Unknown
అర్జునుడు పేడి రూపమున విరటుఁ గొల్వ వచ్చుట
అర్జునుడు కొలువులోనికి రావటం ఎలావుందంటే
ఆ.
మంచుమఱుఁగువడినమార్తాండుఁడునుబోలె, నీఱు గవిసియున్న నిప్పుఁబోలె
వేషధారి యైన విష్ణుండుఁబోలె న, వ్విరటుకొలువు చేర నరుఁడు వచ్చె. 228
క.
కనుదెంచి పేడితనమును, వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా, జనులకుఁ దనుఁ జూపి మందసంచారమునన్. 229
క.
నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ, గన్నియలకు నాడ గఱపఁ గా నోపుదు వి
ద్వన్నుత మన్నామంబు బృ,హన్నల యేఁ బేడి ననుడు నత డిట్లనియెన్. 233
ఉ.
ఆయత బాహులున్ వెడఁద యైనసమున్నతవక్షమున్ సరో
జాయితలోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్ర మ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే. 234
కాయజున్ = మన్మధుని, కౌశికున్ = ఇంద్రుని
వ.
అనిన విని యమ్మహీపతికి బృహన్నల యి ట్లనియె.237
ఉ.
ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్త్వముం
బోఁడిమి దప్పి యున్నది నపుంసక జన్మ మవశ్యభోగ్య మై
వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మభావ్య మె
వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. 238
వ.
కావున.
తే.
ఒండు పనులకు సెలవు లే కునికిఁ జేసి, యభ్యసించితి శైశవ మాది గాఁగ
దండలాసకవిధమును గుండలియును, బ్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును. 240
సెలవు = ఉపయోగము, బ్రేరణి = కుండమీఁది నాట్యము

విరాటరాజప్పుడు తన కూతురు ఉత్తరను పిలిపించి ఆమెకు బృహన్నలను గురువుగా పరిచయం చేసి బృహన్నలకామెను అప్పగిస్తూ ఆమెతో ఇలా అంటాడు.
ఆ.
ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును, జెలియుఁ బరిజనంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్కకొఱఁతయు లే దిందుఁ, జేరి బ్రదుకు బుద్ధిగౌరవమున. 253
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-విరాట పర్వము
భీముడు వంటలవాఁడై విరటుఁ గొల్వ వచ్చుట
శా.
దేవా నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్
సేవాదక్షత నొండుమై నెఱుఁగ నీచిత్తంబునన్ మెచ్చున
ట్లే వండం గడు నేర్తు బానసమునం దిచ్చోటనే కాదు న
న్నేవీటన్ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులన్ జూచినన్. 217

భీముడు వంటలవాడి వేషంలో విరాటు కొల్వులోనికి ప్రవేశించి విరాట రాజుతో పై విధంగా అంటాడు. నేను శూద్రజాతికి చెందినవాడను. నాపేరు వలలుడు. మీకు వంటలు మంచి రుచిగా వండిపెట్టగలను. ఏవిధంగా చూచినా నన్నుమించిన వంటలవాడు ఎక్కడా కనిపించడు.
చ.
వలసిన నేలు మేను బలవంతుఁడఁ గారెనుఁబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమును లావు విద్య మెయి దర్పముఁ బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విఱుతున్ వడిన్ గడియలోనన చూడ్కికి వేడ్క సేయుదున్. 223
దలమును=ఆధిక్యమును
మీకు కావలిస్తే నాకుద్యోగమివ్వండి. నేను చాలా బలవంతుడను, ఎనుబోతులతోనూ, ఏనుగులతోనూ, పెద్దపులి, సింహం మొదలైన వానితోనూ పోట్లాడతాను, అంతేకాదు  పెద్ద పెద్ద మల్లురతో కూడా పోట్లాడి మీకు వినోదాన్ని కలిగిస్తాను అంటాడు.
ఇలా చెప్పేసరికి అతనికి విరాటుడు తన వంటశాలలో వంటల వారందరికీ పెద్దగా ఉద్యోగమిస్తాడు.
Unknown
శ్రీమదాంధ్ర మహాభారత పఠనాన్ని విరాట పర్వం తో మొదలు పెట్టాలంటారు పెద్దలు. అందుకని ఆది పర్వం పూర్తిచేసిన తర్వాత విరాట పర్వంలోనికి ప్రవేశిస్తున్నాను.
విరాట పర్వం ఫ్రథమాశ్వాసము-

పాండవులు థౌమ్యుని వీడికొని విరాట నగరం చేరతారు. వారి ఆయుధాలనన్నింటిని ఓ శమీ వృక్షం మీద భద్రపఱచి , ఆ ఆయుధాలు ధర్మరాజుకు అర్జునునకు మాత్రమే ఆ సంవత్సరకాలంలో కనిపించేలాను మిగిలిన వారికి అవి విషంతో కూడుకున్న పాములువలె కన్పించుగాక అని నియమించుకుంటారు. ఈ ఏర్పాటు భీముని దృష్టిలో ఉంచుకుని సమయభంగం కాకుండా ఉండాలని చేసుకున్నది. వారు విరాటరాజు కొలువున ఎలా మెలగాలన్నది కూడా నిర్ణయించుకుంటారు.
వారు వారిలో వారిని పిలుచుకోవటానికి వీలుగా మారు పేర్లను పెట్టుకుంటారు. ఆ మారు పేర్ల వివరాలు.
ధర్మరాజు--జయుడు
భీముడు--జయంతుడు
అర్జునుడు--విజయుడు
నకులుడు--జయత్సేనుడు
సహదేవుడు--జయద్బలుడు.
తరువాత ధర్మరాజు యమధర్మరాజు తనకు అరణ్యవాస సమయంలో ఇచ్చిన వరాన్ని(యక్షప్రశ్నలు ఘట్టంలో) పురస్కరించుకొని ప్రార్ధన చేయగా అతని అనుగ్రహంతో వారి వారి కనుగుణమైన రూపాలు వారికి సంప్రాప్తిస్తాయి.
ఆ రూపాలతో వారు ఒకరి తరువాత ఒకరుగా విరాటు కొల్వులోనికి ప్రవేశిస్తారు. ధర్మరాజు కంకుడు అనేపేరుతో విరటునిసభలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు విరాటుడతనితో
ఉ.
ఎయ్యది జన్మభూమి కుల మెయ్యది యున్నచోటు పే
రెయ్యది మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతం
బెయ్యది నాకు నంతయును నేర్పడఁగా నెఱిగింపుఁ డున్నరూ
పయ్యది నావుడున్ నరవరాగ్రణి కయ్యతిముఖ్యుఁ డిట్లనున్. ౧౯౦

మీ వివరాలనన్నింటిని చెప్పమని విరాటు డడుగుతాడు యతి రూపంలో వచ్చిన ధర్మరాజుని.
ఆ.
ఉన్నరూప పలుకునన్నరు లెక్కడఁ, గలరు తోఁచినట్లు పలుకు పలుక
నైనచంద మయ్యె నంతియకా కంత, పట్టి చూడఁ గలరె యెట్టివారు. ౧౯౧
ఉన్నరూపు+=యథార్థమునే
ఇలా చెప్పి ధర్మరాజు లౌక్యాన్నుపయోగించి కొన్నాడు ఇక్కడ.

వ. అని మందహాసంబు సేయుచు మఱియును. ౧౯౨
క.
నానావిధభూతమయము, మే నతిచంచలము మనము మేకొని నిక్కం
బేనరునకు జెల్లింపం, గా నగు సత్యంబు నడపుక్రమ మట్లుండెన్. ౧౯౩
మేకొని=పూని
సత్యము యొక్కరూపాన్ని గురించి చెప్పి తాను నిజం చెప్పకుండా దాటవేసాడాయన. ఎవరికీ కూడా పూర్తి సత్యాన్ని పలకడం సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడతాడు. అదీ ఆయన చాతుర్యం. ధర్మరాజుకు సఖుడననీ తనకు కొద్దిగా ద్యూతక్రీడ తెలుసుననీ ఓ ఏడాదిపాటాశ్రయం కావాలనీ తన పేరు కంకుడనీ చెప్పి ఆశ్రయం పొందుతాడు.