Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-9
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్. 244

ఏకచక్రపురంలో పాండవులు తమ యింటి గృహస్థునకు కలిగిన కష్టాన్ని నివారించాలని కుంతి పాండవులకు చెపుతూ పై విధంగా అంటుంది.

పాండవులు జననీ సహితముగా వారణావతానికి వెళ్ళిన తరువాత దుర్యోధనునిచే నియమింపబడిన పురోచనుడు తాను నిర్మించిన చతుశ్శాలను వారికి చూపిస్తాడు. దానిలో వారు గృహప్రవేశం చేస్తారు. ధర్మరాజు ఆ గృహం లాక్షాగృహం అని గ్రహించి విదురుడు చెప్పిన ముందు జాగ్రత్త గుఱించి భీమునికి చెపుతాడు. భీముడు పురోచనునితో సహా ఆ గృహాన్ని వెంటనే తగలేద్దామంటాడు.

ధర్మరాజు అతడిని వారించి అలా చేస్తే భీష్మవిదురులకు కోపం రావచ్చని అగ్ని భయంతో మనం వేఱేచోటకు వెళ్ళితే మన ఆచూకిలోనే దుర్యోధనుడుంటాడు అనిచెప్పి అప్పటికా ఆలోచనని విరమింప చేస్తాడు. ఈలోగా విదురుఢు రాబోయే కృష్ణచతుర్దశినాటి రాత్రి లాక్షాగృహ దహనం జరుగుతుందని, జాగ్రత్తగా ఉండమని ఖనికు డనేవాడిని వారివద్దకు పంపి హెచ్చరిస్తాడు. ఖనికుడు పాండవులు క్షేమంగా బయటపడటానికి లాక్షాగృహం నుండి రహస్యమార్గాన్ని నిర్మించి పాండవులకది చూపించి జాగ్రత్తలు చెప్తాడు. పురోచనుడు పంపించిన నిషాద స్త్రీ తన ఐదుగురు పుత్త్రులతో లక్కయింటి ప్రక్కనే నిదురిస్తుండగా ఆ రాత్రి పురోచనుడు కూడా లక్కయింటిలోనే నిద్రిస్తుండగా భీముడు అర్ధరాత్రి సమయంలో పురోచనుని కంటె ముందే తాను మేల్కని లక్కయింటికి నిప్పుపెట్టి నిద్రిస్తున్న పాండవులను తల్లితో సహా తన భుజస్తంధాలమీద, చేతులతోనూ మోసుకుని రహస్య ద్వారం గుండా బయటపడి ఆవార్తను ఖనికుని ద్వారా విడురునికి చేరవేస్తాడు. లక్కయింటితో పాటుగా ఓక స్త్రీ ఐదుగురు మగవారు దహనమై పోవటంచేత పాండవులు , కుంతి చనిపోయారని అందరూ అనుకుని ఆ విషయం ధృతరాష్ట్రునికి చేరవేస్తారు. దుర్యోధను డావార్తవిని సంతోషపడతాడు. తన సేవకుడు పురోచనుడు కూడా ప్రమాదవశమున ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని భావిస్తాడు.

తరువాత నిద్రిస్తున్నపాండవులను తల్లిని భీముడు ఒక చెట్టుక్రిందికి చేర్చి వారికి నీళ్ళు తీసుకొని వచ్చి వారు తమంతట తాము మేల్కొనేదాక వేచి ఉందామనుకుంటాడు.

తరువాత కథ వ్యాసుడు వారిదగ్గఱకు వచ్చి వారికి హితోపదేశం చేసి రాగల కాలంలో ధర్మరాజు యుద్ధంలో కౌరవులను నిర్జించి సుఖంగా రాజ్యపాలన చేయగలడని కుంతీ దేవికి చెప్పి వారిని ఏకచక్రపురానికి వెళ్ళమని తరువాత తాను అక్కడికి వచ్చి వారిని తిరిగి కలుస్తానని చెప్పి వెళతాడు.

తరువాత భీమహిడింబల వివాహము, ఘటోత్కచుని జననము వగైరా జరుగుతాయి.

ఘటోత్కచుడు పుట్టిన వెంటనే పెద్దవాడయిపోయి తాను తన తల్లితో అరణ్యంలో నివసిస్తానని, పని కలిగినప్పుడు తనను తలచుకుంటే వస్తానని చెప్తాడు. తరువాత కుంతీ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ ఓ బ్రాహ్మణుని గృహంలో తల దాచుకుంటారు. ఓరోజు ఆ హ్రాహ్మణుని యింటినుండి రోదనలు వినిపిస్తే కుంతి వారికి వచ్చిన కష్టాన్ని తొలగించి వారికి సహాయం చేయటం తమ ధర్మమని పాండవులకు చెపుతూ ఈ విధంగా పలుకుతుంది.
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్ 244.

ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని గుర్తించగలగటం మంచి పని. మంచి మనసుతో దానికి సమంగా ఇతరులకు అవకాశం కలిగినపుడు తిరిగి ఉపకారం చేయటం మధ్యమమైనది. వారు చేసిన ఉపకారానికంటె ఎక్కువ ప్రత్యుపకారం మనం తిరిగి వారికి చేయటం ఉత్తమమం మనలాంటి చేయగలిగిన బుద్ధి కలిగిన వారికి.- అని కుంతీ దేవి తన పుత్త్రులతో అంటుంది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment