు నాపగేయు మహాయశున్.
౧౬౫

బాణాలతో గంగాప్రవాహానికి సేతువును నిర్మస్తున్న తన పోలికలతో ఉన్న గాంగేయుని శంతనుడక్కడ చూస్తాడు.కాని చిన్నతనంలో చూచి ఉండటం చేత గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడు గంగాదేని అక్కడికి వచ్చి కొడుకును శంతనునకు చూపి ఇలా అంటుంది.
సీ.
సాంగంబు లగుచుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధ
శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నేర్చినయట్ల నేర్చె

బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత దక్షుఁ డంతియ కడుదక్షుఁడయ్యె

నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల యట్టిఁడ యనఘమూర్తి


ఆ.

నొప్పుకొనుము వీని నుర్వీశ యని సుతు, నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు

నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్న పేదయ, పోలె సంతసిల్లి భూవిభుండు.
169

ఇక్కడ గాంగేయుని సామర్ధ్యం వర్ణించబడింది.
వ.
తన పురంబునకు వచ్చి సకల రాజన్యప్రధానసమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యపట్టాభిషేకంబు సేసి కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగు వత్సరంబు లనన్యవ్యాపారుం డై యుండి యొక్కనాఁడు యమునాతీరంబున వేఁట లాడుచుఁ గ్రుమ్మరువాఁడపూర్వసురభి గంధం బాఘ్రాణించి దానివచ్చినవలనారయుచు నరిగి యమునాతీరంబున. ౧౭౦
క.
కనకావదాతకోమల, తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాధుఁడు, గనియెను సురకన్యవోనికన్నియ నంతన్
. ౧౭౧
కనకావదాత=బంగరువలె పచ్చనై
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్

దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం

తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨
Unknown

ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

గంగా వసువుల సంభాషణము
ఉ.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫


గాంగేయు డైన భీష్ముని జననం సందర్బం లోనిదీ పద్యం.

జనమేజయుడు వైశంపాయుని కి ట్లనియె.౧౨౦
క.
నరవరుఁ డగు శంతనున క, య్యమరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల, య్యిరువురకును బుట్టె దీని నెఱిఁగింపు మొగిన్. ౧౨౧

నరుడైన శంతన మహారాజుకూ గంగానదికీ ఎలా కలయిక జరిగింది? మహాపురుషుడు భీష్ముడు వారిద్దరికి ఎలా జన్మించాడో వివరంగా చెప్పాల్సింది అని అడిగాడు.
వ.
మఱి పాండవ ధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంగా విన వలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డై యశ్వమేధ సహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాది దేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబుతోఁ బితామహుం గొల్చు చున్న యవసరంబున గంగాదేవి స్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన. ౧౨౨
తే.
ఊరుమూలమేర్పడఁగ నయ్యువిద వలువ, దొలఁగె ననిలంబు చేత విధూత మగుచు
నమరు లెల్లఁ పరాఙ్ముఖు లైరి దాని సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు. ౧౨౩

తొడ మొదలు కనిపించేలా గాలిచేత ఆ ఉవిద వలువ చెదరగా దేవతలందరూ మొగము త్రిప్పుకొన్నారు. కాని మహాభిషుడు మాత్రం ఆమెను సాభిప్రాయంగా చూచాడు.
ఆ.
దాని నెఱిఁగి కమలయోని వానికి గర, మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాప మిచ్చె నొనరంగ వాఁడును, గరము భీతిఁ గరయుగంబు మొగిచి. ౧౨౪

ఇది గ్రహించిన బ్రహ్మ అతనికి మనిషి జన్మ నెత్తాల్సిందిగా శాప మిచ్చాడు. వాడు భయంతో చేతులు కట్టుకొని .
వ.
మర్త్యలోకంబున రాజర్షి వంశంబులలోనఁ బుణ్య చరిత్రుండు ప్రతీపుండ కావున వానికిఁ బుత్త్రుండ నై జన్మించెద నొరుల యందు జనింప నోప నని కమలభవు ననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందలి యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకంబునకు వచ్చునది యెదుర. ౧౨౫

గంగా వసువుల సంభాషణము
క.
అనిమిషలోక వియోగం, బున దుఖిఃతు లయి వసిష్ఠ మునివరు శాపం
బున వచ్చు వారి వసువుల, నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁగరుణన్.౧౨౬

దేవలోక వియోగంతో బాదపడుతూ వసిష్ఠ మునివరుని శాపంతో వస్తున్న ఎనమండుగురు వసువులను ఎదురుగా చూచి గంగా దేవి దయతో.
.
ద్యుతి దఱిఁగి నైజలోక, చ్యుతిఁ బొందను మీకు నొండు చోటికి నరుగం
గత మేమి యనిన విని య, య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్. ౧౨౬

