Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౨
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట

క.
అనుపమ నియమాన్వితు లై, యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సినవారికంటె నక్రో,ధనుఁడు గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్
.౧౪౬

గొప్ప నియమాలతోకూడి సాటిలేని దక్షిణలను ఇచ్చిన వారికంటే కోపిస్టి కానివాడు చాలా గొప్పవాడని తత్త్వవిధిజ్ఞులు అంటారు.
క.
అలిగిన నలుగక యెగ్గులు, వలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
వలుకక బన్నమువడి యెదఁ, దలఁపక యున్నతఁడ చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
౧౪౭

ఎదుటివారు కోపగిస్తే తను కోపగించకుండా వుండి, వాళ్ళేమయినా నిందావాక్యాలు పలికితే వానిని విననియట్లే ప్రతివచనములేమీ పలకకుండా ఉన్నవాడే లోకంలో ధర్మజ్ఞుడనబడతాడు.
వ.
ఇట్లు దేవయాని నుద్ధరించి యయాతి నిజపురంబువ కరిగె నిట దేవయానియు శర్మిష్ఠ సేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని యేను వృషపర్వుపురంబు సొర నొల్ల శర్మిష్ఠచేత నాపడిన యవమానంబు మదీయజనకున కెఱింగింపు మని పంచిన నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతంబంతయు శుక్రునకుం జెప్పిన శుక్రుండును నాక్షణంబ కోపఘూర్ణితబాష్పపూరితనయన యై యున్న దేవయానింగని యీ పై చెప్పిన విధంగా అన్నాడు.౧౪౫

శర్మిష్ఠ చేసిన అవమానాన్ని సహించి తిరిగి వృషపర్వుని రాజ్యంలో అడుగే పెట్టనని దేవయాని తండ్రికి వర్తమానం పంపిస్తే శుక్రాచార్యులవారు వెంటనే అక్కడికివచ్చికూతురిని అనునయిస్తూ పై చెప్పిన నీతివాక్యాలను చెప్తాడు.
వ.
కావున బుద్ధిగలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు శర్మిష్ఠ రాచకూఁతురు గొండొకయది దానితోడి దేమి రమ్మనిన దేవయాని యిట్లనియె.౧౪౮
క.
కడుననురక్తియు నేర్పును, గడఁకయుఁ గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడువివేకశూన్యుల, కడ నుండెడునంతకంటెఁ గష్టము గలదే.౧౪౯

అనురక్తి, నేర్పు, యత్నము కలవారిని ఊరికే నిందలు పలికే వివేకములేని వారివద్ద ఉండటం కంటే కష్టం ఇంకోటేదీ ఉండదు.
అందుచేత వృషపర్వుని రాజ్యంలో తానుండలేనని యెక్కడ కైనా వెళ్ళిపోతానంటుంది దేవయాని. అలాగైతే నీతోపాటే నేనూను అని వాళ్ళిద్దరూ బయలుదేరబోతారు. ఇదంతా చారులవలన విన్న వృషపర్వుడు వేగంగా అక్కడికి వచ్చి శుక్రాచార్యులను తమని వీడి పోవద్దని, వారేమి కోరితే అది యిస్తానని వరమిస్తాడు. అప్పుడు దేవయాని శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో కూడా తనకు దాసి కావాలని వరం కోరుతుంది. రాజు శర్మిష్ఠను పిలిచి ఆమెను కన్యకాసహస్రంతో పాటుగా దేవయానికి దాసిగా ఉండేట్లు ఏర్పాటు చేస్తాడు.
ఆరోజుల్లో బ్రాహ్మణులకు రాజులు అంత వినయవిధేయలతో ఉండేవారు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment