Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧౦
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్
దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ
డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨

శంతన మహారాజు యోజనగంధి యైన సత్యవతిని చూచిన ఘట్టంలోని పద్యం. ఎంత మనోహరంగానూ సుందరం గానూ ఉందో చూడండి.

గంగా శంతనుల సమయము
ప్రతీపుడామెను నీవు నా కుఱువెందు కెక్కావు అని అడగ్గా నేను నీ సద్గుణాలకు మెచ్చి నీకు భార్య కావాలని వచ్చాను.
నన్ను పెళ్ళి చేసుకో అంటుంది.
చ.
అనినఁ బ్రతీపుఁ డి ట్లనియె నంబురుహానన యాగ్ని సాక్షికం
బునఁ బరిణీత యైనసతిఁ బొల్పుగ నొక్కతఁ గాని యన్యలన్

మనముననేనియుం దలఁప మానిని యిట్టిజితాత్ము నన్ను
ని
ట్లని పలుకంగ నీ కగునె యన్యులఁ బల్కినయట్ల బేల వై. ౧౩౮

నేను ఏకపత్నీవ్రతుడిని. నాతో ఇతరులతో పలికినట్లుగా ఇలా మట్లాడటం తగునా అంటాడామెతో ప్రతీపుడు.
వ.
మఱి యదియునుం గాక స్త్రీభాగం బయిన డాపలికుఱు వెక్కక పురుషభాగం బై పుత్త్రారోహణయోగ్యం బైన నా వలపలికుఱు వెక్కితి గావున నాపుత్త్రునకు భార్యవగు మనిన నదియు నట్ల చేయుదు నని యదృశ్య యయ్యె నంతం బ్రతీపుండును బుత్త్రార్థి యై సకలతీర్థంబులయందు సునందా దేవియుం దానును వేదవిహిత వ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు తపంబు సేసిన. ౧౩౯

స్త్రీ భాగమైన ఎడమ తొడ మీద గాకుండా పురుషభాగమైన కుడి తొడమీద ఎక్కావు కావున నా కొడుకుకు భార్యవు కమ్మని చెప్పగా అలానే అంగీకరించి అదృశ్యమైంది గంగాదేవి. తరువాత ప్రతీపుడు భార్యతో కలసి సంతానం కోరి వ్రతాలూ పూజలూ చేయగా వారికి శంతనుడు పుడతాడు. శంతనుడు పెరిగి పెద్దవాడయ్యాక అతనిని రాజ్యాభిషిక్తుని చేసి యిలా అంటాడు.
మధ్యాక్కర.
తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున
నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టికమనీయరూప
వొనర నాసుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య

కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.
౧౪౨

తానిచ్చిన మాటప్రకారం గంగను వివాహమాడమని కొడుకుకు చెప్తాడు ప్రతీపుడు.
వ.
మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని చెప్పి తపస్సు చేసుకోడానికి వెళ్తాడు.
ఒకరోజు శంతనుడు వనములో విహరిస్తుండగా ఒక అందమైన కన్యక అతనికి దృగ్గోచరమౌతుంది. ఆమెను చూచి.
చ.
కని మునికన్యయో దనుజకన్యకయో భుజగేంద్ర కన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ

వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య.యంచు న

య్యనఘుఁడు దాని జిత్తమున నాదటవోవక చూచెఁ బ్రీతితోన్
. ౧౪౫

ఆమెనాతడు తనివితీరా చూస్తుండి పోయాడట. అప్పుడామె అతనితో
క.
భూనాధ నీకు భార్యం, గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము, మానుగ నా కిష్ట మయినమార్గముఁ బ్రీతిన్
. ౧౪౯
సమయంబు =సంకేతము
గంగా శంతనుల సమయము
వ.
అది యె ట్లంటేని యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను నప్రియంబులు వలుకక యుండను వలయు నట్లైన నీకు భార్య నై యభిమత సుఖంబు లొనరింతు నటు గాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె గంగయు మనుష్యస్త్రీరూపధారిణి యై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె నంత. ౧౫౦

నోరుమూసుకుని తాను చెప్పినట్లే వినాలని ముందే ఒప్పందం ఖరారు చేసుకుందావిడ.

అలా నియమించుకున్న తరువాత తనకు పుట్టిన పిల్లల్ని వరుసగా ౭ గురి వరకూ పుట్టీపుట్టగానే గంగానదిలో పడవేస్తుండే దావిడ. అదంతా సహించిన శంతనుడు 8వ సారి మాత్రం ఆమెకు అడ్డు చెప్తాడు.
క.
పడయంగ రానికొడుకులఁ, గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతిని వై తీ
కొడుకు నుదయార్క తేజుని, విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్.
౧౫౩
వ.
దాని నప్రియంబులు వలికి వారించిన నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచి నీతోడిసంగతి నాకు నింతియ యేను బుణ్యజలప్రవాహ పవిత్రతం ద్రిభువన పావని యనం బరఁగిన గంగఁ జు మ్మీవసువులు వసిష్టు శాపంబున వసుమతిం బుట్ట వచ్చుచుండి యే మొండు చోట జన్మింపనోపము నీ యంద పుట్టెదము మర్త్యంబునం బెద్దకాలంబుండ కుండ మమ్ము ముక్తులం జేయుమని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి దీన నీకుం బుణ్యలోకంబు లక్షయ్యంబులగు మఱియు నియ్యష్టమ పుత్త్రండు వసువులయం దొక్కొక్కళ్ల చతుర్థార్ధంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు లోక హితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలంబుండు ననిన గంగకు శంతనుం డి ట్లనియె. ౧౫౪

వసువులనేవారు దేవతలు వారికి వసిష్టముని శాపమెందు కిచ్చాడు, అష్టమ వసువు అందరికంటె వేరుగా ఎక్కువకాలం భూమి మీద జీవించటానికి కారణమేమిటని శంతనుడామెను అడిగాడు. అప్పుడామె ౮ గురు వసువులు వసిష్టుని ఆశ్రమానికి భార్యలతో సహితంగా క్రీడార్ధం వచ్చారు. వారిలో అష్టమ వసువైన ప్రభాసుని భార్య ఆశ్రమంలోని నందిని అనే ధేనువును చూచి ముచ్చటపడి దానిని తన చెలియలి నుశీనరనరపతి కూతురు జితవతికి బహుమానంగా ఇద్దామని అంటే వసువులందరూ కలసి ఆ హోమధేనువుని అపహరిస్తారు. ఆ విషయం దివ్యదృష్టితో గ్రహించిన వసిష్టమహర్షి వారిని మనుష్యయోని పుట్టాల్సిందని శాపమిస్తాడు. అప్పుడు వారంతా మునికాళ్లమీదపడి ప్రార్ధించగా ఎక్కువకాలం మనుష్యులుగా వారందరూ ఉండక్కరలేదని అనుగ్రహిస్తూ అష్టమ వసువు అయిన ప్రభాసుడు నేరం ఎక్కువగా చేసాడు కాబట్టి అతను దీర్ఘకాలం మనుష్యలోకంలో ఉంటాడనిన్నీ మరియు అనపత్యుడుగా కూడా వుంటాడని అనుగ్రహిస్తాడు వసిష్టమహాముని.

ఈ కథ అంతా చెప్పి గంగాదేవి కుమారుడు పెరిగి పెద్దయ్యేవరకూ తనతోనే ఉంటాడని తీసుకుని వెళుతుంది.
కొంతకాలం జరిగాక శంతనుడు గంగానది చెంతకు వాహ్యాళికి వెళ్ళగా అక్కడ
తరలము.
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్ ధను వభ్యసించుచు బాణసంహతి సేతుగా

ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న

త్యనఘు నాత్మ సమాను నాత్మజు నాపగేయు మహాయశున్.
౧౬౫

బాణాలతో గంగాప్రవాహానికి సేతువును నిర్మస్తున్న తన పోలికలతో ఉన్న గాంగేయుని శంతనుడక్కడ చూస్తాడు.కాని చిన్నతనంలో చూచి ఉండటం చేత గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడు గంగాదేని అక్కడికి వచ్చి కొడుకును శంతనునకు చూపి ఇలా అంటుంది.
సీ.
సాంగంబు లగుచుండ సకలవేదంబులు సదివె వసిష్టుతో సకలధర్మ
శాస్త్రాదిబహువిధ
శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నేర్చినయట్ల నేర్చె

బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత దక్షుఁ డంతియ కడుదక్షుఁడయ్యె

నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల యట్టిఁడ యనఘమూర్తి


ఆ.

నొప్పుకొనుము వీని నుర్వీశ యని సుతు, నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు

నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్న పేదయ, పోలె సంతసిల్లి భూవిభుండు.
169

ఇక్కడ గాంగేయుని సామర్ధ్యం వర్ణించబడింది.
వ.
తన పురంబునకు వచ్చి సకల రాజన్యప్రధానసమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యపట్టాభిషేకంబు సేసి కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగు వత్సరంబు లనన్యవ్యాపారుం డై యుండి యొక్కనాఁడు యమునాతీరంబున వేఁట లాడుచుఁ గ్రుమ్మరువాఁడపూర్వసురభి గంధం బాఘ్రాణించి దానివచ్చినవలనారయుచు నరిగి యమునాతీరంబున. ౧౭౦
క.
కనకావదాతకోమల, తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాధుఁడు, గనియెను సురకన్యవోనికన్నియ నంతన్
. ౧౭౧
కనకావదాత=బంగరువలె పచ్చనై
ఉ.
దానిశరీర సౌరభము దానివిలోలవిలోకనంబులున్
దానిమనోహరాకృతియు దానిశుచిస్మితవక్త్ర కాంతియున్

దానివిలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం

తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్
. ౧౭౨
Unknown

ఆది పర్వము-చతుర్థాశ్వాసము-
౯
గంగా వసువుల సంభాషణము
ఉ.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫


గాంగేయు డైన భీష్ముని జననం సందర్బం లోనిదీ పద్యం.

జనమేజయుడు వైశంపాయుని కి ట్లనియె.౧౨౦
క.
నరవరుఁ డగు శంతనున క, య్యమరనదికిని నెట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల, య్యిరువురకును బుట్టె దీని నెఱిఁగింపు మొగిన్. ౧౨౧

నరుడైన శంతన మహారాజుకూ గంగానదికీ ఎలా కలయిక జరిగింది? మహాపురుషుడు భీష్ముడు వారిద్దరికి ఎలా జన్మించాడో వివరంగా చెప్పాల్సింది అని అడిగాడు.
వ.
మఱి పాండవ ధార్తరాష్ట్రసంభవంబును సవిస్తరంగా విన వలతుం జెప్పుమనిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుం డై యశ్వమేధ సహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాది దేవతలం దనిపి దేవలోకంబునకుం జని యందు దేవర్షి గణంబుతోఁ బితామహుం గొల్చు చున్న యవసరంబున గంగాదేవి స్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన. ౧౨౨
తే.
ఊరుమూలమేర్పడఁగ నయ్యువిద వలువ, దొలఁగె ననిలంబు చేత విధూత మగుచు
నమరు లెల్లఁ పరాఙ్ముఖు లైరి దాని సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు. ౧౨౩

తొడ మొదలు కనిపించేలా గాలిచేత ఆ ఉవిద వలువ చెదరగా దేవతలందరూ మొగము త్రిప్పుకొన్నారు. కాని మహాభిషుడు మాత్రం ఆమెను సాభిప్రాయంగా చూచాడు.
ఆ.
దాని నెఱిఁగి కమలయోని వానికి గర, మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాప మిచ్చె నొనరంగ వాఁడును, గరము భీతిఁ గరయుగంబు మొగిచి. ౧౨౪

ఇది గ్రహించిన బ్రహ్మ అతనికి మనిషి జన్మ నెత్తాల్సిందిగా శాప మిచ్చాడు. వాడు భయంతో చేతులు కట్టుకొని .
వ.
మర్త్యలోకంబున రాజర్షి వంశంబులలోనఁ బుణ్య చరిత్రుండు ప్రతీపుండ కావున వానికిఁ బుత్త్రుండ నై జన్మించెద నొరుల యందు జనింప నోప నని కమలభవు ననుమతంబు వడసె గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందలి యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకంబునకు వచ్చునది యెదుర. ౧౨౫

గంగా వసువుల సంభాషణము
క.
అనిమిషలోక వియోగం, బున దుఖిఃతు లయి వసిష్ఠ మునివరు శాపం
బున వచ్చు వారి వసువుల, నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁగరుణన్.౧౨౬

దేవలోక వియోగంతో బాదపడుతూ వసిష్ఠ మునివరుని శాపంతో వస్తున్న ఎనమండుగురు వసువులను ఎదురుగా చూచి గంగా దేవి దయతో.
క.
ద్యుతి దఱిఁగి నైజలోక, చ్యుతిఁ బొందను మీకు నొండు చోటికి నరుగం
గత మేమి యనిన విని య, య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్. ౧౨౬

ప్రకాశాన్ని కోల్పడి నిజలోకాన్ని విడిచి వేరే చోటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో చెప్పమని గంగాదేవి వారినడుగుతుంది.
వ.
ఏము వసిష్ఠ మునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్క పుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపం బోయెద మని దుఃఖించి తమ శాపప్రకారంబు గంగాదేవికి నెఱింగించి యే మొండుచోట జన్మింప నోపము నీయందుఁ బుట్టెదము మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁ గావున వానికి నీకును సమాగమం బగు మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు ననిన విని గంగ సంతసిల్లి యిట్లనియె. ౧౨౮
క.
నా కభిమతంబు నిట్టిద, మీకును నుపకార మగు సమీహితబుద్ధిన్
జేకొని చేసెద మీర ల, శోకస్థితి నుండుఁ డనుచు సురనది కరుణన్. ౧౨౯

వ.
నాకూ మీకూ కూడా వీలుగా వుంటుంది . అలా నే చేస్తాను. మీరు విచారించకండి అని గంగాదేవి వారితో పలికింది.
వ.
వసువులకు మనఃప్రియంబుగాఁ బలికిన విని వారును గంగ యనుగ్రహంబు వడసి నీవు మాకు నుపకారంబు సేయ నోపు దేని నేము నీకుఁ గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్త్యలోకంబునం బెద్దకాలం బుండకుండునట్లుగాఁ జేయునది మాకు వసిస్ఠ మహాముని యనుజ్ఞయు నిట్టిద యనిన గంగయు నట్ల చేయుదు మఱి మీరెల్ల స్వర్గతు లైన నాకొక్క కొడుకు దీర్ఘాయుష్మంతుం డై యుండెడువిధం బె ట్లనిన దానికి వసువు లి ట్లనిరి. ౧౩౦
క.
మాయం దొక్కొక్కళ్ల తు, రీయార్థముఁ దాల్చి శుభ చరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమవసు, వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై. ౧౩౧

మా అందరిలో ఒక్కొక్కరి నాల్గవ యంశము వయస్సును పొంది ఒక కుమారుడు దీర్ఘాయుష్మంతు డై గొప్ప పరాక్రమ వంతుడై ఉంటాడు.
వ.
అని యిట్లు గంగా వసువులొండొరులు సమయంబు సేసికొని చని రంత నిక్కడ. ౧౩౨
క.
వీరుఁడు ప్రతీపుఁ డఖిల, క్ష్మారాజ్యసుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు, భారతకులుఁ డుండె ధర్మపరుఁ డై నిష్ఠన్. ౧౩౩
వ.
ఇట్లు యమనియమవ్రతపరాయణుం డై యున్న వానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు.౧౩౪
ఉ.
గంగ నిజాంగదీప్తు లెసగం జనుదెంచి లతాంగి సంతతో
త్తుంగ పయోధరద్వితయ తోయరుహానన చారునేత్ర ది

వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు సాలవిశాలదక్షిణో

త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్.
౧౩౫

గంగాదేవి తన నిజాంగదీప్తులు ప్రకాశిస్తుండగా అందమైన స్త్రీ రూపం ధరించి ప్రతీప వసుధాధిపుని కుడి తొడపైమన్మథవశంబున కూర్చోవటం జరిగిందట.

Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౮

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
క.
అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ
ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్.
౯౨

యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశకరుడవుతాడనీ నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.
క.
భూరిగుణు నిట్టికుల వి, స్తారకు దారకు నుదార ధర్మప్రియు ని
ష్కారణమ తప్పఁ జూడఁగ, సారమతీ చనునె నాఁటి సత్యము గలుగన్. ౯౩

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?
చ.
నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క.
వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
౯౫

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే.
సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు
. ౯౬

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.
క.
కావున సత్యము మిక్కిలి , గా విమలప్రతిభఁ దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ, గావింపుము గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్.
౯౭
క.
క్షత్త్రవరుఁ డైన విశ్వా, మిత్త్రునకుఁ బవిత్రమైన మేనకుకున్ స
త్పుత్త్రి నయి బొంకువలుకఁగ, ధాత్త్రీతల నాధ యంత ధ ర్మేతరనే
. ౯౮

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.
వ.
అనిన శకుంతలపలుకులు సేకొన నొల్లక దుష్యంతుం డిట్లనియె.
క.
ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్
మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే.
౧౦౦

నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?
క.
వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,
దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ ౧౦౦ --(పాఠాంతరము)

ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా!!
క.
పొడువునఁ బ్రాయంబునఁ గుఁ, గడిఁదిబలంబునను జూడఁగా నసదృశు నీ
కొడు కని యీతని నెంతయు, నెడమడుగుగఁ జూపఁ దెత్తె యిందరు నగగాన్. ౧౦౧

పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా.
వ.
ఇట్టి లోకవిరుద్ధంబుల కే మోడుదు మయుక్తంబు లయినపలుకులు పలుకక నీ యాశ్రమంబునకుం బొమ్మనిన శకుంతల యత్యంత సంతాపితాంతఃకరణ యై. ౧౦౨

ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత సంతాపాన్నొందిన దై.
మధ్యాక్కర.
తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ
నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి
కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. ౧౦౩

పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.
ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.
వ.
ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. ౧౦౪
చ.
గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే
కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 105

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును తీసుకువచ్చింది.
Unknown
ఆంధ్రమహాభారతము-చతుర్థాశ్వాసము-౭

కణ్వుండు శకుంతలను దుష్యంతు పాలికిం బంపుట
వ.
మఱియు భార్య పురుషునం దర్ధం బగుటం జేసి పురుషునకు మున్న పరేత యైన పతివ్రత పరలోకంబునం దన పురుషుం గూడఁ దదాగమనంబు ప్రతీక్షించుచుండుఁ బురుషుండు మున్న పరేతుండైనఁ బదంపడి తానును బ రేతయై తన పురుషుంగూడ నరుగునట్టి భార్య నవమానించుట యధర్మంబు మఱియుం బురుషుండు భార్యయందుఁ బ్రవేశించి గర్భంబునఁ బుత్త్రుండై తాన యుద్భవిల్లు గావున నఙ్గా దఙ్గా త్సమ్భవసి యనునది యాదిగాఁగల వేదవచనంబులయందును జనకుండును బుత్త్రుండును ననుభేదంబు లేదు. ౮౬
ఎంత బాగా వివరించిందో చూడండి. వేదశాస్త్రప్రమాణాన్ని కూడా ఉంటంకిస్తూ ధర్మా ధర్మ వివరణ చేసింది.
భార్య పురుషునిలో అర్ధభాగం. అందువల్ల ఆమె అతనికంటే ముందే మరణిస్తే ఆతని ఆగమనాన్ని ప్రతీక్షచేస్తూ పరలోకంలో ఆతనిని కలవటానికై వేచి ఉంటుంది. అలానే పురుషుడు ఆమె కంటే ముందు మరణిస్తే తరువాత ఆమె కూడా మరణించి తన పురుషుఢిని కూడటానికి వెళ్తుంది. అటువంటి భార్యను అవమానించటం అధర్మం. మఱియు పురుషుడే భార్యయందు ప్రవేశించి తిరిగి పుత్త్రుడిగా జన్మిస్తాడు. పురుషుని అంగాలనుంచే పుత్త్రుని అంగాలన్నీతయారయి పుడతాయి అనే వేదవచనం కూడా వుంది. అందుచేత జనకునికీ పుత్త్రునికీ భేదమే లేదు. అంతేకాదు ఇంకా విను.
క.
విను గార్హపత్య మనున,య్యనలము విహరింపఁబడి త దాహవనీయం
బన వెలుఁగునట్ల వెలుఁగును,జనకుడు దాఁ బుత్త్రుఁడై నిజద్యుతి తోడన్. ౮౭

గార్హపత్యమనే అగ్ని విహరింపబడి ఆ త్రేతాగ్నిలో జనకుడే తన నిజప్రకాశంతో తానే పుత్త్రునిగా వెలుగుతాడు.
క.
తాన తననీడ నీళ్ళుల, లో నేర్పడఁ జూచునట్లు లోకస్తుత త
త్సూను జనకుండు సూచి మ, హానందముఁ బొందు నతిశయ ప్రీతిమెయిన్. ౮౮

తండ్రి తన నీడను తాను నీళ్ళలో చూచుకొన్నట్లే ఆ కుమారుని చూసుకొని రెట్టించిన ప్రీతితో మహానందాన్ని పొందుతాడు.
వ.
పున్నామ్నో నరకా త్త్రాయత ఇతి పుత్త్ర యను వేదవచనంబు గలదు గావునఁ బుణ్యాచారుం డయిన పుత్త్రుం డుభయపక్షములవారి నుద్ధరించు గావున. ౮౯

ఇంకో వేద వచనాన్ని కూడా ఉదహరిస్తుందిక్కడ. పున్నామ నరకంనుండి దాటించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే పుత్త్రుడనబడతాడు. ఇది వేదవచనం. అటువంటి వాడు ఇరుపక్షాల్ని కూడా ఉద్ధరిస్తాడు. అందుచేత.
క.
నీ పుణ్యతనువువలనన, యీ పుత్త్రకుఁ డుద్భవిల్లి యెంతయు నొప్పున్
దీపంబు వలన నొండొక, దీపము ప్రభవించునట్లు తేజం బెసగన్. ౯౦

నీ పుణ్యమైన శరీరం నుండి, ఒక దీపాన్నుండి ఇంకో దీపం పుట్టినట్లుగా , మంచి తేజస్సుకలిగి నీ యీ కుమారుడు నీ నుండే పుట్టిన వాడై ప్రకాశిస్తున్నాడు చూడు. అంతే కాదు. చివరగా చెప్తున్నాను విను.
చ.
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాధ యీ పుత్త్రగా
త్త్రపరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూరసాం
ద్ర పరాగప్రసరంబుఁ జందనముఁ జంద్ర జ్యోత్స్నయుం బుత్త్ర గా
త్ర పరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే. ౯౧

ఇంకా ఇంకా విపరీతమైన వాగ్వాదాలెందుకు, ఓ రాజా యీ నీ కొడుకు శరీరాన్ని ఓసారి కౌగలించుకుని చూడవయ్యా.
నీకే తెలిసిపోతుంది. ఎవరూ చెప్పనక్కర్లా. ఎందుచేతనంటే ఆ కౌగిలి సుఖము కంటె ముత్యాలహారం గాని కర్పూరం గానీ
దట్టమైన పుప్పొడి ప్రసరణం గానీ మంచిగంధం గానీ చంద్రుని వెన్నెల గానీ పుత్త్రుని శారీర కౌగిలింత కంటె ఎక్కువ హృదయాన్నలరించేవిగాను చల్లగానూ ప్రాణులకు ఉండవు సుమా. (ఇదే డి యన్ యే పరీక్ష కంటే కూడా నమ్మదగిన తార్కాణం. అందుచేత అటువంటి పరీక్షలవసరం లేదు)
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౬

కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట(కొనసాగింపు)
వ.
అనిన వెల వెల్ల నై వెచ్చనూర్చి నిశ్చేష్టిత యై కెందమ్మి రేకుల వలనం దొరంగు జలకణంబులపోలెఁ గోపారుణిత నయనంబుల బాష్పకణంబులు దొరఁగం దలవాంచి యారాజుం గటాక్షించుచు హృదయ సంతాపంబు దనకుఁదాన యుపశమించుకొని పెద్దయుం బ్రొద్దు చింతించి శకుంతల యా రాజున కిట్లనియె.౭౮

ఎంత అందంగా వర్ణించారు నన్నయ్యగారు. "రాజుం గటాక్షించుచు"- భారతీయ స్త్రీత్త్వాన్నంతా మూర్తీభవింప జేసారు ఈ ఒక్క పద ప్రయోగంతో.
కోపారుణిత నయనంబులు ఎంత కోపం వచ్చిందో చెప్తూనే ఉన్నాయి. అయినా సరే ఆసమయంలో కూడా రాజుని క్షమించగలగటం - ఎంత సహృదయం కావాలి ? అలా ఉండగలగటానికి. పాపం కోపాన్ని తనకుతానే ఉపశమింప చేసుకోవాల్సి వచ్చింది బాధనంతా. ఎంత కష్టం ఎంత కష్టం.
ఆ.
ఏల యెఱుక లేని యితరులయట్ల నీ, వెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేన
కాని దీని నెఱుఁగ రిందొరు లని, తప్పఁ బలుక నగునె ధార్మికులకు. ౭౯

