Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౩
భీష్ముండు బ్రహ్మచర్య వ్రతంబు పూనుట
వ.
బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయ వలయు వివాహం బయ్యెద ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహిత సుహృజ్జనంబులతో విచారించి యోజన గంధి రాజుచిత్తంబునం గలుగుట యెఱింగి యనేక రాజన్యసైన్యసమన్వితుం డయి దాశరాజు కడకుం జని మారాజునకు సత్యవతిని దేవిం గా నిచ్చునది యని యడిగిన నాతండును దేవవ్రతుం బూజించి నీవు ధర్మశీలుండ వర్థానర్థ విదుండవు సకలకార్య సమర్థుండవు గుర్వర్థంబు గన్యార్థి వై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి యీ సత్యవతి నొరుల కీ వలవదు శంతనునక యిచ్చునది యనుటం బేసి తొల్లి యసితుండయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయ నగు. ౧౮౪

దాశరాజు మాటలు కార్యసాధన దిశగా ఎంత పొందికగా ఉన్నాయో గమనించండి. తరువాత యీ 'అసితుండయిన దేవలుండు' అనే మాట భారతంలో ఇదివరకు కూడా ఓసారి వచ్చింది. ఈ పాత్ర కథా కమామీషు ఏమిటో తెలిసిన పెద్ద లెవరైనా వివరిస్తే బావుణ్ణు.
క.
విను మైనను సాపత్న్యం, బను దోషము కలదు దీన నదియును నీచే
తను సంపాద్యము నీ వలి, గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్. ౧౮౫

పురహర అజ కేశవులు=శివో బ్రహ్మ విష్ణువులు
చూడండి వాక్య నిర్మాణం ఎంత పొందికగా వుందో.

దీనిలో సాపత్న్యం అనే దోషం ఉంది. అదీ నీచేతనే పరిష్కరింపబడ గలిగేదే. నీకు కోపమొస్తే శివుడు బ్రహ్మ విష్ణువు కూడా అడ్డుకోలేరు. ( నే ననగా యెంత?) -ఎంత రాజకీయ చతురత్వం ఆ మాటల్లో దాగివుందో గమనించండి.
వ.
ఆ దోషం బెట్లు పరిహృతం బగునట్లుగా నీ చిత్తమునం దలంచి వివాహంబు సేయు మనిన గాంగేయుం డి ట్లనియె. ౧౮౬

భీష్ముఁడు బ్రహ్మచర్య వ్రతంబు

చ.
వినుడు ప్రసిద్ధు లైన పృథివీపతు లిందఱు నే గురు ప్రయో
జనమునఁ జేసితిన్ సమయస్థితి యీ లలితాంగి కుద్భవిం
చినతనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు వాఁడ మాకు నె
ల్లను బతి వాఁడ కౌరవకుల స్థితికారుఁ డుదారసంపదన్. ౧౮౭

అందరూ వినండి. ఈమె సంతానమే రాజ్యాని కర్హత కలిగుంటుంది. వాడే మాకందరికీ రాజు. ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞ అంటాడు.
వ.
అని సభాసదుల కెల్ల మహాహర్షంబుగా సత్యవ్రతుం డయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశ రా జిట్లనియె. ౧౮౮
క.
నీ వఖిలధర్మవిదుఁడవు, గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్
భావిభవత్సుతు లిట్టిరె, నీవిహితస్థితియు సలుప నేర్తురె యనినన్. ౧౮౯

పొగడ్త ఎంత గొప్పదో చూడండి. ఓ పక్క పొగడుతూ దాశరాజు తనకు కావాల్నిన వన్నీ నోటితో తిన్నగా చెప్పకుండానే ఎలా సాధించుకుంటున్నాడో, ఎంత వాక్చాతుర్యాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో. నీ సంగతి సరేనయ్యా నువ్వు మాటిచ్చాక దానికి తిరుగుంటుందా! కాని భవిష్యత్తనేటొకటుంది చూసావూ మరి నీ కొడుకులు నీ యిచ్చిన యీ మాటను పాటించాలిగా మఱి. అన్నాడు తెలివితేటలుపయోగించి.
క.
ధృతిఁ బూని బ్రహ్మచర్య, వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ ననప
త్యత యైనను లోకము లా, యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై. ౧౯౦

భ్రహ్మచర్య వ్రతాన్ని దాలుస్తున్నాను ఇది మొదలుగా. అనపత్యత అంటారా, నాకు అనుభవయోగ్యము లైన లోకాలు యింకా చాలా చాలా వున్నాయి యేమీ ఫర్వా లేదు అన్నాడు.
వ.
అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్య పరిత్యాగంబును బ్రహ్మచర్యవ్రతపరిగ్రహంబును జేసిన దేవ వ్రతు సత్యవ్రతంబు నకు గురుకార్యధురంధరత్వమునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం బుష్పవృష్టిఁగురిసి భీష్ముం డని పొగడిరి దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత. ౧౯౧

ఇక్కడో విషయం మనం గమనించాల్సి ఉంది. స్వార్ధానికి అంతు అంటూ ఉండదు కామోసు. శంతనునికి భీష్ముడు ఏకపుత్త్రుడూ వీరుడూ కాబట్టి అతని ఉనికి ఖాయం కాదు కాబట్టి " అనఘా నీకు తోడుగ పుత్త్రుల పడయంగ నిష్టమయినది నాకున్." అన్నాడు శంతనుడు. కాని పాపం దేవవ్రతుడు మాత్రం ఎంత పెద్ద త్యాగం చేయాల్సొచ్చిందో చూడండి. ఎంత అన్యాయమో గదా. ఆ రోజుల్లో అలానే ఉండేవారు కామోసు. అది ద్వాపరం, ఇది కలియుగం కాబట్టి మన ఆలోచన లిట్లా ఉంటున్నాయి.
వ.
శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహం బై యతిమానుషం బయిన యా భీష్ము సత్యవ్రతంబునకు సంతసిల్లి స్వత్థందమరణంబుగా వరం బిచ్చి సత్యవతి యందు చిత్రాంగద విచిత్రవీర్యు లన నిద్దఱు గొడుకులం బడసి----




పర్వములు | edit post
0 Responses

Post a Comment