Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౬
వేదవ్యాసముని సత్యవతి యొద్దకు వచ్చుట
వ.
అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి కొండొకనాఁడు దను కన్యయై యున్న కాలంబునఁ బరాశరుండు దన్నుఁ గామించుటయు నమ్మునివరంబున దన కన్యాత్వంబు దూషితంబు గా కునికియుఁ దత్ప్రసాదంబునం జేసి యమునాద్వీపంబునఁ గృష్ణద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్భంబునఁ బుట్టి పని గల యప్పుడ తన్నుఁ దలంచునది యని చెప్పి తపోవనంబునకుం జనుటయును భీష్మునకుం జెప్పి నిజతపోదహనదగ్ధసాపేంధనుండయిన కృష్ణద్వైపాయనుండఖిల ధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ యనుమతంబున భవద్భ్రాతృ క్షేత్రంబులయందు సంతానంబు వడయు ననిన సత్యవతి వలన నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకుడున్న దిక్కునకు మ్రొక్కి తొల్లి జగంబు లుత్పాదించిన యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబుగల వేదవ్యాసుం డిక్కురువంశంబుఁ బ్రతిష్ఠించుటయ యెల్లవారికి నభిమతంబ యనిన సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ.

వేదవ్యాసముని సత్యవతి యొద్దకు వచ్చుట
ఉ.
నీలగిరీంద్ర శృంగమున నిర్మల మైన సువర్ణ వల్లరీ
జాలమువోనిపింగళవిశాలజటాచయ మొప్పఁగా వచ
శ్శ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీలవినీలవిగ్ర హా
రాళరుచుల్ వెలుంగఁగ బరాశరసూనుఁడు తల్లి ముందటన్. ౨౪౦.

నీలమైన గిరీంద్రశృంగము మీద నిర్మలమైన బంగారు తీఁగలవలెఁ బచ్చని విశాలమగు జడలమొత్తముతో ప్రకాశించుచూ, వచశ్శ్రీలలితుడైన వ్యాస మహర్షి ఇంద్రనీలములవంటి నల్లనిదేహము యొక్క వికారకాంతులు వెలుగుచుండగా తల్లి ముందఱ ప్రత్యక్షమైనాడట.
వ.
సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యా ప్రథమ పుత్రు నతిహర్షంబునం గౌఁగిలించికొని యవిరళ పయోధర పయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న నమ్మునివరుండును దల్లి బాష్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సర భూసురవరులతో విధిపూర్వకంబుగా భీష్ముండు సేసిన యర్ఘ్యాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న నమ్మాహామునిఁ గుశలం బడిగి సత్యవతి యి ట్లనియె. ౨౪౧
క.
జనకునకును స్వామిత్వము, తనయోద్దేశమునఁ గలిమి తథ్యమ యది య
జ్జననికి గలుగున కావునఁ, జనుఁ బని బంపంగ నిన్ను జననుత నాకున్.
౨౪౨

తండ్రికి అధికారము తనయుడు కలిగినప్పుడే కలగటం తథ్యం. అది ఆతల్లికి కూడా కలుగుతుంది కాబట్టి నిన్ను నేను పనికి నియోగించవచ్చు అని తల్లి కొడుకుతో అంటుంది.

అప్పుడామె భీష్ముని ప్రతిజ్ఞాపాలన గూర్చి కృష్ణద్వ్యైపాయనున కెఱింగించి అతని తమ్ముడైన విచిత్రవీర్య సుక్షేత్రములలో దేవరన్యాయం ద్వారా సంతానాన్ని కలగజేయమంటుంది.
క.
అని సత్యవతి నియోగిం, చిన వేదవ్యాసుఁ డట్ల చేయుదు నిది యెం
దును గలధర్మువ యెప్పుడు, వినఁబడు నానా పురాణవివిధశ్రు
తులన్. ౨౨౭

అలా సత్యవతి పురమాయించగా అలాగే చేస్తాను, ఇది యెల్లెడలా అమలుపరపబడుచున్న ధర్మమే అంటాడు వ్యాసుడు. చాలా పురాణాల్లోను శ్రుతులలోనూ కూడా వినబడేదే అంటాడు.
వ.
ఇక్కాశీరాజదుహితలయందు ధర్మస్థితిం బుత్త్రోత్పత్తి గావించెద వీరలు నా చెప్పిన వ్రతం బొక సంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్పుత్త్రులు పుట్టుదు రనిన సత్యవతి యి ట్లనియె. ౪౮

