Unknown
విరాట పర్వము- ప్రథమాశ్వాసము-౬
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మములు సెప్పుట
చ.
ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గానియట్లుగా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతనికంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్.౧౨౯

సేవకుడు రాజులదగ్గఱ మెలగాల్సిన విధం గుఱించి చెప్పాడు.
క.
నగళులలోపలిమాటలు, తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన, నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.౧౩౦

అంతఃపురం విషయాలు బైటికి చేరవేయకూడదు. తనకు బయట తెలిసిన విషయాలు రాజుకు ఉపయోగపడేవైతే అతనితో చెప్పాలి.
క.
అంతిపురము చుట్టరికం, బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయో
పాంతచరకుబ్జవామన, కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్.౧౩౧

అంతఃపురం గొడవలు చాలా సున్నితమైన విషయాలు.అక్కడి స్త్రీలతో పొందుకూడా భటుడైనవానికి నిషిద్ధమైనదే.
ఆ.వె.
ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం,బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నన, గలుగువారి కైనఁ గార్య మగునె. ౧౩౨

ఉత్తమమైన ఆసనములు, వాహనములు రాజుగారు తమకు ఇవ్వకుండా వాటిని తమంతట తామేఉపయోగించటం ఎంతటి చనువు గలిగివున్నవారికైనా తగిన కార్యం కాదు.
క.
మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశు కడన్
ము న్నున్న యట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు నాపద లడగున్.౧౩౩

ప్రభువు మన్నన చేసినపుడు పొంగిపోయి, అవమానించినపుడు క్రుంగి పొవటం కాకుండా ఎల్లప్పుడూ ఓకే విధంగా మునుపు వున్నట్లుగానే ఉండేవారికి శుభములు కలుగుతాయి., ఆపదలు తొలగుతాయి.
క.
జనపతి యెవ్వరినైనను, మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱిం
గినయేనిఁ దాను వెలిపు, చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్.౧౩౪

ప్రభువు ఎవ్వరిమీదైనా కత్తికట్టిన విషయం తనకు ముందుగా తెలిసినా సరే,దానిని ఎటువంటి మూఢుఢు కూడా ముందుగా బయటపెట్టకూడదు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment