Unknown
శ్రీమదాంధ్ర మహాభారత పఠనాన్ని విరాట పర్వం తో మొదలు పెట్టాలంటారు పెద్దలు. అందుకని ఆది పర్వం పూర్తిచేసిన తర్వాత విరాట పర్వంలోనికి ప్రవేశిస్తున్నాను.
విరాట పర్వం ఫ్రథమాశ్వాసము-

పాండవులు థౌమ్యుని వీడికొని విరాట నగరం చేరతారు. వారి ఆయుధాలనన్నింటిని ఓ శమీ వృక్షం మీద భద్రపఱచి , ఆ ఆయుధాలు ధర్మరాజుకు అర్జునునకు మాత్రమే ఆ సంవత్సరకాలంలో కనిపించేలాను మిగిలిన వారికి అవి విషంతో కూడుకున్న పాములువలె కన్పించుగాక అని నియమించుకుంటారు. ఈ ఏర్పాటు భీముని దృష్టిలో ఉంచుకుని సమయభంగం కాకుండా ఉండాలని చేసుకున్నది. వారు విరాటరాజు కొలువున ఎలా మెలగాలన్నది కూడా నిర్ణయించుకుంటారు.
వారు వారిలో వారిని పిలుచుకోవటానికి వీలుగా మారు పేర్లను పెట్టుకుంటారు. ఆ మారు పేర్ల వివరాలు.
ధర్మరాజు--జయుడు
భీముడు--జయంతుడు
అర్జునుడు--విజయుడు
నకులుడు--జయత్సేనుడు
సహదేవుడు--జయద్బలుడు.
తరువాత ధర్మరాజు యమధర్మరాజు తనకు అరణ్యవాస సమయంలో ఇచ్చిన వరాన్ని(యక్షప్రశ్నలు ఘట్టంలో) పురస్కరించుకొని ప్రార్ధన చేయగా అతని అనుగ్రహంతో వారి వారి కనుగుణమైన రూపాలు వారికి సంప్రాప్తిస్తాయి.
ఆ రూపాలతో వారు ఒకరి తరువాత ఒకరుగా విరాటు కొల్వులోనికి ప్రవేశిస్తారు. ధర్మరాజు కంకుడు అనేపేరుతో విరటునిసభలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు విరాటుడతనితో
ఉ.
ఎయ్యది జన్మభూమి కుల మెయ్యది యున్నచోటు పే
రెయ్యది మీర లిందులకు నిప్పుడు వచ్చినదానికిం గతం
బెయ్యది నాకు నంతయును నేర్పడఁగా నెఱిగింపుఁ డున్నరూ
పయ్యది నావుడున్ నరవరాగ్రణి కయ్యతిముఖ్యుఁ డిట్లనున్. ౧౯౦

మీ వివరాలనన్నింటిని చెప్పమని విరాటు డడుగుతాడు యతి రూపంలో వచ్చిన ధర్మరాజుని.
ఆ.
ఉన్నరూప పలుకునన్నరు లెక్కడఁ, గలరు తోఁచినట్లు పలుకు పలుక
నైనచంద మయ్యె నంతియకా కంత, పట్టి చూడఁ గలరె యెట్టివారు. ౧౯౧
ఉన్నరూపు+=యథార్థమునే
ఇలా చెప్పి ధర్మరాజు లౌక్యాన్నుపయోగించి కొన్నాడు ఇక్కడ.

వ. అని మందహాసంబు సేయుచు మఱియును. ౧౯౨
క.
నానావిధభూతమయము, మే నతిచంచలము మనము మేకొని నిక్కం
బేనరునకు జెల్లింపం, గా నగు సత్యంబు నడపుక్రమ మట్లుండెన్. ౧౯౩
మేకొని=పూని
సత్యము యొక్కరూపాన్ని గురించి చెప్పి తాను నిజం చెప్పకుండా దాటవేసాడాయన. ఎవరికీ కూడా పూర్తి సత్యాన్ని పలకడం సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడతాడు. అదీ ఆయన చాతుర్యం. ధర్మరాజుకు సఖుడననీ తనకు కొద్దిగా ద్యూతక్రీడ తెలుసుననీ ఓ ఏడాదిపాటాశ్రయం కావాలనీ తన పేరు కంకుడనీ చెప్పి ఆశ్రయం పొందుతాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment