Unknown
ఆది పర్వము సప్తమాశ్వాసము

వశిష్ఠు వలనఁ కల్మాషపాదుండు శాపవిముక్తిఁ జెందుట
చ.
గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడు భక్తుండ వై సమస్త ధా
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖముండు మింక బ్రా
హ్మణుల కవజ్ఞ సేయక శమత్వము చేకొను మింద్రుఁడైన బ్రా
హ్మణుల కవజ్ఞ సేసి యవమానముఁ బొందుఁ ప్రతాపహీనుఁడై. 129

కల్మాషపాదుడు వశిష్ఠుని వలన శాపవిముక్తిని పొందిన తరువాత వానితో వశిష్ఠుడు పై విధంగా అంటాడు.

గుణములతో ప్రకాశిస్తూ బ్రహ్మణులకు భక్తుడవై సమస్త ధారుణి ప్రజలను పాలిస్తూ రోషాన్ని విడిచిపెట్టి ఇకనుంచి సుఖంగా ఉండు. బ్రాహ్మణులకు అవజ్ఞ సేయక శమత్వాన్ని పొందు. ఇంద్రుడి వంటి గొప్పవాడైనా బ్రాహ్మణులకు అవజ్ఞ చేసినచో్ ప్రతాపహీనుడై అవమానాన్ని పొందుతాడు.

మారు వేషంలో నున్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని దక్కించుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్జునునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. అలాగే శల్యుడు కూడా మారువేషంలో నున్నభీముని చేతిలో ఓడిపోతాడు. ఆ సందర్భం లోనివి ఈ పద్యాలు.
క.
నా యెదురఁ జక్క నై యని, సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం
తేయుఁ డగు విజయునకుఁ గా, కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్.200

ఆ.
పరశురాముఁడొండె హరుడొండె నరుఁడొండె, గాకయొరులు గలరె కర్ణునోర్వ
బలిమి భీముఁడొండె బలదేవుఁడొండె గా, కొరులు నరులు శల్యునోర్వఁ గలరె. 205

తరువాత అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తల్లికి భిక్షను తెచ్చామని నివేదించగా ద్రౌపదిని చూడకుండానే ఆమె మీరయిదుగురూ ఉపయోగించండని పలికింది. కుంతీదేవి మాట ప్రకారం పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడాలని తలుస్తారు. పాండవులు తమ స్వస్వరూపాల్ని తెలియజేసి ఆ విషయం ద్రుపదునికి తెలియ పరచగా అతడిలా అంటాడు.
క.
ఒక్క పురుషునకు భార్యలు, పెక్కం డ్రగు టెందుఁ గలదు పెక్కండ్రకు నా
లొక్కత యగు టేయుగముల, నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్. 244

ఒక పురుషునికి పెక్కుమంది భార్యలు ఉండటం సహజం కాని పెక్కండ్రకు ఒక్క కన్య భార్యగా వుండటం ఎక్కడా కనీ వినీ యెఱుగం అంటాడు.
అప్పుడు వ్యాసులవారక్కడికి వేంచేసి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతమంతా ద్రుపదునికి తెలియజేసి పాండవుల నైదుగురినీ ద్రౌపది పెళ్ళి చేసుకోవచ్చని చెప్తాడు. అప్పుడు ద్రుపదునితో వ్యాసులవారి సమక్షంలో ధర్మరాజిలా అంటాడు.
చ.
నగియును బొంకునందు వచనంబు నధర్మువునందుఁ జి త్తముం
దగులదు నాకు నెన్నఁడును ధర్ము వవశ్యము నట్ల కావునన్
వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం
దగ దను నీవిచారములు దక్కి వివాహమొనర్పు మొప్పుగాన్. 252
వ.
మఱియుం దొల్లి గౌతముం డయిన జటిలుఁ డను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును దాక్షాయణి యను ముని కన్యక యేక నామంబునఁ బ్రచేతసు లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్య యయ్యె ననియును గథల వినంబడు అని అంటాడు. తరువాత వ్యాసుల వారి అనుమతితో పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.
నగియును=పరిహాసమునకు
శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసం సమాప్తం.
పర్వములు | edit post
0 Responses

Post a Comment