Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౯
యయాతి మహారాజు చరిత్రము
తే.
వర్ణధర్మముల్ గాచుచు వసుధయెల్ల, ననఘచరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్రి యైన, దేవయానిని దా నెట్లు దేవిఁ జేసె.౯౭
తే.
విపుల తేజంబునను దపోవీర్యమునను, జగదనుగ్రహనిగ్రహ శక్తియుక్తుఁ
డయినయట్టియయాతికి నలిగియేమి, కారణంబున శాపంబు కావ్యుఁడిచ్చె.౯౮

రాజైన యయాతి బ్రాహ్మణుడు గురుడు అయిన శుక్రాచార్యుని పుత్రిక నెలా పెళ్ళాడాడు.విపుల తేజస్కుడు తపోమహిమతో అనుగ్రహ నిగ్రహశక్తియుక్తుడైన యయాతికి ఏ కారణం వలన శుక్రుడు శాపమిచ్చాడు. అని అడిగాడు జనమేజయుడు వైశంపాయనుడిని.
వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు.
పూర్వం వృషపర్వుడనే దానవ పతికి శుక్రుడు ఆచార్యు డై దేవతలకు విరోధియైన ఆ దానవపతికి ప్రియాన్ని చేకూరుస్తుండే వాడు. దేవతలతో జరిగిన యుద్ధాలలో మరణించిన అందరు రాక్షసులను తన దగ్గర ఉన్న మృత సంజీవని అనే విద్య ద్వారా ఎప్పటికప్పుడు తిరిగి బ్రతికిస్తుండేవాడు. అలా చేయటం వలన రాక్షస సైన్యాన్ని జయించటం దేవతలకు అసాధ్యంగా ఉండేది. ఈ కారణం చేత దేవతలు అందరూ ఆ మృతసంజీవని విద్యను శుక్రాచార్యుల దగ్గరనుండి నేర్చుకొని రావడానికని బృహస్పతి కుమారుడైన కచుడిని నియోగిస్తారు. శుక్రాచార్యునికి అతని కూతురు దేవయాని అంటే విరీతమైన ఫ్రేమ అనీ ఆమె అనుగ్రహం పొంది ఆమె ద్వారా ఆ విద్యను శుక్రాచార్యుని వద్ద నుండి నేర్చుకుని రావలసిందని అతనిని పంపుతారు.
కచుడు శుక్రుని వద్దకు వెళ్ళి తనను బృహస్పతి కుమారునిగా పరిచయం చేసుకొని తనని శిష్యునిగా స్వీకరించి చదువు చెప్పమని ప్రార్థిస్తాడు. అతని వినయనిధేయతలు వగైరాలతో సంతృప్తి చెందిన శుక్రుడు అతనిని సేవిస్తే బృహస్పతిని సేవించినట్లేనని తలచి అతణ్ణి శిష్యుడుగా అంగీకరిస్తాడు.
సీ.
పని యేమి పంచినఁ బదపడి చేసెద ననక తన్ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురుచిత్తవృత్తికిఁ గడు ననుకూలుఁ డై వినయంబుతోడ
మనమునఁ జెయ్వులమాటల భక్తి నేకాకారుఁ ఢై మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁ డై ప్రియహితభాషణములఁ బుష్ప ఫలవిశేష
ఆ.
దానములను సంతతప్రీతిఁ జేయుచు, నివ్విధమునఁ బెక్కు లేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర, నెమ్మి వడసెఁ దనదు నేర్పు పేర్మి.౧౧౦

గురువును సేవించుకోవాల్సిన విధం విపులంగా తెలియజేయబడిందిక్కడ.

కచుడిలా గురువుగారికి ప్రియ శిష్యుడుగావటం సహించలేని దానవులు అతనినెలాగైనా మట్టు పెట్టాలని ఓసారి అడవికి వెళ్ళినపుడు అతనిని అడవిలో చంపివేసి ఓ చెట్టుకు కట్టివేసి తిరిగి వస్తారు. అందరితో పాటుగా కచుడు తిరిగి రాకపోవటం చూచి దేవయాని తండ్రికి ఆ విషయం తెలియపరుస్తుంది. దివ్యదృష్టితో జరిగినది తెలిసికొన్న శుక్రుడు అతనిని తన మృతసంజీవని విద్య ద్వారా బ్రతికిస్తాడు. ఈసారి ఇలా కాదని దానవులు కచుడిని చంపి దహనం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రునికిస్తారు. శుక్రుడది త్రాగుతాడు. సాయంత్రం మళ్ళీ దేవయాని గొడవ పెడితే శుక్రుడు కచునికోసం దివ్యదృష్టితో వెదకి వెదకి చివరకు సురతో కలిసి తన పొట్టలో ఉండడాన్ని గ్రహిస్తాడు. అప్పుడు శుక్రాచార్యులు మద్యసేవను నిరసిస్తూ ఇలా కట్టడి చేస్తాడు.
ఆ.
మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్, పరఁగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణమాత్రన, చెఱుచు మద్య సేవ సేయ నగునె.౧౨౦
క.
భూసురు లాదిగఁ గలజను, లీసుర సేవించి రేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు, చేసితి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్.౧౨౧

అని శుక్రాచార్యులు సురాపానము మహాపాపమని శపించి, కచునకు కడుపులో ఉండగానే మృతసంజీవనిని ఉపదేశించి తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి తనని అదే విద్య ద్వారా తిరిగి బ్రతికించమంటాడు. కచుడు ఆవిధంగానే చేస్తాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment