Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-7
కుంతి యందు భీముడు జన్మించుట
వ.
ఇట్లు పుత్త్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీమాద్రీ సహితుం డై శతశృంగంబున నున్న యవసరంబున నట ముందఱ ధృతరాష్ట్రువలనన్ గాంధారి కృష్ణద్వైపాయను వరంబున గర్భంబు దాల్చి యొక్క సంవత్సరంబు నిండినఁ బ్రసూతి గాకున్నం బదరుచుఁ బుత్త్రలాభలాలస యయి యున్నయది యప్పు డయ్యుధిష్టరు జన్మంబు విని మన్యుతాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన గర్భపాతం బగుడు. 98
మన్యుతాపంబునన్=క్రోధాతిశయంబుచే
క.
దాని నెఱింగి పరాశర, సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి మనో
హీన వయి గర్భపాతము, గా నిట్టులు సేయు టిదియుఁ గర్తవ్యంబే. 99
క.
ఇమ్మాంసపేశి నేకశ,త మ్ముదయింతురు సుతులు ముదమ్మున నిది త
థ్య మ్మింక నైన నతి య,త్నమ్మున రక్షింపు దీని నావచనమునన్.100
స్త్రీలలో అసూయా ద్వేషములు ఎంతపని నైనా చేయిస్తాయి. కుంతికి యుధిష్టురుడు పుట్టాడని తెలియగానే తనుకూడా గర్భం ధరించి సంవత్సరం పూర్తయినా తనకు ప్రసవం ఇంకా కాలేదనే బాధతో గాంధారి కడుపుమీద గట్టిగా కొట్టుకుందట. అప్పుడామెకు గర్బపాతం జరిగిందట. ఇది తెలిసిన వ్యాస మహర్షి వెంటనే అక్కడకు వచ్చి.
వ.
అని గాంధారిఁ బదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశత ఖండంబులుగా విభాగించి వీని వేఱువేఱ ఘృతకుండంబులంబెట్టి శీతలజలంబులం దడుపుచు నుండునది యిందు నూర్వురు గొడుకులు నొక్కకూఁతురుం బుట్టుదు రని చెప్పి చనినఁ దద్వచనప్రకారంబు చేయించి గాంధారీధృతరాష్ట్రులు సంతసిల్లి యున్న నిట శతశృంగంబున. 101
చ.
నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుఁ గుంతిఁ జూచి యం
బురుహదళాక్షి యింక నొకపుత్త్రు నుదార చరిత్రు నుత్తమ
స్థిరజవసత్త్వు నయ్యనిల దేవుదయం గలిగింపు పెంపుతోఁ
గురుకులరక్షకుం డతఁ డగున్ బలవద్భుజవిక్ర మోన్నతిన్. 102
వ.
అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు సంపూర్ణం బగుడు. 103
చ.
సుతుఁడు నభస్వదంశమున సుస్థిరుఁ డై యుదయించినన్ మహా
యతికృతజాతకర్ముఁ డగునాతని కాతతవీర్యవిక్రమో
న్నతునకు భీమసేనుఁ డను నామముఁ దా నొనరించె దివ్యవా
క్సతి శతశృంగ శైలనివసన్మునిసంఘము సంతసిల్లగన్. 104

ఆవిధంగా భీముడు కూడా కుంతికి జన్మించాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment