Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౦
దేవయాని కచుడు ఒకరినొకరు శపియించుకొనుట
కచుడు శుక్రాచార్యుల యొద్ద మృతసంజీవని విద్య నేర్చి శుక్రుడిని బ్రతికించిన తర్వాత చాలా కాలం గురుని సేవించి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళటానికి గురుని అనుమతి పొంది, దేవయానికి కూడా వీడ్కోలు పలకడానికి వస్తాడు. అప్పుడామె అతనితో--
ఉ.
నీవును బ్రహ్మచారివి వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్.౧౨౯

క.
ఆ కచుఁ డత్యంత విషా,దాకులుఁ డై లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె, నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్.౧౩౦
క.
గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థమ లోకధర్మపథ మిది దీనిం
బరికింపక యీపలుకులు, తరుణీ గురుపుత్రి నీకుఁ దగునే పలుకన్.౧౩౧
వ.
అనిన నాకచునకు దేవయాని కరం బలిగి నీవు నామనోరథంబు విఫలంబుగాఁ జేసినవాఁడవు నీకు సంజీవని పనిసేయ కుండెడుమని శాపం బిచ్చినఁ గచుం డేను ధర్మపథంబు దప్పనివాఁడను నీవచనంబున నాకు సంజీవని పనిసేయ దయ్యెనేని నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక మఱి నీవు ధర్మవిరోధంబు దలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్క్షణంబ.౧౩౨

క.
దేవగురునందనుం డమ, రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదీశించి సు, ధీవిభుఁ డొనరించు చుండె దేవహితంబుల్.133
పర్వములు | edit post
0 Responses

Post a Comment