Unknown

ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

గంగా వసువుల సంభాషణము
ఉ.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫


గాంగేయు డైన భీష్ముని జననం సందర్బం లోనిదీ పద్యం.

జనమేజయుడు వైశంపాయుని కి ట్లనియె.౧౨౦
క.
నరవరుఁ డగు శంతనున క, య్యమరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల, య్యిరువురకును బుట్టె దీని నెఱిఁగింపు మొగిన్. ౧౨౧

నరుడైన శంతన మహారాజుకూ గంగానదికీ ఎలా కలయిక జరిగింది? మహాపురుషుడు భీష్ముడు వారిద్దరికి ఎలా జన్మించాడో వివరంగా చెప్పాల్సింది అని అడిగాడు.
వ.
మఱి పాండవ ధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంగా విన వలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డై యశ్వమేధ సహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాది దేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబుతోఁ బితామహుం గొల్చు చున్న యవసరంబున గంగాదేవి స్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన. ౧౨౨
తే.
ఊరుమూలమేర్పడఁగ నయ్యువిద వలువ, దొలఁగె ననిలంబు చేత విధూత మగుచు
నమరు లెల్లఁ పరాఙ్ముఖు లైరి దాని సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు. ౧౨౩

తొడ మొదలు కనిపించేలా గాలిచేత ఆ ఉవిద వలువ చెదరగా దేవతలందరూ మొగము త్రిప్పుకొన్నారు. కాని మహాభిషుడు మాత్రం ఆమెను సాభిప్రాయంగా చూచాడు.
ఆ.
దాని నెఱిఁగి కమలయోని వానికి గర, మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాప మిచ్చె నొనరంగ వాఁడును, గరము భీతిఁ గరయుగంబు మొగిచి. ౧౨౪

ఇది గ్రహించిన బ్రహ్మ అతనికి మనిషి జన్మ నెత్తాల్సిందిగా శాప మిచ్చాడు. వాడు భయంతో చేతులు కట్టుకొని .
వ.
మర్త్యలోకంబున రాజర్షి వంశంబులలోనఁ బుణ్య చరిత్రుండు ప్రతీపుండ కావున వానికిఁ బుత్త్రుండ నై జన్మించెద నొరుల యందు జనింప నోప నని కమలభవు ననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందలి యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకంబునకు వచ్చునది యెదుర. ౧౨౫

గంగా వసువుల సంభాషణము
క.
అనిమిషలోక వియోగం, బున దుఖిఃతు లయి వసిష్ఠ మునివరు శాపం
బున వచ్చు వారి వసువుల, నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁగరుణన్.౧౨౬

దేవలోక వియోగంతో బాదపడుతూ వసిష్ఠ మునివరుని శాపంతో వస్తున్న ఎనమండుగురు వసువులను ఎదురుగా చూచి గంగా దేవి దయతో.
.
ద్యుతి దఱిఁగి నైజలోక, చ్యుతిఁ బొందను మీకు నొండు చోటికి నరుగం
గత మేమి యనిన విని య, య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్. ౧౨౬

ప్రకాశాన్ని కోల్పడి నిజలోకాన్ని విడిచి వేరే చోటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్పమని గంగాదేవి వారినడుగుతుంది.
.
ఏము వసిష్ఠ మునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్క పుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపం బోయెద మని దుఃఖించి తమ శాపప్రకారంబు గంగాదేవికి నెఱింగించి యే మొండుచోట జన్మింప నోపము నీయందుఁ బుట్టెదము మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁ గావున వానికి నీకును సమాగమం బగు మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు ననిన విని గంగ సంతసిల్లి యిట్లనియె. ౧౨౮
.
నా కభిమతంబు నిట్టిద, మీకును నుపకార మగు సమీహితబుద్ధిన్
జేకొని చేసెద మీర ల, శోకస్థితి నుండుఁ డనుచు సురనది కరుణన్. ౧౨౯

.
నాకూ మీకూ కూడా వీలుగా వుంటుంది . అలా నే చేస్తాను. మీరు విచారించకండి అని గంగాదేవి వారితో పలికింది.
.
వసువులకు మనఃప్రియంబుగాఁ బలికిన విని వారును గంగ యనుగ్రహంబు వడసి నీవు మాకు నుపకారంబు సేయ నోపు దేని నేము నీకుఁ గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్త్యలోకంబునం బెద్దకాలం బుండకుండునట్లుగాఁ జేయునది మాకు వసిస్ఠ మహాముని యనుజ్ఞయు నిట్టిద యనిన గంగయు నట్ల చేయుదు మఱి మీరెల్ల స్వర్గతు లైన నాకొక్క కొడుకు దీర్ఘాయుష్మంతుం డై యుండెడువిధం బె ట్లనిన దానికి వసువు లి ట్లనిరి. ౧౩౦
.
మాయం దొక్కొక్కళ్ల తు, రీయార్థముఁ దాల్చి శుభ చరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమవసు, వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై. ౧౩౧

మా అందరిలో ఒక్కొక్కరి నాల్గవ యంశము వయస్సును పొంది ఒక కుమారుడు దీర్ఘాయుష్మంతు డై గొప్ప పరాక్రమ వంతుడై ఉంటాడు.
.
అని యిట్లు గంగా వసువులొండొరులు సమయంబు సేసికొని చని రంత నిక్కడ. ౧౩౨
.
వీరుఁడు ప్రతీపుఁ డఖిల, క్ష్మారాజ్యసుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు, భారతకులుఁ డుండె ధర్మపరుఁ డై నిష్ఠన్. ౧౩౩
.
ఇట్లు యమనియమవ్రతపరాయణుం డై యున్న వానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు.౧౩౪
.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫

గంగాదేవి తన నిజాంగదీప్తులు ప్రకాశిస్తుండగా అందమైన స్త్రీ రూపం ధరించి ప్రతీప వసుధాధిపుని కుడి తొడపైమన్మథవశంబున కూర్చోవటం జరిగిందట.

పర్వములు | edit post
1 Response
  1. రాఘవ Says:

    ఆహా! ఎంత చక్కటి తెలుగు, ఎంత చక్కటి పాత్రచిత్రణ!


Post a Comment