ఆది పర్వము-పంచమాశ్వాసము-3
కర్ణుఁడు జనియించి సూతగృహంబు సేరుట
చ.
సలలిత మైన పుట్టుఁ గవచంబు నిసర్గజ మైనకుండలం
బులయుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం
డలమొకొ భూతలంబున బెడం గయి దీప్తిసహస్రకంబుతో
వెలిఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగు చుండఁగాన్. 26
సహజమైన కవచకుండలాలతో సూర్యమండలమే భూమి మీదకు అవతరించిందా అన్నట్లుగా సహస్రకిరణాలతో ప్రకాశిస్తూ కర్ణుడు పుట్టాడట.
వ.
అంత నాదిత్యుం డాకాశంబున కరిఁగిన గొడుకుంజూచి కుంతి తద్దయు విస్మయంబంది యెద్దియునుం చేయునది నేరక. 27
ఈ ఘట్టంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి గారిని తలుచుకోకుండా వుండటం సాధ్యం కావటం లేదు.
వారి కుంతీ కుమారిలో ఇదే ఘట్టాన్ని వారు ఎంత హృదయంగమంగా పెంచి పోషించి వ్రాసారో ఓసారి చూద్దాం.
చ.
అది రమణీయ పుష్పవన - మావనమం దొక మేడ - మేడ పై
నది యెక మాఱుమూలగది - ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్ల యీడుగల బాలిక - పోలిక రాచపిల్ల - జం
కొదవెడి కాళ్లతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్. 1
నన్నయ గారి కుంతిని సినిమాలో ఓ అందమైన సీనరీని చూపిస్తున్నట్లుగా ప్రతి చిన్న డిటెయిలును మిస్ కాకుండా
కరుణరస పూరితంగా ఓ క్రమాన్ని పాటిస్తూ అలతి అలతి పదాలతో ప్రారంభం చేసారు పాపయ్య శాస్త్రిగారు. ఆంధ్రజాతి ఈ ఇద్దరు కవులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతుందో నాకు తెలియదు. ఇంకా చెప్తున్నారు చూడండి.
ఉ.
కన్నియలాగె వాలకము కన్పడుచున్నది - కాదు కాదు - ఆ
చిన్ని గులాబి లేత అరచేతులలో - పసిబిడ్డ డున్నయ
ట్లున్నది - ఏమి కావలయునోగద ఆమెకు - అచ్చుగుద్దిన
ట్లున్నవి - రూపు రేక - లెవరో యనరా దత డామె బిడ్డయే ! 2
మన తెలుగు నుడికారాన్ని తెలుగు తనాన్ని ఎంత బాగా ఆవిష్కరించారో చూడండి. పోలికలు అచ్చుగుద్దినట్లున్నవట. అందుచేత ఆ బిడ్డ ఎవరో అనాల్సిన పని లేదట. అతడామె బిడ్డయే నట. ఎంతబాగా చెప్పారో చూడండి.
గీ.
దొరలు నానంద బాష్పాలొ - పొరలు దుఃఖ
బాష్పములొ గాని గుర్తుపట్టలేము:
రాలుచున్నవి ఆమె నేత్రాలనుండి
బాలకుని ముద్దు చెక్కు టద్దాల మీద! 3
చూడండి సస్పెన్సును ఎంతందంగా మెయిన్ టెయిన్ చేస్తున్నారో. ఇప్పటికింకా ఆమె ఎవరో ఆమె పేరేమిటో ఇంకా మనకు చెప్పలేదాయన.
ఉ.
పొత్తులలోని బిడ్డనికి పుట్టియుపుట్టకముందె యెవ్వరో
క్రొత్తవి వజ్రపుం గవచకుండలముల్ గయిసేసినారు ! మేల్
పుత్తడి తమ్మిమొగ్గ జిగిబుగ్గల ముద్దులు మూటగట్టు నీ
నెత్తురుకందు నెత్తుకొని నెచ్చలి యెచ్చటి కేగుచున్నదో! 4
పొత్తులలోని బిడ్డ - నెత్తురుకందు - మేల్ పుత్తడి తమ్మి మొగ్గ - ముద్దులు మూటగట్టు - ఈ ముద్దులు మూటలు గట్టే పదబంధాలతో మనల్నందరినీ కట్టి పడేస్తున్నారు శాస్త్రిగారు. ఇప్పటికి కథ మనకు కొంచెం కొంచెం అర్థం అవుతోంది. చెప్పబోయేది కర్ణుడిని గురించని.
గీ.
గాలితాకున జలతారు మేలిముసుగు
జాఱె నొక్కింత - అదిగొ ! చిన్నారి మోము !
పోల్చుకొన్నాములే ! కుంతిభోజ పుత్త్రి
స్నిగ్ధ సుకుమారి ఆమె కుంతీ కుమారి !! 5
అమ్మయ్య ! చివరి కెలాగయితేనేం సస్పెన్సు విడిపోయింది. ఆవిడెవరో మనందరం పోల్చుకోగలిగాం. ఎవరో కాదు ఆ స్నిగ్ధసుకుమారి(ఎంత సుకుమారమైన పదబంధం) కుంతి భోజుని కూతురు కుంతీకుమారి యే! మనకు బాగా తెలిసిన మనమ్మాయే !
మ.
కడువేగమ్మున చెంగుచెంగున తరంగాల్ పొంగ, ఆ తోట వెం
బడి పాఱుచున్నయది బ్రహ్మాండమ్ముగా - అల్ల దే
బుడుతన్ చేతులలోన బట్టుకొని యా పూబోడియుంగూడ ని
య్యెడకే వచ్చుచునుండె గద్గదికతో నేమేమొ వాపోవుచున్. 6
ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి మళ్ళీ నన్నయ గారి దగ్గర కెళ్దాం. ఆయనేం చెప్పారో కూడా చూద్దాం.
తరువోజ.
ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర మిమ్మంత్ర శక్తి యే నెఱుఁగంగ వేఁడి
యేల పుత్త్రకుఁ గోరి యెంతయుభక్తి నినుఁ దలంచితిఁ బ్రీతి నినుఁడును నాకు
నేల సద్యోగర్భ మిచ్చెఁ గుమారుఁ డేల యప్పుడ యుదయించె నిం కెట్టు
లీలోకపరివాద మే నుడిగింతు నింతకు నింతయు నెఱుఁగరె జనులు. 28
నన్నయగారు తరువోజ నెన్నుకున్నారు. దానికి మన శాస్త్రిగారు మత్తేభా న్నెన్నుకున్నారు.
మ.
" ముని మంత్రమ్ము నొసంగ నేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
మ్మని నే కోరగనేల? కోరితినిబో ఆతండు రానేల ? వ
చ్చెనుబో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల ? ప
ట్టెనుబో పట్టి నొసంగనేల ? అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్. 7
నన్నయ్యగారి తరువోజకు శాస్త్రిగారద్దిన మెరుగులు చూడండి. నన్నయ గారు కర్ణుడిని కన్నియకు పుట్టిన కానీనుడన్నారు. కాని మన శాస్త్రిగారు మటుకు సూర్యుడు కుంతిని చేపట్టినట్లుగనే వ్రాసారు. కానీనుడుగా కర్ణుడిని చూపటం ఆయనకిష్టం లేదల్లే ఉంది. ఈలోకపరివాదాన్నెలా ఉడిగించగలనని నన్నయగారి కుంతి వాపోతే శాస్త్రిగారి కుంతి మటుకు అడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ అని వాపోతుంది. మన తెలుగు పలుకుబడిని మరింతందంగా చెప్పారు శాస్త్రిగారు. మళ్ళీ నన్నయ గారి దగ్గర కెళ్దాం. ఈసారి ఆయన వసంత తిలకాన్నెత్తుకున్నాడు.
వసంత తిలకము.
ఈబాలు నెత్తికొని యింటికిఁ జన్న నన్నున్
నాబంధు లందఱు మనంబున నే మనారె
ట్లీబాలు సూర్యనిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధి వుట్టు నని కన్య మనంబులోనన్.29
అనారు=అనరు
కర్ణుడిని అక్కడే వదలి వెళ్ళిపోదామనుకుంది నన్నయ గారి కుంతి.
కాని శాస్త్రిగారి కుంతి ఇంకోలా అనుకుంది చూడండి.
ఉ.
ఏయెడ దాచుకొందు నిపు డీ కసిగందును ! కన్నతండ్రి "చీ
చీ" యనకుండునే ? పరిహసింపరె బంధువు ? లాత్మ గౌరవ
శ్రీ యిక దక్కునే ? జనులు చేతులు చూపరె ? దైవయోగమున్
ద్రోయగరాదు - ఈ శిశువుతో నొడిగట్టితి లోకనిందకున్.8
ఇంకా ఇలా కూడా అనుకుంటుంది శాస్త్రిగారి కుంతి.
గీ.
