Showing posts with label సభా పర్వము. Show all posts
Showing posts with label సభా పర్వము. Show all posts
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
ఉ.
అమ్మగధేశు నుగ్రబలు నాయుధయుద్ధమునన్ జయింపఁగా
నిమ్మహి నోప రెవ్వరు నుమేశ్వరుఁ డట్టివరమ్ము వానికిన్
నెమ్మిన యిచ్చె గావున వినీతుఁడు వాయుసుతుండు మల్ల యు
ద్ధమ్మున నోర్చు నాతని నుదగ్రమహాభుజశక్తి యేర్పడన్. 162

క.
బలిమిమెయిఁ బార్థురక్షా,బలమును బవనసుతు బాహుబలమును నాని
ర్మలనీతిబలము నీకుం, గలుగ నసాధ్యంబు గలదె కౌరవనాథా. 163

చ.
తడయక యేగి నీతిబలదర్పము లొప్పఁగ వాని డాసి క
వ్వడియును నేను భీముఁడు నవశ్యముఁ బోర బృహద్రథాత్మజుం
గడిఁదిరిపున్ జయింతుము జగన్నుత న న్నెద నమ్ముదేని యి
ల్ల డ యిడు భీము నర్జును నలంఘ్యబలాఢ్యుల నావశంబునన్. 164

శ్రీకృష్ణుడు ధర్మరాజుతో జరాసంధునిమీదకు యుద్ధానికి పోయేటప్పుడన్న మాటలవి.
దానికి ధర్మరాజిట్లా అన్నాడు.
చ.
ప్రియహితసత్యవాక్య యరిభీషణ కృష్ణ భవన్ని దేశసం
శ్రయమున నున్న మా కధికశత్రుజయం బగుటేమి పెద్ద ని
శ్చయముగ నింక మోక్షితుల సర్వమహీశుల నిమ్మహాధ్వర
క్రియయును సిద్ధిఁ బొందె నయకిల్బిషకీర్తి వెలుంగు చుండగన్. 166

చూడండి ధర్మరాజు వాక్యాన్ని ఎలా మొదలుపెట్టాడో. 'ప్రియహిత సత్యవాక్య' అని. అంటే చచ్చినట్లు ఆ పనిని నెరవేర్చుకొని రావలసిందే అని సూచన అన్నమాట.
Unknown
శ్రీమదాంధ్రమహాభారతము-సభాపర్వము-ప్రధమాశ్వాసము-2
భీమసేనార్జునులు ధర్మరాజున కుత్సాహంబు కలిగించుట
క.
ఆరంభరహితుఁ బొందునె, యారయసంపదలు హీనుఁ డయ్యును బురుషుం
డారంభశీలుఁ డయి యకృ, తారంభులనోర్చు నెంతయధికుల నయినన్. 123

ఏ పనినీ ప్రారంభించని వాడిని సంపదలు చేరవు. హీనుడైనా సరే కృతప్రయత్నుడైన వాడు ప్రయత్నించని వారిని వారెంత అధికులయినా సరే ఓడించగలుగుతాడు.
క.
కడు నధికునితోడఁ దొడరినఁ, బొడిచిన నొడిచినను బురుషుపురుషగుణం బే
ర్పడుఁగాక హీను నొడుచుట, కడిఁదియె పౌరుషము దానఁగలుగునె చెపుమా. 124

తనకంటె అధికుడైన వానితో కలబడితే పురుషునకు మగతనం కానీ హీనుడిని అణచటం గొప్పా ? దానివల్ల పౌరుషం కలుగుతుందా చెప్పు.
జరాసంధుని మీదకు దండయాత్రకు పోవటానికి ఉద్యమిస్తూ భీముడు ధర్మరాజుతో పై విధంగా అంటాడు.
అప్పుడర్జునుడు--
క.
కులరూపగుణద్రవ్యం,బులు విక్రమవంతునందు భూవిదితము లై
నిలుచు నవిక్రమునకు నవి, గలిగియు లేనిక్రియ నప్రకాశంబు లగున్. 129

కులము, రూపము, గుణము, ద్రవ్యము --ఇవి విక్రమవంతుని యందు ప్రకాశించినట్లుగా అవిక్రమునందు ప్రకాశించవు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-
నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చిఇంద్రసభ, యమసభ, వరుణసభ, కుబేరుసభ, బ్రహ్మసభా వర్ణనలను చేస్తాడు. ఆ వర్ణనలలో పాండురాజు యమసభలో ఉన్నట్లుగాను హరిశ్చంద్రచక్రవర్తి దేవేంద్రసభలో ఉన్నట్లుగాను చెప్తాడు. అదివిని ధర్మరాజు నారదునితో
మధ్యాక్కర.
పరమధర్మాత్మకుఁ డయినపాండుభూపతిఁదొట్టి సకల
ధరణీశు లెల్ల యముసభ నుండంగఁ దా నేమిపుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁ డై యుండంగఁ గనియె.82
వ.
అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుండి ట్లని చెప్పె. 83
ఉ.
దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మ పరాయణుం డయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైక విభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రి కా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్. 84
సీ.
జయశీలుఁ డయి హరిశ్చంద్రుండు దొల్లి సప్తద్వీపములఁ దనబాహుశక్తిఁ
జేసి జయించి నిశ్శేషితశత్రుఁ డై ధారుణిలోఁ గలధరణిపతుల
నిజశాసనంబున నిలిపి నిత్యం బైన మహిమతో సకలసామ్రాజ్యమొప్ప
రాజసూయంబు తిరంబుగా నొనరించి తనరి యథోచితదక్షిణలకు
ఆ.
నేనుమడుఁగు లర్థమిచ్చి యాజకులఁ బూ,జించి భక్తితో విశిష్టవిప్ర
జనుల కభిమతార్థసంప్రదానంబులఁ,దృప్తి సేసె వంశదీపకుండు.85
వ.
వాఁడును బ్రాహ్మణవచనంబునం జేసి దేవేంద్రసాలోక్యంబు వడిసె నట్టిహరిశ్చంద్రుమహిమాతిశయంబు రాజసూయనిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో నిట్లనియె. 87
వైవస్వతసభన్=యమసభలో
చ.
కొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ యిందు నా
యునికియు రాజసూయమఖ మున్నతిఁ జేసినధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైనధర్మ నం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయగన్.89

నీవు మనుష్యలోకానికి వెళ్ళి నాకొడుకు ధర్మరాజుతో నా నరకనివాసాన్ని గురించి రాజసూయం చేసినవారి సంబంధుల స్వర్గనివాసస్థితిని తెలియజేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా అతనికి చెప్పి రాజసూయయాగం చేయమని నా మాటగా చెప్పమన్నాడు.
చ.
అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁడయి తమ్ములబాహుబలంబు పెంపునన్. 90

నాకొడుకులు దేవతాంశతో పుట్టినవాళ్ళు ధర్మరాజు రాజసూయాన్ని తమ్ముల సహాయంతో పూర్తి చేయగలడు
అని కూడా అన్నాడు.
వ.
అట్లేని నాకు నస్మత్పితృపితామహనివహంబుతోడ నాకాధిపలోకసుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు వచనంబు నీ కెఱింగించువేడుక నిట వచ్చితి. 91
క.
న్యాయమున రాజసూయము, సేయుము నీపితృగణంబుఁ జెచ్చెర నధిక
శ్రీయుత సురగణపూజ్యులఁ, జేయుము శక్రుసభ నుండఁ జేయుము వారిన్. 92

నీ తండ్రికి స్వర్గం ప్రాప్తించేలా నీవు రాజసూయయాగం చెయ్యి అని నారదుడు ధర్మరాజును ప్రేరేపిస్తాడు.
వ.
దిగ్విజయోపార్జితంబు లయినధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణ్యాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు(పూజ్యంబై యొప్పం) బ్రకాశింపుము మఱి రాజసూయంబు బహు విఘ్నంబు బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయు చుండుదు రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిలప్రజాప్రళయకారణం బయిన రణం బగునని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములం జూచి ధర్మ తనయుండు ధౌమ్యద్వైపాయనసుహృద్బాంధవమంత్రి సమక్షంబున నిట్లనియె.93

ధర్మరాజు నారదవచనప్రబోధితుండయి రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట
క.
పితృసంకల్పము సేయఁగ, సుతుల కవశ్యమును వలయు సుతజన్మఫలం
బతిముదమునఁ బితృవరులకు, హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్. 94
క.
పరలోకనిలయు లగుమీ, గురులకు దీనిన హితం బగున్ లోకభయం
కరసంగరమును గాలాం,తరమున నగునని విరించితనయుఁడు సెప్పెన్. 95
క.
పితృగణహితార్థముగ స,త్క్రతువొనరింపగ బుద్ధి గలదు ప్రజాసం
హృతి తత్క్రతువున నగు నని, మతి నాశంకయును గలదు మానుగ నాకున్. 96

ద్వైదీభావంలో పడ్డాడు ధర్మరాజు.ఓ ప్రక్క తండ్రులకు స్వర్గలోకప్రాప్తి, మరోప్రక్క ప్రజావినాశనం ఏదీ తేల్చుకోలేకుండా వున్నాడు.
వ.
ఏమి సేయుదు నని డోలాయమానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97
ఉ.
చేయుము రాజసూయ మెడ సేయక దాననచేసి దోషముల్
వాయు నిలేశ భూప్రజకుఁ బార్థివు లెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు సర్వసంపదలు చేకొనఁగాఁ దఱి యయ్యెఁ గౌరవా
మ్నాయలలామ నీ కెనయె మానవనాథులు మానుషంబునన్.98
వ.
అనిన వారలవచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుం డయి ధర్మరాజు రాజసూయంబు సేయసమకట్టి............
ఇక్కడ ధర్మరాజు వ్యక్తిత్వం కొంచెం దెబ్బతిన్నట్లనిపిస్తుంది నాకు. నిఖిలజన ప్రళయాన్ని కలిగించే యుద్ధం జరుగుతుందని ముందే తెలిసినా దానికివ్వాల్సినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా రాజసూయానికి పూనుకోవటం నాకంతగా నచ్చలేదు. అది అతని వ్యక్తిత్వానికి మచ్చగా నా కనిపిస్తుంది. నేను తప్పో కాదో నాకు తెలియట్లేదు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౧౦
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
ఆ.వె.
దారసంగ్రహంబు ధరణీశ రతిపుత్ర, ఫలము శీలవృత్త ఫలము శ్రుతము
దత్తభుక్త ఫలము ధనము వేదము లగ్ని,హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు
.౫౨

పెళ్ళికి రతి సుఖము, పుత్రులు కలుగుట ఫలము. శ్రుతులను వినటం వలన ఫలితం మంచి నడవడికను పొందటం. ఢబ్బుకు దానము, భోగము ఫలము. వేదమునకు ఫలం అగ్నిహోత్రం. అని తెలుసుకో.
చ.
బహుధనధాన్యసంగ్రహంబు బాణశరాసన యోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘసం

గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా

వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లై న దుర్గముల్.
౫౩
దుర్గ రక్షణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు.
బహు ధన ధాన్య సంగ్రహం ఐ వుండాలి. బాణాలను శరములను ప్రయోగించగల వీరులతో వుండాలి.నిరంతరాయంగా మంచినీరు, తృణజలకాష్ఠసమూహంతో కూడి వుండాలి.అనేక యంత్రములు కలిగి శత్రువులకు భేధించరానిదై వుండాలి.
ద్విషద్భయా వహులు=?. నీచే రక్షించబడే కోట పై విధంగా వుందా? అని అడుగుతున్నాడు నారదుడు.
చ.
వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ

విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు

ర్మదమలినాంధ చిత్తులఁ
బ్రమత్తులఁ నింద్రియనిర్జితాత్ములన్.౫౪

మంచి బుద్ధితో నీలోపలనున్న శత్రువర్గాన్ని వదలకుండా జితేంద్రియుడ వై మొదలనే దేశకాలబలములు ఇంకా దైవబలమూ కూడా కల్గి శత్రువులను ఓడించడానికి ఉత్సాహముతో నున్నావా.ఇంద్రియాలను వశపరచుకొనే వానిని జాగరూకుడవై కనిపెట్టుకుని వుంటున్నావా.
తే.
కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న, నీకు ముందఱఁజని రిపునృపులయందు దగిలి సామాద్యుపాయంబులొగినసంప్ర,యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.౫౪

నీవు యుద్ధానికి వెళ్ళేప్పుడు నీకంటే ముందుగా వెళ్ళి శతృవులలో చేరి సామాద్యుపాయములతో నీ విజయానికి సహాయకారిగా చేసుకొంటున్నావా చెప్పు.
వ.
మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం లనర్థజ్జ్ఞులతోడిచింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబులయం దనర్థకచింత నిశ్చితకార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబుల బ్రయోగింపమి విషయంబులం దగులుట యనం బరగిన పదునాలుగు రాజదోషంబుల పరిహరించితె యని నారదుడు ధర్మరాజును అడుగుతాడు.౫౬
రాజైనవాడు పరిహరించాల్సిన పద్నాలుగు దోషాలను తెలియజేస్తాడిక్కడ.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౯
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
వలయు నమాత్యులుఁ జుట్టం,బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం
సులు బలసి యుండ నిచ్చలుఁ, గోలువుండుదె లోకమెల్లఁ గొనియాడంగన్.౪౮
క.
పరికించుచు బాహ్యాభ్యం,తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్.౪౯
బయటను లోనను ఉన్న జనుల వలన ఎల్లప్పుడూ జాగరూకుడవై నీ రక్షణను చూసుకుంటూ ఇతర రాజుల కదలికల్ని నేర్పరులైన చారులనెడు కన్నులతో గమనిస్తున్నావు గదా.
క.
వెలయఁగ విద్వజ్జనము,ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార,మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.౫౦
ఆ.వె.
వార్తయందు జగము వర్తిల్లు చున్నది, యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింప వలయుఁ బతికి.౫౧
వార్త=అర్థానర్థవివేచన విద్య
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౮
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కృత మెఱిఁగి కర్త నుత్తమ, మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు, పతియె జగజ్జనులనెల్లఁ బరిపాలించున్.౪౬

చేయదగినది తెలిసికొని కర్తను సభలలో బాగుగా పొగడి మర్చిపోకుండా తగిన సత్కారమును చేస్తున్నావు గదా. చేయదగినదానిని తెలుసుకున్న రాజే జగాలనన్నీ పరిపాలించగలుగుతాడు.
సీ.
ఆయంబునందు నాలవభాగమొండె మూఁడవభాగమొండె నం దర్థమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవనినాథ యాయుధాగారధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందుఁ బరమవిశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య
ఆ.
గురుల వృద్ధశిల్పివరవణిగ్బాంధవ, జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదరికము వొరయకుండఁగఁ బ్రోతె, సకలజనులు నిన్ను సంస్తుతింప.౪౭
ఆదాయంలో నాల్గవభాగం ఆయుధాగార ధనాగారముల నిర్వహణకు, మూడవభాగాన్ని సైన్యాన్నిఅశ్వదళ నిర్వహణకు,
ఒకటిన్నర భాగాన్ని గజసైన్యనిర్వహణయందు ఖర్చుపెట్టాలి కాని అంతకు మించి ఖర్చు పెట్టరాదనే విషయం గ్రహించావు గదా. ధనాగార నిర్వహణలో దక్షులను భక్తులను పరమ విశ్వాసం గలవారినే నియమించుకొన్నావుగదా.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౭
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
చోరభయవర్జితముగా, ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవధ్భృత్యవరుల్.౪౨

దొంగలవలని భయం లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నావా? నీ భృత్యులు చోరులనుండి ధనాన్ని గ్రహించి వారిని రక్షించటం లేదుగదా!
క.
ధరణీనాధ భవద్భుజ, పరిపాలిత యైన వసుధఁ బరిపూర్ణము లై
కర మొప్పుచున్నె చెఱువులు, ధరణి కవగ్రహభయంబు దనుకకయుండన్.౪౩
అవగ్రహ=వానలేమివలని
తనుకక
=కలుగక
రాజా! నీరాజ్యంలో చెఱువులన్నీ నీటితో నిండి ఉన్నాయా! వానలేమి భయం లేకుండా అంతా సుభిక్షంగా ఉన్నారుగదా.
చూడండి చెఱువుల ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ఎన్నో ఎన్నెన్నో చెఱువులు కబ్జా అయిపోయి , లేక పూడిపోయి ఉండి వ్యవసాయానికేమాత్రం ఉపయోగపడకుండా ఉంటున్నాయి.
క.
హీను లగు కర్షకులకును, భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న,నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.౪౪

