Showing posts with label అరణ్య పర్వము. Show all posts
Showing posts with label అరణ్య పర్వము. Show all posts
Unknown
అరణ్య పర్వము- ప్రథమాశ్వాసము-9
భీమసేన ధర్మరాజుల సంవాదము
ఆ.
బాహుబలము మెఱసి పరులసంపదలు సే, కొనఁగ లావు లేనికుత్సితుండు
నియత దుఃఖవృత్తి నిర్వేదపరుఁడగుఁ, గాక నీకుఁ దగునె? కౌరవేంద్ర.౨౪౧
తే.
తగిలి నిత్యంబు నేకాంతధర్మ నిరతుఁ, డగుట యుక్తమె పురుషున కట్టివాని
వెలయ ధర్మకామంబులు విడుచుఁ బ్రాణ,విగతుసుఖదుఃఖములు రెండు విడుచునట్లు.౨౪౪
ధర్మ కామములు అని కాక అర్ధ కామములు అని వుండాలేమో అని ఓ చిన్న సందేహం.
సీ.
ధర్మ కామంబులు దఁఱుగంగ నర్థార్థి యగువాఁడు పతితుఁ డౌ నర్థ సేవ
నర్థార్థముగఁ జేయునతఁ డుగ్రవనములో గోరక్ష సేయునక్కుమతిఁ బోలు
నర్థధర్మములకు హానిగాఁ గామార్థి యగునాతఁ డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు నట్లు కామంబుతో హాని బొందు
ఆ.
నర్థధర్మములు మహాబ్ధిమేఘములట్టు, లుభయమును బరస్పరోదయమ్ము
లిట్లు గాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే, వించువాఁడు సర్వ విత్తముండు.౨౪౫
వ.
భవదాచరితం బైన యీధర్మం బర్థకామంబులక కాదు నీకును నీ బాంధవులకును బాధాకరంబు దాన యజ్ఞ సత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు జగంబులు ధర్మమయంబులు ధర్మువునకు మిక్కిలి యొం డెద్దియు లే దయినను నర్థార్థంబు గానిధర్మువు క్షత్రియుల కయుక్తంబు.౨౪౬
ఉ.
శత్రుల నాజి నోర్చుటయు సర్వ భయంబులఁ బొంద కుండఁగా
ధాత్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాచుటయుం బ్రియంబుతోఁ
బాత్రుల కర్థ మీగియును బ్రాహ్మణపూజయుఁ జువ్వె యుత్తమ
క్షత్రియధర్మముల్ సుగతికారణముల్ విపులార్థమూలముల్.౨౪౭
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
సీ.
క్రోధంబు పాపంబు గ్రోధంబునన చేసి యగుఁ ధర్మ కామార్థహాని
కడుఁ గ్రోధి కర్జంబు గానండు క్రుద్ధుండు గురునైన నిందించుఁ గ్రుద్ధుఁ డై న
వాఁడవధ్యుల నైన వధియించు మఱియాత్మఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ
ఆ.వె.
యెఱుక గల మహాత్ముఁ డెఱుక యన్జలముల, నార్చుఁ గ్రోధ మను మహానలంబు
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు, దాల్చు దేశకాలతత్వ మెఱిఁగి.౨౨౨

క్రోధం - పాపం. దానివలన ధర్మ,అర్థ,కామాలకు హాని కలుగుతుంది. ఎక్కువ కోపి యైనవాడు కార్యముపై దృష్టి పెట్టలేడు, గురువు నైనా నిందిస్తాడు, వధింపగూడని వారిని వధిస్తాడు, చివరకు తనకు తానే హాని చేసుకుంటాడు. మావంటి ధర్మాన్ని అనుసరించే వారికి క్రోధాన్ని దాల్చటం గుణమా? క్రోధమనే గొప్ప అగ్నిని ఎఱుక అనే జలంతో ఎఱుక గలిగిన మహాత్ములు ఆర్పివేస్తారు. దేశకాలతత్వాన్ని ఎఱిగి క్రోధవర్జితు డైనవాఁడు తేజస్సును పొందుతాడు.
క.
క్షమ గలవానికిఁ బృథ్వీ,సమునకు నిత్యంబు విజయసంసిద్ధి యగున్
క్షమ యైనవానిభుజవి,క్రమము గడున్ వెలయు సర్వకార్యక్షమ మై.౨౨౩

క్షమకలవాడు భూదేవితో సమానుడు వానికి ఎప్పుడూ విజయం చేకూరుతుంది. సర్వ కార్యములయందును క్షమాగుణము కలవాని భుజవిక్రమము ప్రకాశిస్తుంది.
వ.
తేజః ప్రభవంబు లైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబు లగుఁ దొల్లి కశ్యపగీత లైన గాథలయం దీయర్థంబు వినంబడు వినుము వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగ మంతయు క్షమయంద నిలిచినవి తప స్స్వాధ్యాయయజ్ఞ కర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదురు.౨౨౪
అమర్ష=కోపము
ఇలా చెప్పి ద్రౌపది ఇంకా వాదానికి దిగితే ఆమెతో ధర్మరాజు
వ.
నాస్తికులయట్లు ధర్మాభిశంకిని వై దైవదూషణంబు సేసెదు శిష్టచరితం బయిన ధర్మంబు నధిక్షేపించు చున్న దుర్మతికిం బ్రాయశ్చిత్తంబు లేదు ధర్మువు దప్పక నిత్యులై జీవించు చున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారదప్రభృతులం బరమ యోగధరులం బ్రత్యక్షంబ చూచెదము వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు రన్యు లన్యాయంబు సేసి రనియు నే నేల ధర్మువు దప్పుదు.౨౨౮
క.
ధీరమతియుక్తిఁ జేసి వి,చారింపఁగ నిక్కువంబు సర్వజనస్వ
ర్గారోహణసోపానం, బారఁగ ధర్మంబ చూవె యతిరమ్యం బై.౨౨౯

అదీ ధర్మరాజు ధర్మ నిరతి. అందుకేనేమో స్వర్గారోహణ పర్వం చివరలో ధర్మరాజు మాత్రమే వెంట వచ్చిన కుక్కతో కలసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలగటం జరుగుతుంది.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭

ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
వ.
క్షమయును దేజంబును నయ్యయి కాలంబులఁ బ్రయోగింప నేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు లే వను నీయర్థం బితిహాసంబున వినంబడు క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిని నిర్ణయించి చెప్పుమని బలీంద్రుండు తొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.౨౧౬
ఆ.వె.
క్షమయ తాల్చియుండఁజన దెల్లప్రొద్దుఁ దే, జంబ తాల్చి యుండఁజనదు పతికి
సంతత క్షముండు సంతత తేజుండు, నగుట దోష మందు రనఘమతులు
.౨౧౭
వ.
ఎట్లనిన నిత్యక్షమాన్వితుం డయినవానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు ర ర్థంబులయం దధికృతుం డైన వాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతం బైన సర్పంబునుంబోలె నెప్పుడు నుద్వేగకరుండగుం గావున గాలోచితంబుగా క్షమాతేజంబులు గల్పించునది యథాకాల కల్పితక్షమాతేజుం డైన వానికి నుభయలోకసిద్ధి యగు నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె.౨౧౮
క.
ఇది తేజంబున కవసర, ముదితక్రోధుండ వగుమ యొక్కించుక దు
ర్మదు లగు సుయోధనాదుల, నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్
.౨౨౦
వ.
అనిన ధర్మరాజిట్లనియె.౨౨౧
భారత ఇతిహాసం లో మనకందరికీ ఏరుకున్నవారికి ఏరుకున్నన్ని నీతులు కుప్పతిప్పలుగా తటస్థపడు తుంటాయి. మనదే ఆలస్యం. రండి మనందరం కలసి రత్నాల్ని ముత్యాల్ని ఏరుకొని భద్రపరచుకుందాం.
Unknown
అరణ్య పర్వము-ప్రఠమాశ్వాసము-౬

ద్రౌపది శ్రీకృష్ణునితో దనపరిభవంబు సెప్పి దుఃఖించుట
వ.
అఖిలరాజలోక పరివృతుం డయి యున్న నారాయణు నొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్రి ముకుళితకరాంబుజ యయి నిన్ను నాది ప్రజాసర్గంబునఁ బ్రజాపతివని యసితుండయిన దేవలుండును, సత్యంబు వలన యజ్ఞం బుద్ధరించుటం జేసి నిత్య సత్య మయుండ వయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, శిరంబున దివంబును బాదంబుల మేదినియును లోచనంబుల సూర్యుండును నవయవంబుల లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వ మయుండవని నారదుండును నక్షయజ్ఞాననిధి వని సర్వమునిముఖ్యులును జెప్పిరి.౧౩౩
వ.
నీ యంతఃకరణప్రవృత్తి కగోచరం బెద్దియు లే దయినను నా పడినపరాభవం బెఱింగించెద.౧౩౫
సీ.
పార్థివప్రభుఁ డైన పాండుమహీపతికోడల నయి యుద్ధకుశలు లయిన
పాండుతనూజుల భార్య నై పూజ్యుఁడ వైన నీయనుజనై యధికశక్తిఁ
బరఁగుధృష్టద్యుమ్ను భగిని నై ధృతరాష్ట్రుపట్టిచే సభఁ దల పట్టియీడ్వఁ
బడి పాపకర్ముచేఁ బరిధాన మొలువంగఁ బడి దారుణం బైన పరిభవంబు
ఆ.వె.
పడితి నట్టి నన్నుఁ బాండవుల్ సూచుచు, నుండి రొరులువోలె నుక్కుదక్కి
యాపగాతనూజుఁ డాదిగాఁ గలవృద్ధ,బంధుజనులు సూచి పలుక రయిరి.౧౩౬
వ.
భ్రాతృపుత్రబంధుజనంబులు నాకుం గలిగియు లేనివా రయి రట్టియెడం గర్ణుండు నన్నుం జూచి నగియె. ౧౩౮
ఆ.వె.
కర్ణునగవు లోకగర్హితుండగు దుస్స, సేను చెయిది కంటె శిఖియపోలె
నడరి నామనంబు నతిదారుణక్రియ, నేర్చు చున్నయది మహీధరుండ.౧౩౯
అప్పుడు కృష్ణుడు వారితో--
వ.
అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వ్యసవంబు సంభవిల్లెం గామజంబు లైన స్త్రీద్యూతమృగయాపానంబు లను నాలుగు దుర్వ్యసనంబులం బ్రవర్తిల్లకుండఁ బ్రతిషేధింపవలయు నందును విశేషంబుగా ననర్థమూలం బయిన ద్యూతంబుఁ బరిహరింపనినాడు పాపం బగునని హేతుదృష్టాంతంబులు సూపి కృపద్రోణవిదురగాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబఱిచి దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు.౧౪౮
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౫
విదురుడు ధృతరాష్ట్రుని విడిచి పాండవులయొద్దకు పోవుట
తే.
కార్యగతుల తెఱఁగు కలరూపు సెప్పిన, నధికమతులు దాని నాదరింతు
రల్పకార్యబుద్ధు లగువారలకు నది, విరసకారణంబు విషమపోలె.

కార్యగతుల ఉన్నరూపు చెప్పినపుడు బుద్ధిమంతులు దానిని అదరిస్తారు. బుద్ధిలేనివారికి అది విషం లాగా విరసకారణం అవుతుంది.

