Unknown
వశిష్ఠ విశ్వామిత్రుల వివాదము
ఆ.
పరులవలన బాధ వొరయ కుండఁగ సాధు, జనులధనము గాచు జనవిభుండు
కరుణ దప్పి తాన హరియించువాఁ డగు, నేని సాధులోక మేమి సేయు. 104

పూర్వం కన్యాకుబ్జాన్ని గాధిపుత్త్రుడైన విశ్వామిత్రు డనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడోసారి తన పరివారంతో సహా వేటకు వెళ్ళి అలసినవాడై వశిష్ఠాశ్రమానికి రాగా వశిష్ఠులవారు అతనికీ పరివారానికీ తన దగ్గఱనున్న నందిని అనే ధేనువు సహాయంతో షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేస్తాడు. విశ్వామిత్రుడు తాను ఆదేశపు రాజు కాబట్టి తనకా గోవు నిమ్మని అడిగి వశిష్ఠునిచే నిరాకరించబడతాడు. అప్పుడు తాను బలవంతంగా నైనా ఆ గోవును తనతో తీసుకెళ్ళగలనని పలికి విశ్వామిత్రుడు బలవంతంగా గోవును తనతో తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఆ సందర్భంలో చెప్పబడినది పై పద్యం.

రాజు సాధుజనుల ధనాన్ని రక్షించటం తన ధర్మంగా కలవాడు. అట్టి రాజు తానే కరుణ లేకుండా సాధుజనుల ధనాన్ని అపహరింప తలిస్తే సాధుజనులు పాపం ఏమి చేయగలుగుతారు అని భావం.

ఆ.
ఎట్టిరాజులును మహీసురో త్తము లెదు, రరగు దెంచునప్పు డధిక భక్తి
నెరఁగి ప్రియము వలికి తెరు విత్తు రిట్టిద, ధర్ము వీవు దీనిఁ దలఁప వెట్టు. 112

ఇక్ష్వాకుకుల సంభవుడైన కల్మాషపాదు డనే రాజు వేటకు పోయి అలసినవాడై వశిష్ఠాశ్రమమునకు వస్తూ వుంటాడు. దారిలో అతని కెదురుగా వశిష్ఠపుత్త్రు డైన శక్తి మహాముని వస్తూంటాడు. రాజు ననే అహంభావంతో కల్మాషపాదుడు ఆ మహా మునికి దారి ఇవ్వకపోగా తనకు దారి ఇవ్వలేదని అహంకారంతో తెరువు తొలగమని అంటాడు. అప్పుడు శక్తి మహాముని అతనితో పై విధంగా అంటాడు.

ఎటువంటి గొప్పరాజులైనా మహీసురోత్తములు (సద్బ్రాహ్మణులు) ఎదురుగా వచ్చుచున్నప్పుడు అధికమైన భక్తితో ఎరిగి వారికి ప్రియము పలికి దారి ఇస్తారు. ఇదే ధర్మం, కాని నీవు దీనిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు ? అని అడిగాడు. ఇటువంటి సూక్తులు భారతం నిండా కోకొల్లలుగా ఉన్నాయి. ఏరుకోవటమే మన కర్తవ్యం.
పర్వములు | edit post
0 Responses

Post a Comment