Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౨
శల్యుఁడు పాండవుల జూడ నుపప్లావ్యంబునకు వచ్చుట
తే.
మేలు చేసితి రొక్కరి మెచ్చి వారి, కోర్కి దీర్చుట పెద్దలగుణమె కాదె
యది మదీయచిత్తమునకు హర్ష కరమ, తివిరి యొక్కటి వేఁడెద నవధరింపు.౧౦౯

శల్యుడు నకుల సహదేవులకు మేనమామ అవుతాడు. యుద్ధప్రారంభంలో పాండవులను చూద్దామని , అవసరం అయితే వారికి సహాయం చేద్దామని వస్తూండగా దుర్యోధనుడు అది తెలిసికొని అతడు వచ్చే మార్గంలో అతనికి ఎన్నో సదుపాయాలు తాను ప్రచ్ఛన్నంగా వుంటూ కలగజేస్తాడు.శల్యుడు పాపం అవన్నీ పాండవులే తనకోసం ఏర్పాటు చేసారనుకుంటాడు. ఆసమయంలో దుర్యోధనుడు అతనికి కనిపించగా ఓ వరం కోరుకోమని అంటాడు శల్యుడు. అప్పుడు దుర్యోధనుడు అతనిని తన పక్షంలో చేరమని అడగ్గా అలాగే నని వరం ఇస్తాడు. తరువాత పాండవుల్ని కలసికొని శల్యుడు జరిగిన విషయం అంతా ధర్మరాజుకు వివరిస్తాడు. అప్పుడు ధర్మరాజతనితో పై విధంగా అంటాడు.
వ.
పార్థునకుఁ గృష్ణుండు సారథ్యంబు సేయువాఁ డై యున్నవాఁడు. కర్ణుండు పార్థుతో నెప్పుడు మచ్చరించుచునుండు వీరిరువురకు సంగ్రామం బైనయపుడు కృష్ణునకుఁ బ్రతిసారథ్యం బొనరింప మీరకాని యక్కడం దక్కొరుండు లేఁడు కావున నవశ్యంబును మీకుం గర్ణసారథ్యంబు కర్తవ్యంబు గాఁగలయది సమరసమయంబున నిరాకరించి పలికి కర్ణుచిత్తంబునకుం గలంక పుట్టించి పార్థు రక్షింపవలయు నకృత్యం బని యనుమానింపక మత్ప్రార్థనంబున నెల్లభంగుల నివ్విధంబనుష్ఠింప వలయునని యభ్యర్థించిన సమ్మతించి శల్యుండిట్లనియె.౧౧౦
అకృత్యం=చేయరానిది(దోషము)
(ఇక్కడ కూడా ధర్మరాజు అధర్మానికి పాల్పడ్డటయిందిగదా అని ఓ సందేహం నా చిన్న బుర్రకి- ఎవరయినా ఈ సందేహం కూడా తీరిస్తే బాగుంటుంది గదా)

అలా శల్యుడు ధర్మరాజుకు మాట యిచ్చిన తరువాత కర్ణుడు ఆరోజు సభలో ఆడినమాటల వలన తన మనసు బాగా నొచ్చుకుందని చెప్పి బాధపడవొద్దు కష్టాలు పెద్దపెద్ద వాళ్ళకే తప్పలేదు మనమనగా నెంత ఇంద్రుడంతటివాడికే తప్పలేదు అంటూ ఇలా అంటాడు.
క.
వాసవుఁడు తొల్లి నిజకాం,తా సహితముగాఁగ నధికదైన్యము వొందెన్
మీ సంపద పెద్దయె విధి, చేసినగతిఁ బడయకుండ శివునకు వశమే.౧౧౬

అలా అనగానే ఆ వృత్తాంతాన్ని చెప్పమని ధర్మరాజడుగుతాడు.అప్పుడు వృత్తాసుర వధని గురించి శల్యుడు ధర్మరాజుకు చెప్తాడు.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౪
పాంచాలీ పాండవులు తమ మెలంగవలయుపనుల నిశ్చయించుకొనుట.
పాండవులు విరాటుని కొలువులో తమ అజ్ఞాతవాస కాలాన్ని గడపాలని నిర్ణయించుకొని వారందరూ ఈ క్రింది పేర్లతో వ్యవహరింప బడాలని అనుకుంటారు.
ధర్మరాజు- కంకుడు
భీమసేనుడు-వలలుడు
అర్జునుడు-బృహన్నల
నకులుడు-దామగ్రంథి
సహదేవుడు-తంత్రీపాలుడు
ద్రౌపది-మాలిని
వీరందరూ పూర్వం ధర్మరాజు ఆస్థానంలో పనిచేసేవారమని కూడా చెప్పుకుంటారు.
(ధర్మరాజు ఇక్కడ అబద్ధం ఆడాడు గదా అని నాకో చిన్న అనుమానం-ఎవరైనా తీర్చగలిగితే బాగుణ్ణు)

ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మంబు లెఱింగించుట
ఈ సేవా ధర్మాలు సార్వకాలికాలు మరియు సేవలు చేసే ఉద్యోగులందరికీ అనుసరణీయాలు అనిపిస్తుంది.
క.
తగఁ జొచ్చి తనకు నర్హం, బగునెడఁ గూర్చుండి రూప మవికృత వేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన, జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్.౧౨౧

తన ఊద్యోగానికి అర్హమైన చోటనే కూర్చుని రూపం ఎంతోకొంతైనా వికృతంగా మార్చుకొని సమయాన్నెఱిగి సేవిస్తే అటువంటి ఉద్యోగి పట్ల యజమాని ప్రసన్నంగా ఉంటాడట.
క.
నరనాథుఁ గొలిచి యలవడ, దిరిగితి నా కేమి యనుచు దేఁకువ లేక
మ్మరియాద దప్పమెలగినఁ, బురుషార్థంహబునకు హాని వుట్టక యున్నే.౧౨౨
తేకుఁవ=భయము

నేను రాజుగారిదగ్గర ఉద్యోగం చేస్తున్నా నాకేవి టనుకుని మర్యాద తప్పి ప్రవర్తిస్తే మొత్తం ఉద్యోగానికే మోసం వస్తుంది.
ఉ.
రాజగృహంబుకంటె నభిరామముగా నిలు గట్టఁ గూడ దే
యోజ నృపాలుఁ డాకృతికి నొప్పగువేషము లాచరించు నే
యోజ విహారముల్ సలుప నుల్లమునం గడువేడ్క సేయు నే
యోజ విదగ్ధు డై పలుకు నొడ్డులకుం దగ దట్లు సేయఁగన్.౧౨౩

రాజుగారింటెదురుగా మనం ఇల్లు కట్టుకోకూడదు. రాజు గారు ఏయే సమయాల్లో ఏయే విధంగా మనం ప్రవర్తిస్తే అనుకూలు డవుతాడో అయా సమయాల్లో ఆయా విధంగా ప్రవర్తించాలి .
క.
పుత్రులు పౌత్రులు భ్రాతలు, మిత్రు లనరు రాజు లాజ్ఞ మీఱిన చోటన్
శత్రులకాఁ దమయలుకకుఁ, బాత్రము సేయుదురు నిజశుభస్థితిపొంటెన్.౧౨౪

ముఖ్యమైన విషయం.రాజులు తమ ఆజ్ఞను మీరినవారిపట్ల చాలా కఠినంగా వుంటారు. కొడుకులైనా, మనవలైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా సరే లెక్కచేయకుండా తమ ఆగ్రహానికి పాత్రులను చేస్తుంటారు సుమా.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౩
కథా ప్రారంభము.
వ.
జనమేజయుండు వైశంపాయునున కిట్లనియె.౪౩
చ.
మహితసముజ్జ్వలాకృతులు మానధనుల్ జనమాన్యు లంగనా
సహితము గాఁగ నేమిగతి సమ్యగుపాయనిగూఢవృత్తిమై
నహితుల క ప్రమేభేద్యముగ నాపదుమూఁడగు నేఁడు మత్పితా
మహులు చరించి రంతయుఁ గ్రమంబున నా కెఱుఁగంగఁ జెప్పుమా.౪౪
నిగూఢవృత్తిమై=రహస్యమైన వ్యాపారము
ధౌమ్యుడు పాండవుల నూరార్చుట
ఉ.
ధర్మనిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయవృత్తి స
త్కర్మవిధిజ్ఞతం జతురతామహిమన్ దృఢబుద్ధి నెవ్వరున్
ధర్మజుపాటి గా రనఁగ ధాత్రిఁ బ్రసిద్ధుఁడ వై నయట్టినీ
పేర్మికి నీడె దుర్దశలపెల్లునకున్ దురపిల్లు టారయన్.౫౧
పేర్మికిన్=గొప్పదనమునకు
వ. అట్లుంగాక.52
క.
దేవతల కైన నొక్కొక,చో వలయున కాదె శత్రుసూదనవిధికా
లావాప్తికి మును దమస,ద్భావము లడఁచికొనియడఁగఁ బడి యుండగన్.౫౩
సీ.
నిషధాత్రి యం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును
నదితిగర్భంబున నవతార మై వామనాకారమున హరి యడఁగుటయును
జనని యూరుప్రదేశంబున నతినిగూఢంబుగా నౌర్వుండు డాఁగుటయును
ధేనుశరీరవిలీనుఁ డై యజ్ఞాతచర్య మార్తాండుండు సలుపుటయును
ఆ.వె.
వినమె యిట్లు వడినవీరలు పదపడి, తమకు నగ్గ మైన తఱి జయింప
రెట్లు ప్రబలి రిపుల నీవును నాపద, కోర్చి భంగపాటు దీర్చికొనుము.౫౪
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౧౦
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
ఆ.వె.
దారసంగ్రహంబు ధరణీశ రతిపుత్ర, ఫలము శీలవృత్త ఫలము శ్రుతము
దత్తభుక్త ఫలము ధనము వేదము లగ్ని,హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు
.౫౨

పెళ్ళికి రతి సుఖము, పుత్రులు కలుగుట ఫలము. శ్రుతులను వినటం వలన ఫలితం మంచి నడవడికను పొందటం. ఢబ్బుకు దానము, భోగము ఫలము. వేదమునకు ఫలం అగ్నిహోత్రం. అని తెలుసుకో.
చ.
బహుధనధాన్యసంగ్రహంబు బాణశరాసన యోధవీరసం
గ్రహము నిరంతరాంతరుదకంబులు ఘాసరసేంధనౌఘసం

గ్రహము ననేక యంత్రములుఁ గల్గి యసాధ్యము లై ద్విషద్భయా

వహు లగు చుండ నొప్పునె భవత్పరిరక్ష్యము లై న దుర్గముల్.
౫౩
దుర్గ రక్షణ వ్యవస్థ గురించి చెప్తున్నాడు.
బహు ధన ధాన్య సంగ్రహం ఐ వుండాలి. బాణాలను శరములను ప్రయోగించగల వీరులతో వుండాలి.నిరంతరాయంగా మంచినీరు, తృణజలకాష్ఠసమూహంతో కూడి వుండాలి.అనేక యంత్రములు కలిగి శత్రువులకు భేధించరానిదై వుండాలి.
ద్విషద్భయా వహులు=?. నీచే రక్షించబడే కోట పై విధంగా వుందా? అని అడుగుతున్నాడు నారదుడు.
చ.
వదలక బుద్ధి నంతరరివర్గము నోర్చి జితేంద్రియుండ వై
మొదలన దేశకాలబలముల్ మఱి దైవబలంబుఁ గల్గి భూ

విదితబలుండ వై యహితవీరుల నోర్వఁగ నుత్సహింతె దు

ర్మదమలినాంధ చిత్తులఁ
బ్రమత్తులఁ నింద్రియనిర్జితాత్ములన్.౫౪

మంచి బుద్ధితో నీలోపలనున్న శత్రువర్గాన్ని వదలకుండా జితేంద్రియుడ వై మొదలనే దేశకాలబలములు ఇంకా దైవబలమూ కూడా కల్గి శత్రువులను ఓడించడానికి ఉత్సాహముతో నున్నావా.ఇంద్రియాలను వశపరచుకొనే వానిని జాగరూకుడవై కనిపెట్టుకుని వుంటున్నావా.
తే.
కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగియున్న, నీకు ముందఱఁజని రిపునృపులయందు దగిలి సామాద్యుపాయంబులొగినసంప్ర,యోగమునఁ జేసి వర్తిల్లుచున్నె చెపుమ.౫౪

నీవు యుద్ధానికి వెళ్ళేప్పుడు నీకంటే ముందుగా వెళ్ళి శతృవులలో చేరి సామాద్యుపాయములతో నీ విజయానికి సహాయకారిగా చేసుకొంటున్నావా చెప్పు.
వ.
మఱియు నాస్తిక్యం బనృతంబు ప్రమాదం బాలస్యం లనర్థజ్జ్ఞులతోడిచింతనంబు క్రోధంబు దీర్ఘచింత దీర్ఘ సూత్రత యెఱుకగలవారి నెఱుంగమి యర్థంబులయం దనర్థకచింత నిశ్చితకార్యంబులు సేయమి మంత్రంబుల రక్షింపమి శుభంబుల బ్రయోగింపమి విషయంబులం దగులుట యనం బరగిన పదునాలుగు రాజదోషంబుల పరిహరించితె యని నారదుడు ధర్మరాజును అడుగుతాడు.౫౬
రాజైనవాడు పరిహరించాల్సిన పద్నాలుగు దోషాలను తెలియజేస్తాడిక్కడ.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౨
వ.
"కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్య సేత్వం, కిం కాలకూటః కిము వా యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే." యని నీవు తొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున నవధరించి భక్తవత్సలుండగు హరిహరనాధుండు నీ దెస దయాళుం డై యునికిం జేసి నిన్నుం గృతార్థునిఁ జేయం గార్యార్థి యయి నాకలోకనివాసియయిన నాకుఁ దనదివ్యచిత్తంబునం గల యక్కారుణ్యంబు తెఱం గెఱుంగునట్టిశక్తిం బ్రసాదించి నన్ను నాకర్షించి కొలిపించుకొని వీఁడె విజయం చేయుచున్నవాఁ డనుచుం జూపుటయు సవిశేషసంభ్రమసంభరితహృదయుండ నయి గలయం గనుంగొను నప్పుడు.౧౧
పరిష్క్రియాయాం=అలంకారము నందు
అవధరించి=చిత్తగించి
సీ.
కరుణారసము పొంగి తొరఁగెడుచాడ్పున శశిరెఖ నమృతంబు జాలువాఱ
హరినీలపాత్రిక సురభిచందనమున్న గతి నాభి ధవళపంకజము మెఱయ
గుఱి యైన చెలువున నెఱసినలోకరక్షణ మన గరళంబుచాయ దోఁప
బ్రథమాద్రిఁ దోతెంచుభానుబింబంబు నా నురమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప
తే.
సురనదియును గాళిందియు బెరసినట్టి, కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి
నామనంబు నానందమగ్నముగఁ జేయ, నెలమి సన్నిధి సేసే సర్వేశ్వరుండు.౧౨
హరినీలపాత్రిక=ఇంద్రనీలమణుల పాత్ర, గుఱి=గురుతు
క.
పారాశర్యుని కృతి యయి, భారత మనుపేరఁ బరఁగు పంచమవేదం
బారాధ్యము జనులకుఁ ద,ద్గౌరవ మూహించి నీ వఖండిత భక్తిన్.౧౭
పారాశర్యుడు=వేదవ్యాసుడు
ఆరాధ్యము=పూజింపఁదగినది
తే.
తెనుఁగు బాస వినిర్మింపఁ దివురుటరయ, భవ్యపురుషార్థతరుపక్వ ఫలముగాదె
దీని కెడ నియ్యకొని వేడ్క నూని కృతిప,తిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ.౧౮
ఎడ=హృదయము
ఉ.
ఇంతకు నేర్చునీకు నొకయింతటిలోన మదీయవాణి న
త్యంతవిభూతిఁ బెం పెసఁగునట్టినినుం గొనియాడ జేత దా
నెంతటిపెద్ద నీ కరుణ నిట్లు పదస్థుఁడ నైతి నింక జ
న్మాంతరదుఃఖముల్ దొలఁగునట్లుగఁ జేసి సుఖాత్ముఁ జేయవే.౨౧
చేఁత=చేయుట
ఉ.
ఇట్టిపదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారతసంహితఁ జెప్పఁ గంటి నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమకారుణికత్వమహావిభూతికిన్.౨౭
పుట్టు=జన్మము, భారతసంహిత=భారతమను నితిహాసము
ఉ.
కూర్చుట నూత్న రత్నమునకుం గనకంబునకుం దగున్ జనా
భ్యర్చిత మైన భారత మపారకృపాపరతంంత్రవృత్తిమైఁ
బేర్చిన దేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ధి నా
నేర్చిన భంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్.౨౮
వరణీయుఁడ=కోరదగినవాడను
ఉ.
కావున భారతామృతముఁ గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
ధ్రావలి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయసంస్మృతి
శ్రీవిభవాస్పదం బయిన చిత్తము తోడ మహాకవిత్వదీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదం గృతుల్.౩౦
గర్ణపుటంబుల=చెవులను దొప్పలచేత
సాత్యవతేయసంస్మృతి శ్రీవిభవాస్పదంబు=వ్యాసుని స్మరణము అను సంపదయొక్క మహిమకు చోటు
అని విన్నపం చేసుకొని తిక్కన గారు భారత రచన కుపక్రమించారు.













Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౪
ధర్మరాజు ధౌమ్యునితో నిట్లనియె.
తే.
వనమునకు వచ్చి నవయంగ వల దుడుగుఁ, డనిన నుడుగక మీతోన యరుగుదెంతు
మనిరి బ్రాహ్మణుల్ వీరికాహార మేయు,పాయమున నుగ్రవనమునఁ బడయనేర్తు.౩౬
వ.
వీరల విడువనోప నేమిసేయుదు ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరాజున కి ట్లనియె.౩౭
ఆ.వె.
భూత రాశి తొల్లి పుట్టి బుభుక్షాభి,తప్త మయినఁ జూచి తద్భయంబు
నపనయింపఁ గడఁగి యదితిసుతాగ్రణి , కమలభాంధవుండు కరుణ తోడ.౩౮
కమలబాంధవుండు=సూర్యుఁడు
వ.
ఉత్తరాయణగతుం డై యుర్వీరసంబు పరిగ్రహించి దక్షిణాయనగతిం బర్జన్యభూతుం డై యోషధులం బడసి రాత్రులయందుఁ జంద్రకిరణాంమృతంబునంజేసి వానిం దడుపుచు వర్ధించి యం దన్నంబు పుట్టించి ప్రజాప్రాణాధారణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయం బని యెఱింగి తొల్లి భీమవైన్యకార్తవీర్యనహుషాదులు యోగసమాధిష్టితులై సూర్యభజనంబున నన్నంబుఁ బడసి యాపదల వలనం బ్రజలం సముద్ధించిరి గావున.౩౯
లయగ్రాహి.
వారిరుహమిత్రు నమరోరగమునిద్యుచరచారణగణ ప్రణుత చారుగుణు భూతా
ధారు నఖిల శ్రుతిశరీరు హరిశంకరసరోరుహభవప్రతిము దారుణతమిస్రా
వారణమరీచి పరిపూరిత దిగంతరు నఘారి నతికారుణికు సూర్యుఁ ద్రి జగ ద్ర
క్షారతుసహస్రకరుఁ గోరిభజియింపుము మనోరథఫలంబు లగు భూరిభుజనీకున్.౪౦
అని ధౌమ్యుడు ధర్మరాజునకు సూర్యుణ్ణి ఆరాఢించమని చెప్పగా ధర్మరాజావిధంగా చేసి సూర్యునివలన ఒక అక్షయపాత్రను పొంది దానిద్వారా ఆ ౧౨ సంవత్సరములు అతిథిలకు ఆహారాన్ని సమకూద్చుకుంటారు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౪
మత్స్యగంధి వృత్తాంతము, శ్రీ వేదవ్యాస మునీంద్రుని అవతారము
సీ.
చపలాక్షి చూపులచాడ్పున కెద మెచ్చుఁ జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీఁగయందంబు మది నిల్పు జఘనతలంబుపైఁ జరుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు వేడ్కతో మఱుమాట వినఁగఁదివురు
నతి ఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు
ఆ.వె.
నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు, లయ్యుఁగడువివిక్త మయిన చోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ, గాముశక్తి నోర్వఁగలరె జనులు.౩౮
పరాశర మహర్షి ఒకసారి మత్స్యకన్య యైన సత్యవతి యేకవస్త్రయై ఓడనడుపుతూ ఉన్నపుడు ఆమె జన్మరహస్యం
దివ్యదృష్ఠితో నెఱిఁగిన వాడై ఆమెయందు మదనపరవశుడయ్యి ఆమె ఓడ నెక్కి ఆ విధంగా ప్రవర్తించాడట.
ఉ.
సంచితపుణ్యుఁ డంబురుహ సంభవునంశము దాల్చి పుట్టి లో
కాంచితుఁ డైనవాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా
గించి జగంబులందు వెలిఁగించి సమస్త జగద్ధితంబుగాఁ
బంచమవేద మై పరఁగు భారత సంహితఁ జేసె నున్నతిన్.౪౭
సత్యవతి యందు పరాశరమునికి సద్యోగర్భంబున వేదవ్యాస మహర్షి జన్మిస్తాడు. ఆ వేదవ్యాసుడే వేదవాజ్ఞ్మయాన్ని విభాగించి లోకములలో వ్యాప్తి నొందించి సమస్తలోకాలకు హితవు గూర్చేట్లుగా పంచమ వేదమైన భారత సంహితను నిర్మిస్తాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౯
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
వలయు నమాత్యులుఁ జుట్టం,బులు మూలబలంబు రాజపుత్రులు విద్వాం
సులు బలసి యుండ నిచ్చలుఁ, గోలువుండుదె లోకమెల్లఁ గొనియాడంగన్.౪౮
క.
పరికించుచు బాహ్యాభ్యం,తర జనములవలన సంతతము నిజరక్షా
పరుఁడ వయి పరమహీశుల, చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్.౪౯
బయటను లోనను ఉన్న జనుల వలన ఎల్లప్పుడూ జాగరూకుడవై నీ రక్షణను చూసుకుంటూ ఇతర రాజుల కదలికల్ని నేర్పరులైన చారులనెడు కన్నులతో గమనిస్తున్నావు గదా.
క.
వెలయఁగ విద్వజ్జనము,ఖ్యులతోడ నశేషధర్మకుశలుఁడ వయి యి
మ్ముల లోకవ్యవహార,మ్ములు దయఁ బరికింతె నిత్యమును సమబుద్ధిన్.౫౦
ఆ.వె.
వార్తయందు జగము వర్తిల్లు చున్నది, యదియు లేనినాఁడ యఖిలజనులు
నంధకారమగ్ను లగుదురు గావున, వార్త నిర్వహింప వలయుఁ బతికి.౫౧
వార్త=అర్థానర్థవివేచన విద్య
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౩
ధర్మరాజు శౌనకునితో నిట్లనియె.
ఆ.వె.
జనునె నిజధనంబు సంవిభాగించి ,యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ
నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర,మంబ కాదె యుత్తమంబు వినఁగ.౩౦
అన్ని ఆశ్రమములలోకెల్ల గృహస్థాశ్రమమె ఉత్తమమైనదంటారు.
వ.
మఱి యార్తునకు శయనంబును భీతున కభయంబును దృషితునకు జలంబును బుభుక్షుతునకు నన్నంబును శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థధర్మంబు తృణభూమ్యుదకప్రియవచనాదరదానం బెల్లవారికి నశ్రమంబ యాత్మార్థంబుగా నన్నపాకంబును నసాక్షికభోజనంబును వృథాపశుఘాతంబును బాపహేతువు లగ్ని హోత్రంబులు ననడ్వాహంబులు నతిథిబాంధవవిద్వజ్జన గురు మిత్ర భామినీ నివహంబు లపూజితంబు లై యెగ్గు సేయును గావున గృహస్థుండు సర్వ సంతర్పకుండు గావలయుం గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్థంబు సాయంప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘనాశియుఁ గావలయు యజ్ఞ శేషం బమృతంబు నాఁ బరగు నతిథిభుక్త శేషంబు విఘసంబు నాఁబడు నట్టివృత్తి వర్తిల్లువాఁ డుత్తమగృహస్థుం డనిన ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె.౩౧
దుఃఖితునకు పడక, భయపడినవానికి అభయము, దప్పిగొన్నవానికి మంచినీరు, ఆఁకలి గొన్నవానికి అన్నము శాంతి పొందిన వానికి ఆసనాన్నిఇవ్వటం సనాతన ఉత్తమ గృహస్థధర్మము. గడ్డి, భూమినుండి వచ్చు నీరు, ప్రియవచనము వీటిని ఆదరముతో దానము చేయుట అందరికీ వీలయ్యేదే. తన కోసం మాత్రమే వంట చేసుకోవటం, ఒంటరిగా ఒక్కడే భోజనము చేయుట, వృథాగా పశువును కొట్టటం, ఇవి పాపాన్ని కలిగిస్తాయి. అగ్నిహోత్రములు, ఎగ్గులు, అతిథి బాంధవ విద్వజ్జన గురు మిత్ర సమూహములు పూజలేనిచో యెగ్గు చేస్తాయి.అందుచేత గృహస్థుడు అందరికీ అన్నీ సమకూర్చాల్సి వుంది. యజ్ఞ శేషము అమృతమే. అతిథి తినగా మిగిలినవి దేవతల భుక్తశేషము. అటువంటివాడు ఉత్తమ గృహస్థనబడతాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౮
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కృత మెఱిఁగి కర్త నుత్తమ, మతుల సభల సంస్తుతించి మఱవక తగుస త్కృతి సేయుదె కృత మెఱిఁగెడు, పతియె జగజ్జనులనెల్లఁ బరిపాలించున్.౪౬

చేయదగినది తెలిసికొని కర్తను సభలలో బాగుగా పొగడి మర్చిపోకుండా తగిన సత్కారమును చేస్తున్నావు గదా. చేయదగినదానిని తెలుసుకున్న రాజే జగాలనన్నీ పరిపాలించగలుగుతాడు.
సీ.
ఆయంబునందు నాలవభాగమొండె మూఁడవభాగమొండె నం దర్థమొండె గాని మిక్కిలి సేయఁ గాదు వ్యయం బని యవధరించితె బుద్ధి నవనినాథ యాయుధాగారధనాధ్యక్షములయందు వరవాజివారణావళులయందు బండారములయందుఁ బరమవిశ్వాసుల భక్తుల దక్షులఁ బంచితయ్య
ఆ.
గురుల వృద్ధశిల్పివరవణిగ్బాంధవ, జనుల నాశ్రితులను సాధుజనులఁ గరుణఁ బేదరికము వొరయకుండఁగఁ బ్రోతె, సకలజనులు నిన్ను సంస్తుతింప.౪౭
ఆదాయంలో నాల్గవభాగం ఆయుధాగార ధనాగారముల నిర్వహణకు, మూడవభాగాన్ని సైన్యాన్నిఅశ్వదళ నిర్వహణకు,
ఒకటిన్నర భాగాన్ని గజసైన్యనిర్వహణయందు ఖర్చుపెట్టాలి కాని అంతకు మించి ఖర్చు పెట్టరాదనే విషయం గ్రహించావు గదా. ధనాగార నిర్వహణలో దక్షులను భక్తులను పరమ విశ్వాసం గలవారినే నియమించుకొన్నావుగదా.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౨
శౌనకుడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట
తే.
జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు, లామిషం బెట్లు భక్షించునట్లుదివిరి
యెల్లవారును జేరి యనేకవిధుల, ననుదినంబును భక్షింతు రర్థవంతు.౨౭

నీటిలో చేపలు, ఆకాసములో పక్షులు మాంసాన్ని తినేటట్లుగా అందరూ చేరి డబ్బుకలవాణ్ణి ఎల్లప్పుడూ తింటూ ఉంటారు.
క.
అర్ధమ యనర్థమూలం, బర్థమ మాయావిమోహనావహము నరుం
డర్ఠార్జనదుఃఖమున న, పార్థీ కృత జన్ము డగుట పరమార్థ మిలన్.౨౮
అపార్థీకృతజన్ముడు=నిరర్థకమగు జన్మ కలవాడు

ధనము అనర్థాలకి మూలం. ధనము మాయావి , మోహాన్ని కలిగించేది. నరుడు ధనసంపాదనార్థం కలిగే దుఃఖం వల్ల నిరర్ధకమైన జన్మ కలవాడగుచున్నాడు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౩
ఉపరిచర వసు మహారాజు వృత్తాంతము
వ.
అట్టి యింద్రోత్సవంబున నతి ప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రధ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱు వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుడయి రాజర్షియయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపంబున బాఱిన శుక్తిమతి యను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతియై గిరినిరోధంబుంబాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నింగాఁ జేకొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చి పెట్టుమని తనపితృదేవతలు పంచిన నప్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.౨౬
భారతం లోని ఈభాగాన్ని ఆధారంగా చేసుకుని వసుచరిత్ర కావ్యం రామరాజభూషణునిచే వ్రాయబడిందని చెప్తారు.
సీ.
పలుకులముద్దును గలికి క్రాల్గన్నుల తెలుపును వలుదచన్నుల బెడంగు
నలఘు కాంచీపదస్థలములయొప్పును లలితాననేందు మండలము రుచియు
నళినీల కుటిల కుంతలముల కాంతియు నెల జవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును మెలపును గలుగు నగ్గిరికన తలఁచి తలఁచి
ఆ.వె.
ముదితయందుఁ దనదుహృదయంబు నిలుపుటఁ, జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద,మయ్యె నవనిపతికి నెయ్యమొనర.౨౭
రేతఃస్యందము=ఇంద్రియము పడుట
ఈ రేతస్సునుండి అద్రిక అనే అప్సరస ద్వారా మత్స్యరాజు,మత్స్యగంధి అనే ఇద్దరు పుట్టడం జరుగుతుంది.

Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౭
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
చోరభయవర్జితముగా, ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవధ్భృత్యవరుల్.౪౨

దొంగలవలని భయం లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నావా? నీ భృత్యులు చోరులనుండి ధనాన్ని గ్రహించి వారిని రక్షించటం లేదుగదా!
క.
ధరణీనాధ భవద్భుజ, పరిపాలిత యైన వసుధఁ బరిపూర్ణము లై
కర మొప్పుచున్నె చెఱువులు, ధరణి కవగ్రహభయంబు దనుకకయుండన్.౪౩
అవగ్రహ=వానలేమివలని
తనుకక
=కలుగక
రాజా! నీరాజ్యంలో చెఱువులన్నీ నీటితో నిండి ఉన్నాయా! వానలేమి భయం లేకుండా అంతా సుభిక్షంగా ఉన్నారుగదా.
చూడండి చెఱువుల ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ఎన్నో ఎన్నెన్నో చెఱువులు కబ్జా అయిపోయి , లేక పూడిపోయి ఉండి వ్యవసాయానికేమాత్రం ఉపయోగపడకుండా ఉంటున్నాయి.
క.
హీను లగు కర్షకులకును, భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న,నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.౪౪

పేదవారైన రైతులకు ధాన్యాన్ని,విత్తనాల్ని అలాగే వర్తకులకు అనూనముగా ఉత్తమ బుద్ధితో ఋణములను ఇస్తున్నావు కదా.
క.
పంగుల మూకాంధుల విక,లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁదశత్రునైనను, సంగరరంగమునఁ గాతె శరణంబనినన్.౪౫

కుంటి,మూగ,అంధ వికలాంగులను, బంధువులెవ్వరూ లేనివారిని దయతో బ్రోచుచున్నావు గదా ! ఆపద కలిగించిన శత్రువునైనా సరే శరణు వేడితే రక్షిస్తున్నావుగదా!
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౨
పాండవ ధార్తరాష్ట్రుల భేదకారణ సంగ్రహము
సీ.
వదలక కురుపతి వారణావతమున లక్కయిల్ గావించి యక్కజముగ
నందఱఁజొన్పి యం దనలంబు దరికొల్పఁ బనిచిన బాండునందను లెఱింగి
విదురోపదిష్ట భూవివరంబునం దపక్రాంతులై బ్రదికి నిశ్చింతులైరి
ధర్మువు నుచితంబుఁ దప్పని వారల సదమలాచారుల నుదితసత్య
ఆ.వె.
రతుల నఖిలలోకహిత మహారంభుల, భూరిగుణుల నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు, దురితవిధుల నెపుడుఁ బొరయ కుండ
.౧౪
పాండవులు ఎలాంటివారో వారిని దైవం ఎందులకు కాపాడుతుందో పై పద్యం చివరి మూడు పాదాలలోను వ్యాస మహర్షి వివరించటం జరిగింది.
శా.
ఆ నారాయణ పాండవేయగుణమాహాత్మ్యామల జ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్ జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై సాత్యవతేయ ధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాక్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంత విధ్వంసి యై.౨౧
ధీవనధి=బుద్ధియనెడి సముద్రమునుండి
అమృతసూతి=చంద్రుడు
అఘధ్వాంత=పాపమనెడి చీఁకటి
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-1
భారత మహిమము

వ.
ఆ వైశంపాయనుండును నఖిలలోకవంద్యుండయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారముసేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.౮

సీ.
కమనీయధర్మార్ధ కామమోక్షములకు నత్యంత సాధనంబయిన దాని
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్న వారల కభిమత శుభకరం బయిన దాని
రాజులకఖిల భూరాజ్యాభివృద్ధినిత్యాభ్యుదయ ప్రదం బయిన దాని
వాఙ్మనఃకాయప్రవర్తితానేక జన్మాఘనిబర్హణం బయిన దాని
ఆ.వె.
సత్యవాక్ప్రబంధ శత సహస్రశ్లోక, సంఖ్య మయిన దాని సర్వలోక
పూజ్య మయినదాని బుధనుత వ్యాస మ,హాముని ప్రణీత మయినదాని.౯
తవిలి= ఆసక్తి కలిగి
అఘనివర్తకంబు=పాపనివర్తకము

ధర్మార్థ కామమోక్షాలకి సాధనం, వినేవారికి శుభాల్నిచ్చేది, రాజులకు భూరాజ్యాభివృద్ధినిచ్చేది, వాక్ మనఃక్కాయములచే చేయబడిన అనేక పాపాల్ని నివర్తింప జేయగలిగేది, లక్షశ్లోకాత్మకమైనది, సకల లోకాలలో పూజింపబడేది, వ్యాస ప్రణీతమయినదీ ఈ మహాభారతము.
శా.
ఆయుష్యం బితిహాస వస్తు సముదాయం బై హికాముష్మిక
శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంత గృహంబు నాఁ బరఁగి నానావేద వేదాంత వి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భార తాఖ్యానమున్.౧౧
ఇతిహాసము=పూర్వకథలనెడి
ఆఖ్యానమున్=కథను
ఆయుస్సును పెంపొందించగలిగేది, పూర్వకథల సముదాయంతో కూడి ఐహికాముష్మిక శ్రేయాల్ని కలుగజేయటానికి కారణమైనది, ఉత్తమ సభా సేవ్యమయినది, ఆగమశాస్త్రాలకు గృహము వంటిదిగా ప్రసిద్ధినొంది - అన్ని వేదవేదాంతవిద్యల కాటపట్టయినట్టి మహాభారత కథను చెప్పడం మొదలుపెట్టాడు.
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౬
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
కులపుత్ర్రులైనసద్భృ, త్యులకును సత్కార మర్ధితోఁ జేయుదె వా
రలు నీ ప్రస్తవమున ని,మ్ములఁ గృతము దలంచి ప్రాణములు విడుతురనిన్.
౩౯

మంచి వంశములో పుట్టిన మంచి సేవకులకు కోరికతో సత్కారాలు చేస్తున్నావా? వారు నీ విషయంలో చేయదగువిషయాన్ని బాగుగా తలచి యుద్ధంలో ప్రాణాల్నిసైతం విడిచి పెడతారు.
క.
అనఘా నీ ప్రస్తనమున, నని నీల్గిన వీరభటులపోష్యుల నె
ల్లను బ్రోతె భోద నాచ్ఛా,దనముల వారలకు నెమ్మి తఱుఁగక యుండన్.
౪౦

నీ కారణంగా యుద్ధములో చనిపోయిన వీరభటుల మీద ఆధారపడినవారి నందరికి వారి వారి తిండీ గుడ్డా వగైరాలకి లోటు రాకుండా వారి క్షేమమును సరిగా చూసుకుంటున్నావుగదా.
క.
ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ,ర్పనివారలఁ బగఱవలనివారల ధృతి చా
లనివారల దుర్జనులం, బనుపవుగా రాచకార్యభారము దాల్పన్
.౪౧
రాచకార్యాలందు నియోగించ దగని వారి గురించి చెపుతున్నాడు.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౭
ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట
తక్షకుని విషాగ్నికి తన హర్మ్యంబుతో సహితముగ పరీక్షన్మహారాజు దగ్ధుడవుతాడు. తరువాత జనమేజయుడు ఉదంకునితో ప్రేరేపింపబడినవాడై సర్పయాగమున తక్షకాది కాకోదర సంహతిని అగ్నిలో పడి నాశనమయ్యేట్లుగా చేయదలచి పురోహితులను ఋత్విజులను పిలిచి వారితో ఇలా అంటాడు.
చ.
తన విషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్ర బాంధవజనుం డగు తక్షకు నుగ్ర హవ్యవా

హన శిఖిలన్ దహించి దివిజాధిపలోక నివాసుఁ డైన మ

జ్జనకున కీ యుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్.
౨౦౬

ఈవిధంగా యజ్ఞం ప్రారంభం అవుతున్నపుడు ఓ వాస్తుశాస్త్ర ప్రవీణుడు ఇది కడచననేరదని జోస్యంచెపుతాడు.
అయినా సరే అని యజ్ఞం ప్రారంభిస్తారు. తక్షకుడు ఇంద్రుని రక్షించమని వేడుకొంటాడు. వాసుకి చెల్లెలయిన జరత్కారువుని తన కొడుకు ఆస్తీకుని పంపించి ఆ యజ్ఞాన్ని ఆపుచేయించవలసినదని వాసుకి ప్రభృతులు కోరతారు. అప్పుడు తల్లి యనుజ్ఞనొంది ఆస్తీకుడు జనమేజయుని యాగశాల చేరుకుని జనమేజయుడిని ఆతని యజ్ఞాన్ని ఈ విధంగా స్తుతిస్తాడు.
మ.
రజనీనాథకులై క భూషణుఁడవై రాజర్షి వై ధారుణీ
ప్రజ నెల్లన్ దయతోడ ధర్మ చరితం బాలించుచుం దొంటి ధ

ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్

విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షతా
.౨౨౪
రజనీనాథ=చంద్ర
పారీక్షతా=పరీక్షత్పుత్రా
తరలము.
కువలయంబున వారికోరినకోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో

నవని రాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం

దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తు లైరి మహా ద్విజుల్
.౨౨౫
ఉ.
అమ్మనుజేంద్రుఁ డైన నలుయజ్ఞము ధర్మజురాజసూయయ
జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతి యజ్ఞముఁ బాశపాణి య

జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ య

జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా
.౨౨౬
చ.
వితతమఖప్రయోగ విధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుత సుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ

క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్సతి

క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వ విద్యలన్.
౨౨౭
విధివిత్తములు=కార్యము నెఱిఁగినవారు
పూర్వదిక్సతి=ఇంద్ర
శా.
విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృ
ష్ణద్వైపాయనుఁ డే గుదెంచి సుతశిష్యబ్రహ్మసంఘంబుతో

సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా

క్షాద్విష్ణుండవ నీవు భూపతులలోఁ గౌరవ్య వంశోత్తమా
.౨౨౮
ఉ.
ఆర్తిహర క్రియాభిరతుఁ డై కృతసన్నిధి యై ప్రదక్షిణా
వర్తశిఖాగ్ర హస్తముల వహ్ని మహాద్విజ దివ్యమంత్ర ని

ర్వర్తిత హవ్యముల్ గొనుచు వారిజ వైరికులేశ నీకు సం

పూర్తమనోరథంబులును
బుణ్యఫలంబులు నిచ్చు చుండెడున్.
ఆర్తిహర=దుఃఖమును దొలఁగించు
వారిజ వైరి=చంద్ర
(ఎవరినైనా మెప్పించి వారినుండి ఏ కోరికనైనా తీర్చుకోవాలంటే ఎలా మాట్లాడాలో ఇంతకంటె ఎక్కడా బాగా చెప్పుండరు)
వ.
అని జనమేజయుండు నాతనియజ్ఞ మహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతులయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.౨౩౦
ఉ.
మానిత సత్యవాక్య యభిమన్యు కులోద్భవ శాంతమన్యుసం
తానుఁడ వై దయాభి నిరతస్థితి నీవు మదీయబంధుసం

తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో

ర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్
.౨౩౧
శాంతమన్యుసంతానుఁడు =శాంతించిన కోప సమూహము గలఁవాడు
ఉపరతంబు=ఉడుగు
వ.
అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె.౨౩౩
క.
ఒనర జరత్కారమునీం,ద్రునకు జరత్కారునకు సుతుం డైనమహా
మునివరు నాస్తీకుని ముద,మునఁదలఁచిన నురగభయముఁ బొందదు జనులన్.
౨౩౭
ఆది పర్వము - ద్వితీయాశ్వాసము సమాప్తం.



Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-6
క.
క్రోధమ తపముం జెఱచును, గ్రోధమ యణిమాదులైన గుణముల బాపుం
గ్రోధమ ధర్మక్రియలకు, బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే
౧౭౪

క.
క్షమ లేని తపసితనమును, బ్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురా
జ్యము భిన్న కుంభమున తో, యములట్టుల యధ్రువంబులగు నివి యెల్లన్.
౧౭౫


పరీక్షితుడు అడవికి వేటకెళ్ళి అక్కడ శమీకు డనే మునీశ్వరుని- తను వేటాడుతున్న జంతువు గురించి వివరం అడిగి-, మౌనవ్రతుడైన ముని సమాధానం చెప్పక పోతే- అతని మెడలో చచ్చిన పాము శవాన్ని వేసి వస్తాడు. శమీకుని పుత్రుడు శృంగి ఇది తెలిసి పరీక్షితుడు ఏడు రోజులలో తక్షక విషాగ్ని వలన చనిపోతాడని శాపం ఇస్తాడు. శృంగి తరువాత తండ్రికి ఈ విషయం చెప్పగా శమీకుడు శోకించి కొడుకుతో పై విధంగా అంటాడు.
వ.
క్షమ విడిచి నీవు దృష్టాదృష్టవిరుద్ధంబైన క్రోధంబుఁ జేకొని సకలక్షమారక్షకుం డైన పరీక్షితునకుం బరీక్షింపక శాపంబిచ్చి చెట్ట సేసితివి. రాజ రక్షకులై కాదె మహామును లతిఘోరతపంబు సేయుచు వేదవిహితధర్మంబులు నడపుచు మహాశక్తిమంతు లయి యున్నవా రట్టిరాజుల కపకారంబు సేయునంతకంటె మిక్కిలి పాతకం బొం డెద్ది మఱియు భరతకుల పవిత్రుం డైన పరీక్షితు రాజ సామాన్యుంగా వగచితే.౧౭౬
వగచితే=తలఁచితివా?
ఉ.
క్షత్రియవంశ్యు లై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియవైశ్యశూద్రు లనఁగాఁ గల నాలుగు జాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామ మాం
ధాతృ రఘుక్షి తీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.౧౭౭ (పోలిక కొంచెం ఎక్కువయిందని పిస్తుంది)
వ.
అతండు మృగయా వ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుడయి యెఱుంగక నా కవజ్ఞఁ జేసె నేనును దాని సహించితి నమ్మహాత్మునకు నీ యిచ్చిన శాపంబుఁ గ్రమ్మఱింప నేర్తేని ల గ్గగు ననిన శృంగి యిట్లనియె.౧౭౮
నేర్తేని=సాధ్యమయితేని
క.
అలుక మెయిమున్న పలికితి, నలుకని నాపలుకు తీక్ష్ణమై యింతకు ను
జ్జ్వలదహనాకృతిఁ దక్షకుఁ, దలరఁగఁ బ్రేరేఁప కేల తా నెడ నుడుగున్.౧౭౯
తలరఁగన్=చలించునట్లుగ
వ.
నావచనం బమోఘం బనిన శమీకుండు శోకాకలితచిత్తుండై తన శిష్యున్ గౌరముఖుం డనువానిం బిలిచి దీనినంతయుఁ బరీక్షితున కెఱిగించి తక్షకువలనిభయంబు దలంగునట్టి యుపాయంబు చెప్పి రమ్మనిన వాఁడు నప్పుడ పరీక్షితు పాలికిం జని అన్ని విషయాలు తెలియజేస్తాడు--౧౮౦
తరువాత ఇక్కడో చిన్న కథ కూడా వుంది.
కశ్యపు డనే వైద్యుడొకడు తక్షక విషాగ్నిచే చనిపోయే పరీక్షితుని బ్రతికించి రాజు నుండి విశేషమైన ధనాన్ని పొందగోరి వెళ్తుంటాడు. ఇది తెలిసిన తక్షకుడు అతని కెదురుపడి అతన్నడిగి విషయం తెలుసుకొని నీకిది సాధ్యం గాదని సవాలు చేసి చేతనైతే- అక్కడ వున్న ఓ మహా వృక్షాన్ని కాటువేసి తన విషంతో బూడిదగా మార్చి- దానిని ముందటిలా తన వైద్యంతో పునర్జీవింప చేయమంటాడు. అతడు దానిని తన శక్తితో ముందటిలా పునర్జీవింప జేస్తాడు. అప్పుడు తక్షకుడే అతనికి విశేషమైన ధనాన్ని ఇచ్చి మరలింప చేస్తాడు. కొసలో చిన్నగమ్మత్తేంటంటే నిర్జనమైన అడవిలో జరిగిన ఈ విషయం బైట లోకానికెలా తెలిసిందన్నది. అక్కడ ఆ చెట్టుపైకి పుల్లలకోసం ఎక్కిన వాడొకడు చెట్టుతో పాటే దగ్ధమై మళ్ళీ చెట్టుతో పాటే పునర్జీవితుడైన వాడొకడు దీనిని ప్రజలకు చెప్పటం జరిగిందట. అదీ సంగతి.మన పూర్వీకుల్లో ఎంతెంత గొప్పవాళ్ళున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౪
గరుడుడు అమృతాన్నితెచ్చి ఉరగులకిచ్చి తను, తన తల్లి పంచభూతముల సాక్షిగా దాస్యమునుంచి విముక్తి పొందామని చెప్పివారిని శుచిగా స్నానం గట్రా చేసి వచ్చి ఆరగించమని చెప్పి శుభ్రమైన ప్రదేశంలో దర్భలపై అమృతం కలిగిన పాత్రను ఉంచి అక్కడినుంచి తల్లితో సహా వెళ్ళిపోతాడు. వారు శుద్ధులై వచ్చేలోగానే అదృశ్యరూపంలో గరుడుని వెనకాలే వచ్చిన ఇంద్రుడు ఆ పాత్రనక్కడినుండి తీసుకుని స్వర్గానికెళ్ళిపోతాడు.
వ.
అంత నయ్యురగులు నమృతం బుపయోగింపం గానక దానియున్నస్థానం బని దర్భలు నాకిన నాలుకలు రెండుగా వ్రయ్యుటం జేసి నాఁటంగోలె ద్విజిహ్వులు నాఁ బరగిరి యమృతస్థితిం జేసి బర్భలు పవిత్రంబు లయ్యె.౧౨౩


తరువాత శేషుడు తన వారు చెసిన పనికి విచారించి వారిని విడిచిపెట్టి బ్రహ్మ గురించి తపస్సు చేసి భూభారాన్ని ధరించేలా వరాన్ని పొందుతాడు.తల్లి శాపం వల్ల జనమేజయ సర్పయాగంలో ఉరగులకు గల మరణాన్నించి వాసుకి చెల్లెలైన జరత్కారువునకు జరత్కారుడనే మునీశ్వరునికి పుట్టే ఆస్తీకుడనేవాని వలన రక్షణ కలుగుతుందని బ్రహ్మ చెప్పాడట.
జరత్కారుని చరిత్రము
జరత్కారుడు వివాహానికి విముఖుడై వుంటే ఆతని పూర్వీకులు అతడు సంతానం లేకుండా వుండటం వలన వారికి సద్గతులు కలగటం లేదంటారు. అది తెలిసినవాడై పెళ్లి చేసుకోడానికి సిద్ధపడి తన పేరు వంటి పేరుగల సనామ్నినే చేసుకుంటానంటాడు. అప్పుడు వాసుకి చెల్లెలైన జరత్కారువు అనే ఆమెతో అతని వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన ఆస్తీకుడే జనమజేయుని సర్పయాగాన్ని విరమింప జేసి సర్పములను రక్షిస్తాడు. ఆ సందర్భంలోని అపుత్రకులకు గతులు కలుగవని చెప్పే పద్యం ఇది.
చ.
తగినసుపుత్రులం బడసి ధర్మువు దప్పక తమ్ము నుత్తముల్
పొగడఁగ మన్మహామతులు పొందుగతుల్ గడుఘోరనిష్ఠతోఁ
దగిలి తపంబు సేసియును దక్షిణ లిమ్ముగ నిచ్చి యజ్ఞముల్
నెగడఁగఁ జేసియుం బడయ నేర రపుత్రకు లైనదుర్మతుల్.౧౫౦
Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-5
నారదుఁడు ధర్మరాజును రాజనీతి విషయములం గొన్నిటి నడుగుట.
క.
ఉపధాశుద్ధులఁ బాప, వ్యపగతబుద్ధుల వినీతవర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె, నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.౩౬

ధర్మాదులచే పరిశుద్ధులైన వారు, పాపవ్యపగతబుద్ధులు, వినీతి వర్తనులు, సమదృష్టి కలిగిన వారు, నిపుణులు అయినవారిని బాగుగా పరీక్షించి ధనసంపాదనాది రాజకార్యాలలో నియోగింస్తున్నావా? గవర్నమెంటు ఆఫీసర్లకుండాల్సిన
లక్షణాలన్నమాట అవి.
ఉ.
ఉత్తమమధ్యమాధమనియోగ్యుల బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమమధ్యమాధమనియోగములన్ నియమించి తే నరేం
ద్రోత్తమ భృత్యకోటికి ననూనముగాఁ దగుజీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్.౩౭

రాజ ధర్మాల్ని ఎంత చక్కగా విశదీకరిస్తున్నారో చూడండి. ఉద్యోగులకు దయతో కాలము తప్పకుండా జీతాల్ని చెల్లిస్తుండాలట రాజు. ఎవరెవర్ని ఏ యే పనుల్లో నియోగించాలో బాగా తెలుసుకుని అలానే నియోగించాలట.
క.
తమతమకనియెడుతఱి జీ,తము గానక నవయుభటులదౌర్గత్యవిషా
దము లేలినవాని కవ,శ్యము నె గ్గొనరించు నతఁడు శక్రుండైనన్.౩౮

జీతాలు అందక ఉద్యోగులు బాధపడితే వాళ్ళ దుర్గతివల్ల కలిగే విషాదము ఆరాజు ఇంద్రుడైనా సరే అతనికి చెడును కలిగిస్తాయట.