Unknown
ఆది పర్వము- అష్టమాశ్వాసము-2
వ.
అనుచున్న సమయంబున నయ్యిద్దఱ వారించి విదురుండు ధృతరాష్ట్రున కి ట్లనియె. 42
సీ.
ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థవిమలమతులు
ద్రోణగాంగేయులు దురితవిదూరులు ని న్నెద్ది గఱపిరి నెమ్మితోడ

దానిన చేయుట ధర్మువు వారలకంటె హితుల్ నీకుఁ గలరె యొరులు

దుర్యోధనుండును దుశ్శాసనుండును గర్ణుండు శకునియుఁ గరము బాలు
గీ.
రెఱుఁగ రిదియు ధర్ము విది యధర్మం బని, యట్టివారిపలుకు లాదరించి
వినక పాండుసుతుల వేగ రావించి వా,రలకుఁ బ్రీతి నర్థరాజ్యమిమ్ము
. 43

విదురుడు ధృతరాష్ట్రునికి సరియైన విధానాన్ని బోధించాడు. ద్రోణుడు, గాంగేయుడు వీరిద్దరూ మధ్యస్థులు, నిజాన్ని పలికేవాళ్ళు, వయోవృద్ధులు, పాపానికి దూరంగా వుండేవారూను అందుచేత వారు చెప్పింది ఆచరించటం శ్రేయస్కరం. వారు చెప్పినట్లుగా పాండవులను పిలవనంపి వారికి అర్థ రాజ్యం ఇయ్యి. దుర్యోధనాదులు ఇంకా చిన్నవాళ్ళు, వారికి ఇది ధర్మం యిది అధర్మం అనేది సరిగా తెలియదు. అని సలహా ఇస్తూ ఇంకా పాండవుల గురించి ఇలా అంటున్నాడు.
మ.
తమకుం దార యజేయు లెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై
శమితారాతిబలుండు వారలకుఁ బాంచాలప్రభుం డిప్ప్డు చు

ట్టము దా నయ్యెఁ దదాత్మజుం డయినధృష్టద్యుమ్నుఁడున్ వారితో

సమవీర్యుం డొడఁగూడె నిష్టసఖుఁ డై సంబంధబంధంబునన్
. 44
దార=తారు అ =వారే, శమితారాతిబలుండు=శత్రుబలము నణఁచినవాఁడు

పాండవులు మొదలే వారికి వారే పరాక్రమంలో ఎవ్వరికీ జయింపరానివారు, వాళ్ళకిప్పుడు శత్రుబలాన్ని అణిచిపెట్టినట్టి ద్రుపదుడు చుట్టం కూడా అయ్యాడు. ఆయనకొడుకు దృష్టద్యుమ్నుఁడు పాండవులతో సరిసమానమైన పరాక్రమ వంతుడు వారికి ప్రియసఖు డయ్యాడు చుట్టరికం మూలంగా.
మ.
బలదేవాచ్యుతసాత్యకుల్ దమకు నొప్పన్ మిత్రులుం గూర్చుమం
త్రులుఁ గా దైవము మానుషంబుం గలనిత్యుల్ నీకు దుర్యోధనా
దులకంటెం గడు భక్తు లెంతయు వినీతుల్ వీరు లప్పాండుపు
త్త్రులు నీపుత్త్రుల కారె వారిఁ దగునే దూరస్థులం జేయఁగన్. 45

బలదేవుడు, శ్రీకృష్ణుడు, సాత్యకి తమకు కూర్చిన మంత్రులు, హితులు కాగా దైవము - మానుషమూ కల నిత్యులూ, దుర్యోధనాదులకంటె నీ యెడల అధికమైన భక్తి కలవారు అయిన పాండవులు నీ పుత్త్రులవంటివారే. వారిని దూరస్థులుగా ఉంచటం తగదు.
ఉ.
ఆహవభూమిలోనఁ బరమార్థము పార్థుఁడు వైరివాహినీ
వ్యూహము వ్రచ్చుచోట మఘవుండును వారికి మార్కొనంగ ను
త్సాహము సేయఁ డన్న లఘుసారు లధీరు లసాహసుల్ నిరు
త్సాహులు ద్రోహులై యెదిరి చత్తురొ మందురొ మానవేశ్వరా. 46
వ్రచ్చుచోటన్ = చీల్చునెడ, మఘవుండు=ఇంద్రుడు

ఉ.
ఆయతబాహుఁ డాతనికి నగ్రజుఁ డగ్రణి పోరులందు నా
గాయుతసత్త్వుఁ డుద్ధతయుగాంతకృతాంతనిభుండు భీముఁ డ
వ్వాయుజసవ్యసాచుల నవార్యబలోన్నతిఁ బోలు చున్నమా
ద్రేయు లజేయు లెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్. 47
క.
తమ్ములయట్టుల తనకు వ,శమ్మయి ధర్మువును ధృతియు సత్యముఁ గారు
ణ్యమును నొప్పఁగ బేర్మి ని,జమ్ముగ మను ధర్మజున కసాధ్యము గలదే. 48
వ.
వారలబలపరాక్రమంబు లెల్లవారికి దృష్టపూర్వంబుల యట్టివారితోడ విగ్రహంబు సేయు దుర్బుద్ధులుం గలరె నీ పుణ్యమున నమ్మహాత్ములు జననీసహితంబు లక్కయింట బ్రదికిరి నీయందుఁ బురోచనదిగ్ధం బయినదుర్యశఃపంకంబుఁ బాండవానుగ్రహజలంబులం జేసి కడిగికొనుము దుర్యోధనాపరాధంబున నఖిలమహీ ప్రజకు నపాయం బగు నని తొల్లియు నీకుం జెప్పితి నట్లు గా కుండ రక్షింపుమనిన విని ధృతరాష్ట్రుండు విదురున కి ట్లనియె. 49
క.
నీవును భీష్ముఁడు ద్రోణుఁడు, భూవినుతవిశుధద్ధర్మబుద్ధుల రగుటన్
మీ వచనమున కనర్థము, గావింపఁగ నంత కార్యగతిమూఢుఁడనే. 50

ఇలా అని చెప్పి పాండవులను తన వద్దకు రప్పించుకొని ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చి ధర్మరాజును ఖాండవప్రస్థానికి పంపిస్తాడు.
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
ఉ.
అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్ జయింపఁగా
నిమ్మహి నోప రెవ్వరు నుమేశ్వరుఁ డట్టివరమ్ము వానికిన్
నెమ్మిన యిచ్చె గావున వినీతుఁడు వాయుసుతుండు మల్ల యు
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్. 162

క.
బలిమిమెయిఁ బార్థురక్షా,బలమును బవనసుతు బాహుబలమును నాని
ర్మలనీతిబలము నీకుం, గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా. 163

చ.
తడయక యేగి నీతిబలదర్పము లొప్పఁగ వాని డాసి క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁదిరిపున్ జయింతుము జగన్నుత న న్నెద నమ్ముదేని యి
ల్ల డ యిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్. 164

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధునిమీదకు యుద్ధానికి పోయేటప్పుడన్న మాటలవి.
దానికి ధర్మరాజిట్లా అన్నాడు.
చ.
ప్రియహితసత్యవాక్య యరిభీషణ కృష్ణ భవన్ని దేశసం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగుటేమి పెద్ద ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశుల నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁ బొందె నయకిల్బిషకీర్తి వెలుంగు చుండగన్. 166

చూడండి ధర్మరాజు వాక్యాన్ని ఎలా మొదలుపెట్టాడో. 'ప్రియహిత సత్యవాక్య' అని. అంటే చచ్చినట్లు ఆ పనిని నెరవేర్చుకొని రావలసిందే అని సూచన అన్నమాట.
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభాపర్వము-ప్రధమాశ్వాసము-2
భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు కలిగించుట
క.
ఆరంభరహితుఁ బొందునె, యారయసంపదలు హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ, తారంభులనోర్చు నెంతయధికుల నయినన్. 123

ఏ పనినీ ప్రారంభించని వాడిని సంపదలు చేరవు. హీనుడైనా సరే కృతప్రయత్నుడైన వాడు ప్రయత్నించని వారిని వారెంత అధికులయినా సరే ఓడించగలుగుతాడు.
క.
కడు నధికునితోడఁ దొడరినఁ, బొడిచిన నొడిచినను బురుషుపురుషగుణం బే
ర్పడుఁగాక హీను నొడుచుట, కడిఁదియె పౌరుషము దానఁగలుగునె చెపుమా. 124

తనకంటె అధికుడైన వానితో కలబడితే పురుషునకు మగతనం కానీ హీనుడిని అణచటం గొప్పా ? దానివల్ల పౌరుషం కలుగుతుందా చెప్పు.
జరాసంధుని మీదకు దండయాత్రకు పోవటానికి ఉద్యమిస్తూ భీముడు ధర్మరాజుతో పై విధంగా అంటాడు.
అప్పుడర్జునుడు--
క.
కులరూపగుణద్రవ్యం,బులు విక్రమవంతునందు భూవిదితము లై
నిలుచు నవిక్రమునకు నవి, గలిగియు లేనిక్రియ నప్రకాశంబు లగున్. 129

కులము, రూపము, గుణము, ద్రవ్యము --ఇవి విక్రమవంతుని యందు ప్రకాశించినట్లుగా అవిక్రమునందు ప్రకాశించవు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-
నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చిఇంద్రసభ, యమసభ, వరుణసభ, కుబేరుసభ, బ్రహ్మసభా వర్ణనలను చేస్తాడు. ఆ వర్ణనలలో పాండురాజు యమసభలో ఉన్నట్లుగాను హరిశ్చంద్రచక్రవర్తి దేవేంద్రసభలో ఉన్నట్లుగాను చెప్తాడు. అదివిని ధర్మరాజు నారదునితో
మధ్యాక్కర.
పరమధర్మాత్మకుఁ డయినపాండుభూపతిఁదొట్టి సకల
ధరణీశు లెల్ల యముసభ నుండంగఁ దా నేమిపుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁ డై యుండంగఁ గనియె.82
వ.
అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుండి ట్లని చెప్పె. 83
ఉ.
దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మ పరాయణుం డయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైక విభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రి కా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్. 84
సీ.
జయశీలుఁ డయి హరిశ్చంద్రుండు దొల్లి సప్తద్వీపములఁ దనబాహుశక్తిఁ
జేసి జయించి నిశ్శేషితశత్రుఁ డై ధారుణిలోఁ గలధరణిపతుల
నిజశాసనంబున నిలిపి నిత్యం బైన మహిమతో సకలసామ్రాజ్యమొప్ప
రాజసూయంబు తిరంబుగా నొనరించి తనరి యథోచితదక్షిణలకు
ఆ.
నేనుమడుఁగు లర్థమిచ్చి యాజకులఁ బూ,జించి భక్తితో విశిష్టవిప్ర
జనుల కభిమతార్థసంప్రదానంబులఁ,దృప్తి సేసె వంశదీపకుండు.85
వ.
వాఁడును బ్రాహ్మణవచనంబునం జేసి దేవేంద్రసాలోక్యంబు వడిసె నట్టిహరిశ్చంద్రుమహిమాతిశయంబు రాజసూయనిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో నిట్లనియె. 87
వైవస్వతసభన్=యమసభలో
చ.
కొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ యిందు నా
యునికియు రాజసూయమఖ మున్నతిఁ జేసినధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైనధర్మ నం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయగన్.89