పేదవారైన రైతులకు ధాన్యాన్ని,విత్తనాల్ని అలాగే వర్తకులకు అనూనముగా ఉత్తమ బుద్ధితో ఋణములను ఇస్తున్నావు కదా.
క.
పంగుల మూకాంధుల విక,లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁదశత్రునైనను, సంగరరంగమునఁ గాతె శరణంబనినన్.౪౫

కుంటి,మూగ,అంధ వికలాంగులను, బంధువులెవ్వరూ లేనివారిని దయతో బ్రోచుచున్నావు గదా ! ఆపద కలిగించిన శత్రువునైనా సరే శరణు వేడితే రక్షిస్తున్నావుగదా!
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౬
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కులపుత్ర్రులైనసద్భృ, త్యులకును సత్కార మర్ధితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని,మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతురనిన్.
౩౯

మంచి వంశములో పుట్టిన మంచి సేవకులకు కోరికతో సత్కారాలు చేస్తున్నావా? వారు నీ విషయంలో చేయదగువిషయాన్ని బాగుగా తలచి యుద్ధంలో ప్రాణాల్నిసైతం విడిచి పెడతారు.
క.
అనఘా నీ ప్రస్తనమున, నని నీల్గిన వీరభటులపోష్యుల నె
ల్లను బ్రోతె భోద నాచ్ఛా,దనముల వారలకు నెమ్మి తఱుఁగక యుండన్.
౪౦

నీ కారణంగా యుద్ధములో చనిపోయిన వీరభటుల మీద ఆధారపడినవారి నందరికి వారి వారి తిండీ గుడ్డా వగైరాలకి లోటు రాకుండా వారి క్షేమమును సరిగా చూసుకుంటున్నావుగదా.
క.
ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ,ర్పనివారలఁ బగఱవలనివారల ధృతి చా
లనివారల దుర్జనులం, బనుపవుగా రాచకార్యభారము దాల్పన్
.౪౧
రాచకార్యాలందు నియోగించ దగని వారి గురించి చెపుతున్నాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-5
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట.
క.
ఉపధాశుద్ధులఁ బాప, వ్యపగతబుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.౩౬

ధర్మాదులచే పరిశుద్ధులైన వారు, పాపవ్యపగతబుద్ధులు, వినీతి వర్తనులు, సమదృష్టి కలిగిన వారు, నిపుణులు అయినవారిని బాగుగా పరీక్షించి ధనసంపాదనాది రాజకార్యాలలో నియోగింస్తున్నావా? గవర్నమెంటు ఆఫీసర్లకుండాల్సిన
లక్షణాలన్నమాట అవి.
ఉ.
ఉత్తమమధ్యమాధమనియోగ్యుల బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమనియోగములన్ నియమించి తే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగుజీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్.౩౭

రాజ ధర్మాల్ని ఎంత చక్కగా విశదీకరిస్తున్నారో చూడండి. ఉద్యోగులకు దయతో కాలము తప్పకుండా జీతాల్ని చెల్లిస్తుండాలట రాజు. ఎవరెవర్ని ఏ యే పనుల్లో నియోగించాలో బాగా తెలుసుకుని అలానే నియోగించాలట.
క.
తమతమకనియెడుతఱి జీ,తము గానక నవయుభటులదౌర్గత్యవిషా
దము లేలినవాని కవ,శ్యము నె గ్గొనరించు నతఁడు శక్రుండైనన్.౩౮

జీతాలు అందక ఉద్యోగులు బాధపడితే వాళ్ళ దుర్గతివల్ల కలిగే విషాదము ఆరాజు ఇంద్రుడైనా సరే అతనికి చెడును కలిగిస్తాయట.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-4
నారదుడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడగుట(కొనసాగింపు)
క.
క్షితినాధ శాస్త్రదృష్టి, ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్పాత
ప్రతికారు లగుచు స,న్మానితు లయి వర్తింతురయ్య నీ దైవజ్ఞుల్.౩౪