"ఈ విషాదాశ్రువులతోడ నింక నెంత
కాల మీ మేను మోతు ? గంగాభవాని
కలుషహారిణి - ఈ తల్లి కడుపులోన
కలిసిపోయెద - నా కన్న కడుపుతోడ."9
ఇక్కడ శాస్త్రిగారు మూలాన్ని అధిగమించి కుంతి బేలతనాన్ని ఆవిష్కరించారు. నన్నయ గారి కుంతి పిల్లాడిని వదలిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటే దాన్ని పరిహరించి తను చేసిన తప్పునకు(కుతూహలంతో మంత్రశక్తిని పరీక్షించి చూద్దామని అనుకోవడం) పరిహారంగా తన కన్నకడుపుతో కూడా కలుషహారిణి అయిన గంగాభవానిలో కలిసి పోదా మని అను కుంటుంది శాస్త్రి గారి కుంతి.
గీ.
అనుచు పసివాని రొమ్ములో నదుముకొనుచు
కుంతి దిగినది నదిలోన - అంతలోన
పెట్టె కాబోలు పవన కంపిత తరంగ
మాలికా డోలికల తేలి తేలి వచ్చు ! 10
ఇంక మళ్ళీ మనం నన్నయగారి మూలం దగ్గరికి వస్తే..
వ.
వందురి వగచుచున్న దానిపుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్ఘ రత్న వసుభరితం బయిన యొక్క మంజసము నదీప్రవాహవేగంబునం దన యొద్దకు వచ్చిన దానిలో చెచ్చెరఁ దనకొడుకుం బెట్టి కుంతి నిజగృహంబునకుం జనియె నంత. 30
ఇలా ఈ విధంగా నన్నయగారో చిన్న వచనంలో కథను తేల్చి వేసారు. ఇది మన శాస్త్రిగారి కాట్టే నచ్చలేదు. అందుకని మన పుణ్యం కొద్దీ శాస్త్రిగారు కధను పెంచి మన కోసం మరింత రసవత్తరంగా తీర్చి దిద్దారు. ఆ విధానాన్ని ఆయన పద్యాల్లోనే చూద్దాం పదండి.
గీ.
మందసము రాక గనెనేమొ - ముందు కిడిన
యడుగు వెనుకకుబెట్టి దుఃఖాశ్రుపూర్ణ
నయనములలోన ఆశాకణాలు మెఱయ
ఆ దెసకె చూచు నామె కన్నార్పకుండ.11
గీ.
దూరదూరాల ప్రాణబంధువు విధాన
అంతకంతకు తనకు దాపగుచునున్న
పెట్టె పొడవును తన ముద్దుపట్టి పొడవు
చూచి తలయూచు మదినేమి తోచినదియొ ? 12
గీ.
"ఆత్మహత్యయు శిశుహత్య యనక గంగ
పాలు గానున్న యీ దీనురాలిమీద
భువనబంధునకే జాలి పుట్టెనేమొ
పెట్టె నంపించి తెరువు చూపెట్టినాడు." 13
గీ.
"ఇట్టులున్నది కాబోలు నీశ్వరేఛ్ఛ"
యనుచు విభ్రాంతిమై దిక్కు లరసికొనుచు
సగము తడిసిన కోకతో మగువ, పెట్టె
దరికి జని మెల్ల మెల్ల గా దరికి తెచ్చి- 14
గీ.
ఒత్తుగా పూలగుత్తుల నెత్తు పెట్టి -
పై చెఱగు చింపి మెత్తగా ప్రక్క పఱచి -
క్రొత్తనెత్తలిరాకుల గూర్చి పేర్చి -
ఒత్తుకొనకుండ చేతితో నొత్తి చూచి - 15
గీ.
ఎట్టకేలకు దడదడ కొట్టుకొనెడి
గుండె బిగబట్టుకొని కళ్ళనిండ జూచి -
బాష్పముల సాము తడిసిన ప్రక్కమీద
చిట్టి బాబును బజ్జుండబెట్టె తల్లి. 16
గీ.
చిన్ని పెదవుల ముత్యాలు చిందిపడగ
కలకలమటంచును నవ్వునే గాని, కన్న
యమ్మ కష్టము - తన యదృష్టమ్ముకూడ
నెఱుగ డింతయు నా యమాయకపు బిడ్డ. 17
గీ.
చెదరు హృదయము రాయిచేసికొని పెట్టె
నలలలో త్రోయబోవును - వలపు నిలువ
లేక - చెయిరాక - సుతు కౌగిలించి వెక్కి
వెక్కి యేడ్చును - కన్నీరు గ్రుక్కుకొనును. 18
గీ.
"భోగభాగ్యాలతో తులతూగుచున్న
కుంతిభోజుని గారాబు కూతురునయి
కన్న నలుసుకు పట్టెడన్నమైన
పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన."19
ఉ.
నన్నతి పేర్మి మై గనెడి నా తలిదండ్రుల ప్రేమ యర్థమౌ
చున్నది; నేడు బిడ్డ నిట నొంటరిగా విడిపోవ కాళ్ళు రా
కున్నవి; యేమి సేతు; కనియున్ గనలేని యభాగ్యురాల నే
నన్ని విధాల - కన్న కడుపన్నది కాంతల కింత తీపియే! 20
ఉ.
పెట్టియలోన నొత్తిగలబెట్టి నినున్ నడిగంగలోనికిన్
నెట్టుచునుంటి తండ్రి ! యిక నీకును నాకు ఋణంబుదీరె, మీ
దెట్టుల నున్నదో మన యదృష్టము! ఘోరము చేసినాను నా
పుట్టుక మాసిపోను! నినుబోలిన రత్నము నాకు దక్కునే ! 21
ఉ.
"పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము నే
నెన్నటికైన చూతునె! మఱే ! దురదృష్టము గప్పిగొన్న నా
కన్నుల కంతభాగ్యమును కల్గునె ? ఏ యమయైన ఇంత నీ
కన్నము పెట్టి ఆయు విడినప్పటి మాటగదోయి నాయనా ! "22
గీ.
పాలబుగ్గల చిక్కదనాల తండ్రి !
వాలుగన్నుల చక్కదనాల తండ్రి !
మేలి నీలి ముంగురుల వరాల తండ్రి !
కాలుచెయి రాని తండ్రి ! నా కన్న తండ్రి ! 23
గీ.
కన్నతండ్రి నవ్వుల పూలు గంపెడేసి -
చిన్ని నాన్నకు కన్నులు చేరడేసి -
చక్కనయ్యకు నెరికురుల్ జానెడేసి -
చిట్టి బాబు మై నిగనిగల్ పెట్టెడేసి - 24
గీ.
బాలభానుని బోలు నా బాలు నీదు
గర్భమున నుంచుచుంటి గంగాభవాని !
వీని నే తల్లి చేతిలోనైన బెట్టి
మాట మన్నింపుమమ్మ ! నమస్సులమ్మ ! 25
గీ.
దిక్కులను చూచి భూదేవి దిక్కు చూచి
గంగదెస చూచి బిడ్డ మొగమ్ము చూచి -
సజల నయనాలతో ఒక్కసారి "కలువ
కంటి" తలయెత్తి బాలభాస్కరుని చూచె - 26
గీ.
మరులు రేకెత్త బిడ్డను మరల మరల
నెత్తుకొనుచు పాలిండ్లపై నొత్తుకొనుచు
బుజ్జగింపుల మమకార ముజ్జగించి
పెట్టెలోపల నుంచి జోకొట్టె తల్లి. 27
గీ.
ఆతపత్రమ్ము భంగి కంజాతపత్ర
మొండు బంగారుతండ్రిపై నెండ తగుల
కుండ సంధించి, ఆకులోనుండి ముద్దు
మూతిపై కట్టకడపటి ముద్దు నుంచి. 28
గీ.
"నన్ను విడిపోవుచుండె మా నాన్న " యనుచు
కరుణ గద్గద కంఠియై కంపమాన
హస్తములతోడ కాంక్ష లల్లాడ, కనులు
మూసికొని నీటిలోనికి ద్రోసె పెట్టె. 29
గీ.
ఏటి కెరటాలలో పెట్టె యేగుచుండ
గట్టుపై నిల్చి అట్టె నిర్ఘాంతపోయి
నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష
లోచనమ్ములతో కుంతి చూచుచుండె. 30
జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ఈ కుంతీ కుమారిని ఎన్నిసార్లు చదివినాగానీ వ్రాసినాగానీ ప్రతీసారీ కూడా కళ్ళు చెమర్చకుండా ఉండవు. ఆ ఆర్ద్రత ఆ కథలో ఉందో, ఆయన శైలిలో ఉందో లేక రెంటిలోనూ ఉందో నా కయితే తెలీదు.
తిరిగి మనం నన్నయగారి దగ్గరకి వచ్చేద్దాం.
ఆ.
ఘనభుజుండు రాధ యనుదానిపతి యొక్క, సూతుఁ డరుగుదెంచి చూచి రత్న
పుంజభరిత మయిన మందసలో నున్న, కొడుకు దానితోన కొనుచు వచ్చి. 31
క.
తనభార్యకు రాధకు ని, చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం
గని చన్నులు సేఁపి ముదం, బునఁ బెనిచెను సుహృదు లెట్టి పుణ్యమొ యనఁగన్. 32
వ.
ఇట్లు వసునివహంబుతో వచ్చుటం జేసి వసుషేణుం డనునామంబునం బరఁగి కర్ణుండు రాధేయుం డై సూతగృహంబునం బెరుఁగు చుండె నంత నిట.33

Post a Comment