Showing posts with label ఉద్యోగ పర్వం. Show all posts
Showing posts with label ఉద్యోగ పర్వం. Show all posts
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౮
ఇంద్రుడు నహుషుతేజోవిశేషంబు చూచి మఱుఁగువడుట.
శచీ దేవి నహుషునితో కొంతకాలం గడువు కోరివచ్చిన పిదప అందరూ కలసి ఆలోచించుకొని విష్ణుదేవు పాలికి రహస్యంగా పోయి సహాయం కోరగా ఇంద్రునిచే అశ్వమేధ యాగం చేయిస్తే అతని పాపం నశిస్తుందని సలహా యిస్తాడు. అలా అశ్వమేధ యాగం చేసి పాపాలను పోగొట్టుకొని ఇంద్రుడు నహుషుని వద్దకు వెళ్ళి ఆతని తేజస్సు చూచి భయకంపితుడై పారిపోయి ఎక్కడో దాగుకొంటాడు.
శచీ దేవి ఆకాశవాణిని ప్రార్థించి ఆకాశవాణి సహాయంతో ఇంద్రుని కలసి నహుషుని పోకలు అతనిని తాను గడువు కోరటం వగైరా తెలియజేస్తుంది.అప్పుడామెతో ఇంద్రుడు
క.
ఆ నహుషు బాహుగర్వ మ,నూనం బై యున్నయది సముజ్జ్వల మునిస
న్మాన ప్రవృద్ధ మగుటను, దానం గాలంబు వేచెదను జయమునకున్.౧౭౫
సముజ్జ్వల మునిసన్మాన ప్రవృద్ధము=ప్రకాశించు మహర్షుల యాదరముఁ బెరిగినది.
చ.
తఱి యగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపినయట్ల చేయుము తగం జని యాతనిఁ గాంచి నన్ను నె
త్తెఱఁగున నైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ మునివర్గవాహనుఁడ వై చనుదెమ్మను మంతఁ దీరెడున్.౧౭౬

సమయం వస్తే గాని యేమీ చెయ్యలేం. నిన్ను పొందాలని అతనికుంటే మునివర్గాన్ని వాహనంగా చేసుకొని రమ్మని చెప్పు. అని శచీ దేవికి చెప్తాడు.
శచీదేవి నహుషుడిని అలానే కోరగా దానికి సమ్మతించి సప్తర్షిగణ వాహన సమేతుడనై వస్తానని చెప్పి అలానే రావటానికి ప్రయత్నిస్తాడు.
శచీ దేవి బృహస్పతిని రక్షింపవేడగా అతడు అగ్నిదేవుడిని పిలిచి ఇంద్రుని వెదికి రమ్మని పంపిస్తాడు. అగ్ని అన్నిచోట్లా వెదకి ఇంద్రుని జాడ కనుక్కోలేక తిరిగివచ్చి బృహస్పతితో ఇలా అంటాడు.
వ.
-----నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింప నేరనైతి నప్పుల వలన నగ్నియు బ్రాహ్మణులవలన క్షత్రియజాతియు నశ్మంబులవలన లోహంబును నుద్భవించె వాని వాఁడిమి యెల్ల యెడలనుం జెల్లుఁ దమతమ జన్మస్థానంబులయం దడంగుం గావున నీళ్ళు నాకు సంక్షయంబు సేయుట ప్రసిద్ధంబనిన విని యనిమిషగురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని.౧౮౫
అశ్మంబులు=ఱాళ్ళు
బృహస్పతి అగ్నికి తన మంత్రబలంచే అన్నిచోట్లకు వెళ్ళే వీలు కలిగించగా అగ్ని తిరిగివెళ్ళి ఇంద్రుని వెదకి పట్టుకుంటాడు. అక్కడికి మునులందరితో కలసి వెళ్తారందరూ.బృహస్పతి ఇంద్రునితో
క.
శరనిధి ఫేనంబున నా, హరి పొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దా
బరిమార్ప నీకు విజయము, దొరకొనియెం గాక దీన దోసము గలదే.౧౯౦
వ.
అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి----౧౯౧
------నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున.౧౯౭
క.
కష్టుం డగునానహుషుఁడు, నష్టాత్మకుఁ డయ్యె దివిజనాయక నీయు
త్కృష్ట చరితమున సురలకుఁ, దుష్టిగ నిజరాజ్యసంగతుఁడ వగు మనుచున్.౧౯౮
కష్టుండు=పాపి
క.
మునివరుఁ డైన యగస్త్యుఁడు, చనుదెంచిన శతమఖుండు సమ్మతి నుచితా
సనమిడి యర్ఘ్యముఁబాద్యము, నొనరిచి యిట్లనియె సవినయోక్తి నతనితోన్.౧౯౯

అగస్త్యు డింద్రునకు నహుషుభ్రష్టత దెలుపుట.
వ.
అనిన విని యమ్మునీంద్రుండి ట్లనియె నన్నహుషుని మోచివేసరుచున్న మునులతనికడ గోష్టీవినోదంబుల నుండి బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందు జెప్పఁబడి యుండునవి నీకుఁ బ్రమాణభూతంబు లగునే యని యడిగినం బాపనిశ్చయుం డై యతం డమ్మంత్రంబులు బ్రమాణంబులుగావనిన నే నమ్మాట నిషేధించి పూర్వాచార్యులచేత నభినందితంబు లగు మంత్రంబుల నిందించుట యజ్ఞానం బని వివాదంబు సేసిన నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నిన నతనిం గనుంగొని పుణ్యహీనుండును దేజో(హాని)దీనుండును నగుట యుపలక్షించి నీవు పూజనీయు లయిన మహామునుల నిన్ను వహింపంబనిచితి వారలు కొనియాడుమంత్రంబుల గర్హించి తదియుంగాక నన్ను నవమానించితి గావున నింద్ర పదభ్రష్టుండ వై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగంబ వై యుండు మని శాపం బిచ్చి పదంపడి యనుగ్రహించి భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డవుపెంపు గలిగి యుథిష్ఠరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు బడయు వాఁడ వనిన దత్క్షణంబ,౨౦౧
క.
స్వర్గ పద భ్రష్టుం డై , దుర్గతికిం బోయె నతఁడు దుశ్టాత్ములకున్
దౌర్గత్యము సుజనులకు, న నర్గళసద్గతియు నగుట యరుదే యెందున్.౨౦౨

ఈవిధంగా ఇంద్రుడంతటివానికే కష్టములు పడక తప్పలేదు.
క.
కావున మీపడినయర,ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి, నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.౨౦౮

అని శల్యుఁడు ధర్మరాజుతో పలికెను.


Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౪
దేవతలు నహుషుని సురరాజ్యాభిషిక్తునిం జేయుట
తే.
శరణు చొచ్చిన రక్షింపఁ జాలియుండి, కడపి పుచ్చిన నూర్థ్వలోకములు దప్పుఁ
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె, కమలగర్భుండు తొల్లి జగద్ధితముగ.౧౬౧
కమలగర్భుండు=బ్రహ్మ

బ్రహ్మ హత్యా పాతకం వలన నీచ దశకు వచ్చిన ఇంద్రుడు నిషధాచలానికి వెళ్ళి అక్కడే దాగి వుంటాడు. దేవతలు, మునులూ కలసి మానవలోకం లోని నహుషుణ్ణి ఇంద్రపదవిని చేపట్టమని కోరతారు. ఆతడు ఇంద్రపదవిని అధిష్టించటానికి వీలు కలిగేలా యమవరుణాది త్రిదశులు, కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ విద్యాధరాది వారందరి దగ్గరనుంచి కొంత కొంత తేజో విశేషములను గ్రహించి బహు బలవంతుడౌ తాడు. కొంతకాలానికి నహుషుడు మదమెక్కిన వాడై ఇంద్రుని భార్య యైన శచీదేవిని పొందగోర్తాడు. అతడామెకు కబురుపెట్టగా ఆమె భయకంపితయై దేవగురువైన బృహస్పతిని శరణు వేడుతుంది. నహుషుడు ఇది తెలిసి దేవగురువు ఇలా ఆమెకు తన ఇంటిలో ఆశ్రయం ఇవ్వటం తప్పు అని అంటాడు. పైగా ఇంద్రుడు అహల్యని కోరినప్పుడు మీరతనికి ఇలా ఎందుకు బుద్ధి చెప్పలేదు అని మునులతో వాదిస్తాడు. అప్పుడా మునులందరూ శచీదేవిని నహుషుని దగ్గఱకు తీసుకువద్దామనే ఉద్దేశ్యంతో బృహస్పతి దగ్గరికి వెళ్తారు. వారందరూ నహుషుడు ఇంద్రపదవిలో ఉన్నాడు కాబట్టి శచీదేవి అతనిదగ్గరకు రావటం లో తప్పులేదంటారు. శచీదేవి అలా అయితే మీరంతా నన్ను శుచివని అనే వాక్యం అబద్ధమోతుందిగదా అని అంటుంది.ఆ సమయంలో బృహస్పతి
వ.
అనిన విని దరహసితవదనుం డగుచుఁ బురుహితబురోహితుండు.౧౫౮
క.
నహుషుండు పనుచువాఁ డటె, విహితానుష్ఠానపరులు వీ రటె తాలో
కహితం బటె యిది మనకున్, మహనీయమ కాక యెట్లు మానఁగ వచ్చున్.౧౫౯
వ.
అని యుల్లసం బాడి యనిమిషులను రుషులను జూచి యిట్లనియె.౧౬౦
తే.
శరణు చొచ్చిన రక్షింపఁ జాలియుండి, కడపి పుచ్చిన నూర్థ్వలోకములు దప్పుఁ
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె, కమలగర్భుండు తొల్లి జగద్ధితముగ.౧౬౧

అలా అని బృహస్పతి అడ్డు చెప్పగా అందరూ కలసి ఆలోచించి శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళి అతడిని కలియటానికి కొంత గడువు కోరి రావటం మంచిదంటారు. శచీదేవి అలానే వెళ్ళి కొంత గడువు కోరి వస్తుంది.
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౩
శల్యుఁడు ధర్మరాజుకు ఇంద్రుడు శచీసమేతంగా పడిన కష్టాల్ని ఇలా చెప్తాడు.
పూర్వం దేవతల్లో మాన్యుడైన త్వష్ట అనేవాడు ఇంధ్రునికి కీడు చేయ దలచి విశ్వరూపుడనే మూడు తలలవాణ్ణి సృష్టించాడు. అతడు ఇంద్రపదవికోరి తపస్సు చేస్తాడు. ఇంద్రుడు మామూలుగా అప్సరసల్ని పంపి తపస్సు భగ్నం చెయ్యాలనుకుంటాడు. అది సాధ్యం కాకపోయే సరికి ఇంద్రుడతడిని చంపివేసి ఎవ్వరికీ తెలియదుగదా అనుకుంటాడు. కాని ఓ ఏడాది గడిచేసరికి భూతగణములాక్రోశము చేయగా ఇంద్రుడో విషమవ్రతం చేసి తద్వారా తనుచేసిన బ్రహ్మహత్యా పాపాన్ని సముద్ర తరు ధరణీ స్త్రీజనములందు విభాగించి పెట్టి (ఇలా కూడా చేయొచ్చన్నమాట) నిజకల్మషాన్ని బాపికొని ఉండగా త్వష్ట కోపించి
తే.
అనపరాధుఁ దపోనిధి నధిక శాంతి, యుక్తుఁ జంపినపాపాత్ము నుఱుక పట్టి
మ్రింగఁ జాలెడువాని నుత్తుంగ దేహు, నేను సృజియింతుఁ జూడుఁడీ యీ క్షణంబ.౧౨౧

అని వృత్రుడనేవాణ్ణి సృష్టించి ఇంద్రునిమీదకు యుద్ధానికి పంపుతాడు.వృత్రుడు ఇంద్రుణ్ణి మింగివేస్తాడు.అప్పుడు దేనతాగణము అతనికి ఆవులింత కలిగేలా చేస్తారు. అప్పుడు ఇంద్రుడు సంకుచిత దేహుడై బయట పడతాడు.
తరువాత యుద్ధంలో గెలువలేక గెలిచే ఉపాయం చెప్పమని విష్ణుదేవుణ్ణి అడుగుతారు. అప్పుడు కొంతకాలం తర్వాత ఇంద్రుని వజ్రయుధపు అంచును ఆశ్రయిస్తానని అప్పుడింద్రుడతణ్ణి సంహరించవచ్చని చెప్పి ప్రస్తుతానికి వారిద్దరూ స్నేహం చేస్తే మంచిదని చెప్తాడు. అప్పుడు మునులందరూ వృత్రుడిని చేరి ఇలా అంటారు.
క.
భుజబల దుర్జయుఁ డింద్రుం, డజయ్యుఁడవు నీవు నీకు నతనికి మీలో
విజయము దక్కదు మీ రే,చి జగంబులు నొవ్వ రణము సేయఁగ నేలా.౧౩౩
క.
మైత్రీ సౌఖ్యముఁ బోలునె, శాత్రవ మెమ్మెయిఁ దలంప శక్ర శ్రీకిం
బాత్రమ వై యొప్పుగఁద,న్మిత్రుఁడ వగు మిదియ మేలు మీ యిద్దఱకున్.౧౩౪

పైగా సత్పురుష సాంగత్యము సంభవించినపుడు చేయకుండా వుండటం నీతిగాదని అంటారు. అప్పుడు వృత్రుడు వారినుంచి ఆర్ద్రమైనదానివలన గాని శుష్కమైనదాని వలన గాని పగలుకాని రాత్రికాని తరువువల్లకాని పాషాణము వల్లకాని శస్త్రాస్త్రముల వల్లగాని చావు లేకుండా వుండే వరం ఇస్తే ఇంద్రునితో స్నేహం గా వుంటానంటాడు. దానికి అందరూ అంగీకరిస్తారు.
ఒకరోజు సాయంకాలం వృత్రుడు సముద్రతీరానున్నపుడు, ఇంద్రుడు రాత్రి పగలూ కాని అసుర సంధ్యాసమయంలో
ఆర్ద్రమూ శుష్కమూ కాని సముద్రపు నురుగును వజ్రాయుధం అంచుకు పట్టించి వృత్రుని మెడ నరకగా అదే సమయంలే వజ్రాయుధపు అంచుని విష్ణువు ఆవహించి ఉండి వృత్రుడిని చంపగలుగుతాడు. వృత్రుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడిని ఆవహించటం చేత దేవలోక సింహాసనార్హత కోల్పోతాడింద్రుడు.
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౨
శల్యుఁడు పాండవుల జూడ నుపప్లావ్యంబునకు వచ్చుట
తే.
మేలు చేసితి రొక్కరి మెచ్చి వారి, కోర్కి దీర్చుట పెద్దలగుణమె కాదె
యది మదీయచిత్తమునకు హర్ష కరమ, తివిరి యొక్కటి వేఁడెద నవధరింపు.౧౦౯

శల్యుడు నకుల సహదేవులకు మేనమామ అవుతాడు. యుద్ధప్రారంభంలో పాండవులను చూద్దామని , అవసరం అయితే వారికి సహాయం చేద్దామని వస్తూండగా దుర్యోధనుడు అది తెలిసికొని అతడు వచ్చే మార్గంలో అతనికి ఎన్నో సదుపాయాలు తాను ప్రచ్ఛన్నంగా వుంటూ కలగజేస్తాడు.శల్యుడు పాపం అవన్నీ పాండవులే తనకోసం ఏర్పాటు చేసారనుకుంటాడు. ఆసమయంలో దుర్యోధనుడు అతనికి కనిపించగా ఓ వరం కోరుకోమని అంటాడు శల్యుడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని తన పక్షంలో చేరమని అడగ్గా అలాగే నని వరం ఇస్తాడు. తరువాత పాండవుల్ని కలసికొని శల్యుడు జరిగిన విషయం అంతా ధర్మరాజుకు వివరిస్తాడు. అప్పుడు ధర్మరాజతనితో పై విధంగా అంటాడు.
వ.
పార్థునకుఁ గృష్ణుండు సారథ్యంబు సేయువాఁ డై యున్నవాఁడు. కర్ణుండు పార్థుతో నెప్పుడు మచ్చరించుచునుండు వీరిరువురకు సంగ్రామం బైనయపుడు కృష్ణునకుఁ బ్రతిసారథ్యం బొనరింప మీరకాని యక్కడం దక్కొరుండు లేఁడు కావున నవశ్యంబును మీకుం గర్ణసారథ్యంబు కర్తవ్యంబు గాఁగలయది సమరసమయంబున నిరాకరించి పలికి కర్ణుచిత్తంబునకుం గలంక పుట్టించి పార్థు రక్షింపవలయు నకృత్యం బని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల నివ్విధంబనుష్ఠింప వలయునని యభ్యర్థించిన సమ్మతించి శల్యుండిట్లనియె.౧౧౦
అకృత్యం=చేయరానిది(దోషము)
(ఇక్కడ కూడా ధర్మరాజు అధర్మానికి పాల్పడ్డటయిందిగదా అని ఓ సందేహం నా చిన్న బుర్రకి- ఎవరయినా ఈ సందేహం కూడా తీరిస్తే బాగుంటుంది గదా)