కాని పాపం ఆవిడ ఈ షరతు కంగీకరించకుండా పిల్లల్ని అర్జంటుగానే పుట్టించాల్సిందని సూచిస్తూ ఆలస్యమయితే రాజ్యం అరాచకం కావటం వగైరా కారణాలు ఏకరువు పెడుతుంది.
వ.
అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబిక కడకుం జని క్షేత్రజ్ఞుండై నవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యదురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు మెల్ల ధర్మంబుల కంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు నేఁటి రాత్రి నీకడకు దేవరుండు వచ్చుం దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది యని కోడలి నొడంబఱిచి యనేక సహస్ర మహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపి యున్న నా రాత్రియందు. ౨౫౨
దేవరుడు=భర్తృభ్రాత(మగని యన్న)
క.
తివిరి సుతజన్మ మెట్టిం, డవునొకొ దేవరుఁడు నాకు ననుచును నవప
ల్లవ కోమలాంగి యంబిక, ధవళేక్షణ విమలశయనతలమున నున్నన్.
౨౫౩

అంబిక తన మగని అన్నద్వారా సంతానం పొందగోరి తెల్లని కన్నులు కలదై తెల్లని శయనతలము మీద వేచి ఉన్నది.
మధ్యాక్కర.
అవసరజ్ఞుం డయి వ్యాసు డేతెంచె నంత త్తపసి
కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
దవిన యన్నువనల్ల నైన దీర్ఘ పుందనువును జూచి
యువిద గన్నుంగవ మొగిచి తెఱవక యుండె భయమున. ౨౫౪

ఆ పని నిర్వర్తించడం కోసమై వ్యాస మహర్షి రాగా ఆ తపసి యొక్క పచ్చని గడ్డాన్నీ, పచ్చని జడలనూ, పచ్చని కన్నులను తగిన యల్పమైన నల్లని పొడవైన శరీరమును చూచి అంబిక తన కన్నులను మూసుకొని తెఱవకుండా భయముతో ఉండిపోయినది.
వ.
కృష్ణద్వైపాయనుండును దానికిం బుత్త్రదానంబు సేసి యా యంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టువాఁడు మాతృదోషంబున నంధుం డగు ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుం బ్రార్థించి యింక నంబాలికయం దొక్క కొడుకుం బడయు మని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనై యున్న నక్కోమలికిం బుత్త్రదానంబు సేసి యీ యంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగు సుపుత్త్రుండు పుట్టు వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగునని చెప్పి యరిగిన. ౨౫౫

ధృతరాష్ట్ర పాండురాజుల జననము
క.
బలవన్మదనాగాయుత, బలయుతుఁడు సుతుండు పుట్టెఁ బ్రజ్ఞాచక్షుం
డలఘుఁడు ధృతరాష్ట్రుం డా, లలనకు నంబికకుఁ గురుకులప్రవరుం డై. ౨౫౬

మదించిన యేనుగుతో సమాన మైన బలము కలిగినవా డైన కుమారుడు ధృతరాష్ట్రుడు గుడ్డివా డై అంబికకు కురు వంశాన్ని ఉద్ధరించటానికై పుడతాడు.
క.
అంబాలికకును గుణర,త్నాంబుధి పాండురవిరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు గురువం, శంబు ప్రతిష్టింప ధర్మ సర్వజ్ఞుం డై. ౨౫౭

అంబాలికకు కూడా గుణవంతు డైన కుమారుడు, తెల్లని దేహంతో కూడినవా డైన పాండురాజు కురువంశాన్ని ప్రతిష్టించడం కోసమై అన్ని ధర్మాల్నీ యెఱిగిన వాడుగా పుడతాడు.

వ.
ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకర్మాది క్రియ లొనరించి నంత నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె నింక నొక్కకొడుకు రూపవంతుం బడయు మనిన నియతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టు ననవుడు సత్యవతి తొల్లింటి యట్ల కోడలి నియోగించిన నక్కోమలి యమ్మునివరుని వికృతవేష రూపగంధంబుల కోపక రోసి తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుం డై దానికిం బుత్త్రదానంబు సేసిన. ౨౫౮
ఆ.
చండకోపుఁ డయిన మాండవ్య మునివరు, శాపమున జముండు సంభవిల్లె
విదురు డనఁగ ధర్మనిదుఁడు పారాశర్యు, వీర్యమున నవార్యవీర్యబలుఁడు. ౨౫౯.

ఉగ్రమైన కోపం గల మాండవ్యముని శాపకారణంగా యముడు విదురుడుగా ధర్మవిదుడై పారాశర్యుని వీర్యంతో అంబికా దాసికి జన్మిస్తాడు .
ఈ విధంగా ధృతరాష్ట్ర,పాండురాజ, విదురులు జన్మిస్తారు.









వ.
పర్వములు | edit post
0 Responses

Post a Comment