నీవు మనుష్యలోకానికి వెళ్ళి నాకొడుకు ధర్మరాజుతో నా నరకనివాసాన్ని గురించి రాజసూయం చేసినవారి సంబంధుల స్వర్గనివాసస్థితిని తెలియజేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా అతనికి చెప్పి రాజసూయయాగం చేయమని నా మాటగా చెప్పమన్నాడు.
చ.
అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁడయి తమ్ములబాహుబలంబు పెంపునన్. 90

నాకొడుకులు దేవతాంశతో పుట్టినవాళ్ళు ధర్మరాజు రాజసూయాన్ని తమ్ముల సహాయంతో పూర్తి చేయగలడు
అని కూడా అన్నాడు.
వ.
అట్లేని నాకు నస్మత్పితృపితామహనివహంబుతోడ నాకాధిపలోకసుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు వచనంబు నీ కెఱింగించువేడుక నిట వచ్చితి. 91
క.
న్యాయమున రాజసూయము, సేయుము నీపితృగణంబుఁ జెచ్చెర నధిక
శ్రీయుత సురగణపూజ్యులఁ, జేయుము శక్రుసభ నుండఁ జేయుము వారిన్. 92

నీ తండ్రికి స్వర్గం ప్రాప్తించేలా నీవు రాజసూయయాగం చెయ్యి అని నారదుడు ధర్మరాజును ప్రేరేపిస్తాడు.
వ.
దిగ్విజయోపార్జితంబు లయినధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణ్యాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు(పూజ్యంబై యొప్పం) బ్రకాశింపుము మఱి రాజసూయంబు బహు విఘ్నంబు బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయు చుండుదు రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిలప్రజాప్రళయకారణం బయిన రణం బగునని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములం జూచి ధర్మ తనయుండు ధౌమ్యద్వైపాయనసుహృద్బాంధవమంత్రి సమక్షంబున నిట్లనియె.93

ధర్మరాజు నారదవచనప్రబోధితుండయి రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట
క.
పితృసంకల్పము సేయఁగ, సుతుల కవశ్యమును వలయు సుతజన్మఫలం
బతిముదమునఁ బితృవరులకు, హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్. 94
క.
పరలోకనిలయు లగుమీ, గురులకు దీనిన హితం బగున్ లోకభయం
కరసంగరమును గాలాం,తరమున నగునని విరించితనయుఁడు సెప్పెన్. 95
క.
పితృగణహితార్థముగ స,త్క్రతువొనరింపగ బుద్ధి గలదు ప్రజాసం
హృతి తత్క్రతువున నగు నని, మతి నాశంకయును గలదు మానుగ నాకున్. 96

ద్వైదీభావంలో పడ్డాడు ధర్మరాజు.ఓ ప్రక్క తండ్రులకు స్వర్గలోకప్రాప్తి, మరోప్రక్క ప్రజావినాశనం ఏదీ తేల్చుకోలేకుండా వున్నాడు.
వ.
ఏమి సేయుదు నని డోలాయమానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97
ఉ.
చేయుము రాజసూయ మెడ సేయక దాననచేసి దోషముల్
వాయు నిలేశ భూప్రజకుఁ బార్థివు లెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు సర్వసంపదలు చేకొనఁగాఁ దఱి యయ్యెఁ గౌరవా
మ్నాయలలామ నీ కెనయె మానవనాథులు మానుషంబునన్.98
వ.
అనిన వారలవచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుం డయి ధర్మరాజు రాజసూయంబు సేయసమకట్టి............
ఇక్కడ ధర్మరాజు వ్యక్తిత్వం కొంచెం దెబ్బతిన్నట్లనిపిస్తుంది నాకు. నిఖిలజన ప్రళయాన్ని కలిగించే యుద్ధం జరుగుతుందని ముందే తెలిసినా దానికివ్వాల్సినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా రాజసూయానికి పూనుకోవటం నాకంతగా నచ్చలేదు. అది అతని వ్యక్తిత్వానికి మచ్చగా నా కనిపిస్తుంది. నేను తప్పో కాదో నాకు తెలియట్లేదు.