ఆదిపర్వము-షష్టాశ్వాసము-2
ఉ.
హారివిచిత్ర హేమకవచావృతుఁ డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు భాస్వదసితోత్పలవర్ణుఁడు సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగఁ బాండవమధ్యముఁ డొప్పె బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చి జనంబులు దన్నె చూడఁగన్. 17
హారివిచిత్ర హేమకవచావృతుఁ డు=ఇంపై వింతయైన బంగారు కవచముచేఁ గప్పఁబడినవాఁడు
ఉన్నతచాపచారుదీర్ఘోరుభుజుండు=పెద్దవింటిచేనందమై పొడవైన గొప్ప భుజములు గలవాఁడు
భాస్వదసితోత్పలవర్ణుఁడు=ప్రకాశించు నల్లకలువలవంటి చాయగలవాఁడు
సేంద్రచాపశంపారుచిమేఘమో=ఇంద్రధనస్సు మెఱపుకాంతితో గూడిన మేఘమా--అనేట్టుగా ఆ విధంగా రంగమధ్యమున నిలుచున్న పాండవమధ్యముడు (అర్జునుఁడు) జనులందరూ తననే చూస్తుండగా ఒప్పాడట.
క.
నరు నింద్రాత్మజు నింద్రా, వరజసఖున్ వీరుఁ బాండవ ప్రవరు ధను
ర్ధరుఁ జూచి చూప ఱెల్లం,బరమాధ్భుత చిత్తు లగుచుఁ బలికిరి తమలోన్. 18
ఇంద్రావరజసఖున్=కృష్ణుని మిత్రుని
ఆ అర్జునుని చూచి జనులందరూ తమలో తాము ఇలా అనుకున్నారట.
తే.
వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు, వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి, కడుపు చల్లగాఁ బుట్టిన ఘనభుజుండు. 19
ధర్మ=ధనుః
ఆవిధంగా జనులందరూ అర్జునుని పొగడుతున్నారట. ఆ పొగడ్తలు విని కుంతీ దేవి చాలా సంతోషాన్ని పొందినదట.
వ.
అయ్యర్జును స్తుతివచనంబు లొక్కట జనసంఘంబు వలన నెగసి వియత్తల విదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం డిది యేమి రభసం బని విదురునడిగిన నాతం డి ట్లనియె. 22
రభసంబు=కలకలము
క.
భూరిభుజుం డర్జునుఁ డతి, శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న, వారితముగఁ బొగడుజనరవంబిది యధిపా. 23
తన విలువిద్యా ప్రదర్శన చేయటానికై రంగప్రవేశం చేసిన అర్జునుని అవారితముగా పొగడుతూ జనులు చేస్తున్న కలకలమిది మహారాజా అని విదురు డతనికి చెప్పాడు.
అర్జునుండు దన యస్త్రవిద్యాకౌశలంబు చూపుట
వ.
అని పొగడు చుండ నర్జునుం డాచార్యు ననుమతంబున నస్త్రలాఘవ వై చిత్ర్యప్రకాశనపరుం డయి యెల్లవారును జూచు చుండ. 26
సీ.
ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున భూప్రవిష్ణుం డగుభూరిఘోర
శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుఁ డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
తే.
దానదృశ్య దేహుండగుఁదత్క్షణంబ, హ్రస్వుఁడగు దీర్ఘుఁడగు సూక్ష్ముఁడగు రయంబు
తోడ రథమధ్యగతుఁడగు ధూర్గతుండు, నగు మహీతలగతుఁడగు నద్భుతముగ. 27
ఆగ్నేయాస్త్రంతో అతిభీకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింపనలవికాని జలాన్ని, అనిలాస్త్రంతో అధికమైన వాయువును, మేఘాస్త్రంతో మహాగొప్పవైన మేఘసమూహాన్ని- పుట్టించాడట. అంతేకాక భూమ్యాస్త్రంతో భూమిలోనికి ప్రవేశించినవాడుగాను, మహా ఘోరమైన శైలాస్త్రంతో పెద్దపర్వతరూపాన్ని దాల్చాడు. ఇవన్నీ కూడా అదృశ్యమైన అస్త్రాలసాయంతో జరుగుతున్నాయట. తాను అదృశ్యమైన దేహం కలవాడుగాను, ఆ క్షణంలోనే పొట్టివాడుగాను, మరుక్షణంలో పొడుగ్గాను, ఒక క్షణం దీర్ఘమైనవాడుగాను, మరో క్షణంలో సూక్ష్మమైన వాడుగాను ఒకసారి రథం మధ్యలో ఉన్నవాడుగాను, ఇంకో క్షణంలో భూమిమీద నిల్చున్నవాడుగాను ఇన్నిన్ని రకాలుగా ప్రత్యక్షమౌతూ అందరినీ అద్భుతంగా అలరించాడు అర్జునుడు తన ధనుర్విద్యతో.
వ.
మఱియుం బాఱెడు సింహవ్యాఘ్రవరాహాది మృగంబుముఖంబులం దొక్కొక్క యమ్మేసి నట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు రజ్జుసమాలంబితంబయిన గోశృంగంబునం దేకవింశతి శరంబులు వరుసన నాట నేసియు ని ట్లస్త్రవిద్యా వైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయు చున్నంతఁ గర్ణుండు నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన. 28
మ.
జను లెల్లం గడు సంభ్రమింపఁగ నజస్రం బై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబయో
యన వీతెంచినఁ బాండవుల్ సనిరి ద్రోణాచార్యు డాయన్ సుయో
ధను వేష్టించిరి తమ్ములందఱును దద్ద్వారంబు వీక్షించుచున్. 29
వ.
అంత. 30
శా.
సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్
బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణ వర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణ పూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్. 31
సాలప్రాంశు=మద్దివలె నెత్తైనవానికిని
నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్=ఉజ్జ్వలమైన సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్నవాడు
బద్ధోగ్రనిస్త్రింశు=గ్రహించిన భయంకర ఖడ్గముగలవానిని
అటువంటి కర్ణుని చూచి జనులందరూ ఆశ్చర్యపోయారట. పాండవులందరూ ద్రోణుని ప్రక్కకు చేరగా కౌరవులందరూ దుర్యోధనుని ప్రక్కకు చేరారట.

Post a Comment