ప్రకాశాన్ని కోల్పడి నిజలోకాన్ని విడిచి వేరే చోటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్పమని గంగాదేవి వారినడుగుతుంది.
.
ఏము వసిష్ఠ మునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్క పుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపం బోయెద మని దుఃఖించి తమ శాపప్రకారంబు గంగాదేవికి నెఱింగించి యే మొండుచోట జన్మింప నోపము నీయందుఁ బుట్టెదము మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁ గావున వానికి నీకును సమాగమం బగు మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు ననిన విని గంగ సంతసిల్లి యిట్లనియె. ౧౨౮
.
నా కభిమతంబు నిట్టిద, మీకును నుపకార మగు సమీహితబుద్ధిన్
జేకొని చేసెద మీర ల, శోకస్థితి నుండుఁ డనుచు సురనది కరుణన్. ౧౨౯

.
నాకూ మీకూ కూడా వీలుగా వుంటుంది . అలా నే చేస్తాను. మీరు విచారించకండి అని గంగాదేవి వారితో పలికింది.
.
వసువులకు మనఃప్రియంబుగాఁ బలికిన విని వారును గంగ యనుగ్రహంబు వడసి నీవు మాకు నుపకారంబు సేయ నోపు దేని నేము నీకుఁ గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్త్యలోకంబునం బెద్దకాలం బుండకుండునట్లుగాఁ జేయునది మాకు వసిస్ఠ మహాముని యనుజ్ఞయు నిట్టిద యనిన గంగయు నట్ల చేయుదు మఱి మీరెల్ల స్వర్గతు లైన నాకొక్క కొడుకు దీర్ఘాయుష్మంతుం డై యుండెడువిధం బె ట్లనిన దానికి వసువు లి ట్లనిరి. ౧౩౦
.
మాయం దొక్కొక్కళ్ల తు, రీయార్థముఁ దాల్చి శుభ చరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమవసు, వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై. ౧౩౧

మా అందరిలో ఒక్కొక్కరి నాల్గవ యంశము వయస్సును పొంది ఒక కుమారుడు దీర్ఘాయుష్మంతు డై గొప్ప పరాక్రమ వంతుడై ఉంటాడు.
.
అని యిట్లు గంగా వసువులొండొరులు సమయంబు సేసికొని చని రంత నిక్కడ. ౧౩౨
.
వీరుఁడు ప్రతీపుఁ డఖిల, క్ష్మారాజ్యసుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు, భారతకులుఁ డుండె ధర్మపరుఁ డై నిష్ఠన్. ౧౩౩
.
ఇట్లు యమనియమవ్రతపరాయణుం డై యున్న వానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు.౧౩౪
.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫

గంగాదేవి తన నిజాంగదీప్తులు ప్రకాశిస్తుండగా అందమైన స్త్రీ రూపం ధరించి ప్రతీప వసుధాధిపుని కుడి తొడపైమన్మథవశంబున కూర్చోవటం జరిగిందట.

Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
క.
అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్.
౯౨

యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశకరుడవుతాడనీ నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.
క.
భూరిగుణు నిట్టికుల వి, స్తారకు దారకు నుదార ధర్మప్రియు ని
ష్కారణమ తప్పఁ జూడఁగ, సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్. ౯౩

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?
చ.
ుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
౯౫

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే.
సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు
. ౯౬

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.
క.
కావున సత్యము మిక్కిలి , గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ, గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
౯౭
క.
క్షత్త్రవరుఁ డైన విశ్వా, మిత్త్రునకుఁ బవిత్రమైన మేనకుకున్ స
త్పుత్త్రి నయి బొంకువలుకఁగ, ధాత్త్రీతల నాధ యంత ధ ర్మేతరనే
. ౯౮

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.
వ.
అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.
క.
ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్
మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.
౧౦౦

నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?
క.
వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,
దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ ౧౦౦ --(పాఠాంతరము)

ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా!!
క.
పొడువునఁ బ్రాయంబునఁ గుఁ, గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు, నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందరు నగగాన్. ౧౦౧

పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా.
వ.
ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయినపలుకులు పలుకక నీ యాశ్రమంబునకుం బొమ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణ యై. ౧౦౨

ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపాన్నొందిన దై.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. ౧౦౩

పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.
ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.
వ.
ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. ౧౦౪
చ.
గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 105

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును తీసుకువచ్చింది.