Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-8
పాండవులు వారణావతంబునకు పోవుట
ఆ.
ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147

ఈ మాటల్ని ధర్మరాజు కుంతీదేవితో అంటాడు. ఆ సందర్భం యేమిటంటే....

ధృతరాష్ట్రుఁడు ధర్మరాజును యువరాజుగా చేసిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు (కణికనీతిని వినిన తరువాత) తండ్రితో-- వీరులైన వారని నేను పాండవులంటే భయపడుతూ ఉంటాను. దానికి తోడు నీవు ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా చేసావు. పైగా ప్రజలందరూ కూడా ధర్మరాజు గుణగణాలచే ఆకర్షితులైనవారై ఆతడే రాజు కావాలని ఆకాంక్షిస్తారు. అలా అతడు రాజైతే ఆతరువాత రాజ్యం వారివారి కుమారులకే చెదుతుంది. మాకు రాజ్యం దక్కదు. కావున నీవేదో ఒక ఉపాయం పన్ని పాండవులను ఈ చోటనుండి దూరంగా వెళ్ళేలా చెయ్యి అంటాడు. వారిని దూరంగా వారణావత నగరానికి పంపిస్తే మంచిదంటాడు. దానికి భీష్మ ద్రోణ విదుర అశ్వత్థామ కృపాచార్యులు మొదలగువారు ఒప్పుకోరేమో అని ధృతరాష్ట్రు డంటే వారందరూ ఒప్పుకుంటారు ఎలా అంటే అశ్వత్థామ నా కిష్టుడు నాతోనే ఉంటాడు , ద్రోణుడు కొడుకును వదలలేడు, బావ ద్రోణుడిని తన చెల్లెలిని విడువలేక కృపాచార్యులును నావద్దే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు, పాండవులతో వెళ్లడు, మనతోనే ఉంటాడు. విదురుడొక్కడూ ఏమీ చేయలేడు. అందుచేత పాండవులను వారణావతానికి పంపించమంటాడు. అందరూ వారణావతాన్ని గురించి బాగా పొగడేలా చేస్తాడు. దానితో పాండవులు కూడా దాని గురించి కుతూహులాన్వితు లవుతుంటారు. అలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి మీరు కుంతితోను మీ పరివారంతోనూ కలసి కొంతకాలం వారణావతంలో నివసించి తిరిగొస్తే బాగుంటుందని అక్కడకు వెళ్ళమని కోరతాడు. వారు దానికి ఒప్పుకుంటారు.

దుర్యోధనుడు విరోచనుడనే వాడిని ఒక లాక్షాగృహం పాండవులకొరకు వారణావతంలో నిర్మించమని పంపిస్తాడు. ఆ గృహంలో పాండవులు నిదురిస్తుండగా వారిని ఆ యింటితో సహా బూడిద చెయ్యాలనేది అతని సంకల్పం. విరోచనుడు అలాగే లాక్షాగృహాన్ని నిర్మిస్తాడు.

పాండవులు వారణావత గమనోన్ముఖులై నపుడు ప్రజలు ఇలా ప్రవర్తించారట.
సీ.
ఇప్పాండుపుత్త్రుల నేలొకో ధృతరాష్ట్రుఁ డేకత మనుపంగ నిచ్చగించె
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు లేల వారింపరో యెఱుఁగరొక్కొ
పితృపితామహూలచే భృతపూర్వమైక్రమాగత మైన రాజ్యంబుఁ గరము నెమ్మి
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
ఆ.
యేల వృద్ధరాజు లెడసేసిరో పార్థు, నరిగినెడక మనము నరిగి యతని
యున్న చోన ప్రీతి నుండుద మిందుండ, నేల యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి. 143

అలా ఆరోజుల్లో మంచివాడైన రాజుని అనుసరించి పోవటానికి ప్రజలు ఉత్సాహపడుతుండేవారు.
వ.
తనపిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయి వచ్చెద మని యందఱం గ్రమ్మఱించి చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి విదురుం డొరులు వినియును నెఱుంగ రానివచనంబుల బహుప్రకారవచన రచనావిశారదుండైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి కొడుకులం గౌఁగిలించుకొని కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱి చనియె నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యిట్లనియె. 144
తే.
విదురుఁడేతెంచి యొరులకువినియు నెఱుఁగ,గానియట్లుండఁ బలికినిన్ గఱపెబుద్ధి
నట్ల చేయుదు నంటి వీ వతనిమతము, సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పుమయ్య.145

విదురుడు ఇతరులు వినినా వారికర్థం కాని రీతిలో నీకేమిటో చెప్పాడు. నీవూ అలానే చేస్తానని అన్నావు. చెప్పేవిషయమైతే అదేదో చెప్పమని కుంతి ధర్మరాజుని అడిగింది.
వ.
అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె.146

ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147
వ.
కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమాదులరై యెఱుక గలిగి యుండునది యని బుద్ధి కఱపి మఱియు దుర్యోధనుచేసెడు దుష్క్రియలిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచద ననియె నని చెప్పిన విని విదురు బుద్ధికి దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచుఁ బాండవులు కతిపయి ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత. 148
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-7
కణికనీతి- కణికుడు దుర్యోధనునకు రాజనీతిఁ జెప్పుట
సీ.
ఆయుధవిద్యలయందు జితశ్రము లనియును రణశూరు లనియు సంత
తోత్సాహు లనియు నత్యుద్ధతు లనియును భయమందుచుండుదుఁ బాండవులకు
దానిపై నిప్పుడు ధర్మజు యువరాజుఁ జేసె రా జే నేమి సేయువాఁడ
నృపనీతి యెయ్యది నిరతంబుగా మీర నా కెఱింగింపుఁడునయముతోడ
ఆ.
ననిన వినియుఁ గణికుఁ డనువాఁడు సౌబలు,నాప్తమంత్రి నీతులందుఁ గరము
కుశలుఁ డైనవాఁడు కురుకులవల్లభు, నిష్టమునకుఁ దగఁగ నిట్టు లనియె. 101

ఆయుధవిద్యలలో స్థిరమైన పరిశ్రమచేసినవారు, యద్ధములో శూరులు, ఎప్పుడూ ఉత్సాహంగా వుండేవారూ, మంచిగర్విష్టులు అని పాండవులకు నేనెప్పుడూ భయపడుతూ ఉంటాను. ఆమీద రాజుగారు ధర్మరాజుని యిప్పుడు యువరాజుగా కూడా చేసారు. నేనేం చేయాలిప్పుడు? రాజనీతి ఏమి చెపుతుంది? మీరు నాకు మేలైనదేమిటో చెప్పండి. అన్నాడు దుర్యోధనుడు తన స్నేహితులతో. అప్పుడు నీతులలో ఆరితేరిన కణికుడనే శకుని కిష్టుడైన మంత్రి దుర్యోధనునికి ప్రీతి కలిగించగలిగేలా ఇలా అన్నాడు.

అమ్మవొడి బ్లాగు ద్వారా ఈ కణికనీతి ఈమధ్య బ్లాగులలో బాగా ప్రచారాన్ని పొందింది. అందుచేత మనం ఈ కణికనీతి ని గురించి అతని మాటలలోనే తెలుసుకోవటం చేద్దాం.
తరువోజ.
ధరణీశుఁ డుద్యతదండుఁ డై యుచితదండవిధానంబు దప్పక ధర్మ
చరితులఁగా మహీజనుల రక్షించి సద్వృత్తుఁ డగునది సర్వవర్ణములు
వరుసన తమతమవర్ణధర్మముల వర్తిల్లుదురు గడవక దండభీతి
నరిమిత్ర వర్జితుఁ డై సమబుద్ధి యగుమహీవల్లభు ననుశాశనమున. 102

రాజైనవాడు మొదటిగా దండనీతిని, ఉచితమైన దండవిధానాన్ని తప్పకుండా ప్రయోగిస్తూ ప్రజలందరూ మంచినడవడిక కలిగి మెలిగేలా రక్షిస్తూ మంచి వృత్తిని కలిగి వుండాలి. అలా అయితే దండభీతి వలన అన్ని వర్ణములవారూ- శతృవులూ, స్నేహితులూ అనే తేడా లేకుండా సమ బుద్ధి కలిగిన రాజు పరిపాలనలో వరుసగా తమ తమ వృత్తిధర్మా ల్నాచరిస్తూ బ్రతుకు సాగిస్తారు.
క.
గుఱుకొని కార్యాకార్యము, లెఱుఁగక దుశ్చరితుఁడయి యహితుఁ డగునేనిన్
మఱవక గురు నైనను జను, లెఱుఁగఁగ శాసించునది మహీశుఁడు బుద్ధిన్.103

ఏది చేయదగినది, ఏది చేయరానిది అనేది తెలియకుండా దుశ్చరితుడూ అహితుడూ ఐన వాడు గురువే అయినా సరే ప్రజలందరికీ తెలిసేలా రాజు మంచిబుద్ధితో వానిని మఱచిపోకుండా యత్నించి శిక్షించాలి.
క.
ధీరమతియుతులతోడ వి, చారము సేయునది మును విచారితపూర్వ
ప్రారబ్ధమైన కార్యము, పారము బొందును విఘాతపదదూరం బై. 104

ముందుగా విద్వాంసులైన వారితో బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిర్వహించిన పని ఏ విఘాతాల్లేకుండా పూర్తవుతుంది.
క.
జనపాలుఁడు మృదుకర్మం,బున నైనను గ్రూరకర్మమున నైనను నే
ర్పున నుద్ధరించునది త, న్ననపాయతఁ బొంది చేయునది ధర్మంబుల్. 105

రాజు మృదు కర్మకానీ క్రూరకర్మకానీ ఏదైనా సరే నేర్పుతో తాను అపాయాన్ని పొందకుండా ఉండేలా వుంటూ ధర్మాల్ని ఉద్ధరించాలి.
క.
అమలినమతి నాత్మచ్థి,ద్రము లన్యు లెఱుంగ కుండఁ దా నన్యచ్ఛి
ద్రము లిమ్ముగ నెఱుఁగుచు దే,శముఁ గాలము నెఱిఁగి మిత్రసంపన్నుం డై. 106

మలినముకాని బుద్ధితో తనతప్పులు యితరు లెఱుగకుండా యితరుల తప్పులను తాను బాగుగా తెలుసుకొనుచూ మిత్రులతో కూడినవాడై దేశ కాల పరిస్థితుల నెఱిగి ప్రవర్తించాలి.
క.
బలహీను లైనచో శ,త్రులఁ జెఱచుట నీతి యధికదోర్వీర్యసుహృ
ద్బలు లైనవారిఁ జెఱుపఁగ, నలవియె యక్లేశసాధ్యు లగుదురె మీఁదన్. 107

శత్రువు బలహీనుడైనచో అతనిని చెడఁ గొట్టటంనీతి. గొప్ప వీరులు మంచి బలవంతులైన వారిని చెడ చేయుట సాధ్యమా? మీఁద నట్టివారు మిక్కిలి కష్టంతో మాత్రమే సాధింపగలిగిన వారౌతారు.
క.
అలయక పరాత్మకృత్యం,బుల మది నెఱుఁగునది దూతముఖమునఁ బరభూ
ములవృత్తాంతము లెఱుఁగఁగఁ, బలుమఱుఁ బుచ్చునది వివిధపాషండతతిన్. 108

విసుగు చెందకుండా ఇతరుల మనస్సులలోని కార్యాలను తన మనసుతో తెలుసుకోవాలి. దూతల ద్వారా ఇతర భూముల వృత్తాంతాల్ని తెలుసుకోవటానికి వారిని వివిధములైన వేదబాహ్యమైన మార్గాల ద్వారానైనా సరే పలుమార్లు పంపిస్తుండాలి.
క.
నానావిహారశైలో,ద్యనసభాతీర్థదేవతాగృహమృగయా
స్థానముల కరుగునెడ మును, మానుగ శోధింపవలయు మానవపతికిన్. 109

వివిధములైన విహార, పర్వత, ఉద్యాన, సభా, తీర్థ, దేవతాగృహ, వేట ప్రదేశాలకు వెళ్ళునపుడు ముందుగానే ఆ యా ప్రదేశాలను రాజైనవాడు బాగుగా శోధింపించుకోవాలి.
తే.
వీరు నమ్మంగఁ దగుదురు వీరు నమ్మఁ,దగరు నాఁగను వలవదు తత్త్వబుద్ధి
నెవ్వరిని విశ్వసింపక యెల్లప్రొద్దు, నాత్మరక్షాపరుం డగునది విభుండు. 110

వీరిని నమ్మొచ్చు, వీరిని నమ్మకూడదు అనేదేం వుండకూడదు. తత్త్వబుద్ధితో ఎవ్వరినీ విశ్వసించకుండా యెప్పుడూ రాజు ఆత్మరక్షా పరుడయి వుండాలి.
ఉ.
ఇమ్ముగ నాత్మరక్ష విధియించువిధంబున మంత్రరక్ష య
త్నమ్మునఁ జేయఁగా వలయుఁ దత్పరిరక్షణశక్తి నెల్ల కా
ర్యమ్ములు సిద్ధిఁ బొందుఁ బరమార్థము మంత్రవిభేద మైనఁ గా
ర్యమ్ములు నిర్వహింపఁగ బృహస్పతికైనను నేరఁ బోలునే. 111

బాగుగా ఆత్మరక్ష చేసుకొనే విధంగా మంత్రాంగాన్ని ప్రయత్నంతో రక్షచేసుకోవాలి. అటువంటి పరిరక్షణ శక్తి వలన ఎల్ల కార్యాలు పరమార్థాన్ని సాధించుకోగలుగుతాయి. మంత్రవిభేదమైన కార్యాలు నిర్వహించటం బృహస్పతి కైనా సాధ్య మౌతుందా ?
క.
పలుమఱు శపథంబులు నం,జలియును నభివాదనములు సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ, గలయవి దుష్టస్వభావకాపురుషులకున్. 112

దుష్టస్వభావం కలిగిన కాపురుషులైనవారికి (చెడ్డవారికి) మాటి మాటికి శపథాల్ని చేయటం, నమస్కారాలు చెయ్యటం, అభివాదాలు చెయ్యటం, ప్రియంగా మాట్లాడటం, మిథ్యావినయం ఒలకబోయటం అనేవి ఉంటాయి.
క.
తన కి మ్మగునంతకు దు,ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కి మ్మగుడును గఱచును, ఘనదారుణకర్మగరళ ఘనదంష్ట్రలచేన్. 113

తనకి సరియైన అవకాశం దొరికేంతవఱకూ దుర్జనుడు యిష్టుని వలె నటించి అవకాశం చిక్కగానే పామువలె గొప్ప దారుణమైన విషం కలిగిన పండ్లతో కాటు వేస్తాడు.
క.
కడునలుకయుఁ గూర్మియు నే,ర్పడ నెఱిఁగించునది వానిఫలకాలము పె
న్బిడుగును గాడ్పును జనులకుఁ, బడుటయు వీచుటయు నెఱుకపడియెడుభంగిన్.114

పెద్దపిడుగు పడుట, పెద్దగాలి వీయుట జనులకు ఎలా అనుభవంలోకి వస్తాయో అలాగే రాజుయొక్క కోపము, చెలిమి జనులకు అనుభవంలోకి వచ్చేలా వాటివాటి ఫలితాలు ఆ యా కాలములలో తెలిసేలా చేయాలి.
క.
తఱి యగునంతకు రిపుఁ దన, యఱకటఁ బెట్టికొని యుండునది దఱి యగుడుం
జెఱచునది ఱాతిమీఁదను, వఱలఁగ మృద్ఘటము నెత్తివైచినభంగిన్. 115

సమయము వచ్చేవఱకూ శత్రువును తన స్కందప్రదేశంలో అట్టి పెట్టుకొని ఉండాలి. సమయం వచ్చినపుడు వాడిని రాతిమీద మట్టికుండను వేసి పగులగొట్టినట్లుగా పగలగొట్టాలి.(నశింపజేయాలి).
క.
తన కపకారము మదిఁ జే,సినజనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన దొకయించుక ముల్లయి, నను బాదతలమున నున్న నడవఁగ నగునే. 116

ముల్లు చాలా చిన్నదయినా పాదంలో ఉంటే ఎలా నడవనివ్వదో అలానే తన కపకారము చేసిన మనుష్యుడు అల్పుడైనా సరే వాడిని చేకొని ఉండకూడదు.
క.
బాలుఁ డని తలఁచి రిపుతో, నేలిదమునఁ గలసి యునికి యిది కార్యమె యు
త్కీలానలకణ మించుక, చాలదె కాల్పంగ నుగ్ర శైలాటవులన్. 117

శత్రువైనవాడు బాలుడే కదా అని వానితో చులుకదనమున వ్యవహరించకూడదు. నిప్పురవ్వ చాలా చిన్నదైనా గొప్ప గొప్ప కాఱడవులను సైతము కాల్చివేయటానికి సరిపోతుంది కదా.
క.
మొనసి యపకారిఁ గడ నిడి, కొనియుండెడుకుమతి దీర్ఘ కుజశాఖాగ్రం
బున నుండి నిద్రవోయెడు, మనుజునకు సమానుఁ డగుఁ బ్రమత్తత్వమునన్.118

అపకారిని దగ్గరగా నుంచుకొనే మూర్ఖుడు జాగ్రత విషయంలో పొడవైన చెట్టు చిటారు కొమ్మమీఁద నిద్రించేటటువంటి మూర్ఖునితో సమానంగా నుంటాడు.
చ.
తడయక సామభేదముల దానములన్ దయతోడ నమ్మఁగా
నొడివియు సత్య మిచ్చియుఁ జనున్ జననాథకృతాపకారులం
గడఁగి వధింపగా ననుట కావ్యమతం బిది గాన యెట్టులుం
గడుకొని శత్రులం జెఱుపఁ గాంచుట కార్యము రాజనీతిమైన్. 119

ఆలసింపక సామభేద దానోపాయములచేతను, దయతో నమ్మేట్లుగా పలికి, నిజం చెప్పి, రాజుకు అపకారం చేసినవారిని సంహరించటం చేయదగిన పని. ఏవిధంగా నైనా సరే శత్రువులను మట్టుపెట్టడమే రాజనీతిలో తగిన కార్యం.
వ.
కావున సర్వప్రకారంబుల నపకారు లయినవారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మ రక్షాపరుండ వయి దూరంబు సేసి దూషించునది యనిన కణికమతంబు విని దుర్యోధనుం డొడంబడి చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కి ట్లనియె. 120
















Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-5
కౌరవ పాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టఁ జనుట
ద్రోణుడు తన శిష్యులతో నాకు గురు దక్షిణగా ద్రుపదుని పట్టి తెండని అడిగాడు. అప్పుడు అదెంతపని అని తలచి కురుకుమారులందరూ పాంచాలపురాన్ని ముట్టడించారు.
పాండవులును రథంబు లెక్కి ద్రోణుం పిఱుంద నరిగి రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.
క.
వడిగొని కౌరవు లొండొరుఁ, గడవఁగ మును చనిరి వారిగర్వము సూడం
గడిమినిద్రుపదాధిపుతోఁ, బొడవఁగ దమ కలవి యగునె భుజవీర్యమునన్.
68
క.
అతగులచే ద్రుపదుఁడుబల, హితుఁ డై పట్టువడ నంతయల్పుఁడె శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా,న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్
. 69
అతగులచేన్=దుర్బలులచేత
కౌరవులందరూ వారి ప్రయత్నంలో విఫలమోతారు. ద్రుపదుడు వారందరినీ ఓడించగా పరాజయులై వెనక్కు తిరిగి వస్తారు .
వ.
ఇట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశర నిహత సురారికుమారులం బోలె వెఱచఱచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి యర్జునుం డాచార్యధర్మనందనులకు నమస్కరించి మీర లింద .ుండుం డేనీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద నని విజృంభించి సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్ర చరుండు గా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీ సముద్రంబు దఱియం జొచ్చిన. 76
ఘోరమైన యుద్ధం జరిగింది.
వ.
అట్టి మహా ద్వంద్వయుద్ధంబున విజిగీషుండయి పాంచాలుండు పాండవమధ్యము ధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన నలిగి వాసవసుతుం డుద్యతాహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుసింహంబునుం బోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాధ్వనులెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత. 87
క.
ప్రక్షీణదర్పు ద్రుపదు ర, థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు, దక్షిణ గా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్. 88
వ.
ద్రోణుండు నర్జునుచేసినపరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె. 89
క.
వీ రెవ్వరయ్య ద్రుపదమ,హారాజులె యిట్లు కృపణు లయి పట్టువడన్
వీరికి వలసెనె యహహ మ,హారాజ్యమదాంధకార మది వాసె నొకో. 90
ఆ.
ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ, యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచి పుచ్చె గురుఁడు విప్రులయలుకయుఁ, దృణాహుతాశనంబును దీర్ఘమగునె 91
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-5
సీ.
శూరులజన్మంబు సురలజన్మంబును నేఱులజన్మంబు నెఱుగ నగునె

మొగిని దధీచి యెమ్మునఁ బుట్ట దయ్యెనే వాసవాయుధ మైనవజ్ర మదియు
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన నాగ్నేయుఁడన రౌద్రుఁడనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె శర స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
తే.
కృపుఁడు ఘటసంభవుడుగాఁడె కీర్తిపరుఁడు, వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁబుట్ట
రై రె సత్క్షత్త్రియప్రభు లవనిఁ గావఁ, గడఁగి మీజన్మములు నిట్లకావె వినఁగ. 60

దుర్యోధనుడు అందఱి జాతకాలనూ బయటపెడుతూ భీముడితో యిలా అంటాడు. ఇంక కథలోనికి వస్తే..
క.
బృహదబ్ధిమేఖలాఖిల, మహీతలక్షత్త్రవరసమక్షమున మహా
మహిమాన్వితుఁగా నన్నును, మహీశుఁగాఁ జేసి తతిసమర్థత వెలయన్. 50

అందఱు రాజుల సమక్షంలో నన్ను రాజుగా ప్రకటించావు అని కర్ణుడు దుర్యోధనునితో అన్నాడు.
క.
దీనికి సదృశముగా మఱి, యే నేమి యొనర్తు నీకు నిష్టం బనినన్
మానుగ నాతోఁ జెలిమి మ,హీనుతముగఁ జేయు మిదియ యిష్టము నాకున్. 51

దీనికి బదులుగా నీకు నేనేమి యివ్వగలను అని కర్ణుడనగా నాతో స్నేహంగా వుండు అది చాలు అన్నాడు దుర్యోధనుడు.
వ.
అనిన విని దుర్యోధనునకు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్టసఖత్వంబున కొడంబడియె నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్ష పరవశుం డయి సూతుండు రథము డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ గర్ణుఁడును బితృగౌరవంబున సంభ్రమించి వినయవినమితోత్తమాంగుం డయిన. 52

ఇదంతా చూచి కర్ణుని పెంపుడు తండ్రి కర్ణుని దగ్గరకొచ్చాడు.
తే.
కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌగిలించి,కొని తదీయమూర్ధ్రాఘ్రాణ మొనరఁ జేసి.
యంగ రాజ్యాభిషేకార్ద్ర మైన శిరముఁ. దడిపె వెండియు హర్షాశ్రుతతులఁ జేసి.53
వ.
దానిం జూచి భీముండు గర్ణుని సూతకులసంభవుగా నెఱింగి నగుచు ని ట్లనియె. 54
క.
నీదుకులమునకుఁ దగఁగఁ బ్ర, తోదముగొని రథముగడపఁ దొడగుము నృపధ
ర్మోదయుఁ డగునర్జునుతోఁ, గా దనక రణంబు సేయఁ గా నీ కగునే. 55
వ.
మఱి యదియునుం గాక. 56
తే.
ఉత్తమక్షత్త్రియప్రవరోపభోగ్య, మైనయంగరాజ్యంబు నీ కర్హ మగునె
మంత్రపూతమైగురుయజమానభక్ష్య, మగు పురోడాశమదిఁ గుక్క కర్హమగునే.57

ఎంత దారుణ మైన మాటన్నాడు.
వ.
అనినం గర్ణుఁడు వెల్ల నయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాస వ్యాకులితవదనుం డయి
యాకాశంబు వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె నంత నంతివ్రీడితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవనమధ్యంబున నుండి దుర్యోధన మధాంధరగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. 58
క.
అనిలజ నీ కిట్లని ప, ల్కను దలఁపను నగునె లేడికడుపునఁ బులి పు
ట్టునె యిట్టిదివ్య తేజం, బునవాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా. 59

దుర్యోధనుడి సంబోధన చూడండి. అనిలజ అని ప్రారంభించాడు. భీమా అని అనలేదు.
సీ.
శూరులజన్మంబు సురలజన్మంబును నేఱులజన్మంబు నెఱుగ నగునె
మొగిని దధీచి యెమ్మునఁ బుట్ట దయ్యెనే వాసవాయుధ మైనవజ్ర మదియు
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన నాగ్నేయుఁడన రౌద్రుఁడనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె శర స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
తే.
కృపుఁడు ఘటసంభవుడుగాఁడె కీర్తిపరుఁడు, వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁబుట్ట
రై రె సత్క్షత్త్రియప్రభు లవనిఁ గావఁ, గడఁగి మీజన్మములు నిట్లకావె వినఁగ. 60
వ.
వానితోడిదేమి దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును బ్రకృతిపురుషుండు గాఁడు తనబాహుబలంబున నీయంగరాజ్యంబునక కాదు సకల మహీరాజ్యంబునకు నర్హుం డగు నను చున్నయంత నాదిత్యుం డస్తగతుం డైన నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు కర్ణుం దోడ్కొని కరదీపికాసహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ బాండవులును భీష్మ ద్రోణవిదురకృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61
ఆ.
కుంతి యంత సహజకుండలకవచాభి, రాముఁ గర్ణుఁ జూచి రవిసమానుఁ
బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమపుత్త్రస్నేహ, మెఱుక పడక యుండ నింతి యుండె. 62

ఇదే కొంప ముంచింది. కుంతి ఈ దాపరికమే అంతకూ కారణం అయ్యింది.
క.
వినుతధనుర్విద్యావిదు, ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలనిభయము సెడి ఱొ,మ్ముఁన జే యిడి నిద్రవోయె ముదితాత్ముం డై. 63

దుర్యోధనుడి కేమో అర్జునిని వలని భయం పోయి హాయిగా నిద్రపోయాడట ఆ రాత్రి.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-4
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47

కర్ణుడిని కృపాచార్యులు తన తల్లి దండ్రుల వివరాలు చెప్పమన్నప్పుడు దుర్యోధనుడు పై విధంగా అంటాడు.
మ.
జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ

ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్ విరో
చనుం డాత్మ ద్యుతి విస్తరించె సుతుపై సంప్రీత చేతస్కుఁ డై.
40
తత్ జీమూత యూథంబు=ఆ మేఘ సమూహము
తత్ ధ్వాంతతిరోహిత ఆపఘనుఁ డు ఐ=ఆ చీఁకటిచేఁ గప్పఁబడిన శరీరియై
కర్ణు డర్జునుని మీద పర్జన్యాస్త్రమేసాడు.
వ.
అయ్యవసరంబున దుర్యోధనుం దొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి భీష్మద్రోణకృపపాండవులు పార్థువలన నుండి రంత. 41
క.
రవిసుతపార్థులఘోరా, హవమునకును వెఱచు చున్న యది కుంతి తదు
ద్భవ ఘనతరశరతిమిరౌ,ఘ వృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్.
42

కర్ణార్జునుల ఘోరమైన ఈ యుద్ధం చూచి కుంతి మిక్కిలి యధికమగు బాణాంధకారముచేఁ గప్పబడిన దేహుడైన కొడుకును చూడగానక భయపడింది.
క.
ధృతిఁ దఱిఁగి మోహమూర్ఛా,న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా గతజీవఁ జేసె నప్పుడ, యతిశీతలచందనోదకా సేకమునన్. 43

కుంతి ధైర్యాన్ని కోల్పోయినదై మూర్ఛనొందగా వెంటనే విదురుఁడు ఆమెకు శీతలోపచారాలు చేసి ప్రాణం తిరిగి వచ్చిన దాన్నిగా చేసాడు.
వ.
అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవ నేసి యాదిత్యసమతేజుం డయి యున్న విదురదర్శితు లై న యక్కర్ణార్జులం జూచి కుంతి సంతసిల్లె నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వ యుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱనడుమ నిలిచి కర్ణున కి ట్లనియె. 44
చ.
కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుఁడు రాజధర్మ బం
ధుర చరితుండు నీ వితనితోడ రణం బొనరించెదేని వి

స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు చెప్పినన్
దొర యగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్. 45
దొర=సాటి
అర్జునుడు కుంతీ పాండురాజుల సంతానం. రాజధర్మా న్నెఱిగిన వాడు. నీ వితనితో ద్వంద్వయుద్ధం చేయాలనుకుంటే నీ తలిదండ్రుల వివరాలు చెప్పు. సాటి వాడవయితె నీపై తన బలాన్నితడు చూపిస్తాడు.
వ.
అనిన విని కర్ణుండు తనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తల వాంచి యున్నం జూచి దుర్యోధనుఁడు గృపున కి ట్లనియె. 46.
క.
కులము గలవాఁడు శౌర్యము, గలవాఁడును నధికసేన గలవాఁడును భూ
తలమున రా జనునామము, విలసిల్లఁగ దాల్చు మూడువిధముల పేర్మిన్.
47
తే.
రాజవరు డైన పార్థుతో రాజు గాని, యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని నెల్లవారును జూడంగ నీ క్షణంబ, రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి. 48
వ.
అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడు మను బ్రాహ్మణవచనంబు వడసి కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండు మణిమకుట కేయూరహారాదిభూషణభూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమ హర్షంబు తోడం గురుపతి కి ట్లనియె. 49
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-3
వ.
కర్ణుండును జనుల నందఱ నదల్చి చొత్తెంచి రంగమధ్యంబున నిలిచి కలయం జూచి కృపద్రోణాచార్యులకు నమస్కరించి జలధరధ్వాన గంభీరరవంబున నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32
జలధరధ్వాన=ఉఱుము వంటి శబ్దము గల
క.
నీవ కడు నేర్పుకాఁడవు, గా వలవదు వీనిఁ గొన్ని గఱచితి మేమున్
నీవిద్య లెల్లఁ జూపుదు, మే వీరులుసూచి మేలుమే లని పొగడన్. 33
క.
అనిన నినతనయుపలుకులు, జనులకు విస్మయము సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును మఱి దుర్యో, ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్క్షణమాత్రన్. 34
వ.
అంత ద్రోణు చేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జును చూపినయస్త్రవిద్యావిశేషంబు లెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకునుహితంబుసేసి నన్నుం గురురాజ్యం బేలించి నా యైశ్వర్యం బుపయోగింపు మనిన నట్ల సేయుదునని కర్ణుం డొడంబడి యిమ్మూఁగిన రాజలోకంబును నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయవలయుననిన ధార్తరాష్ట్ర మధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డిట్లనియె. 35
క.
పిలువంగఁబడక సభలకు, బలిమిం జని పలుకుపాపభాగుల లోకం
బులకుఁ జన వేఁడి పలికెదు, పలువ యెఱుంగవు పరాత్మ పరిణామంబుల్. 36
పలువ=దుర్జనుఁడా!
పర ఆత్మ పరిణామంబుల్=ఇతరుల, తన-కొలదులు
క.
అనిన విని పార్థునకు ని, ట్లనియె నినాత్మజుఁడు దుర్బలాయాసక్షే
పనిబంధనమ్ములు వలుకక, ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడఁగుము నాతోన్. 37
క.
ఈరంగభూమి యస్త్రవి, శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు, వీరికిఁ గా దనువిచార విషయము గలదే. 38
విషయము=తావు
వ.
అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన. 39
Unknown
ఆదిపర్వము-షష్టాశ్వాసము-2
ఉ.
హారివిచిత్ర హేమకవచావృతుఁ డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు భాస్వదసితోత్పలవర్ణుఁడు సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగఁ బాండవమధ్యముఁ డొప్పె బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చి జనంబులు దన్నె చూడఁగన్. 17
హారివిచిత్ర హేమకవచావృతుఁ డు=ఇంపై వింతయైన బంగారు కవచముచేఁ గప్పఁబడినవాఁడు
ఉన్నతచాపచారుదీర్ఘోరుభుజుండు=పెద్దవింటిచేనందమై పొడవైన గొప్ప భుజములు గలవాఁడు
భాస్వదసితోత్పలవర్ణుఁడు=ప్రకాశించు నల్లకలువలవంటి చాయగలవాఁడు
సేంద్రచాపశంపారుచిమేఘమో=ఇంద్రధనస్సు మెఱపుకాంతితో గూడిన మేఘమా--అనేట్టుగా ఆ విధంగా రంగమధ్యమున నిలుచున్న పాండవమధ్యముడు (అర్జునుఁడు) జనులందరూ తననే చూస్తుండగా ఒప్పాడట.
క.
నరు నింద్రాత్మజు నింద్రా, వరజసఖున్ వీరుఁ బాండవ ప్రవరు ధను
ర్ధరుఁ జూచి చూప ఱెల్లం,బరమాధ్భుత చిత్తు లగుచుఁ బలికిరి తమలోన్. 18
ఇంద్రావరజసఖున్=కృష్ణుని మిత్రుని
ఆ అర్జునుని చూచి జనులందరూ తమలో తాము ఇలా అనుకున్నారట.
తే.
వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు, వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి, కడుపు చల్లగాఁ బుట్టిన ఘనభుజుండు. 19
ధర్మ=ధనుః
ఆవిధంగా జనులందరూ అర్జునుని పొగడుతున్నారట. ఆ పొగడ్తలు విని కుంతీ దేవి చాలా సంతోషాన్ని పొందినదట.
వ.
అయ్యర్జును స్తుతివచనంబు లొక్కట జనసంఘంబు వలన నెగసి వియత్తల విదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం డిది యేమి రభసం బని విదురునడిగిన నాతం డి ట్లనియె. 22
రభసంబు=కలకలము
క.
భూరిభుజుం డర్జునుఁ డతి, శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న, వారితముగఁ బొగడుజనరవంబిది యధిపా. 23

తన విలువిద్యా ప్రదర్శన చేయటానికై రంగప్రవేశం చేసిన అర్జునుని అవారితముగా పొగడుతూ జనులు చేస్తున్న కలకలమిది మహారాజా అని విదురు డతనికి చెప్పాడు.

అర్జునుండు దన యస్త్రవిద్యాకౌశలంబు చూపుట

వ.
అని పొగడు చుండ నర్జునుం డాచార్యు ననుమతంబున నస్త్రలాఘవ వై చిత్ర్యప్రకాశనపరుం డయి యెల్లవారును జూచు చుండ. 26
సీ.
ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున భూప్రవిష్ణుం డగుభూరిఘోర
శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుఁ డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
తే.
దానదృశ్య దేహుండగుఁదత్క్షణంబ, హ్రస్వుఁడగు దీర్ఘుఁడగు సూక్ష్ముఁడగు రయంబు
తోడ రథమధ్యగతుఁడగు ధూర్గతుండు, నగు మహీతలగతుఁడగు నద్భుతముగ. 27

ఆగ్నేయాస్త్రంతో అతిభీకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింపనలవికాని జలాన్ని, అనిలాస్త్రంతో అధికమైన వాయువును, మేఘాస్త్రంతో మహాగొప్పవైన మేఘసమూహాన్ని- పుట్టించాడట. అంతేకాక భూమ్యాస్త్రంతో భూమిలోనికి ప్రవేశించినవాడుగాను, మహా ఘోరమైన శైలాస్త్రంతో పెద్దపర్వతరూపాన్ని దాల్చాడు. ఇవన్నీ కూడా అదృశ్యమైన అస్త్రాలసాయంతో జరుగుతున్నాయట. తాను అదృశ్యమైన దేహం కలవాడుగాను, ఆ క్షణంలోనే పొట్టివాడుగాను, మరుక్షణంలో పొడుగ్గాను, ఒక క్షణం దీర్ఘమైనవాడుగాను, మరో క్షణంలో సూక్ష్మమైన వాడుగాను ఒకసారి రథం మధ్యలో ఉన్నవాడుగాను, ఇంకో క్షణంలో భూమిమీద నిల్చున్నవాడుగాను ఇన్నిన్ని రకాలుగా ప్రత్యక్షమౌతూ అందరినీ అద్భుతంగా అలరించాడు అర్జునుడు తన ధనుర్విద్యతో.
వ.
మఱియుం బాఱెడు సింహవ్యాఘ్రవరాహాది మృగంబుముఖంబులం దొక్కొక్క యమ్మేసి నట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు రజ్జుసమాలంబితంబయిన గోశృంగంబునం దేకవింశతి శరంబులు వరుసన నాట నేసియు ని ట్లస్త్రవిద్యా వైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయు చున్నంతఁ గర్ణుండు నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన. 28
మ.
జను లెల్లం గడు సంభ్రమింపఁగ నజస్రం బై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబయో
యన వీతెంచినఁ బాండవుల్ సనిరి ద్రోణాచార్యు డాయన్ సుయో
ధను వేష్టించిరి తమ్ములందఱును దద్ద్వారంబు వీక్షించుచున్. 29
వ.
అంత. 30
శా.
సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్
బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణ వర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణ పూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్. 31

సాలప్రాంశు=మద్దివలె నెత్తైనవానికిని
నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్=ఉజ్జ్వలమైన సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్నవాడు
బద్ధోగ్రనిస్త్రింశు=గ్రహించిన భయంకర ఖడ్గముగలవానిని
అటువంటి కర్ణుని చూచి జనులందరూ ఆశ్చర్యపోయారట. పాండవులందరూ ద్రోణుని ప్రక్కకు చేరగా కౌరవులందరూ దుర్యోధనుని ప్రక్కకు చేరారట.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-1
కుమారాస్త్ర విద్యాసందర్శన కథాప్రారంభము
క.
ఘోరాస్త్రశస్త్రవిద్యల, నారూఢములందు నిపుణు లైరి కుమారుల్
మీరలు వీరలవిద్యా, పారముసను టెఱుఁగ వలయు భవదీయసభన్.3

కుమారులందఱూ అస్త్రశస్త్రనిద్యలలో ఆరితేరారు. మీరో సభచేసి వీరి విద్యాపారాన్నిచూడాల్సింది అని ద్రోణుఁడు ధృతరాష్ట్రునితో అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుని ఆనతి మేరకు విడురుడు రమ్యమైన సభను అన్నివిధాలా అలంకరించి ఏర్పాటు చేయగా ఓ రోజు గాంధారీ సహితముగా ధృతరాష్ట్రుడా సభకు బంధుజనంతో సహా వచ్చి ఆసీనుడయ్యాడు.
తే.
సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క, నెతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్త్రి, కెలన నుండె నున్మీలితనలిననేత్ర. 6

కుంతీదేవి కూడా సుతుల ధనుర్విద్యాప్రదర్శనము చూచు వేడ్కతో గాంధారి ప్రక్కన కూర్చుని ఉన్నది.
ద్రోణాచార్యులవారు అశ్వత్థామతో సహా రంగమధ్యమున ప్రవేశించాడు.
శా.
ద్రోణాచార్యుపిఱుంద నొప్పి కృతహస్తుల్ బద్దగోధాంగుళి
త్రాణుల్ మార్గణపూర్ణతూణులు మహాధన్వుల్ కుమారుల్ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్టానుపూర్వంబుగాన్. 10
బద్దగోధాంగుళిత్రాణుల్=కట్టుకొనబడిన ఉడుముతోలు చేతి కవచములు గలవారు.
ధర్మరాజుమొదలుగా గల కుమారులందరు వారివారి వయస్సుల ప్రకారము బారులు తీరి ద్రోణుని ప్రక్కన వచ్చి వరుసగా నిలబడ్డారు.
గురువుగారి అనుమతి ప్రకారం అందరూ తమ తమ విద్యలను వరుసగా ప్రదర్శించసాగారు.

భీమ దుర్యోధనులు తమగదాకౌశలంబు చూపుట
మ.
అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్ర భై
రవహుంకారరవంబునన్ వియదగారం బెల్ల భేదిల్లఁ బాం
డవ కౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థ మై భావిపాం
డవ కౌరవ్యరణాభిసూచన పటిష్టం బయ్యె ఘోరాకృతిన్. 14
వియత్ ఆగారం=ఆకాశ గృహము
అకాండప్రోత్థ మై=కారణము లేక కలిగిన దై
వారి గదాయుద్ధం అతిభయంకరమై భావి భారత కౌరవ రణానికి సూచనగా అనిపించినదట.
క.
ఆరాజసుతులవిద్యా, పారగపటుచేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి, ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచు నుండెన్.15
పరువడిన్=క్రమముగా
వ.
అంత భీమదుర్యోధనులగదాకౌశలంబు సూచుజనుల పక్షపాత జనిత పరస్పర క్రోధవచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామం బంచి వారి నిద్దఱ వారించి వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి నా ప్రియశిశ్యుం డయిన యర్జునుధనుఃకౌశలంబుఁ జూడుం డనిన నయ్యాచార్యువచనానంతరంబున. 16


Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-18
ద్రోణుఁ డస్త్రనిద్యం దనశిష్యులఁ బరీక్షించుట.
వ.
అక్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు గృత్రిమం బయిన భాసం బనుపక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి దాని నందఱకుం జూపి మీమీ ధనువుల బాణంబులు సంధించి నా పంచినయప్పుడ యప్పక్షితలఁ దెగ నేయుం డే నొకళ్ళొకళ్ళన పంచెద నని ముందఱ ధర్మనందనుం బిలిచి యీవృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనా నంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె. 248
తే.
వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము, దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ
యనిన నిమ్ముగఁ జూచితిననిన వెండి, యునుగురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి. 249
క.
జననుత యామ్రానిని న,న్నును మఱి నీ భ్రాతృవరులనుం జూచితె నీ
వనవుడుఁ జూచితి నన్నిటి, ననఘా వృక్షమున నున్న యవ్విహగముతోన్. 250
వ.
అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి నీ దృష్టి చెదరె నీవు దీని నేయ నోపవు పాయు మని యవ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేననకులసహదేవులను నానాదేశాగతు లయిన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన నందఱ నిందించి పురందరనందనుం బిలిచి వారి నడిగినయట్ల యడిగిన నర్జునుం డి ట్లనియె. 251
క.
పక్షిశిరంబు దిరంబుగ, నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ,క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్. 252
వ.
ఇట్లశ్రమంబునఁ గృత్రిమపక్షితలఁ దెగ నేసినయర్జునునచలితదృష్టికి లక్ష్యవేదిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేద రహస్యంబు లుపదేశించె నంత. 254
లక్ష్యవేదిత్వంబునకు=గుఱినిగొట్టుటకును
క.
మానుగ రాజకుమారుల, తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థమరిగి యందు మ,హానియమస్థుఁ డయి నీళు లాడుచు నున్నన్. 255
క.
వెఱచఱవ నీరిలో నొ, క్కెఱగా నొకమొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు, చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్. 256
వెఱచఱవన్=భయపడఁగా
ఒక్కెఱగాన్=ఉగ్రముగా
చిఱుదొడ=పిక్క
క.
దాని విడిపింపఁ ద్రోణుఁడు, దా నపుడు సమర్థుఁ డయ్యుఁ దడయక పనిచెన్
దీని విడిపింపుఁ డని నృప,సూనుల శరసజ్యచాపశోభితకరులన్. 257
శరసజ్యచాపశోభితకరులన్=బాణముల నెక్కుపెట్టిన విండ్లచేఁ బ్రకాశించు చేతులు గలవారిని
శా.
దానిన్ నేరక యందఱున్ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానం గానిశరీరముం గలమహోగ్రగ్రాహమున్ గోత్ర భి
త్సూనుం డేనుశరంబులన్ విపులతేజుం డేసి శక్తిన్ మహా
సేనప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్ విక్రమం బొప్పఁగాన్. 258
గోత్ర భిత్సూనుండు =అర్జునుఁడు
మహాసేనప్రఖ్యుఁడు=కుమారస్వామి వలెఁ బ్రసిద్ధుఁడు
వ.
అమ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్న దేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి ద్రోణుం డర్జును ధనుఃకౌశలంబునకు మెచ్చి వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుం డగు నని తనమనంబున సంతోషించి వానికి ననేకదివ్యబాణంబు లిచ్చె నని యర్జును కొండిక నాఁటి పరాక్రమగుణ సంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పెనని. 259
ఆది పర్వము పంచమాశ్వాసము సంపూర్ణం.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-17
ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట
మహాభారతంలోని అనేకానేక ఉపాఖ్యానాల్లో ఇది ఒకటి. ద్రోణుని వ్యక్తిత్వం ఈ కథలో మసకబారింది.
వ.
మఱియు గదా కార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబుల యందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహా ప్రసిద్ధి విని హిరణ్యధన్వుండను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యా గ్రహణార్థి యయి వచ్చిన వాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొనకున్న వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231
ప్రాసాసి=?
తే.
వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి, దానికతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి, నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.
232
క.
ఇటఁ బాండవకౌరవు లొ,క్కొట నందఱు గురుననుజ్ఞ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి, పటుతరజవ సారమేయభటనివహముతోన్. 233

పాండవులు కౌరవులు కలసి భటులతోను, వేటకుక్కలతోను వేటకు బయల్దేరారొకసారి.
వ.
మఱియు నం దొక్క భటునికుక్క తోడుదప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యు సమీపంబున మొఱింగిన నయ్యెలుంగు విని దానిముఖంబునం దేను బాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁడేసిన నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ. 234
ఉ.
తేజిత బాణహస్తు దృఢదీర్ఘమలీమసకృష్ణ దేహుఁ గృ
ష్ణాజిన వస్త్రవిష యా ప్తవిషాదు నిషాదుఁ జూచి యా

రాజకుమారు లందఱుఁ బరస్పర వక్త్రవిలోకన క్రియా

వ్యాజంబునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్.
235
వ.
అక్కుమారులు వాని శరలాఘవంబునకు మెచ్చి నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 236
క.
వినుఁ డే హిరణ్యధన్వుం, డనువనచరనాథుకొడుక నాచార్యుఁడు ద్రో
ణునకున్ శిష్యుఁడ నెందును, ననవద్యుఁడ నేకలవ్యుఁ డనువాఁడ మహిన్.
237
వ.
అనిన విని కురుకుమారు లందఱు మగిడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డొక్కనాఁ డేకాంతంబున నాచార్యున కి ట్లనియె. 238
క.
విలువిద్య నొరులు నీ క, గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలికితిరి నాక కా దీ, త్రిలో కముల కధికుఁ జూచితిమి యొక యెఱుకన్. 239
క.
నా కంటెను మీకంటెను, లోకములో నధికు డతిబలుండు ధనుర్వి

ద్యా కౌశలమున నాతఁడు, మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా. 240
వ.
అనిన ద్రోణుం డదరిపడి వానిం జూతము రమ్మని యర్జునిం దోడ్కొని యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేగిన నెఱింగి వాడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి యేను మీశిష్యుండ మి మ్మారాధించి యివ్విలువిద్యఁ గఱచితి నని కరంబులు మొగిచి యున్నం జూచి ద్రోణుం డట్లేని మాకు గురుదక్షిణ యిమ్మనిన సంతసిల్లి వాఁ డి ట్లనియె. 241
క.
ఇదె దేహం బిదె యర్థం, బిదె నాపరిజనసమూహ మిన్నిటిలో నె
య్యది మీకిష్టము దానిన, ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘంబనినన్. 242
క.
నెమ్మిని నీదక్షిణహ, స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి మ్మి
ష్ట మ్మిది నా కనవుడు విన, యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్. 243
తే.
దక్షిణాంగుష్ట మిచ్చిన దానఁ జేసి, బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁడయ్యెఁ, బార్థునకు మనోరుజయు బాసెనంత. 244
దక్షిణాంగుష్టము=కుడి బొటన వ్రేలు
క.
విలువిద్య నొరులు నీక,గ్గలముగ లే కుండ నిన్నుఁ గఱపుదు నని మున్
బలరిపుసుతునకుఁ బలికిన, పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్. 245
బలరిపుసుతునకున్=అర్జునునకు
మత్తకోకిలము.
భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్యమైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమ కౌశలంబున దండితారి నరుం డిలన్. 246
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-16
మత్తకోకిలము.
వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధన మోపఁ డేనియు వీనిమాత్రకు నాలుగేన్
పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచు నుండగాన్. 218

మత్తకోకిలము- నడక ఎంత అందంగా వుంటుందో కదా.

కనీసం పిల్లాడికి పాలనిమిత్తం నాలుగు పాడి పశువులనన్నా ఇయ్యకపోడు గదా అనే ఉద్దేశంతో వెళ్ళాడు పాపం.
వ.
అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన నాతండు దనరాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక యేను రాజును నీవు పేదపాఱుండవు నాకును నీకును ఎక్కడిసఖ్యం బని పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి నని దన వృత్తాంతం బంతయు జెప్పిన. 219
పాఱుడు=బ్రాహ్మణుడు
క.
విని రోయుతీఁగ గాళ్ళం, బెనఁగె గదా యనుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్
ఘనభుజు నభీష్టపూజా, ధనధాన్యవిధానముల ముదంబునఁ దనిపెన్. 220

వెతుకుతున్నతీగ కాళ్ళకు తగిలింది గదా అనుకుని భీష్ముడు ద్రోణుని అన్నివిధాలా ఆదరించి
చ.
మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు వీరిఁ
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్య లెల్లఁ బెం
పున జమదగ్నిసూనుఁడును బోలఁడు ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్. 222

మనమల కందరికీ విద్య గఱపమని కోరుతూ ద్రోణుడిని ఎటువంటి పొగడ్తతో భీష్ముడు ఆకట్టుకున్నాడో చూడండి. పరశురాముడుకూడా యుద్దంలోనూ నైపుణ్యంలోనూ పరాక్రమం లోనూ నిన్ను పోలడని విన్నాను-అదీ మాట నేర్పంటే.
వ.
అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుండు వారలం జేకొని యందఱ కి ట్లనియె. 223
తే.
అస్త్రవిద్యలు గఱచి నాదైన ఇష్ట, మొగిన తీర్పంగ నిందెవ్వఁ డోపు ననినఁ
బాయమొగమిడి కౌరవుల్ పలుకకుండి, రేనుదీర్చెద ననిపూనె నింద్రసుతుఁడు. 224

గురువును ఆకట్టుకోవటం అంటే అదీ. ఆవిద్య అర్జునిడికి మాత్రమే తెలుసు. అందుచేత వెంటనే ఆమాటన్నాడు.
వ.
ఇట్లు తనయిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న నానా దేశంబులం గలరాజపుత్త్రు లెల్ల వచ్చి వారితోఁ గలసి కఱచుచుండిరి(మఱియు సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె) అంత. 225
కర్ణుడు కూడా నానాదేశ రాజులతో పాటుగా ద్రోణుని దగ్గర విద్య నేర్చుకున్నాడా అనే సందేహం కలుగుతున్నది నాకు.
క.
నరుఁ డస్త్రవిద్యా, పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ, బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్. 226
వ.
అయ్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీకటి నాతం డేయనేర కుండ వలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడువం బెట్టకుమీ యనిపంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయు చున్న నొక్కనాఁటిరాత్రి యందు. 227

చీకటిలో అన్నం తినటం అలవాటయితే ధనుర్విద్యను కూడా చీకటిలో అదేవిధంగా నేర్చుకోవచ్చన్నమాట.
ఉ.
వాసవనందనుండు గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బోవుడు భోజన క్రి యా
భ్యాసవశంబునం గుడిచి పన్నుఁగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.228
పటుమారుతాహతిన్= మిక్కిలి గాలి దెబ్బచేత
క.
పాయక చీఁకటియందును, నేయం దా నభ్యసించె నిట్టియెడం గౌం
తేయు ధనుర్జ్యాధ్వని విని, ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్.228

శిష్యుల విద్యాపరిశ్రమ చూస్తే ఏ గురువుకైనా ముచ్చట వేస్తుంది కదా.
సీ.
ఆతనియస్త్రవిద్యాభియోగమునకుఁ బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
యన్న ధనుర్ధరు లన్యులు నీకంటె నధికులు గా కుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా నని పల్కి ద్వంద్వసంకీర్ణ యుద్ధముల తెఱఁగు
రథమహీవాజివారణములపై నుండి దృఢచిత్ర సౌష్టవస్థితుల నేయ
తే.
బహువిధవ్యూహభేదనోపాయములను, సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటిభార్గవుఁడు వింట, నిట్టిఁడే యని పొగడంగ నెల్ల జనులు.229
అభియోగమునకున్=పూనికకు

అలా విలువిద్యలో అర్జునుని అందరికంటె ప్రవీణు డయ్యేలా విద్య గఱపాడు ద్రోణుఁడు.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-15
ద్రోణుఁడు హస్తి పురంబునకు వచ్చుట
చ.
ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుం డగువానితోడ మూ
ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్ రణశూరుతోడ భీ

రునకు వరూథితోడ నవరూథికి సజ్జనుఁతోడఁ గష్టదు

ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే.
204

ఇంకా ఇలా ధనపతితో దరిద్రునకు తత్త్వవిదునితో మూర్ఖునకు ప్రశాంతునితో క్రూరునకు పరాక్రమవంతునితో భీరునకు కవచముగల వానితో అదిలేనివానికి మంచివానితో చెడ్డవానికి ఏవిధంగా సఖ్యము కుదురుతుంది అని కూడా ద్రుపదుడు ద్రోణునితో అన్నాడు.
క.
సమశీలశ్రుతయుతులకు, సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా, హము నగుఁ గా కగునె రెండు నసమానులకున్. 205

