Unknown
ఆంధ్రమహాభారతము-చతుర్థాశ్వాసము-

కణ్వుండు శకుంతలను దుష్యంతు పాలికిం బంపుట
వ.
మఱియు భార్య పురుషునం దర్ధం బగుటం జేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దన పురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుఁ బురుషుండు మున్న పరేతుండైనఁ బదంపడి తానును బ రేతయై తన పురుషుంగూడ నరుగునట్టి భార్య నవమానించుట యధర్మంబు మఱియుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున నఙ్గా దఙ్గా త్సమ్భవసి యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండును బుత్త్రుండును ననుభేదంబు లేదు. ౮౬
ఎంత బాగా వివరించిందో చూడండి. వేదశాస్త్రప్రమాణాన్ని కూడా ఉంటంకిస్తూ ధర్మా ధర్మ వివరణ చేసింది.
భార్య పురుషునిలో అర్ధభాగం. అందువల్ల ఆమె అతనికంటే ముందే మరణిస్తే ఆతని ఆగమనాన్ని ప్రతీక్షచేస్తూ పరలోకంలో ఆతనిని కలవటానికై వేచి ఉంటుంది. అలానే పురుషుడు ఆమె కంటే ముందు మరణిస్తే తరువాత ఆమె కూడా మరణించి తన పురుషుఢిని కూడటానికి వెళ్తుంది. అటువంటి భార్యను అవమానించటం అధర్మం. మఱియు పురుషుడే భార్యయందు ప్రవేశించి తిరిగి పుత్త్రుడిగా జన్మిస్తాడు. పురుషుని అంగాలనుంచే పుత్త్రుని అంగాలన్నీతయారయి పుడతాయి అనే వేదవచనం కూడా వుంది. అందుచేత జనకునికీ పుత్త్రునికీ భేదమే లేదు. అంతేకాదు ఇంకా విను.
క.
విను గార్హపత్య మనున,య్యనలము విహరింపఁబడి త దాహవనీయం
బన వెలుఁగునట్ల వెలుఁగును,జనకుడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతి తోడన్. ౮౭

గార్హపత్యమనే అగ్ని విహరింపబడి ఆ త్రేతాగ్నిలో జనకుడే తన నిజప్రకాశంతో తానే పుత్త్రునిగా వెలుగుతాడు.
క.
తాన తననీడ నీళ్ళుల, లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్సూను జనకుండు సూచి మ, హానందముఁ బొందు నతిశయ ప్రీతిమెయిన్. ౮౮

తండ్రి తన నీడను తాను నీళ్ళలో చూచుకొన్నట్లే ఆ కుమారుని చూసుకొని రెట్టించిన ప్రీతితో మహానందాన్ని పొందుతాడు.
వ.
పున్నామ్నో నరకా త్త్రాయత ఇతి పుత్త్ర యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షములవారి నుద్ధరించు గావున. ౮౯

ఇంకో వేద వచనాన్ని కూడా ఉదహరిస్తుందిక్కడ. పున్నామ నరకంనుండి దాటించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే పుత్త్రుడనబడతాడు. ఇది వేదవచనం. అటువంటి వాడు ఇరుపక్షాల్ని కూడా ఉద్ధరిస్తాడు. అందుచేత.
క.
నీ పుణ్యతనువువలనన, యీ పుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబు వలన నొండొక, దీపము ప్రభవించునట్లు తేజం బెసగన్. ౯౦

నీ పుణ్యమైన శరీరం నుండి, ఒక దీపాన్నుండి ఇంకో దీపం పుట్టినట్లుగా , మంచి తేజస్సుకలిగి నీ యీ కుమారుడు నీ నుండే పుట్టిన వాడై ప్రకాశిస్తున్నాడు చూడు. అంతే కాదు. చివరగా చెప్తున్నాను విను.
చ.
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాధ యీ పుత్త్రగా
త్త్రపరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూరసాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుం బుత్త్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. ౯౧

ఇంకా ఇంకా విపరీతమైన వాగ్వాదాలెందుకు, ఓ రాజా యీ నీ కొడుకు శరీరాన్ని ఓసారి కౌగలించుకుని చూడవయ్యా.
నీకే తెలిసిపోతుంది. ఎవరూ చెప్పనక్కర్లా. ఎందుచేతనంటే ఆ కౌగిలి సుఖము కంటె ముత్యాలహారం గాని కర్పూరం గానీ
దట్టమైన పుప్పొడి ప్రసరణం గానీ మంచిగంధం గానీ చంద్రుని వెన్నెల గానీ పుత్త్రుని శారీర కౌగిలింత కంటె ఎక్కువ హృదయాన్నలరించేవిగాను చల్లగానూ ప్రాణులకు ఉండవు సుమా. (ఇదే డి యన్ యే పరీక్ష కంటే కూడా నమ్మదగిన తార్కాణం. అందుచేత అటువంటి పరీక్షలవసరం లేదు)
పర్వములు | edit post
4 Responses
  1. విపరీత ప్రతిభాషలేమిటికి.. ఈ పద్యం నాకెంతో ఇష్టం. దీని మీద నేను టపాయించాను కూడా.
    http://arunam.blogspot.com/2009/01/blog-post_09.html
    మంచి పద్యం అందించారు.


  2. Unknown Says:

    ధన్యవాదములు. రాబోయే పద్యం నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె --ఈ పద్యమన్నా కూడా నా కెంతో ఇష్టం.


  3. Anonymous Says:

    ఏం బాలేదు
    ఏమీ బాలేదు ఏమీ బాలేదు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే


  4. Anonymous Says:

    అవును మీచవుకబారు వ్యాఖ్య ఏమీ బాగోలేదు.


Post a Comment