ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౬
కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
వ.
అనిన వెల వెల్ల నై వెచ్చనూర్చి నిశ్చేష్టిత యై కెందమ్మి రేకుల వలనం దొరంగు జలకణంబులపోలెఁ గోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరఁగం దలవాంచి యారాజుం గటాక్షించుచు హృదయ సంతాపంబు దనకుఁదాన యుపశమించుకొని పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కిట్లనియె.౭౮
ఎంత అందంగా వర్ణించారు నన్నయ్యగారు. "రాజుం గటాక్షించుచు"- భారతీయ స్త్రీత్త్వాన్నంతా మూర్తీభవింప జేసారు ఈ ఒక్క పద ప్రయోగంతో.
కోపారుణిత నయనంబులు ఎంత కోపం వచ్చిందో చెప్తూనే ఉన్నాయి. అయినా సరే ఆసమయంలో కూడా రాజుని క్షమించగలగటం - ఎంత సహృదయం కావాలి ? అలా ఉండగలగటానికి. పాపం కోపాన్ని తనకుతానే ఉపశమింప చేసుకోవాల్సి వచ్చింది బాధనంతా. ఎంత కష్టం ఎంత కష్టం.
ఆ.
ఏల యెఱుక లేని యితరులయట్ల నీ, వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేన కాని దీని నెఱుఁగ రిందొరు లని, తప్పఁ బలుక నగునె ధార్మికులకు. ౭౯
ఎంత ఔచిత్యం గా వున్నాయో చూడండి ఆమె మాటలు. ధార్మికులకు అని ఓ మూల అంటపొడుస్తూనే అడుగుతోంది.
నే నొక్కదాన్ని కాక ఇక్కడ ఇంకెవరికీ ఈ విషయం తెలియదు గదా అనుకుంటున్నట్టున్నావు. అలాఅని తప్పుగా మాట్లాడవచ్చా? అని అంటూ తనతో పాటుగా ఇంకా ఎవరెవరికి ఆవిషయం తెలుసో కూడా చెపుతోంది.
చ.
విమలయశోనిధీ పురుషవృత్త మెఱుంగుచు నుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్
యముడును జంద్రసూర్యులు నహంబును రాత్రియు నమ్మహాపదా
ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్. ౮౦
విమలయశోనిధీ ఎంత అర్థనంతమైన సంబోధన.
వేదాలు, పంచభూతములు, ధర్మము, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి, ఇవన్నీ పురుషవృత్తాన్ని గమనిస్తూంటాయి. ఏ నరుడూ కూడా ఈ మహా పదార్థాల దృష్టిలో పడకుండా ఏ కార్యాన్నీ చక్కబెట్టలేడు. తనను తాను మోసం చేసుకోనూ లేడు.
క.
నా యెఱిఁగినట్ల యన్నియు, నీ యిచ్చినవరము ధారుణీవర యెఱుఁగున్
నా యందుఁ దొంటియట్టుల, చేయు మనుగ్రహ మవజ్ఞ సేయం దగునే. 81
ధారుణీవర అని సంభోదించిదీసారి. నే నెరిగినట్లే పై చెప్పిన మహాపదార్థాలన్నిటికీ కూడా నీ యిచ్చిన వరము తెలుసును. అందుచేత పూర్వం లానే నన్ను ఆదరించు. అవమానించకు.
క.
సతియును గుణవతియుఁ బ్రజా, వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచునతి దు,ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్. ౮౨
ఆలోచిస్తే సతి, గుణవతి, బిడ్డతల్లి, అనువ్రత, ఐన వనితను అవజ్ఞాదృష్టితో చూసేదుర్మతికి ఇహమూ, పరమూ కూడా వుండవు. జాగ్రత్త అని హెచ్చరించింది కూడా.
క.
సంతత గృహమేధిఫలం, బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా
వంతుండగువాఁడు క్రియా, వంతుఁడుఁ దాంతుండు బుత్త్రవంతుండు నగున్. ౮౩
అనుగుణమైన భార్య కలవాడు ఎల్లప్పుడూ గృహమేధి ఫలాన్నిఅంతటినీ సంపూర్తిగా పొందుతాడు. క్రియా వంతుడు, దాంతుడు, పుత్త్రవంతుడు కూడా అవుతాడు.
వ.
మఱియును. ౮౪
సీ.
ధర్మార్థ కామసాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్ర శిక్ష కాచార్యకం బన్వయస్థితికి మూలంబు సద్గతికి నూఁత
గౌరవంబున కేక కారణం బున్నత స్థిర గుణమణుల కాకరము హృదయ
సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవె భర్తకు నొండ్లుగావు ప్రియము
ఆ. లెట్టిఘట్టములను నెట్టి యాపదలను, నెట్టి తీఱములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను, నొనరఁజూడఁ గనినజనుల కెందు. ౮౫
భార్య ధర్మార్థసాధనకు ఉపకరణం, గృహనీతి విద్యకు స్థానం, విమలమైన చారిత్రశిక్షకు ఉపాధ్యాయుడు వంటిది, వంశాన్ని కొనసాగించటానికి మూలమైనది, సద్గతిని పొందటానికి ఊతం, గౌరవాన్ని పొందటానికి ఉన్న ఒకేఒక కారణం,
ఉన్నతమైన స్థిరమైన గుణములనే మణులకు స్థానము, హృదయానికి సంతోషం కలిగించేది. భార్యయే కాని భర్తకు ఇంకోటేదీ ప్రియమైనది కానేరదు. భార్య, పిల్లలు గలవానికి ఎటువంటి సమయంలో గానీ ఎటువంటి కష్టమైనా గానీ పోరాములలో చుట్టుముట్టిన వంతలెల్లా కూడా దూరమౌతాయి. అంటూ ఇంకా ఇలా అంటుంది. (సశేషం)

Post a Comment