Unknown
అర్జునుడు పేడి రూపమున విరటుఁ గొల్వ వచ్చుట
అర్జునుడు కొలువులోనికి రావటం ఎలావుందంటే
ఆ.
మంచుమఱుఁగువడినమార్తాండుఁడునుబోలె, నీఱు గవిసియున్న నిప్పుఁబోలె
వేషధారి యైన విష్ణుండుఁబోలె న, వ్విరటుకొలువు చేర నరుఁడు వచ్చె. 228
క.
కనుదెంచి పేడితనమును, వనితారూపంబు నమర వాసవసుతుఁ డా
మనుజాధీశునకు సభా, జనులకుఁ దనుఁ జూపి మందసంచారమునన్. 229
క.
నిన్నుఁ గొలువంగ వచ్చితిఁ, గన్నియలకు నాడ గఱపఁ గా నోపుదు వి
ద్వన్నుత మన్నామంబు బృ,హన్నల యేఁ బేడి ననుడు నత డిట్లనియెన్. 233
ఉ.
ఆయత బాహులున్ వెడఁద యైనసమున్నతవక్షమున్ సరో
జాయితలోచనంబులుఁ బ్రసన్నముఖంబు నుదాత్తరేఖయుం
గాయజుఁ గ్రేణి సేయు ననఁ గౌశికు మీఱు ననంగ విభ్ర మ
శ్రీయును బెంపునుం గలుగఁ జేసి విధాతృఁడు పేడిఁ జేసెనే. 234
కాయజున్ = మన్మధుని, కౌశికున్ = ఇంద్రుని
వ.
అనిన విని యమ్మహీపతికి బృహన్నల యి ట్లనియె.237
ఉ.
ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్త్వముం
బోఁడిమి దప్పి యున్నది నపుంసక జన్మ మవశ్యభోగ్య మై
వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మభావ్య మె
వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. 238
వ.
కావున.
తే.
ఒండు పనులకు సెలవు లే కునికిఁ జేసి, యభ్యసించితి శైశవ మాది గాఁగ
దండలాసకవిధమును గుండలియును, బ్రేంఖణంబు తెఱంగును బ్రేరణియును. 240
సెలవు = ఉపయోగము, బ్రేరణి = కుండమీఁది నాట్యము
విరాటరాజప్పుడు తన కూతురు ఉత్తరను పిలిపించి ఆమెకు బృహన్నలను గురువుగా పరిచయం చేసి బృహన్నలకామెను అప్పగిస్తూ ఆమెతో ఇలా అంటాడు.
ఆ.
ఎల్ల చుట్టములును దల్లియుఁ దోడును, జెలియుఁ బరిజనంబుఁ జెలువ నీకు
గురువ యింక నొక్కకొఱఁతయు లే దిందుఁ, జేరి బ్రదుకు బుద్ధిగౌరవమున. 253
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-విరాట పర్వము
భీముడు వంటలవాఁడై విరటుఁ గొల్వ వచ్చుట
శా.
దేవా నాలవజాతివాఁడ నిను నర్థిం గొల్వఁగా వచ్చితిన్
సేవాదక్షత నొండుమై నెఱుఁగ నీచిత్తంబునన్ మెచ్చున
ట్లే వండం గడు నేర్తు బానసమునం దిచ్చోటనే కాదు న
న్నేవీటన్ మిగులంగ నెవ్వఁడును లేఁ డెబ్భంగులన్ జూచినన్. 217
భీముడు వంటలవాడి వేషంలో విరాటు కొల్వులోనికి ప్రవేశించి విరాట రాజుతో పై విధంగా అంటాడు. నేను శూద్రజాతికి చెందినవాడను. నాపేరు వలలుడు. మీకు వంటలు మంచి రుచిగా వండిపెట్టగలను. ఏవిధంగా చూచినా నన్నుమించిన వంటలవాడు ఎక్కడా కనిపించడు.
చ.
వలసిన నేలు మేను బలవంతుఁడఁ గారెనుఁబోతు దంతి బె
బ్బులి మృగనాథునిం దొడరి పోరుదు శూరత యుల్లసిల్లఁగా
దలమును లావు విద్య మెయి దర్పముఁ బేర్చి పెనంగు జెట్టిమ
ల్లుల విఱుతున్ వడిన్ గడియలోనన చూడ్కికి వేడ్క సేయుదున్. 223
దలమును=ఆధిక్యమును
మీకు కావలిస్తే నాకుద్యోగమివ్వండి. నేను చాలా బలవంతుడను, ఎనుబోతులతోనూ, ఏనుగులతోనూ, పెద్దపులి, సింహం మొదలైన వానితోనూ పోట్లాడతాను, అంతేకాదు పెద్ద పెద్ద మల్లురతో కూడా పోట్లాడి మీకు వినోదాన్ని కలిగిస్తాను అంటాడు.
ఇలా చెప్పేసరికి అతనికి విరాటుడు తన వంటశాలలో వంటల వారందరికీ పెద్దగా ఉద్యోగమిస్తాడు.
Unknown
శ్రీమదాంధ్ర మహాభారత పఠనాన్ని విరాట పర్వం తో మొదలు పెట్టాలంటారు పెద్దలు. అందుకని ఆది పర్వం పూర్తిచేసిన తర్వాత విరాట పర్వంలోనికి ప్రవేశిస్తున్నాను.
విరాట పర్వం ఫ్రథమాశ్వాసము-౮పాండవులు థౌమ్యుని వీడికొని విరాట నగరం చేరతారు. వారి ఆయుధాలనన్నింటిని ఓ శమీ వృక్షం మీద భద్రపఱచి , ఆ ఆయుధాలు ధర్మరాజుకు అర్జునునకు మాత్రమే ఆ సంవత్సరకాలంలో కనిపించేలాను మిగిలిన వారికి అవి విషంతో కూడుకున్న పాములువలె కన్పించుగాక అని నియమించుకుంటారు. ఈ ఏర్పాటు భీముని దృష్టిలో ఉంచుకుని సమయభంగం కాకుండా ఉండాలని చేసుకున్నది. వారు విరాటరాజు కొలువున ఎలా మెలగాలన్నది కూడా నిర్ణయించుకుంటారు.
వారు వారిలో వారిని పిలుచుకోవటానికి వీలుగా మారు పేర్లను పెట్టుకుంటారు. ఆ మారు పేర్ల వివరాలు.
ధర్మరాజు--జయుడు
భీముడు--జయంతుడు
అర్జునుడు--విజయుడు
నకులుడు--జయత్సేనుడు
సహదేవుడు--జయద్బలుడు.
తరువాత ధర్మరాజు యమధర్మరాజు తనకు అరణ్యవాస సమయంలో ఇచ్చిన వరాన్ని(యక్షప్రశ్నలు ఘట్టంలో) పురస్కరించుకొని ప్రార్ధన చేయగా అతని అనుగ్రహంతో వారి వారి కనుగుణమైన రూపాలు వారికి సంప్రాప్తిస్తాయి.
ఆ రూపాలతో వారు ఒకరి తరువాత ఒకరుగా విరాటు కొల్వులోనికి ప్రవేశిస్తారు. ధర్మరాజు కంకుడు అనేపేరుతో విరటునిసభలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు విరాటుడతనితో
ఉ.
ఎయ్యది జన్మభూమి కుల మెయ్యది యున్నచోటు పేరెయ్యది మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతంబెయ్యది నాకు నంతయును నేర్పడఁగా నెఱిగింపుఁ డున్నరూపయ్యది నావుడున్ నరవరాగ్రణి కయ్యతిముఖ్యుఁ డిట్లనున్. ౧౯౦
మీ వివరాలనన్నింటిని చెప్పమని విరాటు డడుగుతాడు యతి రూపంలో వచ్చిన ధర్మరాజుని.
ఆ.
ఉన్నరూప పలుకునన్నరు లెక్కడఁ, గలరు తోఁచినట్లు పలుకు పలుకనైనచంద మయ్యె నంతియకా కంత, పట్టి చూడఁ గలరె యెట్టివారు. ౧౯౧
ఉన్నరూపు+
అ=
యథార్థమునేఇలా చెప్పి ధర్మరాజు లౌక్యాన్నుపయోగించి కొన్నాడు ఇక్కడ.
వ. అని మందహాసంబు సేయుచు మఱియును. ౧౯౨
క.
నానావిధభూతమయము, మే నతిచంచలము మనము మేకొని నిక్కంబేనరునకు జెల్లింపం, గా నగు సత్యంబు నడపుక్రమ మట్లుండెన్. ౧౯౩
మేకొని=పూని
సత్యము యొక్కరూపాన్ని గురించి చెప్పి తాను నిజం చెప్పకుండా దాటవేసాడాయన. ఎవరికీ కూడా పూర్తి సత్యాన్ని పలకడం సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడతాడు. అదీ ఆయన చాతుర్యం. ధర్మరాజుకు సఖుడననీ తనకు కొద్దిగా ద్యూతక్రీడ తెలుసుననీ ఓ ఏడాదిపాటాశ్రయం కావాలనీ తన పేరు కంకుడనీ చెప్పి ఆశ్రయం పొందుతాడు.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౭
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మము లెఱింగించుటఉ.
ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక యాకొండు నలంగుదున్ నిదురకుం దఱి దప్పెను డప్పి వుట్టె నొక్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినాతం డొక చాయ చూపినను దత్పరతం బనిసేయు టొ ప్పగున్.౧౩౫
సేవకుడనేవాడు ఎండకు వానకు ఓర్చుకోవాలి. తన యిల్లు చాలా దూరం అని అనక ఆకలవ్వుతుంది, అలసిపోయాను, నిదరపోవడానికి కాలమయింది, దప్పికవుతుంది, ఒక్కడ్నే ఎలా చెయ్యను, అని సణగకుండా రాజుగారు ఓదారి చూపితే
పనిచేయాల్సినచోట అదే ధ్యాసతో పని చేయటం మంచిదవుతుంది.
క.
తా నెంతయాప్తుఁ డై నమ,హీనాయకు సొమ్ము పాము నెమ్ములుగా లోనూనినభయమునఁ బొరయక, మానినఁ గాకేల కలుగు మానము బ్రదుకున్.౧౩౬
రాజుకు తానెంత ఆప్తుడైనా సరే రాజుగారి ధనం పాముతలమీది మణిలా లోన భయముకలిగి ప్రవర్తించకపోతే మానము బ్రదుకు కూడా దక్కవు.
ఆ.
ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ,నంబు గుప్తవర్తనములు గాఁగఁజలుపవలయు నృపతి కొలువున్న యెడల బా,హిరము లైనఁ గెలని కెగ్గు లగుట.౧౩౭
రాజుగారు కొలువున్నప్పుడు ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట -ఇవి ఇవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. బయటకు తెలిస్తే అందరి దృష్టి నీమీదే వుంటుంది.
క.
వైరుల దూతలు నెర వగు, వారు నిరాకృతులుఁ బాపవర్తులుఁ దమకుంజేరువగా వర్తించుట, నేరమి తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్.౧౩౮
శత్రురాజుల దూతలు , నెరవగువారు(?), రూపము లేనివారు, పాపవర్తులు - తమకు చేరువగా మెలగటాన్ని సేవకులు తెలుసుకోలేకపోతే చివరకు చేటు, నింద కూడా కలిగిస్తారువాళ్ళు.
ఆ.
వసుమతీపాల వర్తించు నేనుంగు, తోడ నైన దోమతోడ నైన వైరమగు తెఱంగు వలవదు తా రెంత, పూజ్యు లైన జనులపొందు లెస్స.౧౩౯
రాజు గారి దగ్గరగా వర్తించే ఏనుగు వంటి వారితో గాని దోమ లాంటి వారితోగాని వైరము పూనటం తగదు. అటువంటి వారితో స్నేహమే మంచిది.
క.
కలిమికి భోగముల కదా, ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ విచ్చలవిడి భోగింపక వే,డ్కలు సలుపఁగ వలయు భటుఁ డడంకువతోడన్.౧౪౦
ధనము ఉంది కాబట్టి భోగించాలని అట్టహాసంగా విచ్చలవిడిగా ఉండకుండగా అణకువతో నే మెలగాలి.ఇవన్నీ సేవకులు రాజులపట్ల చూపించాల్సిన పాటించాల్సిన సేవాధర్మములు. అజ్ఞాత వాస సమయంలో పాండవులు రాజు దగ్గఱ సేవలు చేస్తూ ఉండాల్సి ఉంది కాబట్టి వారి పురోహితు డైన ధౌమ్యుడు పాండవులకు ఇవన్నీ పాటించాలని ఉపదేశిస్తాడు. ఈ కాలానికైనా ఏ కాలానికైనా ఇవే ధర్మాలు అందరు సేవకులకూ కూడా వర్తిస్తాయి.
Unknown
విరాట పర్వము- ప్రథమాశ్వాసము-౬
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మములు సెప్పుటచ.
ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గానియట్లుగానిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యెవ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతనికంచుఁ జూడ్కి సుస్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్.
౧౨౯
సేవకుడు రాజులదగ్గఱ మెలగాల్సిన విధం గుఱించి చెప్పాడు.
క.
నగళులలోపలిమాటలు, తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొండుగడం బుట్టినఁ బతి విన, నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.౧౩౦
అంతఃపురం విషయాలు బైటికి చేరవేయకూడదు. తనకు బయట తెలిసిన విషయాలు రాజుకు ఉపయోగపడేవైతే అతనితో చెప్పాలి.
క.
అంతిపురము చుట్టరికం, బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయోపాంతచరకుబ్జవామన, కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్.౧౩౧
అంతఃపురం గొడవలు చాలా సున్నితమైన విషయాలు.అక్కడి స్త్రీలతో పొందుకూడా భటుడైనవానికి నిషిద్ధమైనదే.
ఆ.వె.
ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం,బులును గరుణఁ దమకు భూమిపాలుఁడీక తార యెక్కు టెంతటిమన్నన, గలుగువారి కైనఁ గార్య మగునె. ౧౩౨
ఉత్తమమైన ఆసనములు, వాహనములు రాజుగారు తమకు ఇవ్వకుండా వాటిని తమంతట తామేఉపయోగించటం ఎంతటి చనువు గలిగివున్నవారికైనా తగిన కార్యం కాదు.
క.
మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశు కడన్ము న్నున్న యట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు నాపద లడగున్.౧౩౩
ప్రభువు మన్నన చేసినపుడు పొంగిపోయి, అవమానించినపుడు క్రుంగి పొవటం కాకుండా ఎల్లప్పుడూ ఓకే విధంగా మునుపు వున్నట్లుగానే ఉండేవారికి శుభములు కలుగుతాయి., ఆపదలు తొలగుతాయి.
క.
జనపతి యెవ్వరినైనను, మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱింగినయేనిఁ దాను వెలిపు, చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్.౧౩౪
ప్రభువు ఎవ్వరిమీదైనా కత్తికట్టిన విషయం తనకు ముందుగా తెలిసినా సరే,దానిని ఎటువంటి మూఢుఢు కూడా ముందుగా బయటపెట్టకూడదు.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౫
ధౌమ్యడు పాండవులకు సేవా ధర్మము లెఱింగించుటక.
చనువాని చేయుకార్యం, బున కడ్డము సొచ్చి యేరుపున మెలఁగుచుఁ దానునుబయిఁ బూసికొనినఁ దన, మునుమెలఁగిన మెలఁకువకును ముప్పగుఁ బిదపన్.౧౨౫
ఏరుపునన్=కడుపుమంటతో
క.
ఊరక యుండక పలువుర, తో రవ మెసఁగంగఁ బలుకఁ దొడరకయు మదింజేరువ గలనాగరరికులుఁ, దారఁ గలసి పలుకవలయు ధరణీశుకడన్.౧౨౭
క.
వేఱొక తెఱగున నొరులకు,మా ఱాడక యునికి లెస్స మనుజేంద్రు కడందీఱమి గలచోటులఁ దా, మీఱి కడఁగి వచ్చి పంపు మెయికొన వలయున్.౧౨౮.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౪
పాంచాలీ పాండవులు తమ మెలంగవలయుపనుల నిశ్చయించుకొనుట. పాండవులు విరాటుని కొలువులో తమ అజ్ఞాతవాస కాలాన్ని గడపాలని నిర్ణయించుకొని వారందరూ ఈ క్రింది పేర్లతో వ్యవహరింప బడాలని అనుకుంటారు.
ధర్మరాజు- కంకుడు
భీమసేనుడు-వలలుడు
అర్జునుడు-బృహన్నల
నకులుడు-దామగ్రంథి
సహదేవుడు-
తంత్రీపాలుడు
ద్రౌపది-మాలిని
వీరందరూ పూర్వం ధర్మరాజు ఆస్థానంలో పనిచేసేవారమని కూడా చెప్పుకుంటారు.
(ధర్మరాజు ఇక్కడ అబద్ధం ఆడాడు గదా అని నాకో చిన్న అనుమానం-ఎవరైనా తీర్చగలిగితే బాగుణ్ణు)
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట ఈ సేవా ధర్మాలు సార్వకాలికాలు మరియు సేవలు చేసే ఉద్యోగులందరికీ అనుసరణీయాలు అనిపిస్తుంది.