పాండవులు వనవాసానికి వెళ్ళిన తరువాత ధృతరాష్ట్రుడు విదురునితో ఇప్పుడు మనం చేయాల్సిన కార్యం ఏమిటని అడిగితే
దానికతడు పాండవులని వెనక్కు పిలిచి వారి రాజ్యం వారికిచ్చివేయటం మంచిదంటాడు. దానికి ధృతరాష్ట్రుడంగీకరించక విదురుడిని నీవు పాండవ పక్షపాతివి మా క్షేమం కోరేవాడివి కావు. అందుచేత వారిదగ్గరకే పొమ్మంటాడు. అప్పుడు విదురుడు పాండవులవద్దకు వచ్చి తాను ఉభయపక్షములవారికి జగమునకంతటికి మంచిదైన విషయం చెబితే అది సర్వజనరుచికరమైన ఆహారము రోగమున్నవాడికి ఎలా అరుచికరం అవుతుందో అలా అది అతనికి అరుచికరం అయ్యింది అటూ పై విధంగా అంటాడు.

ధృతరాష్ట్రుడు విదురుడు పాండవుల దగ్గఱ ఉండటం తెలుసుకొని అతనిని విడిచి వుండలేక కామ్యక వనానికి వెళ్ళి అతనిని తిరిగి తీసుకుని రమ్మని సంజయుని చేత కబురంపి అతడిని వెనక్కి తిరిగి రప్పించుకుంటాడు.దుష్టచతుష్టయం పాండవులను అడవికి వెళ్ళి అక్కడే యుద్ధం చేసి వారిని నాశనం చేద్దామని సన్నద్ధులవుతుంటే ఆ విషయం తెలిసిన కృష్ణద్వైపాయనుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి వారిని వారించమని చెప్తాడు.

ధృతరాష్ట్రునికి వ్యాసుఁ డింద్రసురభి సంవాదం సెప్పుట
వ్యాసుడు ధృతరాష్ట్రునితో
ఆ.
ఎల్ల నెయ్యములకుఁ దల్లిదండ్రులయందు, సుతులవలని నెయ్య మతిశయంబు
ధనము లెంత కలిగినను సుతరహితుల, కెమ్మెయిని మనః ప్రియము లేదు.౮౧

అనిచెప్పి ఇంకా ఇలా అంటాడు.
క.
సుజనులసహవాసంబునఁ, గుజనులుసద్ధర్మ మతులగుట నిక్కము ధ
ర్మజునొద్దనుండి నీయా,త్మజుఁడు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్.౮౮

అని అలా చేయమంటే ధృతరాష్ట్రుడు వ్యాసమునీంద్రునే దుర్యోధనునకు చెప్పమంటాడు. వ్యాసుడు మైత్రేయుడనే మునీశ్వరుడు వచ్చి దుర్యోధనునికి బోధ చేస్తాడని చెప్తాడు.
మైత్రేయుడు అక్కడికి వచ్చి దుర్యోధనునితో భీముని పరాక్రమం గురించి చెపుతూ బకుడు, హిడింబాసురుడు, జరాసంధుడు మొదలైన వారిని భీముడు చంపేడు అతనిని నీవు గెలవలేవు పాండవులతో సఖ్యంగా ఉండమంటాడు.
మాత్రేయుండు దుర్యోధనుని శపించుట
వ.
వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు జరామరణవంతులైన వారిం జెనకి యెట్లు జీవింతురు నీవు వారితో నొడంబడి యుండు మిది కార్యం బనిన మైత్రేయు పలుకు లాదరింపక పాదాంగుష్టంబున నేల వ్రాయుచు బాహువెత్తి దొడలు సఱచి నగుచున్న యా దుర్యోధనుం జూచి మైత్రేయుండలిగి యీయపరాధంబున నావహంబగు నందు భీముగదాఘాతంబున నీయూరు భగ్నం బయ్యెడు మని శాపంబిచ్చిన---౧౦౩
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౪
ధర్మరాజు ధౌమ్యునితో నిట్లనియె.
తే.
వనమునకు వచ్చి నవయంగ వల దుడుగుఁ, డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్ వీరికాహార మేయు,పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు.౩౬
వ.
వీరల విడువనోప నేమిసేయుదు ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరాజున కి ట్లనియె.౩౭
ఆ.వె.
భూత రాశి తొల్లి పుట్టి బుభుక్షాభి,తప్త మయినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి , కమలభాంధవుండు కరుణ తోడ.౩౮
కమలబాంధవుండు=సూర్యుఁడు
వ.
ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి దక్షిణాయనగతిం బర్జన్యభూతుం డై యోషధులం బడసి రాత్రులయందుఁ జంద్రకిరణాంమృతంబునంజేసి వానిం దడుపుచు వర్ధించి యం దన్నంబు పుట్టించి ప్రజాప్రాణాధారణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహుషాదులు యోగసమాధిష్టితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల వలనం బ్రజలం సముద్ధించిరి గావున.౩౯
లయగ్రాహి.
వారిరుహమిత్రు నమరోరగమునిద్యుచరచారణగణ ప్రణుత చారుగుణు భూతా
ధారు నఖిల శ్రుతిశరీరు హరిశంకరసరోరుహభవప్రతిము దారుణతమిస్రా
వారణమరీచి పరిపూరిత దిగంతరు నఘారి నతికారుణికు సూర్యుఁ ద్రి జగ ద్ర
క్షారతుసహస్రకరుఁ గోరిభజియింపుము మనోరథఫలంబు లగు భూరిభుజనీకున్.౪౦
అని ధౌమ్యుడు ధర్మరాజునకు సూర్యుణ్ణి ఆరాఢించమని చెప్పగా ధర్మరాజావిధంగా చేసి సూర్యునివలన ఒక అక్షయపాత్రను పొంది దానిద్వారా ఆ ౧౨ సంవత్సరములు అతిథిలకు ఆహారాన్ని సమకూద్చుకుంటారు.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౩
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౨
శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట
తే.
జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు, లామిషం బెట్లు భక్షించునట్లుదివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల, ననుదినంబును భక్షింతు రర్థవంతు.౨౭

నీటిలో చేపలు, ఆకాసములో పక్షులు మాంసాన్ని తినేటట్లుగా అందరూ చేరి డబ్బుకలవాణ్ణి ఎల్లప్పుడూ తింటూ ఉంటారు.
క.
అర్ధమ యనర్థమూలం, బర్థమ మాయావిమోహనావహము నరుం
డర్ఠార్జనదుఃఖమున న, పార్థీ కృత జన్ము డగుట పరమార్థ మిలన్.౨౮
అపార్థీకృతజన్ముడు=నిరర్థకమగు జన్మ కలవాడు

ధనము అనర్థాలకి మూలం. ధనము మాయావి , మోహాన్ని కలిగించేది. నరుడు ధనసంపాదనార్థం కలిగే దుఃఖం వల్ల నిరర్ధకమైన జన్మ కలవాడగుచున్నాడు.
Unknown
అరణ్య పర్వముప్రథమాశ్వాసము-1
క.
తిలలును నీళ్ళును వస్త్రం, బులుఁ బుష్పసుగంధవాసమున సౌరభముం
బొలు పెసఁగ దాల్చుఁ గావున, నలయక సత్సంగమమున నగు సద్గుణముల్.6
పాండవులు నిజాయుధములు ధరించి ద్రౌపదీ సహితముగ అరణ్యవాసమునకు బయలు దేరినప్పుడు పౌరులెల్లరు దుఃఖితులై ఇలా అంటున్నారు. నువ్వులు, నీళ్ళు, వస్త్రములు పుష్పముల సుగంధం చేత సౌరభాన్ని తాల్చుతాయి.అలానే సత్సంగము వలన అలుపు లేకయె సద్గుణములు కలుగుతాయి.

శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట

క.
శోకభయస్థానంబు ల, నేకంబులు గలిగినను విహీనవివేకుం
డాకులతఁ బొందునట్లు వి, వేకముగలవాఁడు బుద్ధివికలుండగునే.20

శోకము, భయము కలుగు స్థానంబులు అనేకమున్నా వివేకం లేనివాఁడు వ్యాకులత్వము నొందినట్లుగా వివేకము కలవాఁడు వ్యాకులత్వము నొందునే.