Unknown
శ్రీమదాంధ్రమహాభారతం – ఎందుకు చదవాలి ?
నామాట
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకున్నాను. అందుకు నేనేం చేయ్యాలి? చదివితేనే గదా తెలిసేది ఎందుకు చదవాలో? అందులో ఏమున్నదో?  అందుకని మహా భారతం పుస్తకాలకోసమని చాలా సంవత్సరాల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించాను. అర్థతాత్పర్య రహితమైన కవిత్రయప్రణీత శ్రీమదాంధ్రమహాభారతం పుస్తకాల్నినేను చాలా ఏళ్ళ క్రితం శ్రీకాళహస్తి గుడికి వెళ్ళినపుడు ఆ గుడిదగ్గఱ కొన్నాను. అప్పుడక్కడ అన్ని పర్వాలూ పూర్తిగా దొరకలేదు. అక్కడ దొరకని వాటిని రవీంద్రా పబ్లిషింగ్ హౌస్ హైదరాబాదులో కొన్నాను. 1993-1995 ల మధ్య నేను నిరుద్యోగిగా తణుకులో కాలం గడుపుతున్నప్పుడు మహాభారతం మొత్తం 18 పర్వాలూ 18 రోజులలో పూర్తిగా చదవాలని ఓ వింత ఆలోచన ఎందుకో కలిగి అలాగే గబగబా చదివి పూర్తిచేసాను. కాని అప్పుడు చదివినదానిలో ఏ 20% మాత్రమో అర్ధమయింది. నేను చదివిన పుస్తకాల్లో అర్ధ తాత్పర్యాలు కానీ ఇతర వివరణలు కానీ ఏమీ లేవు.
ఇటీవల జూలై నెలలో తిరుపతి వెళ్ళినపుడు అక్కడి ప్రెస్సులో శ్రీమదాంధ్రమహాభారతం టీకాతాత్పర్యాలతోనూ విశేష వివరణలతోను ఉన్న టి.టి.డి ప్రచురణల ప్రతి 18 పర్వాలూ 15 సంపుటాలలోఉన్నది 1000 రూపాయల చౌక ధరలో కనిపిస్తే కొన్నాను. 2010 ఆగస్టు నెలలో చదవటం మొదలుపెట్టి 2010 డిసెంబరు 31 నాటికి 5 నెలల్లో చదవటం పూర్తి చేయగలిగాను.ఈ పుస్తకాల్లో అర్థం, తాత్పర్యం, అక్కడక్కడా అవసరమైనచోట్ల విశేష వివరణలూ కూడా ఉండటం చేత సుమారు 90 % పైగా అర్ఠం చేసుకోగలిగాను. పుస్తకం.నెట్ వారు 2010 లో మీరు చదివిన పుస్తకాలగుఱించి ఏమైనా వ్రాస్తే ప్రచురిస్తామని అనటం చూసి శ్రీమదాంధ్రమహాభారతం ఎందుకు చదవాలనే దాని గుఱించి వ్రాద్దామనిపించి వ్రాయటానికి పూనుకున్నాను. పెద్దలు నా ఈ సాహసాన్ని మన్నింతురు గాక!
 కొంతమంది మహాభారతాన్ని వినటాన్ని ఇష్టపడతారు.( వింటే భారతం వినాలన్నది మన తెలుగు వారి నానుడి) కొంతమంది మహాభారతాన్ని చూడటానికి ఇష్టపడతారు. మఱికొంతమంది మహాభారతాన్ని చదవటానికి ఇష్టపడతారు. వినగోరేవారికి భక్తి టీ.వి లోని గరికపాటి వారి మహాభారతం, లేదా ఇతర ఛానళ్ళలోని చాగంటివారి మహాభారత ప్రవచనాలూ వినటానికి అందుబాటులో ఉన్నాయి.అలాగే మహాభారతాన్నిచూడగోరేవారికి ఈ టి.వి.లోని మహాభారతం ధారావాహికా వీక్షణం ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే కొంతమంది బ్లాగరులు కంప్యూటర్లలో మహాభారతాన్నిఎందుకు చదవాలో దానిలోని గొప్పదనం ఏమిటో ఎవరైనా వ్రాస్తే చదవాలని కూడా అనుకోవచ్చని ఎందుకో నా కనిపించింది. సరిగ్గా అలాంటి వారికోసమే నా ఈ చిన్ని ప్రయత్నం. పెద్దలందరూ నా ఈ ప్రయత్నాన్ని నిండుమనసుతో స్వీకరించి నన్నాశీర్వదించాలనీ నాచే చేయబడే తప్పులను ఎత్తిచూపి నాకు మార్గదర్శకత్వం వహించాలనీ ఇందుమూలంగా కోరుకుంటున్నాను. మీ అందరి సలహాలకూ సంప్రదింపులకూ నేనెప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. 
వేదవ్యాసమహాముని సంస్కృతంలో రచించిన మహాభారతం నూఱు పర్వాలతోను సుమారు 100500 శ్లోకాలతోను ఉంటే కవిత్రయం వారాంధ్రీకరించిన మహాభారతం 18 పర్వాలతోనూ 21507 గద్యపద్యాలతోనూ ఉంది. భారతానువాదం ఒక అనువాదంలా కాకుండా ఓ స్వతంత్ర్యకావ్యంగా కవిత్రయం వారి చేతుల్లో రూపుదిద్దుకుంది. ఆంధ్రమహాభారతం లోని పర్వాల పేర్లు 1. ఆదిపర్వం 2. సభాపర్వం 3.ఆరణ్యపర్వం 4.విరాటపర్వం 5.ఉద్యోగపర్వం 6.భీష్మపర్వం 7.ద్రోణపర్వం 8.కర్ణపర్వం 9.శల్యపర్వం 10.సౌప్తికపర్వం 11.స్త్రీపర్వం 12.శాంతిపర్వం 13.అనుశాసనికపర్వం 14.అశ్వమేధపర్వం 15.ఆశ్రమవాసపర్వం 16.మౌసలపర్వం 17.మహాప్రస్థానీకపర్వం18.స్వర్గారోహణపర్వం. వీటిలో ఆది, సభాపర్వాలనూ ఆరణ్యపర్వంలో కొంత భాగాన్నీ రాజరాజనరేంద్రుని కాలంలో (క్రీ.శ. 1053ప్రాంతం) ఆయన అభ్యర్ధనపై నన్నయభట్టారకుడు తెలుగు చేసాడు. విరాట పర్వం మొదలుగా మిగిలిన 15 పర్వాలనూ నెల్లూరు మనుమసిద్ధి ఆస్థానంలోని కొట్టరువు తిక్కన సోమయాజి (1255-1260మధ్యలో ) ఆంధ్రీకరించటం జరిగింది. నన్నయ భట్టారకుడు ఆంధ్రీకరించగా మిగిలిన భాగాన్ని ఎఱ్ఱాప్రెగడ నన్నయ పేరుమీదుగానే పూర్తిచేసాడు. వ్యాసుడు మహా భారతాన్ని 3 సంవత్సరాల్లో పూర్తిచేసాడు. అయితే ఆంధ్రమహాభారతం మటుకు 3గ్గురు కవులచేత 3 విడి విడి సమయాల్లో పూర్తిచేయబడింది.
ఉపోద్ఘాతం(అవతారిక)

నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ ! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్!!


ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్నఅంశం మరొకచోట ఉండవచ్చు. కాని, భారతంలో లేని అంశం మరెక్కడా ఉండదని వ్యాసులవారు సంస్కృత మహా భారతంలో ఘంటాపథంగా ప్రకటించారు.
ధర్మే చార్ధే చ కామే చ మోక్షే చ భరతర్షభ ! యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ ! ! (సం.మ.భా. 56-33)
 దీనిని భారతం చివరలో స్వర్గారోహణ పర్వంలో తిక్కన గారీవిధంగా ఆంధ్రీకరించారు.

 అమల ధర్మార్థ కామ మోక్షముల గుఱిచి ! యొలయు తెరు వెద్దియును నిందుఁ గలుగునదియు

యొం డెడలఁ గల్గు దీన లేకుండు చొప్పు ! దక్కొకంటను లేదు వేదజ్ఞులార ! (స్వర్గా.82)
( ఓ వేదవిదులారా ! పవిత్రమైన ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి ప్రవర్తించే ధర్మం ఏదైతే ఈ భారతంలో చెప్పబడిందో అది మరొకచోట కూడా ఉంటుంది. ఇందులో లేని ధర్మం మరెక్కడా కూడా కనిపించదు.)
 వ్యాసుడు భరతవంశ కథనాన్ని మొదటగా జయం అనే పేరుతో వ్రాసాడు. దానిని వివిధలోకాలలో ప్రచారించే నిమిత్తం తన శిష్యులైన నారదుడు(దేవలోకం), అసితుడైన దేవలుడు(పితృలోకం), శుకుడు(గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలలో), సుమంతుడు(నాగలోకం), మనుష్యలోకంలో ప్రచారం చేయటానికి వైశంపాయనుడినీ నియోగించాడు. జయ కావ్యం  మనుష్యలోకంలో వైశంపాయనునిచే చెప్పబడినప్పుడు భారతంగా విస్తరించటం జరిగింది. ఆ వైశంపాయనుడు జనమేజయునికి భారతాన్ని చెప్తుండగా విన్నవాడు రోమహర్షుని పుత్త్రుడైన (రౌమహర్షిణి) ఉగ్రశ్రవసుడు అనే మహాముని. ఆ రౌమహర్షిణి తఱువాత నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు ఆ కావ్యాన్ని విస్తరించి మహాభారతం గా చెప్పటం జరిగింది. ఇది జయకావ్యం మహాభారతంగా రూపుదిద్దుకున్న విధాన క్రమం. కన్నడంలో పంపమహాకవి భారతాన్ని జయం అనే పేరుమీదనే నన్నయ కంటే ముందుగానే కన్నడీకరించాడు.
వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. – ఇది తెలుగువాళ్ళ నోటినుండి తఱచుగా వెలువడే నానుడి. అందుచేతనే మన తెలుగు వారందరికీ ప్రీతి పాత్రమైన భారతం గుఱించి వ్రాయాలని సంకల్పించాను. నన్నయ భారతాంధ్రీకరణాన్ని ఈ క్రింది పద్యంతో మొదలుపెడతాడు.
మంగళశ్లోకము
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్,
తే వేదత్రయమూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీ కన్ధరా శ్శ్రేయసే.
(ఏ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలంనుండి క్రమంగా, రొమ్మునందూ, ముఖమునందూ, దేహమునందూ లక్ష్మీ సరస్వతీ పార్వతులను ధరిస్తున్నవారై, స్త్రీపురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడువేదాలరూపం కలవారున్నూ, దేవతలచేత పూజింపబడినవారున్నూ అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరు లనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సు కలిగించే వా రౌతారు గాక !) ఈ పైపద్యం శార్దూల విక్రీడితం. కాని దీనికి తెలుగులోని యతి ప్రాసలు లేవు. సంస్కృత శార్దూల విక్రీడితం ఈ పద్యం.
నన్నయ ఋషితుల్యుడు.ఆయన నోట త్రిమూర్తులు అనే పదం రావటం చేత భారతాన్ని కూడా త్రిమూర్తులవంటి కవిబ్రహ్మ తిక్కన, నారాయణునివంటి నన్నయ, ప్రబంధపరమేశ్వరుడని పేరుగాంచిన ఎఱ్ఱన తెలిగించారని కొందరు పెద్దలంటారు. నిజమే ననిపిస్తుంది.
రాజరాజనరేంద్రుడు నన్నయతో మహాభారతాంధ్రీకరణం గుఱించి చెప్తూ ఈ విధంగా అంటాడు.
ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబు లైయుండుఁ బా
యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుఁ బార్వతీపతిపదాబ్జధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్ .
రాజరాజుకు అత్యంత ప్రీతి పాత్రమైన 5 విషయాల్లో భారతకథాశ్రవణం కూడా ఒకటి. ఆ మహా భారతం ఎటువంటి దంటే ....
అమల సువర్ణ శృంగఖుర మై కపిలం బగుగోశతంబు ను
త్తమబహువేదవిప్రులకు దానము సేసినఁదత్ఫలంబు త
థ్యమ సమకూరు భారతకథాశ్రవణాభిరతిన్ మదీయచి
త్తము ననిశంబు భారతకథాశ్రవణ ప్రవణంబుకావునన్.
(పరిశుద్ధమైన బంగారపు తొడుగుతో కూడిన కొమ్ములును, గిట్టలును కల కపిలవర్ణం కల వందావులను యోగ్యులు, నాలుగువేదాలూ అధ్యనం చేసిన వారైన విప్రులకు దానం చేసిన ఫలితం భారతకథను వినే ఆసక్తిచేత తప్పక కలుగుతుంది. నాహృదయం కూడా భారతకథను వినాలి అని కుతూహలపడుతూ ఉంటుంది.) కాబట్టి -- మహాభారతబద్ధనిరూపితార్థం--- ఏర్పడేటట్లుగా రచించమని కోరతాడు రాజరాజనరేంద్రుడు నన్నయని. నన్నయ కవిత్వం

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకవితార్థయుక్తి లో

నారసి మేలునా,నితరు లక్షరరమ్యత నాదరిం  ప నా

నారుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా

భారతసంహితారచనబంధురుఁ డయ్యె జగద్ధితంబుగన్.

(కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును, కవిత్వమందును కల మనోహరాలైనఅర్థాలతోడి కూడికను లోపల తరచి గ్రహించి బాగు,బాగు అని ప్రశంసించగా, సామాన్యులు వీనులకు విందుచేకూర్చే అక్షరాలకూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా, హృద్యమైన అర్థాలతో కూడిన వివిధసుభాషితాలకు నిధానమైన నన్నయభట్టు లోకశ్రేయస్సు కలిగేట్లుగా మహాభారత వేదాన్ని రచించటానికి పూనుకున్నాడు.మహాభారతానికి పంచమ వేదం అనే పేరు కూడా ఉంది. ప్రసన్న కథాకవితార్థయుక్తి,, అక్షరరమ్యత, నానారుచిరార్ధసూక్తినిధిత్వం అనే ఈ మూడూ నన్నయ కవిత్వ లక్షణాలు.

భారత కథా ప్రస్థావన

నైమిశారణ్యంలో శౌనకుడనే మహర్షి పన్నెండు సంవత్సరాలపాటు సాగే సత్రయాగం చేస్తున్నప్పుడు అక్కడికి చేరిన మహాఋషులందరూ రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవసుని చుట్టూచేరి ఆయన దగ్గరనుండి పురాణకథలను వినగోరుతారు. అప్పుడు ఆయన మీరు నానుండి ఏమంచి కథని వినదలచుకున్నారని అడగ్గా వారతనితో--

ఏయది హృద్య, మపూర్వం ! బేయది, యెద్దాని వినిన నెఱుక సమగ్రం

బై యుండు, నఘనిబర్హణ ! మే యది ? యక్కథయ వినఁగ నిష్టము మాకున్.
(ఏకథ మనోహరమో, ఏది క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథను వినటం మాకిష్టం. అని అంటారు) అప్పుడు ఉగ్రశ్రవసుడు వారికి భారతకథను చెప్పటానికి ప్రారంభించి, ఆ కథను కృష్ణద్వైపాయనుడనే పేరుగల వ్యాసమహర్షి రచించాడు అని చెప్పి దానిలోని పర్వాలవివరాలనన్నిటినీ విశదం చేస్తాడు. ఆ మహాభారతం తెలుగులో 18 పర్వాలతో కూడి ఉందని సంగ్రహంగా ఆ యా పర్వాలలోని కథాసంగ్రహాలను వివరిస్తాడు. మహాభారత మాహాత్మ్యాన్ని కూడా చెప్తాడు.
సాత్యవతేయవిష్ణుపదసంభవ మై విభుధేశ్వరాబ్ధిసం
గత్యుపశోభితం బయి జగద్విదితం బగుభారతీయభా
రత్యమరాపగౌఘము నిరంతర సంతతపుణ్యసంపదు
న్నత్యభివృద్ధి సేయు వినినం గొనియాడిన నెల్లవారికిన్.
(సత్యవతీ పుత్త్రుడైన శ్రీమన్నారాయణరూపమైన వ్యాసుని వాక్కునుండి పుట్టి పండితసముద్రం యొక్క స్నేహమనే కలయికచే శోభనొందిన భారతమనే ఆకాశగంగా ప్రవాహం విన్నవారికి ప్రశంసించినవారికీ ఎల్లప్పుడూ సర్వసంపదలనీ కలిగిస్తుంది )  
మహాభారత యుద్ధం పాండవులు(7 అక్షౌహిణులు), కౌరవుల(11 క్షౌహిణులు) మధ్య 18 రోజులపాటు శమంతపంచకం (కురుక్షేత్రం) అనేచోట జరుగుతుంది. కౌరవుల పక్షాన 10 రోజులు భీష్ముడు, 5రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, ఒకరోజు సగానికి శల్యుడు, మిగిలిన సగానికి దుర్యోధనుడు సేనానాయకత్వం వహిస్తారు. పాండవుల పక్షంలో పాండవ పట్టమహిషి యైన ద్రౌపది సోదరుడు దృష్టద్యుమ్నుడు సేనానాయకత్వం వహిస్తాడు. ఒక అక్షౌహిణి అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుఱ్ఱాలు, 109350 కాల్వురు కలిగిన సేనాసమూహం. ఇటువంటి 18 అక్షౌహిణుల సైన్యం భారతయుద్ధంలో పాలుపంచుకున్నది.

ఆదిపర్వం

పరీక్షన్మహారాజు కొడుకైన జనమేజయుడు సుదీర్ఘంగా సాగే సత్త్రయాగాన్ని ప్రారంభిస్తాడు. మహాభారతం ఉదంకోపాఖ్యానమనే కథతో ప్రారంభమవుతుంది. ఈ ఉపాఖ్యానంలో చాలా మంచి పద్యాలు కొన్ని ఉదాహరిస్తాను.

తగు నిది తగ దని యెదలో ! వగవక, సాధులకుఁ బేదవారల కెగ్గుల్

మొగిఁ జేయు దుర్వినీతుల ! కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్. 1-1-85              

(ఈపని యుక్తమయినది, యుక్తమయినది కాదు అని మనస్సులో ఆలోచించకుండానే బీదవారికి, అశక్తులకూ, మంచివారికీ అపకారాలు పూనికతో చేసే నీతిరహితులకు కారణం లేకుండానే ఆపదలు వస్తూ ఉంటాయి.) నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వానికి ఇది ఒక ఉదాహరణం. సరమ అనే దేవలోకంలోని ఆడకుక్క కొడుకు సారమేయుడనేవాడు జనమేజయుడు చేసే సత్రయాగం ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశంలో తిరుగుతుండగా జనమేజయుని కొడుకులు వాడిని కొట్టి బాధిస్తారు. అప్పుడు సరమ జనమేజయునితో పై విధంగా అంటుంది. మరో మంచి పద్యం.

నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా

ఖండల శస్త్రతుల్యము జగన్నుత ! విప్రులయందు; నిక్కమీ

రెండును రాజులందు విపరీతము; గావున విప్రుఁ డోపు, నో

పం డతిశాంతుఁ డయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్. 1-1-100

(లోకం చేత స్తుతించబడినవాడా ! ఉదంకమహామునీ ! బ్రాహ్మణులలో వారి నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది. మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. ఇది నిజం. మనసూ, హృదయమూ అనే ఆ రెండున్నూ రాజులలో అందుకు విరుద్ధంగా ఉంటాయి. అంటే రాజులందు మనస్సు వజ్రతుల్యంగానూ, పల్కు వననీతంగానూ ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడు తాను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోగలుగుతాడు. మిక్కిలి శాంతు డైనా రాజు తన శాపాన్ని ఉపసంహరించుకోలేడు.) ఇది కూడా నన్నయ రుచిరార్థసూక్తినిధిత్వానికి ఉదాహరణమే. ఉదంకుడు గురుపత్నికోరికమేరకు పౌష్యమహారాజు దేవి కుండలాల కోసమని వెళ్ళి నపుడు ఆ పౌష్యుడూ ఉదంకుడూ ఒకరినొకరిని పరస్పరం శపించుకుంటారు. ఉదంకుడు పౌష్యుని తనకిచ్చిన శాపం ఉపసంహరించుకోమని కోరినప్పుడు రాజు అతనితో పైవిధంగా అంటాడు.నన్నయ గారు ఉదంకోపాఖ్యానంలోనే ఉదంకునితో నాగముఖ్యులను తన వశం చేసుకోవటానికై చెప్పిన 4 పద్యాలు 1.బహువన పాదపార్థి 2.అరిది తపోవిభూతి 3. దేవమనుష్యలోకముల 4. గోత్రమహామహీధర అనేవి కూడా బహుళ ప్రచారంలో ఉన్నవీ మరియు కంఠస్థం చేయదగినవీను. ఉదంకుడు జనమేజయునితో ప్రల్లదుఁ డైన యొక్క కులపాంసను చేసినదానఁ దత్కులం బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము?” అని  చెప్పి జనమేజయునికి సర్పయాగ బుద్ధిని పుట్టిస్తాడు. ఇక్కడ భృగువంశకీర్తనమూ, చ్యవనుని చరిత్ర, సహస్రపాదుని వృత్తాంతమూ, గరుడోపాఖ్యానం వగైరా వరుసగా వస్తాయి. ఇక్కడ వచ్చిన ఉదంకోపాఖ్యానమూ, చ్యవన చరిత్ర మరియు గరుడోపాఖ్యానం తరువాత తిక్కన భారతంలో కూడా మళ్ళీ వస్తాయి. దేని అందం దానిదే.
శమీకపుత్త్రుడు పరీక్షితునికి శాపమిచ్చిన ఘట్టంలో శమీకుడు తన కుమారునితో కోపం గుఱించి ఈ విధంగా అంటాడు.

క్రోధమ తపముం జెఱచును:! గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం:

గ్రోధమ ధర్మక్రియలకు ! బాధ యగుం: గ్రోధిగాఁ దపస్వికి జన్నే? 1-2-172

(కోపమే తపస్సును చెడగొడుతుంది. కోపమే అణిమ, లఘిమ మొదలయిన అష్టసిద్ధులను పోగొడుతుంది. కోపమే ధర్మంతో కూడిన కార్యాలకు బాధ కలిగిస్తుంది. కావున తపస్సు చేసే మునికి కోపం కలవాడవటం తగునా ? తగదు.) 

క్షమ లేని తపసితనమును,!  బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్యప్రభురా

జ్యము భిన్నకుంభమున తో ! యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్.1-2-173

( ఓర్పు లేని ముని తపస్సున్నూ, ప్రమాదపడేవాడి ధనమున్నూ, ధర్మం నుండి తొలగిన రాజు రాజ్యమున్నూ, ఇవన్నియు బ్రద్దలయిన కుండలోని నీళ్ళవలె అస్థిరాలవుతాయి.)
కచదేవయాని చరిత్రలో శుక్రుడు చేసిన మద్యపానాన్నిగుఱించి మద్యపానం వల్ల జరిగే నష్టం గుఱించి –

మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్ ! పరఁగ బెక్కు సేసి పడయఁబడిన

యట్టి యెఱుక జనుల కాక్షణమాత్రన ! చెఱుచు మద్యసేవ సేయ నగునె ? 1-3-120

(పూర్వమందలి అనేక జన్మాలలో పుణ్యకార్యాలను ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానం జనాలకు క్షణమాత్రంలోనే పోగొట్టుతుంది మద్యపానం. అట్టి మద్యపానం చేయదగునా? అంటే చేయరాదని తాత్పర్యం.) ఇది కూడా నన్నయగారి మంచి సూక్తి.   

అనుపమ నియమాన్వితులై ! యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే

సినవారికంటె నక్రో ! ధనుఁడ గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్. 1-3-146

(సాటి లేని నియమంతో కూడినవారై గొప్పదక్షిణలతో వేలకొద్దీ యజ్ఞాలు చేసినవారికంటె కోపం లేనివాడే మిక్కిలి గొప్పవాడని పరమార్థం తెలిసినవారు చెప్తారు ) నన్నయ సూక్తి.

అలిగిన నలుగక, యెగ్గులు ! పలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్

పలుకక, బన్నము వడి యెడఁ ! దలఁపక యున్నతఁడె చూవె  ధర్మజ్ఞ్నుడిలన్.1-3-147

(ఇతరులు కోపిస్తే కోపించకుండా, ఇతరులు నిందలు పలికితే మరి వాటిని విననట్లే మారుపలకక, అవమానం పొందికూడా హృదయమందు తలవకుండా ఉన్నవాడే సుమా భూమియందు ధర్మ మెఱిగినవాడు.)

కడు ననురక్తియు నేర్పును ! గడఁకయు, గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్

నొడివెడు వివేకశూన్యుల ! కడ నుండెడు నంతకంటె కష్టము గలదే.1-3-149

(మిక్కిలి అనురాగాన్ని, నేర్పును, పూనికయు, కలవారిని లక్ష్యపెట్టక మేరమీరేటట్లుగా నిందలు పలికేజ్ఞానహీనులవద్ద నివసించేకంటే నైచ్యం వేఱుగా గలదా ! లేదు.) యయాతి చరిత్రలో శర్మిష్ఠ దేవయానిని నూతిలో త్రోసి వెళ్ళినప్పుడు శుక్రాచార్యులు దేవయానిని కోపం తగ్గించుకోమని బ్రతిమాలుతూ చెప్పే ఘట్టంలోవి పై పద్యాలు.
శర్మిష్ఠ తఱువాత యయాతి సంపర్కం కోరి అతను అబద్ధం ఎట్లు ఆడగలనని అంటే అతనితో ఎప్పుడెప్పుడు అబద్ధమాడినా పాపం రాదో వివరిస్తూ చెప్పిన పద్యం క్రిందిది.

చను బొంకఁగఁ బ్రాణాత్యయ ! మున, సర్వధనాపహరణమున, వధ గావ

చ్చిన విప్రార్థమున, వధూ ! జన సంగమమున, వివాహసమయములందున్.1-3-178

భాగవతంలో పోతన గారు కూడా వారిజాక్షులందు వైవాహికములందు –అంటూ ఇటువంటి పద్యాన్నే చెపుతారు.
ఋతిమతి యై పుత్త్రార్థము ! పతిఁ గోరిన భార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన ! యతనికి మఱి భ్రూణహత్య యగు నండ్రు బుధుల్. 1-3-188
(పుష్పవతి యై భర్తను వాంఛించిన భార్యయెడ అనుకూల్యం లేనివాడై ఋతుకాలాన్ని వ్యర్థం చేసినవానికి గర్భస్థశిశువును చంపినపాప మబ్బు తుందని పెద్దలు అంటారు). శుక్రుడు యయాతికి ముసలివాడివి కమ్మని శాపమిచ్చిన ఘట్టం లోనిదీ పద్యం.
తగిలి జరయు రుజయు దైవవశంబున !  నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యారెంటిఁ జే ! కొందురయ్య యెట్టి కుమతులైన. 1-3-193
(ముసలితనాన్ని,రోగాన్నీ విధివశాన కలిగినప్పుడు వాటిని అనుభవిస్తారు. కాని , ఎంతటి బుద్ధిహీనులైనా వాటిని కావాలని గ్రహిస్తారా ? గ్రహించరు). యయాతి శుక్రుని శాపవశంచేత తనకు కలిగిన ముసలితనాన్ని తనకొడుకులలో ఎవరినైనా ధరించి వారి  యవ్వనాన్ని తనకు ఇమ్మని కోరినపుడు వారిలా అంటారు. అదేసందర్భంలో ఇంకో మంచి పద్యం.
నరలు గల కాము నైనను ! దరుణులు రోయుదురు డాయ; ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా ! పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే. 1-3-194
(కుబేరుడైనా కూడా నెరసిన వెంట్రుకలు కలిగిన మన్మథుడి నైనా యవ్వనవతులు సమీపించటానికి అసహ్యించుకుంటారు. పురుషుడు ధనవంతుడైనా కూడా వారింపశక్యం కాని ముసలితనం వలన కలిగే రోత చేత ఇష్టము లైన భోగాలు పొంద వీలు లేనివాడు కాడా !) యయాతి చెప్పినట్లుగా అతని కొడుకులు వినకపోయేసరికి యయాతి
తనయుండు దల్లిదండ్రులు ! పనిచిన పని సేయఁడేని, పలు కెదలోఁ జే
కొనడేని, వాఁడు తనయుం ! డనబడునే ? పితృధనమున కర్హుం డగునే ? అని అంటాడు.
(కొడుకు తల్లిదండ్రులు చెప్పిన పని చేయకపోతే, వారి మాట హృదయంలో అంగీకరించకపోతే అలాంటివాడు కొడుకనిపించుకుంటాడా? తండ్రిసొమ్ముకు తగినవాడు అవుతాడా?)   
శకుంతలోపాఖ్యానం అనబడే భరతుని చరిత్రలో కొన్ని మంచి పద్యాలు.
కణ్వుడు శకుంతలను దుష్యంతుని దగ్గఱకు పంపించేటప్పుడు అన్నమాటలు.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు
పతులకడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె 1-4-66
(ఎటువంటి పతివ్రతలకైనా పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండటం తగదు. భర్తలయొద్ద ఉండటమే భార్యలకు ధర్మము. భార్యలకు భర్తలే ఆధారం)
కలయఁగ బల్కరించి రుపకారులు నై రని నమ్మియుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాథులన్.1-4-70
(రాజులను కలుపుగోలుతనంతో పల్కరించారని, ఉపకారులై వ్యవహరించారనీ చెప్పి బుద్దిమంతులు వారిని నమ్మి ఉండరాదు). శకుంతల దుష్యంతుడు తన యెడల చూపిన నిర్లక్ష్యభావానికి ఇలా అనుకుని వాపోతుంది. ఇంకా
మఱచినఁ దలపింపఁగ నగు;! నెఱుఁగని నాఁ డెల్లపాట నెఱిఁగింప నగున్;
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని కఱటిం ! దెలుపంగఁ గమలగర్భుని వశమే.1-4-72
(మఱచిపోతే గుర్తు చేయొచ్చు, తెలవకపోతే ఎలాగోలా తెలియచేయ వచ్చు. కాని ఎఱిగి ఉండికూడా ఎఱగనట్లు నటించే మోసగాడికి తెలియచెప్పటం బ్రహ్మకు కూడా వశం కాదు)
దుష్యంతుడు సభలో భరతుడిని కుమారుడుగా అంగీకరించనని పలికినప్పుడు శకుంతల చెప్పిన మాటలు. ఎంత అందమైన పద్యమో చూడండి. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం, ఇప్పటికీ గుర్తున్న పద్యం.
నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.1-4-94
(సత్యవ్రతం గల ఓ రాజా ! మంచినీటితో నిండిన చేదుడుబావులు నూఱింటికంటె ఒక దిగుడుబావి మేలు. ఆలాంటి నూఱు దిగుడుబావులకంటె  ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి నూఱు యజ్ఞాలకంటే కూడా ఒక పుత్త్రుడు మేలు. అట్టి పుత్త్రులు నూఱుమంది కంటే ఒక సత్యవాక్యం మేలైనది.)
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్. 1-4-95.
(వెయ్యి అశ్వమేధయాగాల ఫలితాన్ని ఒక ప్రక్క సత్యవాక్యాన్ని ఒక ప్రక్క తాసులో పెట్టి తూస్తే సత్యం వైపే మొగ్గు చూపిస్తుంది).

సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు. 1-4-96


(తీర్థాలన్నింటి సేవనం, వేదాలనన్నింటి అధ్యయనం కూడా సత్యంతో సరికావు. ధర్మాత్ములైన ఋషులు ఎల్లప్పుడు అన్ని ధర్మాలకంటే కూడా సత్యమే గొప్పదని చెపుతారు.దీనిని దృష్టిలో ఉంచుకో.)
శంతన మహారాజు సత్యవతిని చూసి మోహంలో పడ్డప్పుడు

దాని శరీరశౌరభము, దాని విలోల విలోకనంబులున్,

దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్,

దాని విలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం

తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్. 1-4-172


శంతనుడు ఆమె శరీరపరిమళాన్నీ, చలించే కన్నులనూ, అందమైన ఆకారాన్నీ, తెల్లని చిఱునవ్వుతో కూడిన ముఖకాంతినీ, శృంగారహావభావాలనూ సంతోషంతో చూచి మన్మథబాణపరవశుడై ఇలా అంటాడు)
దీర్ఘతముడు గ్రుడ్డివాడు. భార్య ప్రద్వేషిణి. అతనివల్ల ఆమెకు సంతానం బాగా కలుగుతుంది. అయినా ఆమె అతడిని మెచ్చక ఉంటే అతడామెని కారణం అడుగుతాడు. అప్పుడామె అతనితో ఇలా అంటుంది.

పతియు భరియించుఁ గావున భర్తయయ్యె ! భామ భరియింపఁబడుఁగాన భార్య యయ్యెఁ

బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను! నేన యెల్లకాలము భరియింతు గాన. 1-4-228


(భార్యను భరిస్తాడు కాబట్టి మగడిని భర్త అని పిలుస్తారు. భర్తచేత భరింపదగింది కాబట్టి ఇల్లాలిని భార్య అని అంటారు. అది మనపట్ల నేను ఎల్లకాలం నిన్ను భరిస్తూ(పోషిస్తూ) ఉంటాను కాబట్టి వ్యత్యస్తమై పోయింది.)
ఇంక నేను నిన్ను సదా పోషించలేను. ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని చెప్తుంది. ఇలా నిర్దయగా పలికేసరికి దీర్ఘతముడు కోపంతో ఆడవారికందరికీ ఈ క్రింది విధంగా శాపమిచ్చాడు.

పతిహీన లయిన భామిను ! లతిధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం

కృత లయ్యెడు మాంగల్యర ! హిత లయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలుగన్. 1-4-230


(భర్తలను కోల్పోయిన భార్యలు ఎంతటి ధనవతులైనా, ఉత్తమకులాలలో పుట్టిన వారైనా ఇప్పటినుండి దయనీయంగా అలంకారాలు లేనివారుగా, తాళిలేనివారుగా అయ్యెదరు గాక !)ఇది దీర్ఘతముడు ఇచ్చిన శాపం.
ఇక్కడితో మహాభారతం ఆదిపర్వం లోని 4 ఆశ్వాసాలతోకూడిన( టి.టి.డి. వారు ప్రచురించిన) మొదటి పుస్తకం పూర్తయినది.
ఆదిపర్వంలోని మిగిలిన 4 ఆశ్వాసాలు రెండవ పుస్తకంగా ప్రచురించబడినది. దానిలోనికి ప్రవేశిద్దాం, రండి.
తన రెండవ భార్య యైన మాద్రితో వేటకు వెళ్ళిన పాండురాజు రెండు లేళ్ళజంట క్రీడిస్తుండగా వాటిలో మగలేడిని బాణంతో కొడతాడు. అప్పుడు ఆ దెబ్బతిన్నలేడి నేను కిందముడనబడే మునిని. రాజులకు మృగయావినోదం దోషం కాకపోయినా
పఱవనోపక యున్న, మైమఱచి పెంటిఁ ! బెనగియున్నను, బ్రసవింప మొనసియున్నఁ,   
దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ ! రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన. 1-5-53
(పరుగెత్తలేనివి, ఆడుదానితో కూడికొన్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను మాంసం ఆహారంగా జీవించే కిరాతులు కూడా కొట్టరు.) రాజులకు మృగయావినోదం ధర్మమైనప్పటికిన్నీ అన్నివేళలా అది కూడదు. ధర్మాలలో విశేషధర్మాలనేవి కొన్ని ఉంటాయి. పాండురాజుకు కిందముడి శాపం - భార్యను కలిసినప్పుడు మరణిస్తావనేది -  పూర్వకర్మఫలితంగా కవి చెప్పుతున్నాడు. గమనించండి. ఇటువంటి మంచి పద్యాలకోసమే మనం భారతాన్ని చదవాలనేది.
ఎట్టి విశిష్టకులంబునఁ ! బుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్
గట్టిన కర్మఫలంబులు ! నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్ ? 1-5-58
శ్వేతకేతుడనే మహాముని, ఉదంకమహాముని పుత్త్రుడు - తన తల్లి ముట్టయి ఋతుమతిగా ఉన్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్ముడు ఆమెని కోరగా  అది ధర్మవిరుద్ధమని కోపించి శ్వేతకేతుడు స్త్రీ పురుషుల విషయంగా ఈ క్రింది కట్టడిని ఏర్పాటు చేసాడు. అదేంటో చూద్దాం రండి.   
ఇది యాదిగా సతు లెన్నండుఁ బర పురుషార్థినుల్ గాఁ జన; దన్యపురుషు
సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ; బరిగ్రహ భూత లయిన సతుల
కిట్టిద మర్యాద  యి మ్మనుష్యుల కెల్లఁ జేసితి లోకప్రసిద్ధి గాఁగ
నని ధర్మ మైన మర్యాద మానవులకుఁ దద్దయు హితముగా ధర్మమూర్తి
యబ్జ భవ సమానుఁ డగు శ్వేతకేతుండు ! నిలిపె నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్య మై ప్రవర్తిల్లుచు ! నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి 1-5-85
ఇటు వంటి కట్టడులు పూర్వం ఉండిఉండకపోవచ్చు. తఱువాత తఱువాత శ్వేతకేతుని లాంటి పెద్దలు సంఘహితం కోసం ఏర్పఱచి ఉండవచ్చు అప్పటినుండీ
పురుషులచే ధర్మస్థితిఁ ! బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజ పురుష భక్తియుఁ ! బరపురుష వివర్జనంబుఁ బరిచితమయ్యెన్.1-5-87
భర్తచేత నియోగింపఁ బడక సతికి  నెద్దియును జేయఁగాఁ దగఁ  దెద్ది యైన
భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ జేయకునికి దోషం బని చెప్పె మనువు. 1-5-88
పాండురాజు తన శాపకారణంగా పిల్లలను భార్యద్వారా పొందటానికి అవకాశం లేనప్పుడు కుంతికి సూర్యుడిచ్చిన వరం ద్వారా కుంతీ మాద్రిలు సంతానవతు లయ్యే ఘట్టం లోని పద్యాలు ఇవి.
మతిఁ దలఁపఁగ సంసారం  ! బతి చంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు ! గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్. 1-5-159
మనం అతి తఱచుగా వాడే సామెత ఇక్కడినుండి వచ్చిందన్నమాట. ఈమాటలు కృష్ణద్వైపాయనుడు తన తల్లి సత్యవతితో అంటాడు. (ఆలోచించి చూస్తే సంసారం ఎండమావులవలె అతిచంచంలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే రోజులకంటె గడచిపోయిన రోజులే మేలు. ఎందుకో వివరిస్తున్నాడు చూడండి.)
క్రూరులు విలుప్తధర్మా! చారులు  ధృతరాష్ట్ర సుతు లసద్వృత్తులు ని
ష్కారణ వైరులు వీరల ! కారణమున నెగ్గు పుట్టుఁ గౌరవ్యులకున్. 1-5-160
(ధృతరాష్ట్రుని కొడుకులు దుర్మార్గులు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వారి కారణంగా కౌరవవంశానికి కీడు కలుగుతుంది.)

ధనపతితో దరిద్రునకుఁ దత్త్వవిదుం డగు వానితోడ మూ

ర్ఖునకుఁ, బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ

రునకు, వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడఁ గష్ట దు

ర్జనునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే ? 1-5-204

ద్రోణుడు ద్రుపదునితోడి తన బాల్యస్నేహాన్ని పునరిద్ధురించుకుందామని అతని వద్దకు వెళ్ళినప్పుడు ద్రుపదుడు అతనిని పై విధంగా పలికి అవహేళన చేస్తాడు.(ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిఱికివానికి, కవచరక్షణ కలవానితో అది లేనివానికి, సజ్జనునితో దుర్జనునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది ?) --పేదవిప్రులకును ధారుణీశులకుఁ బోలగ సఖ్యము సంభవించునే?—అని పలికి తఱువాత పైవిధంగా అంటాడు. ఈ పద్యం నన్నయ నానారుచిరార్థసూక్తినిధిత్వానికి ఓ మచ్చు తునక. ఇంకా పొడిగింపుగా—

సమశీలశ్రుతయుతులకు !  సమధనవంతులకు సమసుచారిత్రులకుం

దమలో సఖ్యము వివా ! హము నగు గా; కగునె రెండు నసమానులకున్? 1-5-205

(సమానమైన స్నేహం, విద్య కలవాళ్ళకు , సమానమైన సంపద కలవాళ్ళకు, సమానమైన మంచినడవడి కలవాళ్ళకు స్నేహం, వివాహం ఏర్పడతాయి, కాని, సమానులు కానివాళ్ళకు అవి ఏర్పడతాయా? ఏర్పడవని భావం)
వేఁడుటెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్
వేఁడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్
పాఁడి కుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్.1-5-218     
(యాచించటం ఎంతో కష్టమైన పని. అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించటం తగినదే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే, ధనం ఇవ్వలేక పోయినా, అశ్వత్థామ పాలకోసం నాలుగు పాడిగోవులనైనా ఇవ్వకపోతాడా?) అని ద్రోణు డనుకుని వెళ్ళి అడిగి - లేదనిపించుకున్నాడు.

తేజితబాణహస్తు, దృఢదీర్ఘమలీమసకృష్ణదేహుఁ గృ

ష్ణాజినవస్త్రు, నస్త్రవిషయాస్తవిషాదు నిషాదుఁ జూచి యా

రాజకుమారులందఱుఁ బరస్పరవక్త్రవిలోకనక్రియా

వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్. 1-5-235

(పదును పెట్టిన బాణాన్ని చేతపట్టుకొన్నవాడు, దిట్టమైనది, పొడవైనది, మురికిపట్టినది, నల్లనిదీ అయిన దేహాన్ని కలిగినవాడు, జింకచర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు, అస్త్రవిద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుడిని చూచి, ఆ రాకుమారులంతా విపరీతమయిన మాత్సర్యంచేత అతడిని చూడలేక ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు.)

కులము గలవాఁడు, శౌర్యము ! గలవాఁడును, నధికసేన గలవాడును, భూ

తలమున రాజనునామము ! విలసిల్లగఁ దాల్చు మూఁడు విధముల పేర్మిన్. 1-6-47

(కుల మున్నవాడు, శౌర్య మున్నవాడు, అధిక సేనా బల మున్నవాడు భూమిమీద మూడువిధాల రాజనే పేరు గొప్పగా పెట్టుకుంటాడు.) కుమారాస్త్రవిద్యాప్రదర్శన ఘట్టంలో కర్ణుడిని తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి మరీ అర్జునునితో ద్వంద్వయుద్ధం చేయమని కృపాచార్యుడు ఆంక్ష పెట్టినపుడు దుర్యోధను డనిన మాటలివి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా అభిషిక్తుడినిగా చేస్తాడు.తఱువాత భీముడు కర్ణుడిని సూతకులంలో పుట్టిన వానినిగా తెలుసుకుని ఈ క్రింది విధంగా అధిక్షేపిస్తాడు.
ఉత్తమ క్షత్త్రియ ప్రవరోపయోగ్య మైన యంగరాజ్యంబు నీ కర్హ మగునె ?
మంత్రపూత మై గురుయజమానభక్ష్య మగు పురోడాశ మది గుక్క కర్హ మగునె ! 1-6-57
(ఉత్తమ క్షత్త్రియ శ్రేష్ఠునిచేత అనుభవించ దగిం దైన అంగరాజ్యం నీకు అనుభవించ తగిందవుతుందా? గొప్పయజ్ఞకర్త భుజించదగిన యజ్ఞపుపిండివంట కుక్క తినటం తగునా!)
శూరులజన్మంబు సురలజన్మంబును ! నేఱులజన్మంబు నెఱుగ నగునె ?
మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే ! వాసవాయుధ మైన వజ్ర మదియు;
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన ! నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె? శర ! స్తంబజన్ముడు గాఁడె ధర్మవిదుఁడు
గృపుడు ? ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు ! వరుఁడు ద్రోణుండు విప్రులవలనఁ బుట్ట
రైరె సత్క్షత్రియుల్ ఘను లవనిఁ గావఁ ? గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ.
(శూరుల పుట్టుక, దేవతల పుట్టుక, నదుల పుట్టుక తెలిసికొనటం సాధ్యమా? దేవేంద్రుని వజ్రాయుధం దధీచి ఎముకనుండి పుట్టలేదా? గంగ కొడుకుగా, కృత్తికల కొడుకుగా, అగ్ని కొడుకుగా, రుద్రుని కొడుకుగా, రెల్లుపొదలలో జన్మకలవాడుగా కుమారస్వామి పుట్ట లేదా? ధర్మ మెరిగిన కృపాచార్యుడు రెల్లుగడ్డిగంటలో పుట్ట లేదా? కీర్తిమంతుడు, శ్రేష్ఠుడు అయిన ద్రోణుడు కుండలో పుట్ట లేదా? భూమిని కాపాడడానికై ఉత్తమక్షత్త్రియులు బ్రాహ్మణులవలన పుట్ట లేదా? విన్న దానిని బట్టి మీ పుట్టుకలు కూడా ఇట్టివే కదా!) కర్ణుడి జన్మ గుఱించి అవహేళన చేసిన భీమునితో దుర్యోధనుడు అన్నమాటలివి. మొదటి చరణం చాలా ప్రసిద్ధమై అందఱి నోళ్ళలోనూ నానుతుంది.
వీ రెవరయ్య? ద్రుపదమ ! పరాజులె ! యిట్లు కృపణు లయి పట్టువడన్
వీరికి వలసెనె? యహహ!! హారాజ్యమదాంధకార మది వాసెనొకో?.1-6-90
(వీ రెవ రయ్యా?ద్రుపదమహారాజులే!ఈ విధంగా దిక్కులేక పట్టుబడవలసిన పరిస్థితి ఏర్పడిందే? అహహా! మహారాజ్యమదం చేత కలిగిన కన్ను గానని తనం తొలగిపోయిందా!(  ఇది కూడా ఒక ప్రసిద్ధ పద్యం.  అర్జునుడు ద్రుపదుని బందీ చేసి ద్రోణునికి గురుదక్షిణగా తెచ్చినప్పుడు ఆయన ద్రుపదునితో ఎకసెక్కెంగా అన్నమాటలివి. తెలుగునాట ప్రతినోటా తఱచుగా అటువంటి సందర్భాలలో పలుకబడే మాటలు ఇవి.

ఇంక నైన మమ్ము నెఱుగంగఁ నగునొక్కొ!”యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచిపుచ్చె గురుడు; విప్రుల యలుకయుఁ ! దృణహుతాశనంబు దీర్ఘమగునె? 1-6-91
(ఇకముందైనా మమ్మల్ని గుర్తుంచుకోగలరా?’ అని ఎగతాళి చేసి ద్రోణుడు ద్రుపదుడిని విడిచి పెట్టాడు. బ్రాహ్మణుని కోపం, ఎండుగడ్డి మంట ఎక్కువసేపు ఉంటాయా? )
కణికనీతిలోని పద్యాలు కొన్ని—
పలుమఱు శపథంబులు నం! జలియును నభివాదనమును సామప్రియభా
షలు మిథ్యావినయంబులుఁ! గలయవి దుష్టస్వభావకాపురుషులకున్.1-6-112
తన కిమ్మగు నంతకు దు! ర్జనుఁ డిష్టుఁడపోలె నుండి సర్పమపోలెం
దన కిమ్మగుడును గఱచును! ఘనదారుణకర్మగరళఘనదంష్ట్రములన్. 1-6-113
తఱియగునంతకు రిపుఁ దన! యఱకటఁ బెట్టికొనియుండునది; దఱియగుడుం
జెఱచునది ఱాతిమీదను! వఱలఁగ మృద్ఘటము నెత్తి వైచిన భంగిన్. 1-6-115
తన కపకారము మునుఁ జే! సిన జనుఁ డల్పుఁ డని నమ్మి చేకొని యుండం
జన; దొకయించుక ముల్లయి! నను బాదతలమున నున్న నడవఁగ నగునే 1-6-116
ఈ కణికనీతులను కణికుడు దుర్యోధనునికి చెప్పుతాడు. కణికనీతులు కాబట్టి అర్థాలను వ్రాయకుండా వదిలాను.
విదురనీతులు మంచివి. వాటికి అర్థాలను చదువుకుందాం తఱువాత తఱువాత.
విదురుడు ధర్మరాజుతో వారణావతంలో జాగ్రత్తగా మెలగవలసిందని, ప్రమాదాలు కలుగబోతాయని రహస్యంగా చెబుతాడు. ఆ రహస్యసంభాషణం దేని గుఱించని కుంతి ధర్మరాజుని అడగ్గా ఆత డామెతో విదురుని మాటల అర్థాన్ని వివరిస్తూ ఇలా అంటాడు.
ఎల్లకార్యగతులు నెఱుఁగుదు; రయినను! నెఱుఁగ జెప్పవలయు నెఱిఁగినంత;
పనియులేక మిమ్ముఁ బనిచిన కురుపతి! హితుఁడపోలె మీఁద నెగ్గు సేయు. 1-6-147
చేయ దగిన పనుల పద్ధతు లన్నింటిని మీ రెరుగుదురు. అయినా నాకు తెలిసినంతవఱకు మీకు తెలియచెప్పాలి. ఏ పనీ లేకుండా మిమ్ములను వారణావతం పంపించే ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడివలె ఉండి తర్వాత కీడు చేస్తాడు.
రమణి నిజభాతృనియో ! గము దలఁపక యపుడు భీముఁ గదిసెఁ; బతిస్నే
హమ కామినులకు బలవం ! తము; పెఱనెయ్యములు వేయుఁ దత్సదృశములే? 1-6-191
(హిడింబ తన అన్న ఆజ్ఞను మరచి భీముడిని కూడుకొన్నది. కాంతలకు భర్తమీది స్నేహమే బలమైనది. తక్కిన స్నేహాలు వెయ్యి అయినా దానితో సమానాలు కావు.) అంతేకదా మరి. కాని భీముడు మటుకు ఆమె కిలా అంటాడు.
విను బేల యెట్టి కష్టుఁడుఁ! దన పురుష గుణంబు సెడఁగఁ దల్లినిఁ దోఁబు
ట్టినవారి విడిచి రాగం! బునఁ జపల స్త్రీ సుఖంబుఁ బొందునె చెపుమా. 1-6-197
(అమాయకురాలా! ఎంతటి నీచు డైనా తన పురుష లక్షణం పోగొట్టుకొని – తల్లిని, తోబుట్టువులను వదలి మోహంలో పడి చంచలమైన స్త్రీ సుఖాన్ని పొందుతాడా ! చెప్పుము.); చూశారా, ఎంత బాగా చెప్పాడో!
వధకు నర్హుఁ డై వచ్చినవానిఁ జంపి ! తదియు ధర్మువ; యిది చాల నబల దీని
కలుగఁజన; దాత్మరక్షకు నగ్గలంబు ! ధర్మ రక్షయ యుత్తమ ధార్మికులకు.1-6-220
(చంపదగినవాడిని చంపావు. అది ధర్మమే. ఈ హిడింబ అబల. దీని మీద కోపపడ కూడదు. ఉత్తములైన ధర్మాత్ములకు ఆత్మరక్షణ కంటె ధర్మరక్షణమే ముఖ్యం.) అని ధర్మరాజు భీమునితో అంటాడు. ఈ పద్యం కూడా నన్నయ సూక్తి నిధిత్వానికి ఒక ఉదాహరణ. అని ఇంకా –
ఆపద యైనను ధర్మువ ప్రాపుగ రక్షింపవలయుఁ బరమార్థము ధ
ర్మాపాయమ ధార్మికులకు నాపద జన్మాంతరమున ననుగత మగుటన్.1-6-221
(తనకు ఆపద కలిగినా ధర్మాత్ములు ధర్మాన్నే రక్షించాలి. ఇది నిజం. ఎందుచేత నంటే ఇంకొక జన్మలో కూడ వెంటవచ్చేది కావటంచేత ధర్మం చెడిపోవటమే ధర్మాత్ములకు నిజమైన ఆపద.) భారతంలో ఇలా అడుగడుగునా ధర్మ పరిరక్షణ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందుకే మనమందరం భారతాన్ని చదవాలని అనేది. ఇంకో బంగారు మొలక---
కృత మెఱుఁగుట పుణ్యము;! న్మతి దానికి సమముసేఁత మధ్యము; మఱి త
త్కృతమున కగ్గలముగ స ! త్కృతిసేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్. 1-6-244
ఏకచక్రపురంలో విప్రుని ఇంటిలో కష్టం కలిగి వారంతా బాధపడుతున్నప్పుడు కుంతీదేవి భీమునితో పై విధంగా అంటుంది. బకునికి ఆహారంగా పోవాల్సివచ్చినపుడు బ్రాహ్మణకుటుంబం వారు ఈ క్రింది విధంగా అనుకొంటారు. ఎంత మంచి పద్యాలో చూడండి.
నలసారము సంసార మ ! ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం
చలము పరాధీనం బిం ! దుల జీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్. 1-6-248
(సంసారం గడ్డివలె నిస్సార మైనది. దుఃఖాన్ని కలిగించేది. భయానికి స్థానమైనది. మిక్కిలి చంచల మైనది. ఇతరులకు లొంగేది. పండితు లైనవాళ్ళు ఈ సంసార జీవనం సత్యమైన దని ఎట్లా నమ్ముతారు ?)
ఆదిని సంయోగవియో! గాదిద్వంద్వములు దేహి యగు వానికి సం
పాదిల్లక తక్కవు పూ! ర్వోదయ కర్మమున నెట్టి యోగికి నైనన్.1-6-249
( ఎంత యోగికైనా – ఏ మానవుడికైనా – పూర్వజన్మకర్మ వలన కలవటం, విడిపోవటం అనే ద్వంద్వాలను అనుభవించటం తప్పదు.)
మనుజులకు నెవ్విధంబున ! ననతిక్రమణీయ మైన యాపద్విషయం
బున సంతాపింపఁగఁ జన ! దని యెఱిఁగియు నగునె యెట్టు లని శోకింపన్.1-6-254
(మానవులకు ఏవిధంగాను దాటరాని దైన ఆపద విషయంలో శోకించ గూడ దని తెలిసికూడ, ఎట్లా అని శోకించవచ్చా? కూడదని భావం.)
పురుషుకంటె మున్ను పరలోక మేఁగిన ! సతియ నోఁచినదియు సతులలోనఁ;
బురుషహీన యైనఁ బరమపతివ్రత ! యయ్యు జగముచేతఁ బ్రయ్యబడదె. 1-6-256
(భర్తకంటె ముందు మరణించిన భార్యే పతివ్రతలలో మిక్కిలి పుణ్యాత్మురాలు. పరమ పతివ్రత అయినా భర్త లేని స్త్రీ లోకంచేత నింద పొందుతుంది గదా!)     
పడిన యామిషంబు పక్షు లపేక్షించు నట్లు పురుషహీనయైన యువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు రిదియుఁ బాప మనక హీనమతులు. 1-6-257
(క్రిందపడిన మాంసం ముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన స్త్రీని చూచి నీచులు ఇది పాప మని అనుకోక తేలికగా ఆమెను కోరతారు.)
ధృతి సెడి వేడెడువానిని ! నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడబడు దు! ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 1-6-274
( ధైర్యాన్ని కోల్పోయి ప్రార్ధించేవాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయపడేవాడిని. శరణు కోరి వచ్చిన వాడిని చంపాలనుకొనే దుర్మార్గునికి ఇహలోక పరలోక సుఖ ముంటుందా! ఉండదు.)
ఖలు నసుర నోర్వ నోపెడు ! బలయుతుఁగా నెఱిఁగి కొడుకు బనిచెదఁ గా; కి
మ్ముల శతపుత్త్రులు గల ధ ! న్యుల కైన ననిష్టుఁ డగు తనూజుఁడు గలఁడే? 1-6-277
(దుర్మార్గుడైన రాక్షసుడిని చంపగల బలవంతు డని తెలిసే నా కుమారుడిని పంపుతున్నాను. కాకుంటే వందమంది కొడుకులున్నవాళ్ళ కయినా ఇష్టం కాని కొడుకు ఉంటాడా?) అని కుంతీ దేవి అంటుంది వారితో.
కుంతి ధర్మరాజుకు పరదుఃఖ నివారణ పరమ ధర్మం అని చెబుతుంది ఈ క్రింది పద్యంలో.
ఉత్తమక్షత్త్రియుం డొరులదుఃఖంబులు ! దలఁగంగఁ బుట్టిన ధర్మశీలుఁ;
డలయక మృత్యుభయం బైనచో విప్రుఁ ! గాచి సత్పుణ్యలోకములు వడయు;
ధన్యుఁ డై క్షత్త్రియు దయఁ గాచి బుధలోక ! కీర్తనీయంబగు కీర్తి వడయు;
వైశ్యశూద్రులఁ గాచి వసుధాతలస్థిత ! సర్వప్రజానురంజనము వడయు;

ననఘ ! సన్మునీంద్రుఁ డయిన వేదవ్యాసు వలన దీని నిక్కువముగ వింటి;
బ్రాహ్మణులకుఁ బ్రియము పాయక చేయంగఁ ! గాన్పచూవె పుణ్యకర్మఫలము. 1-6-286
(ఉత్తమక్షత్రియుడు ఇతరుల దుఃఖాలు తొలగించటానికి పుట్టిన ధర్మశీలుడు, ఆలస్యం చేయక మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుడిని కాపాడితే అతడు పుణ్యలోకాలు పొందుతాడు. ధన్యుడై క్షత్రియుడిని దయతో రక్షిస్తే పండితులచేత ప్రశంసింపదగిన కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే భూమండలంలో ప్రజ లందఱి అనురాగాన్ని పొందుతాడు. ఈ విషయం మునిశ్రేష్ఠుడైన వేదవ్యాసుడు చెప్పితే విన్నాను. బ్రాహ్మణులకు ఇష్టమైనది తప్పక చేయచూడటమే సుమా మహాపుణ్యఫలం.) ఇంకా ఇలా అంటుందామె.
జననుత బ్రహ్మణకార్యము సనఁ జేసిన బ్రాహ్మణప్రసాదంబున నీ
కును నీ తమ్ములకును నగు ననవరతశ్రీసుఖాయురైశ్వర్యంబుల్. 1-6-287
(బ్రాహ్మణకార్యం పూర్తి చేస్తే వారి అనుగ్రహం వలన నీకు, నీ తమ్ములకు అంతులేని సంపద, సుఖం, ఆయువు, ప్రభుత కలుగుతాయి.)
ఇంతుల గోష్టి నున్నయతఁ డెంత వివేకము గల్గెనేని య
త్యంత మదా భిభూతుఁ డగు; ధర్మువు దప్పుఁ; బ్రియం బెఱుంగఁ; డే
నెంత వివేకి నయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్;
వింతయె ? కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్! 1-7-59
పాండవులు పాంచాలదేశానికి వెళ్తుండగా దారిలో అర్జునునిచేత అంగారపర్ణు డనబడే గంధర్వుడు జయింపబడి ఎందుచేత మమ్మల్ని అధిక్షేపిస్తూ మాట్లాడావని అతనిని  పాండవులు అడుగగా అతడిట్లా అంటాడు. (స్త్రీల గోష్టిలో ఉండేవాడు ఎంత వివేకి అయినా, అహంకారపూరితు డౌతాడు. నేను వివేకం గలవాడినే అయినా నిగ్రహం కోల్పోయి, భార్యల యెదుట మీతో ఆ విధంగా మాట్లాడాను. ఇది అసహజం కాదుగదా ! మన్మథునిశక్తిని అణచటం ఎంతవారికైనా సాధ్యమా ?
అనవద్యు వేదవేదాంగ విశారదు ! జప హోమ యజ్ఞ ప్రశస్తు సత్య
వచను విప్రోత్తము వర్గ చతుష్టయ ! సాధన సఖు సదాచారు సూరి
సేవ్యుఁ బురోహితుఁ జేసిన భూపతి ! యేలు నుర్వీతలం బెల్ల; నిందుఁ
బరలోకమునఁ బుణ్యపరుల లోకంబులు ! వడయు; జయస్వర్గఫలము సూవె

రాజ్య; మదియు నుర్వరాసుర విరహితుఁ ! డయిన పతికిఁ గేవలాభిజాత్య
శౌర్యమహిమఁ బడయ సమకూరునయ్య తా! పత్య! నిత్యసత్యభాషణుండ!1-7-61
(తపతికి సంబంధించిన వంశంలో జన్మించినవాడా ! నిత్య సత్యభాషీ ! అర్జునా ! ఏ లోపం లేనివాడిని, వేద వేదాంగాలలో పండితుడిని, జప హోమ యజ్ఞాలు చేయటంచేత ప్రసిద్ధు డైన వాడిని, సత్యభాషిని, బ్రాహ్మణశ్రేష్ఠుని, ధర్మార్థకామమోక్ష సాధనలో మిత్రుడిని, మంచినడవడిక గల వాడిని పురోహితుడుగా చేసికొన్న రాజు, ఈ లోకంలో భూమండలమంతా పరిపాలిస్తాడు; పరలోకంలో పుణ్యగతులు పొందుతాడు; జయం, స్వర్గం రాజ్యం వలన లభిస్తాయి. బ్రాహ్మణుడు లేకుండా  కేవలం వంశ పరాక్రమాల గొప్పదనంచేతనే అటువంటి ఫలాన్ని పొందటం రాజుకు సాధ్యం కాదు.) ఈ పద్యం రాజ్యవ్యవస్థలో పురోహితుని ప్రాధాన్యాన్నీ, అతని యోగ్యతలనీ వివరిస్తుంది.

వేదాలు -4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. వేదాంగాలు – 6.శిక్ష(పాణిని), వ్యాకరణం(పాణిని), ఛందం(పింగళముని), నిరుక్తం(యాస్కుడు), జ్యోతిషం( ఆదిత్యాదులు), కల్పం(అశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబాదులు)   
వివాహాలు – 8. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైశాచం.
విశ్వామిత్రుడు వశిష్ఠుని నందినిని తనకిమ్మని, లేనిచో బలవంతంగా తీసుకుని పోతానని బెదిరించగా వసిష్ఠుడు మారుమాట్లాడకుండా చూస్తుంటాడు. అప్పుడు నన్నయ గారిలా అంటారు.
పరులవలన బాధ పొరయకుండఁగ సాధు ! జనుల ధనము గాచు జనవిభుండు
కరుణ తప్పి తాన హరియించువాఁ డగు ! నేని సాధులోక మేమి సేయు ? 1-7-104
కల్మాషపాదుడు వశిష్ఠుని చూడబోగా మార్గమధ్యంలో అతని కెదురుగా వచ్చుచున్న వశిష్ఠ పుత్త్రుడైన శక్తి మహామునిని దారిలోనుండి అడ్డు తొలగమని రాజగర్వంతో  కల్మాషపాదుడు పలుకగా శక్తి మహాముని అతనితో ఈ విధంగా అంటాడు.
ఎట్టి రాజులును మహీసురోత్తము లెదు ! రరుగుదెంచు నప్పు డధికభక్తిఁ
దెరలి ప్రియము వలికి తెరువిత్తు రిట్టిద ! ధర్ము; వీవు దీనిఁ దలఁప వెట్టు? 1-7-112
నన్నయ రుచిరార్థసూక్తి.
షడంగాలు -6. అనుద్రుతం, ద్రుతం, లఘువు, గురువు, ప్లుతం, కాకపాదం.
ఎఱుక గలఁడేని మఱి శక్తుఁడేని యన్యు!  లన్యులకు హింస గావించునపుడు దానిఁ
బూని వారింపకున్న నప్పురుషుఁ డేగుఁ ! హింస చేసినవారల యేఁగుగతికి. 1-7-146
నన్నయ రుచిరార్థసూక్తి.
ఫలపవనాంభోజన శుభవ్రతవృత్తులఁ జేసి చూడ దు
ర్బలతను లయ్యు బ్రాహ్మణు లపారతపోబలసంపదన్ మహా
బలయుతు లట్టి వారలకు భవ్యుల కెందు నసాధ్య మెద్దియుం
గలదె చరాచరాఖిలజగంబులఁ బెద్దల కారె సద్ద్విజుల్. 1-7-184
(బ్రాహ్మణులు ఫలాలను, గాలిని, నీటిని భక్షించటంచేత, పుణ్యవ్రతాలు చేయటంచేత, చూడటానికి బలహీనమైన దేహం కలవాళ్ళయినా, అపార తపోబల సంపదచేత వాళ్ళు మహాబలవంతులు. అటువంటి మహనీయులకు ఎక్కడా అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్త చరాచర లోకాలలో సద్బ్రాహ్మణులే గొప్పవాళ్ళు గదా!) ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినపుడు నన్నయ బ్రాహ్మణులను మెచ్చుకొన్న తీరు.
పరశురాముఁ డొండె హరుఁ డొండె నరుఁ డొండె ! గాక యొరులు గలరె కర్ణు నోర్వ!
బలిమి భీముఁ డొండె బలదేవుఁ డొండెఁ గా ! కొరులు నరులు శల్యు నోర్వఁ గలరె! 1-7-205.
ద్రౌపదీ స్వయంవరానంతరం జరిగిన యుద్ధంలో కర్ణుని శకుని ల ఓటమి గుఱించి ప్రజలు అనుకొన్న మాటలు.
ఒక్క పురుషునకు భార్యలు పెక్కం డ్రగు టెందుఁ గలదు పెక్కండ్రకు నా

