Unknown
ఆది పర్వము-చతుర్ధాశ్వసము-3

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమం బెఱింగించుట

మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
.49

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయంలోనిదీ పద్యం.

దుష్యంతుడు అలా తనవారిని బయటనే నిలిపివుంచి కణ్వమహాముని దర్శనార్థం ఆశ్రమం లోనికి ప్రవేశిస్తాడు. అక్కడతనికి మునీశ్వరుని దర్శనం కాలేదు కాని తన్వి, పయోజదళాయతాక్షి, సంకుల మిళితా ళినీల పరికుంచిత కోమల కుంతల ఐన శకుంతల దర్శనం అవుతుంది.
ఆమె దుష్యంతుని నెఱింగి ఆసన అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి కుశలం బడుగుతుంది. అప్పుడామెతో దుష్యంతుడు--
ఉ.
క్రచ్చఱ వేట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందుఁ బోయిరొకొ వా రనినన్ విని యా లతాంగి వా

రిచ్చటనుండి యీక్షణమ యేగిరి కానకుఁ బండ్లు దేర మీ

వచ్చు టెఱింగిరేని జనవల్లభ వారును వత్తు రింతకున్.
౨౭

వేటకోసమై వచ్చి కణ్వమహామునుల దర్శనంకోసం వచ్చాను. వారు యెక్కడకు వెళ్ళారో యిచట లేరు అనగా నామె వారిప్పుడే పండ్లు తేవటానికని అడవికి వెళ్ళారు. మీరొచ్చినట్టు తెలిసినవారై యిప్పుడే తిరిగి వస్తూంటారు. వారు వచ్చేవరకూ ఓ ముహూర్తకాలం వేచివుండాల్సిందని ప్రార్థిస్తుంది. ఆమె వినయానికి సంతసించి ఆమె రూపగుణ విశేషాలచే సంచలితుం డైన రాజు ఆమెను నీ వెవ్వరి కూతురవు యిట్టి గుణసుందరిని నీవు ఇక్కడికెలా వచ్చేవు అని అడుగుతాడు. దానికి శకుంతల
క.
జగతీ వల్లభ యే న,త్యగణితధర్మ స్వరూపుఁ డని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం, డగు కణ్వమునీంద్రు నాత్మజ ననినన్
.౨౯
చ.
ఇది ముని కన్యక యేని మఱియేలొకొ యీ లలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలు కింతను నమ్మ నేర న

య్యెద విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు నంచుఁ దా

నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్.
౩౦
వ.
ఇట్లు దుష్యంతుం డాశకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె.౩౧
తే.
ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వ రేతుఁ, డైన కణ్వమహాముని యనఘచరితుఁ
డట్టిముని కెట్లు గూఁతుర వైతి దీని, నాకు నెఱుగంగఁ జెప్పుము నలిననేత్ర
.౩౨

ఈమె మునికూతురనని అంటున్నది. అదే నిజమయితే మఱి నా మనస్సు ఈమె యందు ఎలా లగ్నం అవుతుంది? ఈమాట నమ్మదగినదిగా లేదు. ఈ ముని విజితేంద్రియుడని చాలాసార్లు విన్నాను కదా. అసలు నిజమేమిటో తెలుసుకోవాలి అని దుష్యంతుడు మనసులో అనుకున్నాడు. అలా అనుకొని ఆమెతో ఇలా అన్నాడు.
కణ్వులవారు ఉత్తమమైన ఆశ్రమాన్ని పాటించేవారు, మరియు ఊర్ధ్వరేతస్కుడూ అని విని ఉన్నాం. అటువంటి అనఘ చరితుడూ పుణ్యాత్మునకు నీవు కుమార్తె వెలా అయ్యావు.
వ.
అని యడిగిన నా రాజునకు శకుంతల యి ట్లనియె.౩౩
క.
ఇక్కమలాక్షి శకుంతల, యెక్కడియది దీనిజన్మ మెవ్విధ మని త
మ్మొక్క మునినాథు డడిగిన, నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్.
౩౪
వ.
నా జన్మ ప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పిన విధంబు చెప్పెదఁ జిత్తగించి విను మని యా దుష్యంతునకు శకుంతల యి ట్లనియె.౩౫

శకుంతల మేనకా విశ్వామిత్రుల కథను దుష్యంతునకు చెపుతుంది.

రాజర్షియై, బ్రహ్మర్షి భావము బడసియున్న విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేస్తున్న సమయాన దేవేంద్రుడు ఆతని తపస్సునకు వెఱచి మేనక అనే అప్సరసను పిలిచి ఆతని తపస్సును భగ్నం చేయమని నియమిస్తాడు. దానికి ఆమె వశిష్ఠునంతవానిని అనపత్యుడవు గమ్మని శపించినంతటి ఉగ్రకోపిష్టి యైన విశ్వామిత్రుని కడకు నన్ను పంపించటం న్యాయం కాదంటూనే నాశక్తికొలది ప్రయత్నిస్తానని చెప్పి మేనక మందమలయానిలం తోడుగా విశ్వామిత్రుని తపోవనం చేరుతుంది. తరువాత కథ మామూలే. విశ్వామిత్రుని దీక్ష భగ్నమై విశ్వామిత్ర మేనకల సంయోగంతో వారిద్దరికీ ఓ ఆడశిశువు జన్మిస్తుంది. మేనక ఆ కన్యకను మాలిని అనే నదీతీరంలో వదలిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు కూడా ఆ శిశువును విడిచిపెట్టి వెళ్ళిపోగా
ఆ.
చెలఁగి లేవ నేడ్చు చిఱుతుక దానిఁ గ్ర,వేయాద ఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు, కొని శకుంతతతులు గూడి యుండె.౪౭
చెట్టుపలఁ=ఱెక్కల చేత
వ.
అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుం జని యమ్మాలినీపులినతలంబుమన శకుంతరక్షిత యై యున్న కూతుఁనత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణశశిరేఖయుం బోలినదాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటం జేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి.
మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘయుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.
4
వ.
అనం బరగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటం జేసి గురుల మిదియును మాచే నభివర్ధిత యగుటం జేసి మాకు హృదయానందని యైన కూఁతురని కణ్వమహామును లమ్మునికిఁ జెప్పినవిధం బంతయు సవిస్తరంబుగా శకుంతల సెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున. ౫౦
పర్వములు | edit post
0 Responses

Post a Comment