Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౬

ఇంద్రుడు యయాతిని స్వర్గలోక భ్రష్టుం జేయుట

యయాతి మహారాజు పూరుని రాజ్యాభిషిక్తుని చేసిన తరువాత తపోవనమునకేగి శిలోంఛవృత్తి నవలంబించి వేయి సంవత్సారాలు తపస్సు చేసాడు. తరువాత నిరాహారుడయి ౩౦ సంవత్సరాలు, వాయుభక్షకుడుగా వుంటూ పంచాగ్ని మధ్యంలో వుంటూ ఒక సంవత్సరము, నీటిలో ఏకపాదము మీద నిలబడి ఇంకొక్క సంవత్సరము తపస్సు చేసి దివ్యవిమానంలో స్వర్గలోకం చేరి దేవర్షిగణ పూజితు డై, అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షి పూజితుండై అనేక కల్పములు అక్కడ గడిపి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రుడు అప్పుడతడిని ఈవిధంగా అడిగాడు.
శిలోంఛవృత్తి=ఱాళ్ళపైనిగింజల నేఱికొనుజీవనముచే
క.
ఏమితపం బొనరించితి, భూమీశ్వర పుణ్యలోక భోగంబులఁ దే
జోమహిమ ననుభవించితి, సామాన్యమె శత సహస్రసంవత్సరంబుల్.
౨౦౮
వ.
అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె.౨౦౯
క.
సుర దైత్య యక్ష రాక్షస, నర ఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భా
సురతపములు నా దగు దు,ష్కర ఘోరతపంబు సరియుఁ గా వమరేంద్రా
.౨౧౦
వ.
అని తన తపోభిమానంబున మహర్షు లతపంబు లవమానించి పలికిన నయ్యయాతి గర్వంబునకు సహింపక యింద్రుం డలిగి నీకు దేవలోక సుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తి యయ్యె నీ గర్వంబు నిన్నింత సేసె నింక నధోలోకంబున కరుగుమనిన వాఁడును మనుష్యలోకంబునకుం బోవనోప నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకుఁ బ్రసాదింపు మని యింద్రు ననుమతంబు వడసి.౨౧౧
సద్భువనంబున=సత్ భువనంబున=సత్ అనులోకమున
తే.
అంతరిక్షంబు నఖిల దిగంతములును
వెలుగఁ జనుదెంచునాతని విమల దీప్తి
సూచి సద్గణములు గడుఁ జోద్యమంది
రురుతరద్యుతి యిదియేమియొక్కొ యనుచు.౨౧౨

యయాతి స్వర్గాన్నుండి వచ్చేటప్పుడు అతనిని ఆవరించి ఉన్న కాంతిని అందరూ అబ్బుర పడుతూ చూచారట.
వ.
అంత నయ్యాయతి దౌహిత్రులైన యష్టకుండును బ్రతర్ధనుండును వసుమంతుండును నౌశీరనుం డయినశిబియు నను వారలు సద్భువుననివాసులు దమయొద్దకుం జనుదెంచిన యయాతి నధిక తేజోమయు ననంతమూర్తిం గని నిసర్గ స్నేహంబున నభ్యాగతపూజల సంతుష్టుం జేసి నీ వెవ్వండ వెందుండి యేమికారణంబున వచ్చితని యడిగిన వారలకు
నయ్యయాతి యి ట్లనియె.౨౧౩

అప్పుడు యయాతి వారికి తాను నహుష పుత్త్రుడు పూరుని తండ్రి యైన యయాతిగా పరిచయం చేసుకొని యింద్రుని తోడి తన సంభాషణని వివరించి తాను సురసిద్ధ మునీంద్రుల తపశ్చరణలు తన తపముతో సరిగావని చెప్పడాన్ని వివరించి,
చ.
అమరవిభుండు దాని విని యల్గి మదంబున ను త్తమావమా
నము దగునయ్య చేయ నని నన్ను నధోభువన ప్రపాతసం
భ్రమ వివసాత్ముఁ జేసె నదిపాడియ యెందును నల్పమయ్యు ద
ర్పము బహుకాలసంచిత తపః ఫలహాని యొనర్పకుండునే.౨౧౭

దర్పము ఎంతహానిని కలిగిస్తుందో చెపుతాడు.

అప్పుడు వారు అతనికి తమను అతని దౌహిత్రులుగా పరిచయం చేసుకుని అతనిని సకల ధర్మాధర్మములు, సుగతి దుర్గతి స్వరూపములు, జీవుల గర్భోత్పత్తి ప్రకారము,వర్ణాశ్రమ ధర్మముల గురించి వివరించమని కోరతారు.

ఆ.
సర్వభూతదయకు సత్యవాక్యమునకు, నుత్తమంబు ధర్ము వొండెఱుంగ
నొరులనొప్పి కోడ కుపతాప మొనరించు, నదియ కడు నధర్మ మనిరి మునులు.౨౧౯

సర్వ భూతములయందు దయ, సత్యవాక్యము వీనిని మించిన ధర్మం ఇంకొకటి తనకు తెలియదన్నాడు.ఇతరులకు నొప్పిని బాధను కలిగించటాన్ని కడు అధర్మమన్నారు పెద్దలు.
ఆ.
వేదవిహిత విధుల నాదరించుట యూర్థ్వ, గతికిఁ దెరువు విధులఁ గడచియెందు
నాఁగఁబడిన వాని లోగఁగఁ జేయుట, యధమగతికి మార్గమనిరి మునులు.౨౨౦

వేదాలలో విధించబడిన కార్యములను చేయుట పైగతి నొందడానికి మార్గమని మునులు చెప్పారు. నిషేధింపబడిన వానిని ఆచరించుట అధమగతికి మార్గమని కూడా చెప్పారు.
వ.
మఱియు గర్భ యోనియందు ఋతుపుష్పరససంయుక్తం బగుచు రేతంబు గాడ్పు చేతం బ్రేరేపితం బయి కలసిన నందుఁ బంచతన్మాత్రలు పొడ వయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవులయి యుద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు దుష్కృతబాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధివిరహితంబు లైన తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు. సుకృత బాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱచి బుద్ధియుక్తు లై మనుష్య యోనులందుఁ బుట్టి యుక్తాచారులును దత్త్వవిదులును నయి దేవత్వంబును పొంది విశుద్ధ జ్ఞానులయి ముక్తులగుదురు మఱి యుక్తాచారులెవ్వరనిన గురుశుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం దప్రమత్తులయి శమదమశౌచంబులు దాల్చి యవిప్లుత బ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును బాపంబునకుఁ బరోపతాపంబునకు వెఱచి ధర్మ్యంబైన విత్తంబున నతిథులం బూజించుచుయజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును నియతాహారులై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును వనంబులనుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబులనుండి శరీరధారణార్థంబు నియతస్వల్పభోజనులయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాలంక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగ విసర్జితులయి యేక చరు లయి యనేకనికేతను లయినయతులును ననువీరలు దమతమ పుణ్యాచారంబులలం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబులవారిని దమ్మును నుద్ధరింతురు గావున.౨౨౧
స్త్రీ గర్భంలో ఋతుకాలమందలి పుష్పరసంతో రేతస్సు గాలిచేత ప్రేరేపింపబడి కలిసిన అందు పంచతన్మాత్రలు రూపాన్ని పొంది క్రమంగా అవయవాలేర్పడి పుట్టినవాడై చెవులద్వారా శబ్దాన్ని, కన్నులద్వారా రూపాన్ని, ముక్కు ద్వారా వాసనని, నాలుక ద్వారా రుచిని, చర్మం ద్వారా స్పర్శను, మనస్సు ద్వారా సర్వాన్ని తెలుసుకుంటూ పూర్వము చేసిన కర్మలవలన పాపాల్ని పుణ్యాల్ని చేస్తూ పాపకర్మలు యెక్కువగా చేస్తే పుణ్యకర్మలని హరిస్తూ బుద్ధి లేని జంతుజాలంలో పుడుతూ పుణ్యకర్మాచరణం అధికంగా చేస్తే అవి పాపకర్మలను హరించగా బుద్ధిని కలిగుండే మానవ జన్మ పొందుతూ యుక్తాచారులూ తత్త్వవిదులూ అయితే దేవత్వాన్ని పొందుతూ ఉంటారు. యుక్తాచారు లెవరయ్యా అంటే ౧. గురుశుశ్రూష చేస్తూ నిత్యమూ అధ్యయన అగ్ని కార్యాలలో జాగరూకులయి శమదమశౌచాల్నితాల్చి సడలని బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించేబ్రహ్మచారులును, ౨.పాపానికి ఇతరుల కపకారం చేయడానికి భయపడుతూ ధర్మమార్గంలో మాత్రమే సంపాదించిన ధనంతో అతిథులను పూజిస్తూ యజ్ఞాల్ని చేస్తూ పరులు ఇవ్వని ధనాన్ని పరిగ్రహించక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును, ౩. తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ అన్ని సంగాల్ని విడిచి జయింపబడిన ఇంద్రియాల్ని కలిగిన వానప్రస్థులును, ౪. అడవులలో నివసిస్తూ గ్రామ వస్తువులనుపయోగించకుండా గ్రామాల్లో ఉంటూ శరీరాన్ని నిలబెట్టుకోడానికి మాత్రమే సరిపడే ఆహారాన్ని స్వీకరిస్తూ నగర ప్రవేశాన్ని పరిహరించి కామక్రోధాల్ని పొందకుండా శౌచాల్ని పాటిస్తూ అన్ని ద్వందాల్ని ఒడిసి పట్టి వివర్జితులయి ఏకచరులయి అనేక గృహాల్ని కలిగిన యతీశ్వరులును--అనబడే వీరంతా తమ తమ పుణ్యాచారాల్ని బట్టి అటు పది తరాల్ని యిటు పది తరాల్ని తమనూ ఉద్ధరించుదురు. కావున.
క.
మానాగ్నిహోత్రమును మఱి, మానాధ్యయనమును మానమౌనంబును వి
జ్ఞానమున మానయజ్ఞము, నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్.221
మాన=గౌరవింపదగిన
గౌరవింపదగిన యజ్ఞము, అధ్యనము, మౌనము, యజ్ఞము ఇవి నాలుగూ యథార్థమయినవి. అని యయాతి వారికి ఉపదేశిస్తాడు.
ఆది పర్వము తృతీయాశ్వాసము సమాప్తము.
పర్వములు | edit post
0 Responses

Post a Comment