రాజు దగ్గర వుండే దైవజ్ఞులైన పురోహితులు దేవ, అంతరిక్ష, భూమిమీఁదా జరిగే ఉత్పాతాలు మొదలైన వానికి సరియైన ప్రతీకారములను ఆచరించి నీచే సన్మానితులగు చున్నారా అని అడుగుతున్నాడు. రాజు అటువంటి వారిని కలిగి ఉండాలన్నమాట.
క.
అనిశము సేవింతురె ని, న్ననఘా యష్టాంగ మైన యాయుర్వేదం
బున దక్షు లైన వైద్యులు, ఘనముగ ననురక్తులై జగద్ధిత బుద్ధిన్.౩౪

వైద్య విధానాలలో ఆయుర్వేదాని కుండే ప్రాధాన్యత అంత గొప్ప దన్న మాట. రాజు దగ్గర ఆయుర్వేదంలో దక్షులైన వైద్యులు కూడా వుండి తీరాలన్నమాట.

క.
సారమతిఁ జేసి మానస, శారీరరుజావళులకు సతతంబుఁ బ్రతీ
కారములు సేయు చుండుదె, యారఁగ వృద్ధోపసేవ నౌషధసేవన్.౩౫

మంచి ఆలోచనతో మానసిక, శారీరక రోగాలకు ఎల్లప్పుడు వృద్ధులకు సేవచేయుట ద్వారానూ, మందులిచ్చుటచేతనూ సరియైన ప్రతీకారము కావించు చున్నావా.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
అనఘుల శాస్త్రవిధిజ్ఞుల, ననురక్తులఁ బితృపితామహక్రమమున ప
చ్చినవిప్రుల మంత్రుల, గా, నొనరించితె కార్యసంప్రయోగము పొంటెన్.27

పాపరహితులను, శాస్త్రవిధిజ్ఞులను, అనురాగము గలవారిని పితృపితామహక్రమమున వచ్చిన విప్రులను మంత్రులుగా నియమించుకోవాలట.
క.
రాజునకు విజయమూలము, రాజితమంత్రంబు సుస్థిరంబున దానిన్
రాజాన్వయ రక్షించితె ధ, రాజనులకుఁ గర్ణ గోచరము గాకుండన్. 28

ప్రసిద్ధమగు రహస్యము (సీక్రెట్ సర్వీస్) రాజులవిజయానికి మూలమైనది.
దానిని ఎవ్వరికీ తెలియకుండగా రాజయినవాడు రక్షించుకోవాలి.
క.
ధీరుఁడు ధర్మాధర్మవి, శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీశ్రితవదనస,రోరుహుఁడనఁ జనునె నీ పురోహితుఁ డధిపా.29

ఇక్కడ పురోహితుని లక్షణాల్ని చెపుతున్నాడు. పురోహితునికి పై లక్షణాలన్నీ
ఉండాల్సిందే. అతడు ధీరుడై, ధర్మాధర్మ విశారదుడై, బహు శ్రుతులను
చదివినవాడై, సమచిత్తుడై, సరస్వతీ దేవి అతని ముఖాన్ని
ఆశ్రయించుకొనివున్నదైనవాడై ఉండాలట. నీ పురోహితు డటువంటివాడే కదా.
క.
జననుత నీయజ్ఞములం, దనవరతనియుక్తుఁ డయినయాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁ డై యేమఱ కుం,డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్.30

నీ యజ్ఞములను ఎల్లకాలము నిర్వహించడానికి నియుక్తుడైన యాజ్ఞికుఁడు
ప్రయోగాలు చేయుటలో సిద్ధహస్తుడై తన పనులను ఎప్పుడూ సమబుద్ధితో
చేస్తూ ఉన్నాడా.
క.
నానావిధరణవిజయమ, హానిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్
సేనాధ్యక్షులఁ జేసితె, నీ నమ్మినవారి మాననీయుల హితులన్.31

నానా విధములయిన యుద్ధాలలో మహా నిపుణులై వారింపనలవికాని
వీరులనతగువారిని సేనాధ్యక్షులుగా చేసుకొన్నావా? వారు నీకు
నమ్మినవారు, మాననీయులు, హితులే కదా?
చ.
చ.
కడుఁ జనువాఁడు నై పురుషకారియు దక్షుఁడు నైనమంత్రి పెం
పడరఁగ రాజపుత్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా ధనమెట్టివారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్.32

ఇక్కడ గుణవంతుడైన మంత్రి లక్షణాన్ని వర్ణిస్తున్నాడు.




Unknown
సభా పర్వము-ప్రథమాశాస్వము-౨
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట
భారతంలో చాలా చోట్ల వివిధములైన ధర్మాలను చెప్పటం జరిగింది.
ఈ సందర్భంలో నారదుడు ధర్మరాజుని అడిగినట్లు పరోక్షంగా వివిధములైన
రాజధర్మాలను ఉపదేశించటం జరిగింది.

సీ.
మీ వంశమున నరదేవోత్తముల దైన సద్ధర్మమార్గంబు సలుపు దయ్య
ధర్మ విదుండ వై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండ నుచిత
కాల విభక్తముల్ గాఁ జేసి సేవింతె ధర్మవునంద చిత్తంబు నిలిపి
యిమ్ముల నపర రాత్రమ్ములం దెప్పుడుఁ జింతింతె నిజబుద్ధిఁ జేయఁ దగిన
ఆ.
రాజకృత్యములఁ దిరంబుగా నిఖిల ని, యోగవృత్తులందు యోగ్యు లయిన
వారిఁ గరము గారవమ్మునఁ బంచితె, నీవు వారి దయిమ నే ర్పెఱింగి.26

ఓ ధర్మరాజా! మీ వంశమున రాజశ్రేష్ఠులదైన సద్ధర్మమార్గాన్ని సలుపుతున్నావా!
ధర్మవిదుడవై ధర్మార్థకామాలు ఒకదానితో నొకటి బాధింపబడకుండగా కాల
విభజనం చేసి సేవిస్తున్నావా! ధర్మమునందే మనస్సును నిలిపి రాత్రి నాల్గవ
జాములో చింతన చేస్తున్నావా! స్వబుద్ధితో చేయదగిన రాజకార్యాలు ఎవరు
ఏయే పనులు చేయసమర్థులో వారి వారి నాయా కార్యాలలో సరిగా గౌరవముతో
చేయటానికి నియమించావా!
(ఇంకావుంది)
Unknown
సభాపర్వము-ప్రథమాశ్వాసము-1
మయుడు మయసభను నిర్మించి పాండవులకిచ్చి వెళ్ళిన తరువాత చాలా మంది మునీశ్వరులు ధర్మరాజును చూడటానికి వస్తారు.
సీ.
సుబల మార్కండేయ శునక మౌంజాయన మాండవ్య శాండిల్య మందపాల
బక దాల్భ్య రైభ్యక భాలుకి జతుకర్ణ గౌతమ కౌశిక కణ్వ కుత్స
సావర్ణి పర్ణాద సత్యగోపతి గోపవేష మైత్రేయ పవిత్ర పాణి
ఘటజాను కాత్రేయ కఠ కలాప సుమిత్ర హారీత తిత్తిరి యాజ్ఞ్యవల్క్య
ఆ.
వాయుభక్ష భార్గవవ్యాస జైమిని, శుక సుమంతు పైల సువ్ర తాదు
లయిన మునులు నేము నరిగితి మెంతయు, రమ్య మయిన ధర్మరాజుసభకు.21

నారదుఁడు పాండవులయొద్దకు వచ్చుట
ఉ.
నీరజమిత్రుఁ డేల ధరణీగతుఁ డయ్యెడునొక్కొ యంచు వి
స్మేరమనస్కు లై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండఁగా
నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి సురేంద్ర మందిర
స్ఫారవిలాసహాసి యగు పార్థుగృహంబునకుం బ్రియంబునన్.23

ప్రజలంతా నీరజమిత్రుడు భూమి మీదకు ఎందుకు వచ్చాడో అని ఆశ్చర్యమనస్కులై ఆతని ప్రకాశాన్ని మెచ్చుకొని చూస్తుండగా ఆకాశ మార్గము నుండి నారదుడు ఇంద్రునిమందిరాన్నే తన విలాసముతో అపహాస్యం చేస్తున్నట్లుగా ఉన్న అర్జునుని ఇంటికి ప్రేమతో వచ్చాడు.

పర్వత పారిజాత రైవత సుముఖు లను మహా మునులతో కలసి వచ్చాడట నారదుఁడు.25