Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-౧
ధృతరాష్ట్ర పాండు కుమారులు పెరుఁగుట
ధృతరాష్ట్ర పాండు కుమారులు భీష్ముని కనుసన్నల్లో పెరుగుతూ ఉండగా--
సీ.
అమరాపగా సూను ననుశాసనంబునఁ గౌరవరాజ్యంబు గడు వెలింగెఁ
గురుభూము లుత్తర కురువుల కంటెను నధిక లక్ష్మీయుక్తి నతిశయిల్లె

ధర్మాభిసంరక్షితంబైన భూప్రజ కెంతయు నభివృద్ధి యెసఁగు చుండె

వలసినయప్పుడు వానలు గురియుట సస్యసమృద్ధి ప్రశస్తమయ్యెఁ

ఆ.
బాడి సేఁపె బుష్పఫల భరితంబులై, తరువనంబు లొప్పె ధర్మకర్మ నిరతిఁ
జేసి కరము నెమ్మితో నన్యోన్య, హితముఁ జేయుచుండి రెల్లజనులు.


భీష్ముని పరిపాలనలో దేశమంతా ఎంత సుభిక్షంగా అలరారుతుందో వివరిస్తున్నారిక్కడ. భూములన్నీసస్యస్యామలమై పాడి పంటలతో అలరారుతున్నాయట. కావలసినప్పుడు కావలసినంత వర్షం మాత్రమే కురుస్తోందట. పశువులన్నీ పుష్కలమైన పాడిని యిస్తున్నాయట. తోటలన్నీ ఫలపుష్పాలతో శోభిస్తున్నాయట. జనులందరూ ఒకరి కొకరు సహాయము చేసుకుంటూ జీవిస్తున్నారట. ఎంత అందమైన పరిపాలన!
వ.
ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజావృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులు గా రాజ్యంబు రక్షించు చున్నంత.
ఆంబికేయు=అంబిక కుమారుడు
ఉ.
ఆయము గర్వమున్ విడిచి యన్యపతుల్ పనిసేయ నిట్లు గాం
గేయ భుజాబలంబున నికృత్త విరోధి సమాజుఁడై కుమా
రాయిత శక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె
త్యాయత కీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగాన్.
నికృత్త =నఱుకబడిన
హస్తినా పురాన్ని రాజధానిగా చేసుకుని ధృతరాష్ట్రుడు చక్కగా రాజ్యపాలన సాగిస్తున్నాడట.
వ.
ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి భీష్ముండు గాంధారపతి యయిన సుబలుకూఁతు గాంధారి యనుదాని నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె.
క.
ఈ వంశము విచ్ఛేదము, గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ
దేవి వచనమున సంతతి, గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్. ౮

వ్యాస మహాముని దయవలన సత్యవతీ దేవి మాట మీద వంశం నిలబెట్టబడింది పూర్వం.
క.
ఈకులము వివర్ధింపఁగ, నా కభిమత మేను వింటి నలినేక్షణ దా
నేక శతసుతులఁ బడయఁగ, నా కన్యక వరమువడసె నట హరు చేతన్. ౯

ఈ వంశం వృద్ధిచెందడమే నా అభిమతం. ఈ గాంధారి నూటొక్క సంతానాన్ని శివునివద్దనుండి వరంగా పొందిందని విన్నాను.
వ.
కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము గాంధారపతి మన తోడి సంబంధమునకుం దగు నని నిశ్చయించి సుబలుపాలికిఁ దగు ముదుసళ్ళం బంచిన సుబలుండును సుముఖుం డై కురుకుల విస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి ననిన వాని బంధు జనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి. ౧౦

గుడ్డివాడికి పిల్లనిచ్చేసాను అని చెప్పి తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండన్నాడన్నమాట.

తే.
అంగముల లోన మేలుత్తమాంగమందు, నుత్తమంబులు గన్నుల యుర్విజనుల
కట్టి కన్నులు లే వను టంతెకాక, యుత్తముఁడు గాడె సద్గుణయుక్తి నతడు. ౧౧

శరీరావయవాలన్నిటి యందు ఉత్తమమయినది శిరస్సు. దానిలో మళ్ళీ ఉత్తమమైనవి కళ్ళు. అటువంటి కనులు లేవనే లోపం ఒక్కటేగాని మిగిలిన అన్నివిషయాల్లోనూ ధృతరాష్ట్రుడు మంచి వరుడే కదా అనుకున్నారట ఆ నగరంలోని ప్రజలు.
ధృతరాష్ట్రుఁడు గాంధారిని వివాహంబు సేసికొనుట.
వ.
అనిన వారి పలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకు పితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి నాకుఁ బతి యమ్మహీపతియ కాని యొరుల నొల్లనని పరమపతివ్రత పర పురుష సందర్శనంబు పరిహరించి తన పతి కనుగుణంబుగా నేత్రపట్టంబు గట్టికొనియుండె నక్కన్యం దోడ్కొని దాని సహోదరుండయిన శకుని మహావిభూతితో హస్తినాపురంబునకు వచ్చిన ధృతరాష్ట్రుఁడును బరమోత్సవంబున గాంధారిని వివాహం బై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు సంభవయు దశార్ణయు నను పదుండ్ర నొక్క లగ్నంబున వివాహంబయి మఱియును. ౧౨
క.
కులమును రూపము శీలముఁ, గలకన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుం డీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల, తిలకుండు వివాహమయ్యె దేవీశతమున్. ౧౩

భీష్ముడు తన పరాక్రమంతో ఇంకో వందమంది కుల రూప గుణవతులయిన కన్యలను తెచ్చి ఇస్తే వారందరినీ కూడా పెళ్ళాడంట ధృతరాష్ట్రుడు. ఈయన కింత సీనుందని మనకిదివరకు తెలియదు.

ఈ పోస్టు శ్రీమదాంధ్రమహాభారతంలో నూఱవ పోస్టు. ఏమిటో కాకతాళీయమే కావచ్చు గాక. ధృతరాష్ట్రుడు వందమంది కన్యకలను వివాహమాడిన సందర్భం ఈ నూఱవపోస్టులో జరగడం ఒక వింతనిపిస్తున్నది నామటుకు నాకు. ఈ సందర్భంగా ఈ నా బ్లాగు వీక్షకులందరికీ నా శుభాభినందనలు ముందుగా తెలియపరుస్తున్నాను. ధృతరాష్ట్రుని మిగిలిన ఈ అందరి భార్యలకూ (గాంధారి కాక) సంతానం కలిగిందో లేదో నాకు తెలియదు. ముందు ముందు చూద్దాం వివరాలు తెలుస్తాయేమో.





పర్వములు | edit post
0 Responses

Post a Comment