Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-14
ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము
వ.
మఱియు వారల కాచార్యుం డైన ద్రోణు జన్మంబును వాని చరిత్రంబును జెప్పెద విను మని జన మేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 193
క.
సద్వినుత చరిత్రుండు భ, రద్వాజుం డనుమునీశ్వర ప్రవరుఁడు గం
గా ద్వారమునఁ దపంబు జ, గద్వంద్యుఁడు సేయు చుండె గతకల్మషుఁ డై
. 194

భరద్వాజు డనే మనీశ్వరుడు గంగాద్వార ప్రదేశంలో గతించిన పాపములు కలవా డై తపస్సు చేసుకుంటున్నాడు.
సీ.
అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు గంగకుఁ జని మున్న కరమువేడ్క
నందు జలక్రీడ లాడుచు నున్న యప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేతపరిధాన యైన యయ్యవసరంబునఁ జూచి యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ దత్కామరాగంబున యతిరేకమునఁ జేసి యాక్షణంబ

తే.
తనకు శుక్ల పాతం బైన దాని డెచ్చి, ద్రోణమున సంగ్రహించిన ద్రోణుఁడనగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి, ధర్మ తత్వజ్ఞుఁ డై భరద్వాజ మునికి
. 195
అతిరేకమునన్=ఆధిక్యము చేత
ఆదీ సంగతి . మహాభారతం లో ఎన్నోచోట్ల జరిగినట్లుగానే ఇక్కడకూడా రేతఃపాతం జరిగి ఆ శుక్లాన్ని కుండలో సంగ్రహించి పెట్టగా దానినుండి ధ్రోణుడు పుట్టడం జరిగింది శుక్రాచార్యుల అంశతో.
వ.
మఱియు ననంతరంబ భరద్వాజ సఖుండైన పృషతుం డను పాంచాలపతి మహా ఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దనసమీపంబున వాసంతికా కుసుమాపచయ వినోదంబున నున్న యప్సరస మేనక యనుదానిం జూచి మదన రాగంబున రేతస్స్కందం బయిన దానిం దనపాదంబునఁ బ్రచ్ఛాదించిన నందు ద్రుపదుండనుకొడుకు మరుదంశంబునఁ బుట్టిన వాని భరద్వాజాశ్రమంబునం బెట్టి చని పృషతుండు పాంచాల దేశంబున రాజ్యంబు సేయుచుండె ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యనంబు సేసి విలువిద్యయుం గఱచి యా వృషతుపరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె ద్రోణుం డగ్నివేశుం డను మహాముని వలన ధనుర్విద్యాపారంగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేక దివ్యబాణంబులు వడసి భరద్వాజు నియోగంబునఁ బుత్త్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి యొక్కనాఁడు. 196
క.
అనవరతము బ్రాహ్మణులకుఁ, దనియఁగ ధన మిచ్చు జామదగ్మ్యుఁడు రాముం
డనుజనవాదపరంపర, విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్. 1
97

జామదగ్న్యు డైన పరశురాముడు బ్రాహ్మణులకు ధనాన్ని దానం చేస్తున్నాడని విని ద్రోణుడు ధనాపేక్షతో భార్గవుని దగ్గరకు వెళ్ళాడు.
క.
అరిగి మహేంద్రాచలమునఁ, బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో
త్తరు భూరికర్మనిర్మల, చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్
. 198
వ.
ఏను భారద్వాజుండ ద్రోణుం డనువాడ నర్థార్థి నై నీ కడకు వచ్చితి ననినఁ బరశురాముం డి ట్లనియె. 199
చ.
కలధన మెల్ల ముందఱ జగన్నుత విప్రుల కిచ్చి వార్ధి మే
నిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డన్మునిఁ కిచ్చితిన్ శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి వీనిలోన నీ
వలసినవస్తువుల్ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్. 200

ఉన్న ధనమంతా ఎప్పుడో విప్రులకు ఇచ్చివేసాను. సముద్రాలు వడ్డాణముగా ధరించి ఉన్న భూమినంతా కశ్యపు డనే మునీశ్వరునకు ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గఱ శరములు, శస్త్రములు మొదలైనవి మాత్రమే ఉన్నాయి. వీనిలో నీకు కావలసినవి తీసుకో ఇస్తాను . అన్నాడు పరశురాముడు.
క.
ధనములలో నత్యుత్తమ, ధనములు శస్త్రాస్త్రములు ముదంబున వీనిం
గొని కృతకృత్యుఁడ నగుదును, జననుత నా కొసఁగుమస్త్రశస్త్ర చయంబుల్. 201

ధనములలో కెల్లా అత్యుత్తమ మైన ధనం శస్త్రాస్త్రాలు కలిగి ఉండటం. వానినే స్వీకరిస్తాను ఇమ్మని కోరాడు ద్రోణుడు పరశురాముడిని.
వ.
అని పరశురాము చేత దివ్యాస్త్రంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి ధనుర్విద్యయు నభ్యసించి ధనార్థి యయి తన బాలసఖుం డైన ద్రుపదుపాలికిం జని యేను ద్రోణుండ నీ బాల్య సఖుండ సహాధ్యాయుండ న న్నెఱుంగుదే యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డి ట్లనియె. 202
చ.
కొలఁది యెఱుంగ కిట్టిపలుకుల్ వలుకంగా దగుఁ గాదు నాక నన్
బలుగుఁదనంబునం బలుకఁ బాడియె నీ సఖి నంచు బేదవి
ప్రులకును ధారుణీశులకుఁ బోలఁగ సఖ్యము సంభవించునే
పలుకక వేగ పొ మ్మకట పాఱుఁడు సంగడికాఁడె యెందునన్. 203

నీ కొలది ఎఱుగకుండా ఇటువంటి పలుకులు పలుక తగునా! పేద విప్రులకు ధారుణీశులకు ఎక్కడైనా సఖ్యం కుదురుతుందా! ఇంకేం మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళు . పాఱుడు యెక్కడైనా సంగడికాడే అని హీనంగా మాట్లాడాడు ద్రుపదుడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment