Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

దుష్యంత మహారాజు చరిత్రము

వ.
ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలులుండు పుట్టె వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టెఁ బుట్టి యనన్య సాధారణ గుణయుక్తుండై.
శా.
ఆ దుష్యంతుఁ డనంత సత్త్వుఁడు సమస్తాశాంత మాతంగమ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్తమై యుండఁగా

నాదిత్యాంశుసమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాది క్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.

ఆదిత్యాంశుసమీర దుర్గమ=సూర్యరశ్మి గాలియు జొరరాని

ఆ దుష్యంత మహారాజు ఓ పర్యాయం అడవికి వేటకు వెళ్ళి మృగాలను వేటాడుతూ వేట తమకంలో పరివారానికి దూరమై కొద్ది పరిజనం మాత్రమే వెంట రాగా ఓ పుణ్యనదీ తీరంలో వివిధసురభికుసుమ ఫల భారవినమ్రతరులతా గుల్మ పరిశోభితం బయిన యొక్క వనంబు గని ఆ వన సౌందర్యమునకు ముగ్ధుడై ప్రవేశించు నపుడు ఆతనిపై చల్లని గాలివిసరి సేదతీర్యటమే కాకుండా లతలయెక్క పువ్వులు అక్షతలు చల్లి దీవించినట్లుగా అయిందట.

మానిని.
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల ని మ్మగుఠావుల జొంపములన్
బూచిన మంచి యశోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం

గాచి బెడంగుగఁ బండిన యా సహకారములం గదళీ తతులం

జూచుచు వీనుల కిం పెసఁగన్ వినుచున్ శుకకోకిలసుస్వరముల్.౨౦
సహకారములం=తియ్యమామిళ్ళ చేతను

చిగిరించిన గోరంట్లతోనూ, బాగా పూచిన అశోకములతోనూ, సురపొన్నలు పొన్నలతోనూ గేదగి పూవులతోనూ బాగుగా పండిన తియ్యమామిడి పండ్లతోను, అరటి పండ్లతోనూ ఒప్పుతున్న చెట్లనూ లతలనూ చూస్తూ, చిలుకల మరియు కోకిలల కుహూరావాల్ని వింటూ ముందుకు సాగాడు.

కవిరాజవిరాజితము.
చని చని ముందట నాజ్యహనిర్ధృతసౌరభధూమలతాతతులం
బెనఁగిన మ్రాకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లై నను బా

యని మధుప ప్రకరంబులఁ జూచి జనాధిపుఁడంత నెఱింగెఁ దపో

వన మిది యల్ల దె దివ్యమునీంద్రు నివాసము నా నగు నంచు నెదన్.
౨౧

ముందుకు వెళ్ళగా వెళ్ళగా అక్కడ నేతితో కూడిన హవిస్సులను అగ్నిలో వేల్చగా వెలువడిన ధూమముతో నిండిన లతలతో వున్న చెట్లకొమ్మల మీద పూవులు లేకున్ననూ పాయని తుమ్మెదలగుంపును చూచి దుష్యంతుడు ఆ ప్రదేశము ఒక ముని ఆశ్రమమని ఎదురుగా కనిపించేది ఆ దివ్యమునీంద్రుని నివాసమని గ్రహించాడు. ఇంకా లోనికి వెళ్ళగా అక్కడ వినిపిస్తున్న హోత్ర స్వాహా శబ్దాల్ని, విద్వత్సంభాషణలను మరియు గోష్ఠీనినాదాల్ని బట్టీ దానిని కణ్వమహాముని ఆశ్రమంగా యెఱిగిన వాడై అందు.
సీ.
శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులును గరికరశీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి వానిఁ జెంది సుఖం బున్న సింహములును
భూసురప్రవరులు భూతబలుల్ దెచ్చి పెట్టు నీవారాన్న పిండతతులు
తే.
గడఁగి భక్షింప నొక్కటఁ గలసియాడు, చున్న యెలుకలుఁ బిల్లులు నొండు సహజ
వైరివర్గంబులయు సహవాసమపుడు, సూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది.౨౪

అక్కడ చిలుకలు శ్రవణ సుఖంగా సామగానాన్ని చేస్తుండగా కదలకుండా ఆగానాన్ని వింటూవున్నాయట ఏనుగులు.
ఆ ఏనుగులశీతల ఛాయలోని చల్లని నీటితుంపరల గాలికి ఆసపడి ఆ ప్రక్కనే సుఖంగా కూర్చున్నాయట సింహాలు. బ్రాహ్మణులు భూత బలుల కోసం తెచ్చి పెట్టిన నీవారాన్న పిండములను తినడానికై చేరిన యెలుకలు పిల్లులు తమ తమ జాతి వైరాలను విడిచి ఒక్కచో స్నేహంతో మెసలుతున్నాయట. ఈ దృశ్యాల్ని చూచి ఆ ముని శక్తికి అబ్బురపడుతూ
ఈ కశ్యపప్రజాపతి పుత్త్రుండైన కణ్వమునీశ్వరులకు నమస్కరించి వస్తాను మీరంతా ఇక్కడే వుండండని తన పరివారానికి నియమించి కణ్వమునీంద్రుల ఆశ్రమంలోనికి ప్రవేశిస్తాడు దుష్యంతుడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment