Unknown
ఆది పర్వము- పంచమాశ్వాసము-11
దుర్యోధనుడు భీముని జంపింపఁ దివురుట
క.
వదలక పెనఁగి పదుండ్రం, బదియేవుర నొక్కపెట్టఁబట్టి ధరిత్రిన్
జెదరఁ బడవైచి పవనజుఁ, డదయుం డయి వీపు లొలియ నందఱ నీడ్చున్.165

భీముడు ఒకేసారి పది పదిహేను మంది కౌరవులను సైతం నేలమీద పడవైచి కట్టకట్టి తోలుదోకునట్లుగా లేకుండా ఆటల్లో ఈడుస్తుండే వాడట.
సీ.
కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యాధృతరాష్ట్రతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున నెక్కించుకొని వారి యుక్కడంగ
గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ గారించి తీరంబు చేరఁ బెట్టుఁ
గోరి ఫలార్ధు లై వారలయెక్కిన మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి
ఆ.
వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడి వారల, తోన ధరణిమీఁదఁ దొరఁగుచుండ
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస, నాదు లెల్ల భాధితాత్ము లైరి. 166

నదిలో స్నానించేటప్పుడు వదేసిమంది ధృతరాష్ట్రకుమారులను లెక్కపెట్టి మరీ తన భుజాలమీద కెక్కించుకొని వాళ్ళని నీటిలో ముంచుతూ తేల్చుతూ బాధపెట్టేవాడట. వారంతా చెట్టెక్కినప్పుడు మొదలు పట్టుకొని వూపి కాయలూ పండ్లతో పాటుగా వాళ్ళంతా కిందపడేలా చేసేవాడట భీముడు.
వ.
దాని సహింపఁజాలక యొక్కనాఁడు దుర్యోధనుండు శకునిదుశ్శాశనులతో విచారించి యి ట్లనియె. 167

పృథ్వి.
ఉపాంశువధఁ జేసి మధ్యమ మదోద్ధతుం జంపి ని
స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ
త్కృపాణపటుశక్తి నత్యధిక కీర్తి నై యేలెదన్. 168
ఉపాంశు=ఏకాంతముగా
ఏకాంతముగా భీముని చంపి ధర్మజుని బంధించి అపాండవముగా తానే భూమండలాన్ని ఏలాలని శకుని దుశ్శాశనాదులతో ఆలోచన చేసాడు.
అలా అని నిశ్చయించి జలక్రీడలాడి అలసటతో భీముడు నిద్రపోతుండగా లతలతో భీముని కట్టివేసి చంపాలనే ఉద్దేశ్యంతో నదిలోనికి త్రోసివేసారు కౌరవులందరూ కలసి. కాని భీముడు మేలుకొని నీల్గేటప్పచికి ఆ లతలన్నీ తెగిపోవటం జరిగింది.
ఒకసారి భీముడిని నిద్రిస్తున్నపుడు ఆతని మర్మస్థానాలలో విషపు పాములచేత కరపించారు కౌరవులు. కాని ఆ విషం భీమునికి ఎక్కలేదు. అన్నంలో విషం కలిపారు. యుయుత్సుడు ఆ విషయం చెప్పినాగాని ఆకలిమీద ఉండి శుభ్రంగా తిని అరగించుకోగలిగాడు భీముడు.
క.
అవిరళవిషఫణిదంష్ట్రలు, పవనజు వజ్రమయ తనువు పయితెలును నో
పవ భేదింపఁగఁ బాప, వ్యవసాయుల చెయ్వు లర్థవంతము లగునే.176
క.
మఱియును నొకనాఁ డెవ్వరు, నెఱుఁగక యుండంగఁ గౌరవేంద్రుఁడు ధర్మం
బెఱుఁగక విష మన్నముతో, గుఱుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్. 179
క.
సముఁడై యుయుత్సుఁడయ్య,న్నము దుష్టం బగుటఁ జెప్పినం గుడిచె నిషా
న్నము నాఁకటి పెలుచను నది, యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్. 180

యుయుత్సుడీ విధంగా సమదృష్టి నున్నవాడగుట చేత చివరికి పాండవుల అనంతరము అతడే రాజవుతాడు.

వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకుఁ దనచేసిన యెగ్గులెల్లను గృతఘ్నునికుం జేసిన లగ్గులునుం బోలె నిష్ఫలం బయ్యె.180
పర్వములు | edit post
0 Responses

Post a Comment