Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-
నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చిఇంద్రసభ, యమసభ, వరుణసభ, కుబేరుసభ, బ్రహ్మసభా వర్ణనలను చేస్తాడు. ఆ వర్ణనలలో పాండురాజు యమసభలో ఉన్నట్లుగాను హరిశ్చంద్రచక్రవర్తి దేవేంద్రసభలో ఉన్నట్లుగాను చెప్తాడు. అదివిని ధర్మరాజు నారదునితో
మధ్యాక్కర.
పరమధర్మాత్మకుఁ డయినపాండుభూపతిఁదొట్టి సకల
ధరణీశు లెల్ల యముసభ నుండంగఁ దా నేమిపుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁ డై యుండంగఁ గనియె.82
వ.
అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుండి ట్లని చెప్పె. 83
ఉ.
దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మ పరాయణుం డయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైక విభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రి కా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్. 84
సీ.
జయశీలుఁ డయి హరిశ్చంద్రుండు దొల్లి సప్తద్వీపములఁ దనబాహుశక్తిఁ
జేసి జయించి నిశ్శేషితశత్రుఁ డై ధారుణిలోఁ గలధరణిపతుల
నిజశాసనంబున నిలిపి నిత్యం బైన మహిమతో సకలసామ్రాజ్యమొప్ప
రాజసూయంబు తిరంబుగా నొనరించి తనరి యథోచితదక్షిణలకు
ఆ.
నేనుమడుఁగు లర్థమిచ్చి యాజకులఁ బూ,జించి భక్తితో విశిష్టవిప్ర
జనుల కభిమతార్థసంప్రదానంబులఁ,దృప్తి సేసె వంశదీపకుండు.85
వ.
వాఁడును బ్రాహ్మణవచనంబునం జేసి దేవేంద్రసాలోక్యంబు వడిసె నట్టిహరిశ్చంద్రుమహిమాతిశయంబు రాజసూయనిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో నిట్లనియె. 87
వైవస్వతసభన్=యమసభలో
చ.
కొనకొని మర్త్యలోకమునకుం జని సన్మునినాథ యిందు నా
యునికియు రాజసూయమఖ మున్నతిఁ జేసినధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైనధర్మ నం
దనునకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయగన్.89

నీవు మనుష్యలోకానికి వెళ్ళి నాకొడుకు ధర్మరాజుతో నా నరకనివాసాన్ని గురించి రాజసూయం చేసినవారి సంబంధుల స్వర్గనివాసస్థితిని తెలియజేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా అతనికి చెప్పి రాజసూయయాగం చేయమని నా మాటగా చెప్పమన్నాడు.
చ.
అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవురు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుఁడు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
దనుఁ డయి సార్వభౌముఁడయి తమ్ములబాహుబలంబు పెంపునన్. 90

నాకొడుకులు దేవతాంశతో పుట్టినవాళ్ళు ధర్మరాజు రాజసూయాన్ని తమ్ముల సహాయంతో పూర్తి చేయగలడు
అని కూడా అన్నాడు.
వ.
అట్లేని నాకు నస్మత్పితృపితామహనివహంబుతోడ నాకాధిపలోకసుఖావాప్తి యగు ననిన నప్పాండురాజు వచనంబు నీ కెఱింగించువేడుక నిట వచ్చితి. 91
క.
న్యాయమున రాజసూయము, సేయుము నీపితృగణంబుఁ జెచ్చెర నధిక
శ్రీయుత సురగణపూజ్యులఁ, జేయుము శక్రుసభ నుండఁ జేయుము వారిన్. 92

నీ తండ్రికి స్వర్గం ప్రాప్తించేలా నీవు రాజసూయయాగం చెయ్యి అని నారదుడు ధర్మరాజును ప్రేరేపిస్తాడు.
వ.
దిగ్విజయోపార్జితంబు లయినధనంబుల బ్రాహ్మణసంతర్పణంబును ధర్మమార్గంబునం జాతుర్వర్ణ్యాశ్రమ రక్షణంబునుం జేసి సామ్రాజ్యంబు(పూజ్యంబై యొప్పం) బ్రకాశింపుము మఱి రాజసూయంబు బహు విఘ్నంబు బ్రహ్మరాక్షసులు దాని రంధ్రంబ రోయు చుండుదు రదియును నిర్విఘ్నంబున సమాప్తం బయ్యెనేని నిఖిలప్రజాప్రళయకారణం బయిన రణం బగునని చెప్పి నారదుం డరిగినఁ దమ్ములం జూచి ధర్మ తనయుండు ధౌమ్యద్వైపాయనసుహృద్బాంధవమంత్రి సమక్షంబున నిట్లనియె.93

ధర్మరాజు నారదవచనప్రబోధితుండయి రాజసూయయజ్ఞంబు సేయుటకు నాలోచించుట
క.
పితృసంకల్పము సేయఁగ, సుతుల కవశ్యమును వలయు సుతజన్మఫలం
బతిముదమునఁ బితృవరులకు, హిత మొనరించుటయ కాదె యెంతయు భక్తిన్. 94
క.
పరలోకనిలయు లగుమీ, గురులకు దీనిన హితం బగున్ లోకభయం
కరసంగరమును గాలాం,తరమున నగునని విరించితనయుఁడు సెప్పెన్. 95
క.
పితృగణహితార్థముగ స,త్క్రతువొనరింపగ బుద్ధి గలదు ప్రజాసం
హృతి తత్క్రతువున నగు నని, మతి నాశంకయును గలదు మానుగ నాకున్. 96

ద్వైదీభావంలో పడ్డాడు ధర్మరాజు.ఓ ప్రక్క తండ్రులకు స్వర్గలోకప్రాప్తి, మరోప్రక్క ప్రజావినాశనం ఏదీ తేల్చుకోలేకుండా వున్నాడు.
వ.
ఏమి సేయుదు నని డోలాయమానసుం డయి యున్న ధర్మరాజునకు ధౌమ్యప్రభృతు లి ట్లనిరి. 97
ఉ.
చేయుము రాజసూయ మెడ సేయక దాననచేసి దోషముల్
వాయు నిలేశ భూప్రజకుఁ బార్థివు లెల్ల భవత్ప్రతాపని
ర్జేయులు సర్వసంపదలు చేకొనఁగాఁ దఱి యయ్యెఁ గౌరవా
మ్నాయలలామ నీ కెనయె మానవనాథులు మానుషంబునన్.98
వ.
అనిన వారలవచనంబుల కనుగుణంబుగా ననుజానుమతుం డయి ధర్మరాజు రాజసూయంబు సేయసమకట్టి............
ఇక్కడ ధర్మరాజు వ్యక్తిత్వం కొంచెం దెబ్బతిన్నట్లనిపిస్తుంది నాకు. నిఖిలజన ప్రళయాన్ని కలిగించే యుద్ధం జరుగుతుందని ముందే తెలిసినా దానికివ్వాల్సినంత ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా రాజసూయానికి పూనుకోవటం నాకంతగా నచ్చలేదు. అది అతని వ్యక్తిత్వానికి మచ్చగా నా కనిపిస్తుంది. నేను తప్పో కాదో నాకు తెలియట్లేదు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment