Unknown
ఆది పర్వము- చతుర్థాశ్వాసము-౧౬
మాండవ్యోపాఖ్యానము
ఆ.
చండకోపుఁ డయిన మాండవ్యమునివరు, శాపమున జముండు సంభవిల్లె
విదురుఁడనఁగ ధర్మవిదుఁడు పారాశర్యు, వీర్యమున నవార్యవీర్యబలుఁడు. ౨౫౯
వ.
అనిన విని జనమేజయుండు వైశంపాయునున కి ట్లనియె.౨౬౦
ఆ.
సకలజీవరాశి సుకృత దుష్కృతఫల, మెఱిఁగి నడపుచున్న యిట్టి ధర్ముఁ
డొంద శూద్రయోనియందు మాండవ్యుచే, శప్తుఁడై యదేల సంభవించె. ౨౬౧

యమధర్మరాజు, సమవర్తి. అటువంటి గొప్పవానికి శూద్రయోని యందు పుట్టే అగత్యం ఎందువల్ల కలిగింది- అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు.
వ.
అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె మాండవ్యుండను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున కెడగలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌన వ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమానులై మాండవ్యు సమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాగినవారి వెనుదగిలి వచ్చిన యా రెకు లమ్మునింగని రాజధనాపహారులయిన చోరులు నీయొద్దన పాఱి రెటవోయి రెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్న న య్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నా మ్రుచ్చులం బట్టికొని, ౨౬౨
ఆ.
తాన చోరులకును దాపికాఁ డై వేష, ధారి మిన్న కేని తపముసేయు
చున్నయట్లు పలుక కున్నవాఁడని యెగ్గు, లాడి యారెకులు నయంబు లేక. ౨౬౩
యారెకులు=తలారులు
తనే చోరులతో కూర్చువాడై వేషం ధరించి మిన్నకుండా తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడని తలారులున్యాయాన్ని తలవకుండా ఉన్నవారై,
వ.
మాండవ్యు నా మ్రుచ్చులతోన కట్టికొనివచ్చి రాజునకుంజూపి ధనం బొప్పించిన రాజు నా మ్రుచ్చులంజంపించి తపోవేషంబున నున్న మ్రుచ్చని యమ్మాండవ్యునిఁ బురంబువెలి శూలప్రోతుం జేయించిన. ౨౬౪
క.
మునివరుఁ డట్లుండియుఁ దన, మనమున నతిశాంతుఁ డయి సమత్వమునఁ దప
మ్మొనరించె ననశనుం డ, య్యును బహుకాలంబు ప్రాణయుక్తుం డగుచున్. ౨౬౫

మునివరుడు శూలప్రోతు డయి వుండి కూడా తన మనస్సులో అతి శాంతిపరుడు కావున సమత్వాన్ని వహించి ఆహారం తీసుకోకుండా తపస్సు చేస్తూ బహుకాలం ప్రాణాలు ధరించి వున్నాడట పాపం.
వ.
ఇట్లు శరీరదుఃఖంబు దలంపక తపంబు సేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రి వచ్చి మునీంద్రా యిట్టి మహా తపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వరని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె. ౨౬౬
తే.
ఎఱిఁగి యెఱిఁగి నన్నడుగంగ నేలదీని, సుఖము దుఃఖంబుఁ బ్రాప్తించు చోటనరుఁడు
దగిలి తన కర్మవశమునఁ దనకుఁ దాన, కర్తగా కన్యులకు నేమి కారణంబు. ౨౬౭

తెలిసి తెలిసి దీనిని గురించి నన్ను అడగటం దేనికి. సుఖము దుఃఖము ప్రాప్తించటానికి నరుడు తాను పూర్వం చేసుకొన్న కర్మ వశం చేతనే కాని ఇతరులెవ్వరూ కూడా దానికి కారణం కాజాలరంటాడు.
వ.
అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికినపలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన రాజునుం బఱ తెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి నా చేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింప వలయు నని శూలంబు వలన నమ్మునిం బాచుచో నది పుచ్చ రాకున్న దాని మొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె దానంజేసి యాముని మాండవ్యుండు నాఁ బరగుచు నమ్మహాముని ఘోరతపంబుసేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యముని పురంబునకుం జని (యమ) ధర్మరాజున కి ట్లనియె. ౨౬౮
క.
దండధర యిట్టిదారుణ, దండమునకు నేమి దుష్కృతముఁ జేసితి ను
గ్రుండవయి తగని దండము, దండింపఁగ బ్రాహ్మణుండఁ దగునే నన్నున్. ౨౬౯

నేనేమి పాపం పూర్వం చేసానని నా కింత కఠిన దండన విధించావు , బ్రాహ్మణుండ నైన నాకు ఇటువంటి క్రూర దండన విధించడం తగునా , దానికి కారణం ఏమిటి అని అడిగాడు యముడిని మాండవ్యుడు. (బ్రాహ్మణులకు అప్పట్లోనే కొన్ని కొన్ని మినహాయింపు లుండేవని ఇందుమూలంగా మనకు తెలుస్తోంది)
వ.
అనిన మాండవ్యునకు ధర్మ రాజి ట్లనియె. ౨౭౦
క.
సొలయక తూనిఁగలం గొ, ఱ్ఱులఁ బెట్టితి నీవు నీ చిఱుతకాలము త
త్ఫల మిప్పు డనుభవించితి, తొలఁగునె హింసాపరులకు దుఃఖ ప్రాప్తుల్. ౨౭౧

నీవు నీ చిన్నప్పుడు తూనీగలను పట్టుకుని వాటిని కొఱ్ఱులకు తగిలించి ఆడుకున్నావు, ఆ పాపం వలన నీ కిలా అయ్యింది . చేసిన పాపానికి శిక్ష అనుభవించి తీరాలి కదా అన్నాడు యమధర్మరాజు.
వ.
అనిన విని మాండవ్యుం డలిగి జన్మంబు మొదలుగాఁ బదునాలుగు వత్సరంబులు దాటునంతకుఁ బురుషుండు బాలుండు వాఁ డెద్దిసేసినఁ బాపంబుం బెద్ద పొరయండు వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు రిది నా చేసిన మర్యాద నీ విట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుఁ జేసిన నాకు బ్రాహ్మణోచితంబు గాని క్రూరదండంబు గావించిన్ వాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టుమని శాపం బిచ్చుటం జేసి వాఁడు విదురుండై పుట్టె. ౨౭౨
భారతంలో చాలా చోట్ల ఇదివరకే చెప్పుకున్నట్లుగా చాలామంది కొన్ని కొన్ని మర్యాదలను ఇదిమొదలుగా అని చెప్పి విధించటం, వాటిని అప్పటినుండి సకల జనులూ పాటిస్తూండటం జరుగుతుండేదని చెప్పుకున్నాం కదా. అటువంటి ఒక మర్యాదను మాండవ్యమహర్షి కూడా ఏర్పాటు చేసాడన్నమాట. మనుష్యుల విషయంలో ౧౪ సంవత్సరాలు వచ్చేవరకూ పురుషుడు బాలుడు, ఏమీ తెలియని అమాయకుడూ కనుక అతను చేసే చెడుకార్యాల ఫలితం పెద్దగా అతడు పొందడనిన్నీ వాని వలన కలిగే పాపం అతనిని అంటదనిన్నీ మర్యాద మాండవ్యమహర్షి చే చేయబడింది. ఆ మర్యాదను లెక్కలోకి తీసుకోకుండా అతనికి యముడు శిక్ష విధించాడు. కనుక మాండవ్యునిచే శాపగ్రస్తు డయ్యాడని మనకు తెలుస్తున్నది. అంతకు పూర్వం మటుకు అటువంటి వెసులుబాటు పిల్లలకు ఉండేది కాదని మనం గ్రహించుకోవాలన్నమాట.
క.
అని మాండవ్యాఖ్యానము, జనమేజయునకు నుదారచరితునకుఁ బ్రియం
బునఁ జెప్పెను వైశంపా, యనుఁ డవితథ పుణ్యవచనుఁడని కడు భక్తిన్. ౨౭౩

ఈ విధంగా మాండవ్యాఖ్యానాన్ని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు వివరంగా చెప్పాడు.

శ్రీ మదాంధ్రమహాభారతం ఎన్నో ఆఖ్యానాలకూ ఉపాఖ్యానాలకూ గని వంటిది. ఇటువంటి నీతిబోధకమైన కథలు భారతం నిండా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం మన అదృష్టం కొద్దీ కవిత్రయంవారు భారతాన్ని సంగ్రహరూపంలో- గరికపాటి వారు చెప్పినట్లుగా లక్షకు పైగా వున్న సంస్కృత భారతాన్ని అందం చెడకుండా సుమారు ౨౩౦౦౦ పద్యగద్యాలలో- అనువదించి పెట్టారు. తనివి తీరా గ్రోలటం మన బాధ్యత గా తెలుగువారందరూ భావిస్తే మనమందరం ధన్యుల మవుతాం. అందుకే మన పెద్దలన్నారు . వింటే భారతం వినాలి , తింటే గారెలే తినాలి అని. తెలుగు వారికి గారెలంటే ఎంతిష్టమో మరి.
ఇక్కడితో భారతంలో ఆది పర్వం లోని చతుర్థాశ్వాసం పూర్తయింది.
పర్వములు | edit post
0 Responses

Post a Comment