శీలము, ధనము, చరిత్ర సమంగా కలవారి మధ్య సఖ్యము, వివాహము సంభవం కాని అవి అసమానులమధ్య జరగవు కదా.
వ.
మఱి యట్లుం గాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధంబులు సంభవించుం గావున మాయట్టిరాజులకు మీయట్టి పేదపాఱువారలతోఁ గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేర దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని ద్రోణుం డవమానజనిత మన్యుఘూర్ణమాన మానసుండయి యెద్దియుం జేయునది నేరక పుత్త్రకళత్రాగ్నిహోత్రశిష్య గణంబులతో హస్తిపురంబునకు వచ్చె నంత నప్పుర బహిరంగణంబున ధృతరాష్ట్ర పాండునందను లందఱు గందుక క్రీడాపరులయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడి. 206
ఆ.
నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ, మొక్కొ యనఁగ వెలుఁగుచున్న యపుడు
రాచకొడుకు లెల్లఁ జూచుచు నుండిరి, దానిఁ బుచ్చుకొనువిధంబు లేక. 207
వ.
అట్టి యవసరంబున . 208
క.
నానావిధశరశరధుల, తో నున్నతచాపధరుఁడు ద్రోణుఁడు వారిం
గానఁ జనుదెంచి యంతయుఁ, దా నప్పు డెఱింగి రాజతనయుల కనియెన్. 209
శరధులతోన్=అమ్ములపొదులతోడను
ఉన్నతచాపధరుఁడు=పొడుగు విల్లును ధరించినవాఁడు
చ.
భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్రవిద్యలం
గరము ప్రసిద్ధుఁ డై పరఁగు గౌతము శిష్యుల రిట్టిమీకు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపిండు గొనంగ లేకయొం
డొరులమొగంబు చూచి నగు చుండఁగఁ జన్నె యుపాయహీనతన్. 210
పిండున్=బంతిని
గౌతము శిష్యులు అనటం జరిగిందేమిటి? కురు పాండు పుత్రులు కృపాచార్యుని శిష్యులు కదా. కృపాచార్యులు శరద్వంతుని కుమారుడు గౌతముని మనవడు కదా.
వ.
దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ డీవిద్య యొరు లెవ్వరు నేరరని ద్రోణుం డొక్కబాణం బభిమంత్రించి దృష్టిముష్టి సౌష్టవంబు లొప్ప నక్కందుకంబు నాటనేసి దాని పుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొక బాణంబున నేసి వరుసన బాణ రజ్జువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారులెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెఱింగించిన నాతండును. 211
దృష్టిముష్టి సౌష్టవంబు=చూపు పిడికిళ్ళ నేర్పు చేత
పుంఖంబు=పిడి
క.
ఎందుండి వచ్చి తిందుల, కె దుండఁగ నీకు నిష్ట మెఱిఁగింపుము స
ద్వందిత యని యడిగిన సా, నందుఁడు ద్రోణుండు భీష్మునికి ని ట్లనియెన్. 213
వ.
ఏ నగ్ని వేశుం డనుమహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు సేసి ధనుర్వేదం బభ్యసించు చున్ననాఁడు పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డనువాఁడు నాకిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి యేను పాంచాల విషయంబునకు రాజయిననాఁడు నాయొద్దకు వచ్చునది నారాజ్య భోగంబులు ననుభవింప నర్హుండవని నన్నుఁ బ్రార్థించి చని పృషతు పరోక్షంబునఁ దద్దేశంబునకు రా జయి యున్న నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధిక తేజస్వి నాత్మజుం బడసి ధనంబు లేమిం గుటుంబ భరణంబునం దసమర్థుండ నయి యుండియు. 214
విషయంబునకున్=దేశమునకు
గౌతమి అంటే కృపాచార్యుని చెల్లెలయిన కృపి యేనా?
క.
పురుషవిశేషవివేకా, పరిచయు లగు ధరణిపతులపాలికిఁ బోవం
బరులందు దుష్ప్రతిగ్రహ, భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్. 215
పురుషవిశేష వివేక అపరిచయులు=గొప్పవారిని వివేకము నెఱుఁగని వారలు
దుష్ప్రతిగ్రహ=చెడ్డ దానమును గొనుట
క.
ధనపతులబాలురు ముదం,బున నిత్యముఁ బాలు ద్రావఁ బోయిన నస్మ
త్తనయుండు వీఁడు బాల్యం, బున నేడ్చెను బాలు నాకుఁ బోయుం డంచున్. 216
వ.
దానిం జూచి దారిద్ర్యంబునకంటెఁ గష్టం బొండెద్దియు లేదు దీని నా బాలసఖుండగు పాంచాలుపాలికిం బోయి పాచికొందు నాతండు దనదేశంబున కభిషిక్తుండు గాఁ బోవుచుండి నన్ను రాఁ బనిచి పోయె. 217
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-14
ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము
వ.
మఱియు వారల కాచార్యుం డైన ద్రోణు జన్మంబును వాని చరిత్రంబును జెప్పెద విను మని జన మేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 193
క.
సద్వినుత చరిత్రుండు భ, రద్వాజుం డనుమునీశ్వర ప్రవరుఁడు గం
గా ద్వారమునఁ దపంబు జ, గద్వంద్యుఁడు సేయు చుండె గతకల్మషుఁ డై
. 194

భరద్వాజు డనే మనీశ్వరుడు గంగాద్వార ప్రదేశంలో గతించిన పాపములు కలవా డై తపస్సు చేసుకుంటున్నాడు.
సీ.
అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు గంగకుఁ జని మున్న కరమువేడ్క
నందు జలక్రీడ లాడుచు నున్న యప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేతపరిధాన యైన యయ్యవసరంబునఁ జూచి యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ దత్కామరాగంబున యతిరేకమునఁ జేసి యాక్షణంబ

తే.
తనకు శుక్ల పాతం బైన దాని డెచ్చి, ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁడనగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి, ధర్మ తత్వజ్ఞుఁ డై భరద్వాజ మునికి
. 195
అతిరేకమునన్=ఆధిక్యము చేత
ఆదీ సంగతి . మహాభారతం లో ఎన్నోచోట్ల జరిగినట్లుగానే ఇక్కడకూడా రేతఃపాతం జరిగి ఆ శుక్లాన్ని కుండలో సంగ్రహించి పెట్టగా దానినుండి ధ్రోణుడు పుట్టడం జరిగింది శుక్రాచార్యుల అంశతో.
వ.
మఱియు ననంతరంబ భరద్వాజ సఖుండైన పృషతుం డను పాంచాలపతి మహా ఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దనసమీపంబున వాసంతికా కుసుమాపచయ వినోదంబున నున్న యప్సరస మేనక యనుదానిం జూచి మదన రాగంబున రేతస్స్కందం బయిన దానిం దనపాదంబునఁ బ్రచ్ఛాదించిన నందు ద్రుపదుండనుకొడుకు మరుదంశంబునఁ బుట్టిన వాని భరద్వాజాశ్రమంబునం బెట్టి చని పృషతుండు పాంచాల దేశంబున రాజ్యంబు సేయుచుండె ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యనంబు సేసి విలువిద్యయుం గఱచి యా వృషతుపరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె ద్రోణుం డగ్నివేశుం డను మహాముని వలన ధనుర్విద్యాపారంగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేక దివ్యబాణంబులు వడసి భరద్వాజు నియోగంబునఁ బుత్త్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి యొక్కనాఁడు. 196
క.
అనవరతము బ్రాహ్మణులకుఁ, దనియఁగ ధన మిచ్చు జామదగ్మ్యుఁడు రాముం
డనుజనవాదపరంపర, విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్. 1
97

జామదగ్న్యు డైన పరశురాముడు బ్రాహ్మణులకు ధనాన్ని దానం చేస్తున్నాడని విని ద్రోణుడు ధనాపేక్షతో భార్గవుని దగ్గరకు వెళ్ళాడు.
క.
అరిగి మహేంద్రాచలమునఁ, బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో
త్తరు భూరికర్మనిర్మల, చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్
. 198
వ.
ఏను భారద్వాజుండ ద్రోణుం డనువాడ నర్థార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశురాముం డి ట్లనియె. 199
చ.
కలధన మెల్ల ముందఱ జగన్నుత విప్రుల కిచ్చి వార్ధి మే
నిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్మునిఁ కిచ్చితిన్ శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి వీనిలోన నీ
వలసినవస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్. 200

ఉన్న ధనమంతా ఎప్పుడో విప్రులకు ఇచ్చివేసాను. సముద్రాలు వడ్డాణముగా ధరించి ఉన్న భూమినంతా కశ్యపు డనే మునీశ్వరునకు ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గఱ శరములు, శస్త్రములు మొదలైనవి మాత్రమే ఉన్నాయి. వీనిలో నీకు కావలసినవి తీసుకో ఇస్తాను . అన్నాడు పరశురాముడు.
క.
ధనములలో నత్యుత్తమ, ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనిం
గొని కృతకృత్యుఁడ నగుదును, జననుత నా కొసఁగుమస్త్రశస్త్ర చయంబుల్. 201

ధనములలో కెల్లా అత్యుత్తమ మైన ధనం శస్త్రాస్త్రాలు కలిగి ఉండటం. వానినే స్వీకరిస్తాను ఇమ్మని కోరాడు ద్రోణుడు పరశురాముడిని.
వ.
అని పరశురాము చేత దివ్యాస్త్రంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి ధనుర్విద్యయు నభ్యసించి ధనార్థి యయి తన బాలసఖుం డైన ద్రుపదుపాలికిం జని యేను ద్రోణుండ నీ బాల్య సఖుండ సహాధ్యాయుండ న న్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డి ట్లనియె. 202
చ.
కొలఁది యెఱుంగ కిట్టిపలుకుల్ వలుకంగా దగుఁ గాదు నాక నన్
బలుగుఁదనంబునం బలుకఁ బాడియె నీ సఖి నంచు బేదవి
ప్రులకును ధారుణీశులకుఁ బోలఁగ సఖ్యము సంభవించునే
పలుకక వేగ పొ మ్మకట పాఱుఁడు సంగడికాఁడె యెందునన్. 203

నీ కొలది ఎఱుగకుండా ఇటువంటి పలుకులు పలుక తగునా! పేద విప్రులకు ధారుణీశులకు ఎక్కడైనా సఖ్యం కుదురుతుందా! ఇంకేం మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళు . పాఱుడు యెక్కడైనా సంగడికాడే అని హీనంగా మాట్లాడాడు ద్రుపదుడు.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-12
కృపాచార్యుల జన్మ వృత్తాంతము
కౌరవపాండవులు కృపాచార్యుల వద్ద, ద్రోణాచార్యుల వద్ద విలువిద్యనభ్యసిస్తున్నారని వైశంపాయనుడు చెప్పినది విని జనమేజయుడు వారిద్దరి వృత్తాంతాన్ని చెప్పమని వైశంపాయనుడిని అడుగుతాడు.
సీ.
వినవయ్య గౌతముం డనఁ బ్రసిద్ధుం డా నమునికి శరద్వంతుఁ డనుమహాత్ముఁ
డురుతర తేజుఁ డై శరసమూహంబుతో నుదయించి వేదముల్ చదువ నొల్ల
కతి ఘోరతపమున నుతభూసురోత్తముల్ వేదముల్ చదువున ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ బడసి మహానిష్ఠఁ గడఁగి తపము
ఆ.
సేయు చున్న దివిజనాయకుఁ డతిభీతి, నెఱిఁగి వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జానపది యనెడు, దాని నదియు వచ్చె వానికడకు. 185

గౌతముడనే మహామునికి శరద్వంతు డనే కుమారుడు శరసమూహముతో సహా జన్మించి వేదములు చదవటానికి ఇష్టపడక ధనుర్వేదాన్ని బాగుగా నేర్చుకొని గొప్ప నిష్ఠతో తపస్సు చేయసాగాడు. ఇంద్రుడు ఆ తపస్సు చెడగొట్టమని జానపది అనే ఆమెను నియోగించగా ఆమె ఆపని నిమిత్తం అక్కడికి వచ్చింది. ఇంద్రునికి అందరి తపస్సులూ పాడుచేయటమే పని కాబోలు.
క.
అమ్ముదితఁ జూచి కాముశ, రమ్ములచే విద్ధుఁ డై శరద్వంతుఁడు చి
త్తమ్మలర మదనరాగర, సమ్మునఁ దన్నెఱుఁగ కుండెఁ జంచలతనుఁ డై. 186

ఆమెను చూచి శరద్వంతుడు కాముని శరములతో బాధింపబడిన వాడై మదనపరవశు డయ్యాడు.
క.
ఆతరుణి కటాక్షేక్షణ, పాతము గౌతమున కపుడు పటుబాణధనుః
పాతముతోడన రేతః, పాతము గావించె రాగపరవశుఁ డగుటన్. 187

ఆమె క్రీఁ గంటి చూపులు పడుట గౌతమునకు అపుడు పటుబాణ ధనుఃపాతముతో పాటుగా రేతఃపాతము(వీర్యము పడుట) అయినదట.
వ.
దాని నెఱింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండు చోటం దపంబు సేయు చుండె. అవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి రంత శంతనుండు మృగయావినోదార్థం బరిగి వానిసేనాగ్రచరుం డాశరచాపకృష్ణాజినంబులుం జూచి యివి యెయ్యేనియు నొక్క ధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణు నపత్యం బగు నని శంతనునకుం జూపిన శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచటం జేసి యయ్యిరువురుఁ గృపుడును గృపియు ననం బెరుగు చున్నంత. 188
క.
చనుదెంచి శరద్వంతుం, డనవద్యుఁడు తనయపత్య మని వారిని శం
తనున కెఱింగిచి కృపు న, త్యనుపమ నుపనీతుఁ జేసె నధిక ప్రీతిన్. 189

శా.
వేదంబుల్ చదివించె భూసురులతో విఖ్యాతి గా నాత్మ సం
వేదిం జేసెఁ జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్త్రవి
ద్యాదాక్షిణ్యముతోడఁ దాన గఱపెం దద్వృత్తముల్ సూచి సం
వాదుల్ గాఁ దననందనుం గృపు శరధ్వంతుండు దాంతాత్ముఁ డై. 190

ఇక్కడ కొంచెం వివరణ తెలియాల్సినది ఉంది. గౌతముని రేతఃపతనము వలన కృపాచార్యుడు జన్మించాడని ముందు చెప్పబడింది. తరువాత శరద్వంతుడు కృపాచార్యుడు తన కొడుకు అని చెప్పినట్లుగా ఉంది. పెద్దలెవరైనా ఈ సందేహనివారణ చేస్తే కృతజ్ఞుడిగా ఉంటాను.
వ.
అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దన మనుమల నందఱ విలువిద్య గఱవం బంచిన.

Unknown
ఆది పర్వము- పంచమాశ్వాసము-11
దుర్యోధనుడు భీముని జంపింపఁ దివురుట
క.
వదలక పెనఁగి పదుండ్రం, బదియేవుర నొక్కపెట్టఁబట్టి ధరిత్రిన్
జెదరఁ బడవైచి పవనజుఁ, డదయుం డయి వీపు లొలియ నందఱ నీడ్చున్.165

భీముడు ఒకేసారి పది పదిహేను మంది కౌరవులను సైతం నేలమీద పడవైచి కట్టకట్టి తోలుదోకునట్లుగా లేకుండా ఆటల్లో ఈడుస్తుండే వాడట.
సీ.
కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యాధృతరాష్ట్రతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున నెక్కించుకొని వారి యుక్కడంగ
గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ గారించి తీరంబు చేరఁ బెట్టుఁ
గోరి ఫలార్ధు లై వారలయెక్కిన మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి
ఆ.
వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడి వారల, తోన ధరణిమీఁదఁ దొరఁగుచుండ
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస, నాదు లెల్ల భాధితాత్ము లైరి. 166

నదిలో స్నానించేటప్పుడు వదేసిమంది ధృతరాష్ట్రకుమారులను లెక్కపెట్టి మరీ తన భుజాలమీద కెక్కించుకొని వాళ్ళని నీటిలో ముంచుతూ తేల్చుతూ బాధపెట్టేవాడట. వారంతా చెట్టెక్కినప్పుడు మొదలు పట్టుకొని వూపి కాయలూ పండ్లతో పాటుగా వాళ్ళంతా కిందపడేలా చేసేవాడట భీముడు.
వ.
దాని సహింపఁజాలక యొక్కనాఁడు దుర్యోధనుండు శకునిదుశ్శాశనులతో విచారించి యి ట్లనియె. 167

పృథ్వి.
ఉపాంశువధఁ జేసి మధ్యమ మదోద్ధతుం జంపి ని
స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ
త్కృపాణపటుశక్తి నత్యధిక కీర్తి నై యేలెదన్. 168
ఉపాంశు=ఏకాంతముగా
ఏకాంతముగా భీముని చంపి ధర్మజుని బంధించి అపాండవముగా తానే భూమండలాన్ని ఏలాలని శకుని దుశ్శాశనాదులతో ఆలోచన చేసాడు.
అలా అని నిశ్చయించి జలక్రీడలాడి అలసటతో భీముడు నిద్రపోతుండగా లతలతో భీముని కట్టివేసి చంపాలనే ఉద్దేశ్యంతో నదిలోనికి త్రోసివేసారు కౌరవులందరూ కలసి. కాని భీముడు మేలుకొని నీల్గేటప్పచికి ఆ లతలన్నీ తెగిపోవటం జరిగింది.
ఒకసారి భీముడిని నిద్రిస్తున్నపుడు ఆతని మర్మస్థానాలలో విషపు పాములచేత కరపించారు కౌరవులు. కాని ఆ విషం భీమునికి ఎక్కలేదు. అన్నంలో విషం కలిపారు. యుయుత్సుడు ఆ విషయం చెప్పినాగాని ఆకలిమీద ఉండి శుభ్రంగా తిని అరగించుకోగలిగాడు భీముడు.
క.
అవిరళవిషఫణిదంష్ట్రలు, పవనజు వజ్రమయ తనువు పయితెలును నో
పవ భేదింపఁగఁ బాప, వ్యవసాయుల చెయ్వు లర్థవంతము లగునే.176
క.
మఱియును నొకనాఁ డెవ్వరు, నెఱుఁగక యుండంగఁ గౌరవేంద్రుఁడు ధర్మం
బెఱుఁగక విష మన్నముతో, గుఱుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్. 179
క.
సముఁడై యుయుత్సుఁడయ్య,న్నము దుష్టం బగుటఁ జెప్పినం గుడిచె నిషా
న్నము నాఁకటి పెలుచను నది, యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్. 180

యుయుత్సుడీ విధంగా సమదృష్టి నున్నవాడగుట చేత చివరికి పాండవుల అనంతరము అతడే రాజవుతాడు.

వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకుఁ దనచేసిన యెగ్గులెల్లను గృతఘ్నునికుం జేసిన లగ్గులునుం బోలె నిష్ఫలం బయ్యె.180
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-10
పాండురాజు మరణము, పాండవులు హస్తిపురంబు చేరుట
క.
మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. 159

కృష్ణద్వైపాయనుడు ఒకనాడు తన తల్లి సత్యవతి తో అంటాడు ఈవిధంగా.

పాండురాజు శాపభయంతో శతశృంగ పర్వతం మీద తన యిద్దరు భార్యలతో మునివృత్తి నుండగా వసంత ఋతువు ప్రవేశించింది.
వ.
ఇట్లు సర్వభూతసమ్మోహనం బయిన వసంతసమయంబునం బాండురాజు మదన సమ్మోహనమార్గణ బందీకృతమానసుండై మద్రరాజపుత్త్రిదైన మనోహరాకృతియందు మనంబు నిలిచి యున్నంత నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు కాయితంబు సేయుచుండి మాద్రీరక్షణంబునం దేమఱి మఱచి యున్న యవసరంబున. 140
మార్గణ=బాణములచేత
ఉ.
చారుసువర్ణహాసి నవచంపక భూషయు సిందువారము
క్తారమణీయమున్ వకుళదామవతంసయునైయపూర్వశృం
గారవిలాసలీల యెసగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁడై.
141
సిందువారముక్తా=వావిలిముత్యములచే
వకుళదామవతంస=పొగడదండ సిగబంతిగా గలది
అంగజరాగమత్తుఁడై=మన్మథానురాగము(కామము) చేఁ దెలియనివాఁడై
క.
కిందము శాపము డెందము, నం దలపఁక శాపభయమునను మాద్రి గడున్
వందురి వారింపఁగ బలి,మిం దత్సంభోగసుఖసమీహితుఁడయ్యెన్.
142
వందురి=దుఃఖపడి
వ.
దానిం జేసి విగతజీవుండైన యప్పాండురాజుం గౌగిలించుకొని మాద్రి యఱచుచున్న దానియాక్రందనధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులం బడి యేడ్చుచున్న నెఱింగి శతశృంగనివాసు లగు మునులెల్లం దెరలి వచ్చిచూచి శోకవిస్మయాకులితచిత్తు లయి రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె. 142
కుంతి భర్తతో సహగమనం చేస్తాననగా మాద్రి ఆమెను వారించి పిల్లలను ఏమఱక రక్షించమని కుంతికి చెప్పి తనే పాండురాజుతో సహగమనం చేస్తుంది.
తరువాత శతశృంగమందలి మునులెల్లరూ కలసి కుంతీదేవిని పాండు కుమారులను హస్తినాపురానికి తీసుకువస్తారు.
అప్పుడు పాండుకుమారులను చూచి పౌరులిలా అనుకున్నారట.
చ.
సురలవరప్రసాదమునఁ జూవె సుపుత్త్రులఁ బాడురాజు భా
సురముగఁ గాంచెఁ దత్సుతులఁ జూతము రం డని పౌరు లెల్ల నొం
డొరులకుఁ జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ
చిరి భుజవిక్రమాధరితసింహ కిశోరులఁ బాండవేయులన్. 150
ఉ.
వారలు దైవశక్తిఁ బ్రభవించినవా రను సందియం
బీరమణీయ కాంతి నుపమింపఁగ వేల్పుల కారె యిట్టియా
కారవిశేషసంపదఁ బ్రకాశిత తేజము పేర్మిఁ జూడ సా
ధారణమర్త్యులే యని ముదంబునఁ బౌరులు దమ్ముఁ జూడగన్. 151

వారినందరిని కౌరవులందరూ పెద్దలతో కలసి సగౌరవంగా ఆహ్వానిస్తారు.
వారిలో ఓ వృద్ధ తపస్వి
వ.
ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్త్రరక్షణార్ధంబు మునిగణ ప్రార్ధిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె. ఇక్కుమారులు కురుకులవిస్తారకులు దేవమూర్తులు యుధిష్టర భీమార్జున నకుల సహదేవు లనంగా దేవాధిష్ఠిత నామంబులు దాల్చి బ్రహ్మర్షిప్రణీతోపనయనులై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుఁ బెరుఁగు చున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధితో రక్షించునది యని చెప్పి అంతర్ధానులయిరి. 156
వ.
అంతఁ గృష్ణద్వైపాయనుండు వారికందఱకు దుఃఖోపశమనంబు సేసి యొక్కనాఁడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె. 158
క.
మతిఁ దలఁపఁగ సంసారం, బతిచంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు, గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. 159

సంసారం అతి చంచలమైనది. సంపదలు ఎండమావులవంటివి, క్షణికమైనవి. గతకాలమే వచ్చేకాలం కంటే మేలైనది
క.
క్రూరులు విలుప్త ధర్మా,చారులు ధృతరాష్ట్రసుతు లసద్వృత్తులు ని
ష్కారణవైరులు వీరల, కారణమున నెగులు పుట్టుఁ గౌరవ్యులకున్. 160

వ.
దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుం గాని మీ రీదారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుంగుడని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగిచి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలంబునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి రిట ధృతరాష్ట్రుండును .161
క.
తనసుతులు పాండుసుతు లని, మనమున భేదింప కతిసమంజసభావం
బున నొక్కరూప కాఁ జే, కొని యుండెం బాండురాజుకొడుకుల బ్రీతిన్. 162
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-9
మాద్రికి నకులసహదేవులు పుట్టుట
ఉ.
కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రితయంబుఁ గాంచె గాం
ధారియు నక్కడన్ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె నేఁ
బోరచి యాఁడుపుట్టువునఁ బుట్టి నిరర్ధకజీవ నైతి సం
సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్. 129

కుంతికీ సంతానం కలిగింది. అక్కడ గాంధారికి కూడా నూర్గురు కొడుకులు కలిగారు. నాకే సంతానం కలగలేదు
వ.
అని వగచుచు నొక్కఁ నా డేకాంతంబ పతియొద్ద గద్గదవచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు న ట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి మ్మనిన మాద్రికిఁ బాండురాజి ట్లనియె. 130
క.
నావచనమున నపత్యముఁ, గావించును గుంతి నీకు గడు నెయ్యముతో
నీ వగచిన యీ యర్థమ, చూవె మనంబునఁ దలంతుఁ జొలవక యేనున్. 131
చొలవక=విముఖత నొందక
నేనూ దాని గురించే అనుకుంటున్నాను. నా మాటమీద నీకు గుంతి సంతానము కలిగేలా చేస్తుంది. విచారించకు.
వ.
అని పలికి యప్పుడ కుంతీ దేవిం బిలిచి మద్రరాజ పుత్త్రి దయిన మనో వాంఛితంబుఁ జెప్పి సకలలోక కల్యాణకారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు పడయు మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసి మాద్రికి నపత్యంబు వడసిన. 132
ఇక్కడో చిన్న పనికిమాలిన సందేహం. వరం దుర్వాసు డిచ్చింది కుంతికి. ఆమెకు మాత్రమే అది పనిచేయాలి, కాని ఆమె కోర్కెమీద మాద్రికి ఎలా పనిచేసింది అన్నది నా సందేహం. పైగా కవలలు కూడా ఈ సారి .
తే.
కవలవారు సూర్యేంద్రు ప్రకాశతేజు, లాశ్వినుల యంశములఁ బుట్టి రమరగుణులు
వారలకుఁ బ్రీతి నాకాశవాణిసేసె, నకులసహదేవు లన నిట్లు నామయుగము. 133
క.
ఊర్జితులు యుధిష్టరభీ, మార్జుననకులసహదేవు లన నిట్లు వివే
కార్జితయశు లుదయించిరి, నిర్జరులవర ప్రసాదనిర్మితశక్తిన్. 134
ఊర్జితులు=ధృఢవంతులు
ఈ విధంగా కౌరవ పాండన జననం జరిగింది.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-8
ఇంద్ర ప్రసాదంబునఁ గుంతి కర్జునుఁ డుదయించుట
క.
కొడుకుం ద్రిలోకవిజయుం, బడయుదు నని ఘోర మగుతపం బొనరింపం
దొడఁగె సురరాజు నెడలో, నిడికొని యే కాగ్రబుద్ధి నేకాంతమునన్. 116

