Unknown
ఆదిపర్వము-అష్టమాశ్వాసము-1
ఆ.
కీర్తిలేనివానికిని జీవనంబు ని,రర్థకంబుచూవె యవనిమీఁద
నిత్యమయినధనము నిర్మల కీర్తియ, యట్టి కీర్తి వడయుట శ్రమంబె
31

పాండవులకు ద్రుపదుని తోడి చుట్టరికం వలన బలం పెరిగింది. ఇటువంటి సమయంలో వారిని నిర్జించటం ఎలాగ అని ఆలోచించిన దుష్టచతుష్టయం ధృతరాష్ట్రునితో మంతనం చేసి పాండవుల మీదికి దండెత్తుదామని నిర్ణయిస్తారు. ధృతరాష్ట్రుడు అందరితో ఆలోచించి చేద్దామని అందరినీ పిలిపించి అడుగుతాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో నా వరకూ నాకు కౌరవపాండవులిరువురూ సమానులే.పితృపైతామహంబయిన రాజ్యం నీకెట్లో వారికీ అట్లే . అందుచేత వారి అర్థరాజ్యం వారికివ్వటం మంచిది. అలా చేస్తే నీకు కీర్తి కలుగుతుంది అంటూ పై విధంగా అంటాడు. కీర్తిలేనివాని జన్మ వ్యర్థము. భూమి మీద నిత్యమయినది కీర్తి మాత్రమే. అటువంటి నిర్మలమైన కీర్తిని పొందుట తేలిక కాదు.
క.
ఇలఁ గీర్తి యెంతకాలము, గలిగి ప్రవర్తిల్లె నంత కాలంబును ని
త్యుల కారె కీర్తిగల పు,ణ్యులు కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే. 32

ఈ భూమి మీద కీర్తి యెంతకాలము కలిగి ప్రవర్తించితే అంత కాలము నిత్యులై వుంటారు. కీర్తి విహీనుడెక్కడా పూజనీయుడు కాడు.
వ.
కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గనరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధ ప్రణయుండ వయి కీర్తి నిలుపుమనిన భీష్ము పలుకులకు సంతసించి 33

ద్రోణాదులందరూ వారినే బలపరచగా ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చెదనని చెప్పి పాండవులను సగౌరవంగా ద్రుపదుని పురం నుండి హస్తినాపురానికి పిలిపిస్తాడు.
పర్వములు | edit post
0 Responses

Post a Comment