అలా శల్యుడు ధర్మరాజుకు మాట యిచ్చిన తరువాత కర్ణుడు ఆరోజు సభలో ఆడినమాటల వలన తన మనసు బాగా నొచ్చుకుందని చెప్పి బాధపడవొద్దు కష్టాలు పెద్దపెద్ద వాళ్ళకే తప్పలేదు మనమనగా నెంత ఇంద్రుడంతటివాడికే తప్పలేదు అంటూ ఇలా అంటాడు.
క.
వాసవుఁడు తొల్లి నిజకాం,తా సహితముగాఁగ నధికదైన్యము వొందెన్
మీ సంపద పెద్దయె విధి, చేసినగతిఁ బడయకుండ శివునకు వశమే.౧౧౬

అలా అనగానే ఆ వృత్తాంతాన్ని చెప్పమని ధర్మరాజడుగుతాడు.అప్పుడు వృత్తాసుర వధని గురించి శల్యుడు ధర్మరాజుకు చెప్తాడు.
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౧

సాత్యకి దుర్యోధనుకడకు దూతం బంప గూడ దని చెప్పుట
చ.
పలికిన చందముల్ నెఱపి పైతృక మై చను రాజ్యభాగ మి
మ్ములఁ బడయం దలంచి బలముం జలమున్ నెఱపం గడంగు వీ
రలు నొరు వేఁడఁ బోదురె యరాతులు సాధుల మెత్తురే రణం
బుల జయలక్ష్మిఁ జేకొనుటఁ బోలునె యొండొక రాజధర్మముల్. 26

విరాటు కొలువులో అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తదుపరి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండాలో నిర్ణయించడానికి కూడిన సభలో సాత్యకి ' అన్నమాట ప్రకారం నడచుకొని పిత్రార్జితమైన రాజ్యభాగం కోసం బలమూ చలమూ కలిగిన ఈ పాండవులు ఒకరిని యాచించబోరు.శత్రువులు సాధువులైనవారిని మెచ్చుకుంటారా? యుద్ధములో జయలక్ష్మిని చేకొనుటను యింకో రాజధర్మమేదయినా పోలునా?' అంటాడు.

యుద్ధము వలనగాని రాజ్యభాగము సిద్ధించదు అంటూ ద్రుపదుడు ఇలా అంటాడు.
క.
మృదుభాషణములదుర్జన, హృదయములు ప్రసన్నతామహిమఁబొందునె యె
ల్లిదముగఁ గొని యంతంతకు, మద మెక్కుంగాక దురభిమానము పేర్మిన్. 35

మెత్తనిమాటల వలన దుర్జనులైన కౌరవుల హృదయాలు ప్రసన్నం కావు. తేలికగా తీసుకుని అంతకంతకూ దురభిమానంతో మద మెక్కుతారు.

దుర్యోధనుడు అర్జునుడు కృష్ణ సహాయాన్నర్థించి వచ్చిన ఘట్టంలో నారాయణాభిధానులు పది వేల సైన్యం ఒకవైపు (వారందరూ యుద్ధం చేస్తారు) , తా నొకడూ ఒకవైపుగా(తాను ఆయుధాన్ని పట్టడు) విభాగం చేసి--
క.
వారొక తల యే నొక తల , యీ రెండు దెఱంగులందు నెయ్యది ప్రియ మె
వ్వారికిఁ జెప్పుడు తొలితొలి, గోరికొనన్ బాలునికిఁ దగుం బాడిమెయిన్. 75
ముందుగా వయసులో చిన్నవాడైన అర్జునుడు కోరుకోవటం న్యాయం అంటాడు కృష్ణుడు.

ఈ ఘట్టంలో కొస్తే తిరుపతి వేంకటకవుల పాండవ ఉద్యోగ విజయాల పైకే మనసు పరిగెట్టుకు పోతుంది.