లొక్కత యగు టే యుగముల నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్. 1-7-244.

పాండవులు ఐదుగురూ కూడా ద్రౌపదిని వివాహమాడతామని, మా తల్లి ఆదేశమూ అదేనని ధర్మరాజు ద్రుపదునితో అన్నప్పుడు ఆయనన్నమాటలు. వ్యాసుని ఎదురుగా ధర్మరాజు ద్రుపదునితో ఇలా అంటాడు.

నగియును బొంకునందు వచనంబు నధర్మువునందుఁ జిత్తముం

దగులదు నాకు నెన్నఁడును; ధర్ము వవశ్యము; నట్ల కావునన్

వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం

దగ దను నీ విచారములు దక్కి వివాహ మొనర్పు మొప్పుఁగన్. 1-7-252

(నవ్వులాట కైనా నా మాట అసత్యంలో, నా మనస్సు అధర్మంలో ఎన్నడూ తగులుకొనదు. ధర్మం ఆ విధంగానే ఉన్నది. అందువలన పద్మాలవంటి కన్నులు కల ద్రౌపదిని ఇవ్వదగును, ఇవ్వకూడదు అని ఆలోచించడం మానుకొని, బాధపడకుండా మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించుము.)
కీర్తి లేని వానికిని జీవనంబు ని ! రర్థకంబ చూవె! యవనిమీద
నిత్య మయిన ధనము నిర్మల కీర్తియ;! యట్టి కీర్తి వడయు టశ్రమంబె?1-8-31
భీష్మద్రోణులు దుర్యోధనుడికి బుద్ది చెప్పే ఘట్టంలోని దీ పద్యం. (కీర్తి లేనివాని బ్రతుకు వ్యర్థమే. భూమిమీద శాశ్వత మైన ధనం స్వచ్ఛమైన కీర్తే. అట్లాంటి కీర్తిని పొందటం సులభమా?)
ఇలఁ గీర్తి యెంత కాలము ! గలిగి ప్రవర్తిల్లె నంతకాలంబును ని
త్యుల కారె కీర్తి గల పు! ణ్యులు; కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే. 1-8-32
(లోకంలో కీర్తి ఎంత కాలం నిలిచి ఉంటుందో, కీర్తిమంతు లైన పుణ్యాత్ములు అంత కాలం జీవించి ఉంటారు. కీర్తి లేని వాడు ఎక్కడైనా పూజార్హు డవుతాడా? )
సుందోపసుందులు పరస్పరం కలహించుకొని యమపురికి పోయినప్పుడు
అన్యోన్యప్రియభాషణు ! లన్యోన్యహితైషు లసుర లన్యులపోలెన్
మన్యుపరిప్రేరితు లై ! యన్యోన్యాభిహతిఁ జనిరియమపురమునకున్. 1-8-113
(ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడేవాళ్ళు, ఒకరి మేలు ఒకరు కోరేవాళ్ళు అయిన ఆ రాక్షసులు (సుందోపసుందులు) పరాయివాళ్ళవలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు.) మన్యుపరిప్రేరితులు=కోపంచేత మిక్కిలి ప్రేరేపింపబడినవాళ్ళయి . అన్యోన్య అనే పదం ఎంత బాగా ఉపయోగించారో గమనించారా?
ఇంతుల నిమిత్తమున ధృతి! మంతులుఁ బొందుదురు భేదమతి గావున మీ
రింతయు నెఱింగి యొండులు! చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్. 1-8-114
ఈ సుందోపసుందుల కథను పాండవులు ఐదుగురు కలసి ద్రౌపదిన భార్యగా వరించినప్పుడు వారిలో వారికి ద్రౌపది మూలంగా కలహాలు ఉత్పన్నం కాకుండా వుండే నిమిత్తం నారదులవారు చెప్పటం జరిగింది.
భూజనపరివాదం బ ! వ్యాజంబునఁ బరిహరింపవలయును మనకున్
వ్యాజమున ధర్మలోపం ! బాజిజయా ! పరిహరింతురయ్య మహాత్ముల్.1-8-123
(యుద్ధంలో జయించే ఓ ధర్మరాజా ! అకారణంగా భూజనులవలన కలిగిన నింద నైనా మనం తొలగించాలి. అటువంటప్పుడు ఏదో సాకుపెట్టి మహాత్ము లైనవాళ్ళు ధర్మం తప్పటాన్ని త్రోసిపుచ్చుతారా!) ఇది నన్నయ రుచిరార్థసూక్తి. అర్జునుడు ద్రౌపది విషయంలో వారిలో వారేర్పరచుకున్న నియమాన్నివారే రాజులయి ఉల్లంఘించరాదని చెప్పి 12 నెలలు తీర్థయాత్రలు చేయటానికై వెళతాడు. ఆ సందర్భంలోని పద్యం ఇది.
అంగజరాజ్యలక్ష్మి పొడవైనదియొక్కొ యనంగ నొప్పు చి
త్రాంగదయందుఁ బార్థుఁడు మహా ప్రణయప్రవణాంతరంగుఁ డై
యంగజభోగసంగమున నమ్మణిపూరపురిన్ సమస్తలో
కాంగణరంగసంగతవిహారయశోంగదుఁ డుండె లీలతోన్. 1-8-146
(మన్మథుని రాజ్యలక్ష్మి రూపుదాల్చిందా అన్నట్లు మహాసౌందర్యవతి అయిన చిత్రాంగద మీద తగులుకొన్న మనస్సుతో, మన్మథభోగా లనుభవిస్తూ , కీర్తివంతు డైన పార్థుడు మణిపూరపురంలో విలాసంతో ఉన్నాడు.) బిందుపూర్వక గ కారం ప్రాస స్థానంలోనే కాకుండా పద్యమంతటా విస్తరించి నన్నయ అక్షరరమ్యతకు ఉదాహరణంగా నిలుస్తోంది.
ధృతిహీనులచిత్తము ల ! ట్లతివలయం దేల తగులు నత్యంతదృఢ
వ్రతుల మనంబులు వారల ! మతులఁ దృణస్త్రైణములఁ సమంబులు కావే.1-8-157
(మనోనిగ్రహం కలవాళ్ళమనస్సులు, నిగ్రహం లేనివాళ్ళ మనస్సులవలె స్త్రీల విషయంలో ఎందుకు తగులుకుంటాయి ? నిగ్రహపరుల దృష్టిలో స్త్రీలు, గడ్డిపరకలు సమానములే కదా!) వంద, సౌరభేయి, సమీచి, బుద్బుద,లత అనే అప్సరసలు శాపవశాన మొసళ్ళ రూపంలో 5 సరస్సులలో ఉండగా వారందరినీ అర్టునుడు బయటికి లాగి శాపవిముక్తులను చేసే ఘట్టంలో వారికి మునీశ్వరులిచ్చిన శాపం గుఱించి చెప్తూ ఆ మునీశ్వరుల గుణాలను వంద అర్జునునికి వర్ణించి చెప్పినప్పటి పద్యం.
ఎంత తపం బొనరించియు ! సంతానము లేనివారు సద్గతిఁ బొందం
గాంతురె ? నీతప మేటికి ! సంతానమువడయు మరిగి సన్మునినాథా! 1-8-299
మందపాలోపాఖ్యానం లోని పద్యం ఇది. మందపాలుడు నేనెన్ని తపస్సులు చేసినాగానీ నాకు పుణ్యలోకాలు లేకుండటానికి కారణమేమిటి అని అడిగినప్పుడు దేవతలు అతనికిలా చెపుతారు.
ఇక్కడితో ఆది పర్వంలోని రెండవ సంపుటం సంపూర్ణం అయింది. తరువాత సభాపర్వ ప్రవేశం.
  (ఇది మొదటగా పుస్తకం.నెట్ లో ప్రచురితమైంది)