క.
తగఁ జొచ్చి తనకు నర్హం, బగునెడఁ గూర్చుండి రూప మవికృత వేషంబుగ సమయ మెఱిఁగి కొలిచిన, జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్.౧౨౧
తన ఊద్యోగానికి అర్హమైన చోటనే కూర్చుని రూపం ఎంతోకొంతైనా వికృతంగా మార్చుకొని సమయాన్నెఱిగి సేవిస్తే అటువంటి ఉద్యోగి పట్ల యజమాని ప్రసన్నంగా ఉంటాడట.
క.
నరనాథుఁ గొలిచి యలవడ, దిరిగితి నా కేమి యనుచు దేఁకువ లేకమ్మరియాద దప్పమెలగినఁ, బురుషార్థంహబునకు హాని వుట్టక యున్నే.౧౨౨
తేకుఁవ=భయము
నేను రాజుగారిదగ్గర ఉద్యోగం చేస్తున్నా నాకేవి టనుకుని మర్యాద తప్పి ప్రవర్తిస్తే మొత్తం ఉద్యోగానికే మోసం వస్తుంది.
ఉ.
రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ దేయోజ నృపాలుఁ డాకృతికి నొప్పగువేషము లాచరించు నేయోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు నేయోజ విదగ్ధు డై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్.౧౨౩రాజుగారింటెదురుగా మనం ఇల్లు కట్టుకోకూడదు. రాజు గారు ఏయే సమయాల్లో ఏయే విధంగా మనం ప్రవర్తిస్తే అనుకూలు డవుతాడో అయా సమయాల్లో ఆయా విధంగా ప్రవర్తించాలి .
క.
పుత్రులు పౌత్రులు భ్రాతలు, మిత్రు లనరు రాజు లాజ్ఞ మీఱిన చోటన్శత్రులకాఁ దమయలుకకుఁ, బాత్రము సేయుదురు నిజశుభస్థితిపొంటెన్.౧౨౪
ముఖ్యమైన విషయం.రాజులు తమ ఆజ్ఞను మీరినవారిపట్ల చాలా కఠినంగా వుంటారు. కొడుకులైనా, మనవలైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా సరే లెక్కచేయకుండా తమ ఆగ్రహానికి పాత్రులను చేస్తుంటారు సుమా.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౩
కథా ప్రారంభము.వ.
జనమేజయుండు వైశంపాయునున కిట్లనియె.౪౩
చ.
మహితసముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనాసహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమైనహితుల క ప్రమేభేద్యముగ నాపదుమూఁడగు నేఁడు మత్పితామహులు చరించి రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా.౪౪
నిగూఢవృత్తిమై=రహస్యమైన వ్యాపారము
ధౌమ్యుడు పాండవుల నూరార్చుటఉ.
ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయవృత్తి సత్కర్మవిధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్ ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వై నయట్టినీపేర్మికి నీడె దుర్దశలపెల్లునకున్ దురపిల్లు టారయన్.౫౧పేర్మికిన్=గొప్పదనమునకు
వ.
అట్లుంగాక.52
క.
దేవతల కైన నొక్కొక,చో వలయున కాదె శత్రుసూదనవిధికాలావాప్తికి మును దమస,ద్భావము లడఁచికొనియడఁగఁ బడి యుండగన్.౫౩
సీ.
నిషధాత్రి యం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయునునదితిగర్భంబున నవతార మై వామనాకారమున హరి యడఁగుటయునుజనని యూరుప్రదేశంబున నతినిగూఢంబుగా నౌర్వుండు డాఁగుటయునుధేనుశరీరవిలీనుఁ డై యజ్ఞాతచర్య మార్తాండుండు సలుపుటయునుఆ.వె.
వినమె యిట్లు వడినవీరలు పదపడి, తమకు నగ్గ మైన తఱి జయింపరెట్లు ప్రబలి రిపుల నీవును నాపద, కోర్చి భంగపాటు దీర్చికొనుము.౫౪
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-
౨
వ.
"కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం, కిం కాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే." యని నీవు తొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుండగు హరిహరనాధుండు నీ దెస దయాళుం డై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోకనివాసియయిన నాకుఁ దనదివ్యచిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టిశక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయం చేయుచున్నవాఁ డనుచుం జూపుటయు సవిశేషసంభ్రమసంభరితహృదయుండ నయి గలయం గనుంగొను నప్పుడు.౧౧
పరిష్క్రియాయాం=అలంకారము నందు
అవధరించి=చిత్తగించిసీ.
కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున శశిరెఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందనమున్న గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱి యైన చెలువున నెఱసినలోకరక్షణ మన గరళంబుచాయ దోఁప
బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబంబు నా నురమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే.
సురనదియును గాళిందియు బెరసినట్టి, కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముగఁ జేయ, నెలమి సన్నిధి సేసే సర్వేశ్వరుండు.౧౨
హరినీలపాత్రిక=ఇంద్రనీలమణుల పాత్ర,
గుఱి=గురుతు
క.
పారాశర్యుని కృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద,ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్.౧౭
పారాశర్యుడు=వేదవ్యాసుడు
ఆరాధ్యము=పూజింపఁదగినది
తే.
తెనుఁగు బాస వినిర్మింపఁ దివురుటరయ, భవ్యపురుషార్థతరుపక్వ ఫలముగాదెదీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిప,తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ.౧౮
ఎడ=హృదయము
ఉ.
ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి నత్యంతవిభూతిఁ బెం పెసఁగునట్టినినుం గొనియాడ జేత దానెంతటిపెద్ద నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జన్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.౨౧
చేఁత=చేయుట
ఉ.
ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యేపట్టునఁ బూజ్యమూర్తి యగు భారతసంహితఁ జెప్పఁ గంటి నాపుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుంగట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.౨౭
పుట్టు=జన్మము, భారతసంహిత=భారతమను నితిహాసము
ఉ.
కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్ జనాభ్యర్చిత మైన భారత మపారకృపాపరతంంత్రవృత్తిమైఁబేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నానేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్.౨౮
వరణీయుఁడ=కోరదగినవాడను
ఉ.
కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావలి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదం బయిన చిత్తము తోడ మహాకవిత్వదీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్.౩౦
గర్ణపుటంబుల=చెవులను దొప్పలచేత
సాత్యవతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదంబు=వ్యాసుని స్మరణము అను సంపదయొక్క మహిమకు చోటు
అని విన్నపం చేసుకొని తిక్కన గారు భారత రచన కుపక్రమించారు.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-1
ఉ.
శ్రీ యన గౌరి నాఁ బరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భద్రాయితమూర్తి యై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబు వైదికధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్. 1
క.
వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్వా దైన చోటులకు దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్. 4
భారతాన్ని పంచమ వేదం అంటారు. అది వేదములకు, అన్ని స్మృతులయొక్క వాదములకు చాలా పురాణ వర్గములలోని విరోధం కలిగించు చోటులకు, ధర్మార్థకామమోక్షాలకు, ప్రమాణము వంటిది.
ఉ.
ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
ష్టాదశ పర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
దాదిఁ దొడంగి మూఁడుకృతు లాంధ్ర కవిత్వవిశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్. 6
ఆదరింపదగినదై సారవంతమై వివిధములైన అర్థములను ప్రాప్తించు స్ఫురణము కలిగి పదునెనిమిది పర్వములతో శోభించుచున్నదై వుండగా దానిలో ఆదిపర్వము మొదలు మూడు పర్వములను ఆంధ్రకవిత్వ విశారదుడు,విద్యాదయితుడు, మహితాత్ముడు ఐన నన్నయభట్టు దక్షతతో తెలుగు చేసాడు.
మ.
హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁబదియేనింటిఁ దెనుంగుబాస జన సంప్రార్థ్యంబు లై పెంపునందుది ముట్టన్ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారఁగన్. 7
హృదయాహ్లాదాన్ని కలిగించి గొప్పదైన నాల్గవ కథతోకూడుకున్నవిరాట పర్వము ఉద్యోగ పర్వము మొదలుగాగల మిగిలిన పదిహేను పర్వాలను తెనుఁగు బాసలో జనులచే ప్రార్థింపబడినవై పెంపు వహించేలా చివరివరకూ రచియించటం ఒప్పుతుంది. అలా చేస్తే పండితులందరూ సంతోషిస్తారు.అని తిక్కన సోమయాజి గారు నిర్ణయించుకొన్నారు.