Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-8
ఇంద్ర ప్రసాదంబునఁ గుంతి కర్జునుఁ డుదయించుట
క.
కొడుకుం ద్రిలోకవిజయుం, బడయుదు నని ఘోర మగుతపం బొనరింపం
దొడఁగె సురరాజు నెడలో, నిడికొని యే కాగ్రబుద్ధి నేకాంతమునన్. 116

పాండురాజు త్రిలోక విజయు డయిన కొడుకును పొందగోరి ఇంద్రుడిని మనసులో తలచి ఘోరమైన తపస్సు చేసాడు.
వ.
ఇట్లతినిష్ఠ నేకపాదస్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్కసంవత్సరంబు వ్రతంబు సేయం బంచి యున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షంబై. 117
క.
పుత్త్రుఁడు నీ కుదయించు న, మిత్రక్షయకరుఁడు బంధుమిత్రాంబుజస
న్మిత్రుం డని వర మిచ్చిన, ధాత్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్. 118

ఇంద్రుడతనికి ప్రత్యక్షమై నీకు గొప్ప కొడుకు పుడతాడని వరమిచ్చాడు.
క.
ధనమున విద్యను సంతతిఁ, దనిసినవా రెందుఁ గలరె ధవళేక్షణ కా
వున నా కింకను బలువురఁ, దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్. 119

ధనసంపాదనతోను, విద్యాసంపాదన తోను, సంతానం పొందే విషయంలోనూ సంతృప్తి చెందేవారెవ్వరూ ఉండరు కదా. అందుచేత నాకింకా సంతానాన్ని పొందాలని వుంది అంటాడు. ఇది ఆ కాలంలో నిజమేమో కాని ఈ కాలంలో మటుకు కాదు. మొదటిదిప్పుడు అప్పటికంటె మరింత యెక్కువ నిజం. రెండోదాని విషయంలో కూడా కొంచెం నిజమే నను కోవచ్చు. కాని మూడవదానిలో మటుకు అస్సలు నిజం కాదు. ఒక సంతానం మాత్రమే చాలు ఈ దేశకాలపరిస్థితులకు.
చ.
అమరగణంబులలోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద సర్వలో
కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిప ప్రసా
దమున సుతున్ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం
శము వెలిఁగింపఁగా బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్. 120

ఇంద్రుడిని ప్రార్థించి అతనిద్వారా అతనితో సమాను డయిన వాడిని తన వంశమును వెలిగించ గలవాడిని అయిన కుమారుడిని పొందమంటాడు పాండురాజు కుంతితో.
వ.
అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటియట్ల దుర్వాసునిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ దత్ప్రసాదంబునఁ గుంతికి. 121
క.
స్థిరపొరుషుండు లోకో, త్తరుఁ డుత్తరఫల్గునీ ప్రథమ పాదమునన్
సురరాజు నంశమున భా, సుర తేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్. 122

ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ప్రథమ పాదంలో ఇంద్రుని అంశతో వంశకరు డయిన కొడుకు పుట్టాడు.
వ.
అయ్యవసరంబున. 123
సీ.
విను కార్తవీర్యు కంటెను వీరుఁ డగుట నర్జుననామ మీతండ యొనరఁ దాల్చు
నీతండ యనిఁ బురుహూతాదిసురుల నోడించి ఖాండవము దహించు బలిమి
నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి రాజసూయము ధర్మరాజు ననుచు
నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్ వడసి విరోధుల నొడుచుఁ గడిమి
ఆ.
ననుచు నవపయోదనినదగంభీర మై, నెగసె దివ్యవాణి గగనవీథిఁ
గురిసెఁ బుష్పవృష్టి సురదుందుభిధ్వనుల్, సెలఁగె సకలభువనవలయ మద్రువ. 124

ఆకాశవాణి అర్జునుడు చేయబోయే ఘనకార్యాలనన్నీ ఏకరువుపెట్టి పుష్పవర్షం కురిపించిందంట ఆ సమయంలో అక్కడ.
పర్వములు | edit post
0 Responses

Post a Comment