పాండురాజు త్రిలోక విజయు డయిన కొడుకును పొందగోరి ఇంద్రుడిని మనసులో తలచి ఘోరమైన తపస్సు చేసాడు.
వ.
ఇట్లతినిష్ఠ నేకపాదస్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్కసంవత్సరంబు వ్రతంబు సేయం బంచి యున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షంబై. 117
క.
పుత్త్రుఁడు నీ కుదయించు న, మిత్రక్షయకరుఁడు బంధుమిత్రాంబుజస
న్మిత్రుం డని వర మిచ్చిన, ధాత్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్. 118

ఇంద్రుడతనికి ప్రత్యక్షమై నీకు గొప్ప కొడుకు పుడతాడని వరమిచ్చాడు.
క.
ధనమున విద్యను సంతతిఁ, దనిసినవా రెందుఁ గలరె ధవళేక్షణ కా
వున నా కింకను బలువురఁ, దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్. 119

ధనసంపాదనతోను, విద్యాసంపాదన తోను, సంతానం పొందే విషయంలోనూ సంతృప్తి చెందేవారెవ్వరూ ఉండరు కదా. అందుచేత నాకింకా సంతానాన్ని పొందాలని వుంది అంటాడు. ఇది ఆ కాలంలో నిజమేమో కాని ఈ కాలంలో మటుకు కాదు. మొదటిదిప్పుడు అప్పటికంటె మరింత యెక్కువ నిజం. రెండోదాని విషయంలో కూడా కొంచెం నిజమే నను కోవచ్చు. కాని మూడవదానిలో మటుకు అస్సలు నిజం కాదు. ఒక సంతానం మాత్రమే చాలు ఈ దేశకాలపరిస్థితులకు.
చ.
అమరగణంబులలోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద సర్వలో
కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిప ప్రసా
దమున సుతున్ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం
శము వెలిఁగింపఁగా బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్. 120

ఇంద్రుడిని ప్రార్థించి అతనిద్వారా అతనితో సమాను డయిన వాడిని తన వంశమును వెలిగించ గలవాడిని అయిన కుమారుడిని పొందమంటాడు పాండురాజు కుంతితో.
వ.
అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటియట్ల దుర్వాసునిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ దత్ప్రసాదంబునఁ గుంతికి. 121
క.
స్థిరపొరుషుండు లోకో, త్తరుఁ డుత్తరఫల్గునీ ప్రథమ పాదమునన్
సురరాజు నంశమున భా, సుర తేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్. 122

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ప్రథమ పాదంలో ఇంద్రుని అంశతో వంశకరు డయిన కొడుకు పుట్టాడు.
వ.
అయ్యవసరంబున. 123
సీ.
విను కార్తవీర్యు కంటెను వీరుఁ డగుట నర్జుననామ మీతండ యొనరఁ దాల్చు
నీతండ యనిఁ బురుహూతాదిసురుల నోడించి ఖాండవము దహించు బలిమి
నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి రాజసూయము ధర్మరాజు ననుచు
నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్ వడసి విరోధుల నొడుచుఁ గడిమి
ఆ.
ననుచు నవపయోదనినదగంభీర మై, నెగసె దివ్యవాణి గగనవీథిఁ
గురిసెఁ బుష్పవృష్టి సురదుందుభిధ్వనుల్, సెలఁగె సకలభువనవలయ మద్రువ. 124

ఆకాశవాణి అర్జునుడు చేయబోయే ఘనకార్యాలనన్నీ ఏకరువుపెట్టి పుష్పవర్షం కురిపించిందంట ఆ సమయంలో అక్కడ.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-8
దుర్యోధనాదుల జననము
క.
అనిలజు పుట్టిన దివసము, నన యట దుర్యోధనుండు నరనుత ధృతరా
ష్ట్రునకున్ గాంధారికి న, గ్రనందనుఁడు ఘనుఁడు పుట్టె కలియంశమునన్.
105

కలి అంశతో దుర్యోధనుడు కూడా భీముడు పుట్టిన సమయానికే గాంధారీ ధృతరాష్ట్రులకు పుడతాడు.
శా.
ఆ దుర్యోధనుఁ డుద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్ శివా
నాదంబుల్ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్
భూదిక్కంపము గాఁ జెలంగె విగతాంభోభృన్నభోవీథియం

దాదిత్యద్యుతి మాయఁగా గురిసె నుగ్రాసృఙ్మహావర్షముల్.
106
క్రవ్యాద ఆరవంబుల్=రాక్షసుల యఱపులు
శివానాదంబుల్=నక్కల యఱపులు
మదఘూకఘూంకృతుల్=మదించిన గుడ్లగూబ కూఁతలు
నానారాభసధ్వానముల్=పెక్కు గాడిదల యఱపులు
విగత అంభోభృత్ నభోవీథి యందున్=మబ్బులేని యాకసమున
ఉగ్రఅసృక్ మహావర్షములు=భయంకరమగు నెత్తుటి వానలు.
దుర్యోధనుడు పుట్టినపుడు పై ఉత్పాతాలెల్లా కలిగినవట. మహానుభావుడు. ఒక్కొక్కరి జాతక ప్రభావం అలా వుంటుంది కాబోలు.
వ.
మఱియు దుర్యోధన జన్మాంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్త్రుం డయిన యుయుత్సుండు పుట్టె నంత గాంధారికి నొక్కొక్క దివసంబున నొక్కొక్కరుండు గాఁ క్రమంబున 2)దుశ్శాశన 3)దుస్సహ 4)దుశ్శల 5) జలసంధ 6) సమ 7) సహవింద 8) అనువింద 9)దుర్ధర్ష 10) సుబాహు 11) దుష్ప్రధర్షణ 12) దుర్మర్షణ 13) దుర్ముఖ 14) దుష్కర్ణ 15) కర్ణ 16) వివింశతి 17) వికర్ణ 18) శల 19) సత్త్వ 20) సులోచన 21) చిత్ర 22) ఉపచిత్ర 23) చిత్రాక్ష 24) చారుచిత్ర 25)శరాసన 26) దుర్మద 27) దుర్విగాహ 28) వివిత్సు 29) వికటానన 30) ఓర్ణనాభ 31) సునాభ 32) నందక 33) ఉపనందక 34) చిత్రబాణ 35) చిత్రవర్మ 36) సువర్మ 37) దుర్విమోచన 38) ఆయోబాహు 39) మహాబాహు 40) చిత్రాంగ 41) చిత్రకుండల 42) భీమవేగ 43)భీమబల 44) బలాకి 45) బలవర్ధన 46) ఉగ్రాయుధ 47) సుషేణ 48) కుండధార 49) మహోదర 50) చిత్రాయుధ 51) నిషంగి 52) పాశి 53) బృందారక 54) దృఢవర్మ 55) దృఢక్షత్ర 56) సోమకీర్య 57) అనూదర 58) దృఢసంధ 59) జరాసంధ 60) సద 61) సువాగు 62) ఉగ్రశ్రవ 63) ఉగ్రసేన 64) సేనాని 65) దుష్పరాజ 66) యాపరాజిత 67) కుండశాయి 68) నిశాలాక్ష 69) దురాధర 70) ధృఢహస్త 71) సుహస్త 72) వాతవేగ 73) సువర్చ 74) ఆదిత్య 75)కేతు 76) బహ్వాశి 77) నాగదత్త 78) అగ్రయాయి 79) కవచి 80) క్రథన 81) కుండ 82) ధనుర్ధరోగ్ర 83) భీమరథ 84) వీరబాహు 85) వలోలుప 86) అభయ 87) రౌద్రకర్మ 88) దృఢ 89)రథాశ్రయ 90) నాధృష్య 91) కుండభేది 92) విరావి 93) ప్రమథ 94) ప్రమాధి 95) దీర్ఘరోమ 96) దీర్ఘబాహు 97) వ్యూఢోరు 98) కనకధ్వజ 99) కుండాశి 100) విరజసు లనంగా నూర్వురు కొడుకులు పుట్టిన. 107

తే.
ఆ తనూజుల కందఱ కనుజ యై ల, తాంగి దుశ్శల యను కూఁతు రమరఁ బుట్టె
నందు దౌహిత్రవంతుల దైన పుణ్య, గతియుఁ గాంతు నే నని పొంగెఁ గౌరవుండు. 108
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-7
కుంతి యందు భీముడు జన్మించుట
వ.
ఇట్లు పుత్త్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీమాద్రీ సహితుం డై శతశృంగంబున నున్న యవసరంబున నట ముందఱ ధృతరాష్ట్రువలనన్ గాంధారి కృష్ణద్వైపాయను వరంబున గర్భంబు దాల్చి యొక్క సంవత్సరంబు నిండినఁ బ్రసూతి గాకున్నం బదరుచుఁ బుత్త్రలాభలాలస యయి యున్నయది యప్పు డయ్యుధిష్టరు జన్మంబు విని మన్యుతాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన గర్భపాతం బగుడు. 98
మన్యుతాపంబునన్=క్రోధాతిశయంబుచే
క.
దాని నెఱింగి పరాశర, సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి మనో
హీన వయి గర్భపాతము, గా నిట్టులు సేయు టిదియుఁ గర్తవ్యంబే. 99
క.
ఇమ్మాంసపేశి నేకశ,త మ్ముదయింతురు సుతులు ముదమ్మున నిది త
థ్య మ్మింక నైన నతి య,త్నమ్మున రక్షింపు దీని నావచనమునన్.100
స్త్రీలలో అసూయా ద్వేషములు ఎంతపని నైనా చేయిస్తాయి. కుంతికి యుధిష్టురుడు పుట్టాడని తెలియగానే తనుకూడా గర్భం ధరించి సంవత్సరం పూర్తయినా తనకు ప్రసవం ఇంకా కాలేదనే బాధతో గాంధారి కడుపుమీద గట్టిగా కొట్టుకుందట. అప్పుడామెకు గర్బపాతం జరిగిందట. ఇది తెలిసిన వ్యాస మహర్షి వెంటనే అక్కడకు వచ్చి.
వ.
అని గాంధారిఁ బదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశత ఖండంబులుగా విభాగించి వీని వేఱువేఱ ఘృతకుండంబులంబెట్టి శీతలజలంబులం దడుపుచు నుండునది యిందు నూర్వురు గొడుకులు నొక్కకూఁతురుం బుట్టుదు రని చెప్పి చనినఁ దద్వచనప్రకారంబు చేయించి గాంధారీధృతరాష్ట్రులు సంతసిల్లి యున్న నిట శతశృంగంబున. 101
చ.
నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుఁ గుంతిఁ జూచి యం
బురుహదళాక్షి యింక నొకపుత్త్రు నుదార చరిత్రు నుత్తమ
స్థిరజవసత్త్వు నయ్యనిల దేవుదయం గలిగింపు పెంపుతోఁ
గురుకులరక్షకుం డతఁ డగున్ బలవద్భుజవిక్ర మోన్నతిన్. 102
వ.
అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణం బగుడు. 103
చ.
సుతుఁడు నభస్వదంశమున సుస్థిరుఁ డై యుదయించినన్ మహా
యతికృతజాతకర్ముఁ డగునాతని కాతతవీర్యవిక్రమో
న్నతునకు భీమసేనుఁ డను నామముఁ దా నొనరించె దివ్యవా
క్సతి శతశృంగ శైలనివసన్మునిసంఘము సంతసిల్లగన్. 104

ఆవిధంగా భీముడు కూడా కుంతికి జన్మించాడు.
Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-6
కుంతీదేవి యందు ధర్మరాజు జననము
వ.
అని పుత్త్రముఖావనలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించినఁ గుంతియుం కొండుకనాఁడు దుర్వాసుని చేతం బడసిన మంత్రంబు తెఱంగు పతి కెఱింగిచి యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె నే వేల్పు నారాధింతు నాన తిమ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె. 91

ఈ వరం గురించి కుంతి పాండురాజుకు చెప్పినది కాని తా నా వరాన్ని మునుపే ప్రయోగించి చూచితినని గాని తత్ఫలితాన్న గాని కుంతి పాండురాజునకు చెప్పినట్లు ఎక్కడా లేదు. అలా జరిగితే కథే వేఱుగా ఉండేదేమో.
క.
లలితాంగి యెల్లలోకం, బులు ధర్మువునంద నిలుచుఁ బలుపుగ ధర్ముం
దలఁపుము యాతఁడె వే, ల్పులలోపలఁ బెద్ద ధర్మువున సత్యమునన్. 92

లోకాలన్నీ ధర్మం నందే నిలుస్తాయి. ధర్మానికి ఆధారమైన ధర్మమూర్తి యమధర్మరాజు. ఆతడే వేల్పులందరిలో పెద్దవాడు కూడా. అందుచేత ధర్మరాజుని తలపమన్నాడు పాండురాజు.
వ.
అని నియోగించినఁ గుంతియు బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన నా ధర్ముండును యోగమూర్తిధరుం డై వచ్చి వరం బిచ్చినం గుంతియు దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93

ఇప్పుడు మునుపటి వలె సద్యోగర్భం కాక మామూలుగానే గర్భాన్ని దాల్చి 9 నెలలకు బదులుగా సంవత్సరం పాటు గర్భాన్ని ధరించిందన్నమాట.
ఉ.
శాత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుఁగొంద నైంద్ర న
క్షత్ర యుతుండు గా శశిప్రకాశజయోన్నత మైన యష్టమిన్
మిత్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మ మూర్తి యై. 94
ఆ విధంగా ధర్మరాజు కుంతికి అష్టమి నాడు ఇంద్రనక్షత్రంలో ఆభిజిత్ లగ్నంలో పుట్టాడన్నమాట.
క.
కురుకులవిభుఁ డగు ధర్మ, స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి
ష్ఠిరుఁ డనునామముఁ దా ను, చ్చరించె నాకాశవాణి జనవినుతముగాన్. 97

ఆకాశవాణి ఆ పుత్రునకు యుధిష్టిరుడు అనే పేరు పెట్టిందట.
Unknown
ఆది పర్వము- పంచమాశ్వాసము-5
వ్యుషితాశ్వుండను రాజు వృత్తాంతము
తే.
భర్త చేత నియోగింపఁ బడక సతికి, నెద్దియును జేయఁ గాఁ దగ దెద్ది యైన
భర్త చేత నియోగింపఁబడినదాని, జేయకునికి దోషంబని చెప్పె మనువు. 88

భర్త చేత నియోగింపబడకుండా భార్యకు ఏదీ చేయగా తగదట. అలాగే భర్త నియోగించిన పనిని ఆచరించకుండా వుండటం దోషమని మను వచనం. ఈమాటలు పాండురాజు కుంతితో అంటాడు. సందర్భం ఏంటంటే---

భార్యను కలిసిన వెంటనే మరణం సంభవిస్తుందన్న శాపం కలిగిన తరువాత పాండురాజు శతశృంగ పర్వతం మీద తపోవృత్తిలో ఉంటాడు( భార్యలతో కలసి). ఒకసారి కొంతమంది మునులు ఆ మార్గం గుండా స్వర్గలోకానికి వస్తూ పోతూ ఉండటం గమనించి తాను కూడా స్వర్గానికి వెళ్దామని ప్రయత్నించి అనపత్యులైన వారికి స్వర్గ ప్రవేశార్హత లేదని తెలుసుకుని దుఃఖిస్తుండగా ఆ మునులు దివ్యదృష్టితో నెఱింగిన వారై అతనితో నీకు ధర్మానిలశక్రాశ్వినిల వరం వలన సంతానం కలుగుతుందని చెప్పి సంతానార్థం ప్రయత్నించమని చెప్తారు.

అప్పుడు పాండురాజు కుంతీ దేవితో ధర్మ పద్ధతిలో సంతానం పొందే మార్గాన్ని అనుసరించమంటాడు. తమ యందు సంతానం కలిగే అవకాశం కలదని చెప్తూ కుంతి పాండురాజుకు వ్యుషితాశ్వుం డనే రాజు కథను చెప్తుంది.
చ.
అతుల బలప్రతాప మహిమాధికుఁ డై వ్యుషితాశ్వుఁ డన్మ హీ
పతి నయధర్మ తత్పరుఁడు పౌరవవంశజుఁ డశ్వమేధముల్
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ
ర్ధిత యశుఁ డై ప్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్. 78

నూరు అశ్వమేధాల్ని చేసి అందరు రాజులనూ జయించాడట ఆ వ్యుషితాశ్వుడు.(ప్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్.)
వ.
అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర యను తన భార్యయందు ననవరత కామాశక్తిం జేసి యక్ష్మరుజాక్రాంతుండయి యస్తమించిన నది పుత్త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింపనోపక .80

(అనవరత కామాశక్తి క్రీడిస్తే పురుషులకు క్షయరోగము కలుగుతుందట, కాని స్త్రీలకు అటువంటి రోగాలేమీ కలగవా అని నాకో సందేహం.)
తే.
పతియు లేక జీవించు నయ్యతివ కయిన, జీవనము కంటె దానికిఁ జావ లగ్గు
కాన నీతోన చనుదెంతుఁ గాని నిన్నుఁ, బాసి యిం దుండఁగానోపవాసవాభ. 81

భర్త లేని బ్రతుకు నేను బ్రతకలేను. దాని కంటె చావు మేలు. అదుచేత నేను కూడా నీతో చచ్చిపోతాను.
వ.
కాదేని నాకుఁ బుణ్యమూ( ర్తిప్రతిమూ)ర్తు లైన పుత్త్రులం బ్రసాదింపు మని ధర్భాస్తరణశాయిని యై యాశవంబుఁ గౌగిలించుకొని విలాపించు చన్న దానికి వానిశరీరమునుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె. 82

క.
విదితముగ నీకు వర మి, చ్చెద నోడకు లెమ్ము గుణవశీకృతభువనుల్
సదమలచరిత్రు లాత్మజు, లుదయింతురు వగవ కుండు ముదితేందుముఖీ. 83

నీకు సంతానం కలుగుతుంది , అలా వరం ఇస్తాను లెమ్ము అని వినిపిస్తుంది. ఇంకా
వ.
ఋతుమతి వయిన యష్టమ దివసంబున నేనిం జతుర్దశ దివసంబున నేని (ఇప్పుడు సైంటిఫిక్ గా సంతానాన్ని పొందటానికి కలియవలసిన రోజులు కూడా అవే నంటారు కదా) శుచివై శయనంబున నుండి నన్నుఁ దలంపు మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురు సాల్వులను, నల్వురు మద్రులునుగా నేడ్వురు గొడుకులం బడసె నది గావున నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబు వడయుమనినం గుంతి జూచి పాండురాజు ధర్మ్యం బయిన యొక్క పురాణకథఁ జెప్పెదఁ దొల్లి స్త్రీలు పురుషులచేత ననావృత లయి స్వతంత్ర వృత్తి నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం ప్రవర్తిల్లు చున్న నుద్దాలకుం డను నొక్క మహామునిభార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతు తల్లి ఋతుమతి యైన దానినొక్క విప్రుం డతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించి దాని సహింపక. 84
సీ.
ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురుషార్థినుల్ గాఁ జన దన్యపురుష
సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ బరిగ్రహభూత లయిన సతుల
కిట్టిద మర్యాద యిమ్మనుష్యుల కెల్లఁ జేసితి లోక ప్రసిద్ధి గాఁగ
నని ధర్మ్య మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి
ఆ.
యబ్జభవసమానుఁ డగు శ్వేతకేతుండు, నిలిపె నదియు ధారుణీజనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు, నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి. 85

అదిగో అప్పటినుండి సతులను పరపురుషులు కోరగూడదనిన్నీ అలా చేస్తే సకల పాపములు కలుగుతాయనిన్ని శ్వేతకేతుని చే చేయబడ్డ కట్టుబాటు. అంటే అంతకు ముందు ఇటువంటి కట్టుబాటు లేదన్నమాట. అందరూ అందరితో గడపవచ్చన్నమాట. ఇటువంటి మర్యాదలు ఎన్నో ఎన్నెన్నో భారతం నిండా ఇది మొదలుగా అని చెప్పబడతాయి. వీనినిబట్టి మానవలోకంలో ఆచారవ్యవహారాలు ఎప్పటినుండి ఎప్పటికి ఎలా మార్పు చెందుతూ వచ్చాయో తెలుస్తుందన్నమాట.
వ.
మఱియుఁ దిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండు నట్లు శ్వేతకేతుఁడు సేసిన ధర్మస్థితి కారణంబున నాటంగోలె. 86

కాని ఈ మర్యాదకో మినహాయింపు ఉంది. ఇది పశుపక్ష్యాదులయందు ఉత్తరకురుదేశాల్లోనూ చెల్లదట. అక్కడ మాత్రం పాత విధానమే ఈనాటికి నడుస్తుందట. ఉత్తరకురుభూములంటే ఏ యే దేశాలో తెలుసుకోవాలి.
క.
పురుషులచే ధర్మస్థితిఁ , బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుషభక్తియుఁ, బరపురుష విసర్జనంబుఁ బరిచిత మయ్యెన్. 87.
తే.
భర్త చేత నియోగింపఁ బడక సతికి, నెద్దియును జేయఁ గాఁ దగ దెద్ది యైన
భర్త చేత నియోగింపఁబడినదాని, జేయకునికి దోషంబని చెప్పె మనువు. 88

భర్త చేత నియోగింపబడకుండా భార్యకు ఏదీ చేయగా తగదట. అలాగే భర్త నియోగించిన పనిని ఆచరించకుండా వుండటం దోషమని మను వచనం. ఈమాటలు కుంతి పాండురాజు తో అంటుంది.
వ.
పతి నియోగించిన దానిం జేయనినాఁడు భార్యకుం బాతకం బని యెఱింగికాదె తొల్లి సౌదాసుం డైన కల్మషపాదుం డనురాజర్షి చేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్టు వలన నశ్మకుం డను పుత్త్రుం బడసె నస్మజ్జన్మంబు నట్టిద మహాముని యయిన కృష్ణద్వైపైయనువలనఁ గురుకులవృద్ధిపొంటె నేముద్భవిల్లితిమి కావున నీ విన్ని కారణంబులు విచారించి నానియోగంబు సేయుము. 89
చ.
అలయక ధర్మ శాస్త్రములయందుఁ బురాణములందు జెప్పె ను
త్పలదళనేత్ర విందుమ యపత్యము మే లని కావునన్ యశో
నిలయులఁ బుత్త్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్. 90
సంగతాంగుళీదళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్=చేర్చిన వ్రేళ్ళనెడి రేకులచేఁ బ్రకాశించు నా చేతులనెడి తామరలతతోఁ గూర్చబడిన దోసిలిని
అంతలా ప్రాధేయపడితే ఏ భార్యమాత్రం కరగకుండా వుండగలదు.










Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-4
వేఁట వోయిన పాండురాజునకు శాపంబు గలుగుట
తే.
పఱవ నోపక యున్న మైమఱచి పెంటిఁ
బెనఁగి యున్నను బ్రసవింప మొనసియున్నఁ
దెవులుగొని యున్న మృగములఁ దివిరి యేయ
రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన. 53
ఎఱచి= మాంసము

పాండు రాజు కుంతీ మాద్రిలను వివాహమాడి దిగ్విజయము చేసి అనేకమంది రాజులను వశీకృతులుగా జేసికొని విపరీతమైన ధనమును సంపాదించి తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి అనేక దానములు చేస్తూ గొప్ప ప్రసిద్ధిని పొందుతాడు.

ఒకసారి తన ఇద్దఱు భార్యలతో కలసి అడవికి వేటకు వెళ్తాడు పాండురాజు. వేటాడుతూ వేటాడుతూ ఒక్కమృగం కూడా దొరకకపోయి కోపించి ఉండగా రెండు - ఒక మగ, ఒక ఆడ లేళ్ళు ఒకదానితో ఒకటి కలసి ఉండగా వాటిపై 5 బాణాలు ప్రయోగించి చంపుతాడు. అప్పుడు వానిలో ఒక లేడి అతనితో మనుష్యభాషలో నేను కిందము డనే మునిని, నేను నా భార్యతో కలసి మృగరూపంలో క్రీడిస్తుండగా మమ్మల్ని వధించావు. నీవు రాజువు కాబట్టి వేటాడటం దోషం కాదు. అయినప్పటికీ - పరుగు పెట్టడానికి అశక్తలై ఉన్నప్పుడూ, శరీరాన్ని మరచి పెంటితో కలసి ఉన్నప్పుడూ, ప్రసవించ డానికి సిద్ధంగా ఉన్నపుడూ, తెవులుకొని ఉన్నప్పుడూ - ఈ సమయాల్లో మృగ మాంసం ఆహారముగా జీవించే ఎఱుక కులం వారైనా గానీ మృగాల్ని వేటాడరు.
చ.
ఇనసమ తేజు లై ధరణి ధర్మపథంబు దప్పఁ ద్రొ
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి య
త్యనఘచరిత్ర యిట్లు దగునయ్య యధర్మువు సేయ నీ యెఱుం
గని నృపధర్మువుల్ గలవె కౌరవపుంగవ గౌరవస్థితిన్. 54

భరతవంశంలో పుట్టిన నీకు అన్ని ధర్మాలూ తెలుసు. ఇలా ధర్మం కాని పనిని చేయటం(పెంటితో కలసి మృగరూపంలో క్రీడిస్తున్న మమ్ము వధించటం) నీకు తగునా? అని అడుగుతాడు మనుష్యభాషలో.
వ.
అని తన్ను నిందించి పలికిన నా మృగంబు పలుకుల కలిగి పాండు రాజి ట్లనియె. 55
వ.
తొల్లి యగస్త్యమహా మునీంద్రుండు మృగమాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్ణయించె దీని నీకు నిందింపం దగునే యనుచున్న నామృగంబు బాణఘాతక్షతవేదన సహింప నోపక సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితివి గావున నీవునుం బ్రియసమాగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు మని నీ ప్రియయు నిన్ను ననుగమించు నని పాండురాజునకు శాపం బిచ్చి గతప్రాణములై పడియున్న మృగములం జూచి శోకించి పాండురాజు పరమనిర్వేదనపరుండయి . 57
క.
ఎట్టివిశిష్టకులంబునఁ, బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్
గట్టినకర్మ ఫలంబులు, నెట్టన భోగింప కుండ నేర్తురె మనుజుల్. 58

ఎంత గొప్పకులం లో పుట్టిన వారైనా సదసద్వివేకములు కలిగి ఉన్నప్పటికీ పూర్వం చేసిన కర్మ ఫలితాన్ని పొందకుండా వుండటం సాధ్యం కాదు గదా అనుకున్నాడు.