ఎంత ఔచిత్యం గా వున్నాయో చూడండి ఆమె మాటలు. ధార్మికులకు అని ఓ మూల అంటపొడుస్తూనే అడుగుతోంది.
నే నొక్కదాన్ని కాక ఇక్కడ ఇంకెవరికీ ఈ విషయం తెలియదు గదా అనుకుంటున్నట్టున్నావు. అలాఅని తప్పుగా మాట్లాడవచ్చా? అని అంటూ తనతో పాటుగా ఇంకా ఎవరెవరికి ఆవిషయం తెలుసో కూడా చెపుతోంది.
చ.
విమలయశోనిధీ పురుషవృత్త మెఱుంగుచు నుండుఁ జూవె వే
దములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్

యముడును
జంద్రసూర్యులు నహంబును రాత్రియు నమ్మహాపదా
ర్థము లివి యుండఁగా నరుఁడు దక్కొననేర్చునె తన్ను మ్రుచ్చిలన్.
౮౦

విమలయశోనిధీ ఎంత అర్థనంతమైన సంబోధన.

వేదాలు, పంచభూతములు, ధర్మము, ఉభయ సంధ్యలు, అంతరాత్మ, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి, ఇవన్నీ పురుషవృత్తాన్ని గమనిస్తూంటాయి. ఏ నరుడూ కూడా ఈ మహా పదార్థాల దృష్టిలో పడకుండా ఏ కార్యాన్నీ చక్కబెట్టలేడు. తనను తాను మోసం చేసుకోనూ లేడు.
క.
నా యెఱిఁగినట్ల యన్నియు, నీ యిచ్చినవరము ధారుణీవర యెఱుఁగున్
నా యందుఁ దొంటియట్టుల, చేయు మనుగ్రహ మవజ్ఞ సేయం దగునే. 81


ధారుణీవర అని సంభోదించిదీసారి. నే నెరిగినట్లే పై చెప్పిన మహాపదార్థాలన్నిటికీ కూడా నీ యిచ్చిన వరము తెలుసును. అందుచేత పూర్వం లానే నన్ను ఆదరించు. అవమానించకు.
క.
సతియును గుణవతియుఁ బ్రజా, వతియు ననువ్రతయు నైన వనిత నవజ్ఞా
న్వితదృష్టిఁ జూచునతి దు,ర్మతి కిహముం బరముఁ గలదె మతిఁ బరికింపన్.
౮౨

ఆలోచిస్తే సతి, గుణవతి, బిడ్డతల్లి, అనువ్రత, ఐన వనితను అవజ్ఞాదృష్టితో చూసేదుర్మతికి ఇహమూ, పరమూ కూడా వుండవు. జాగ్రత్త అని హెచ్చరించింది కూడా.
క.
సంతత గృహమేధిఫలం, బంతయుఁ బడయంగ నోపు ననుగుణభార్యా
వంతుండగువాఁడు క్రియా, వంతుఁడుఁ దాంతుండు బుత్త్రవంతుండు నగున్
. ౮౩

అనుగుణమైన భార్య కలవాడు ఎల్లప్పుడూ గృహమేధి ఫలాన్నిఅంతటినీ సంపూర్తిగా పొందుతాడు. క్రియా వంతుడు, దాంతుడు, పుత్త్రవంతుడు కూడా అవుతాడు.
వ.
మఱియును. ౮౪
సీ.
ధర్మార్థ కామసాధన కుపకరణంబు గృహనీతివిద్యకు గృహము విమల
చారిత్ర శిక్ష కాచార్యకం బన్వయస్థితికి మూలంబు సద్గతికి నూఁత

గౌరవంబున కేక కారణం బున్నత స్థిర గుణమణుల కాకరము హృదయ

సంతోషమునకు
సంజనకంబు భార్యయ చూవె భర్తకు నొండ్లుగావు ప్రియము

ఆ.
లెట్టిఘట్టములను నెట్టి యాపదలను, నెట్టి తీఱములను ముట్టఁబడిన
వంతలెల్లఁ బాయు నింతులఁ బ్రజలను, నొనరఁజూడఁ గనినజనుల కెందు.
౮౫

భార్య ధర్మార్థసాధనకు ఉపకరణం, గృహనీతి విద్యకు స్థానం, విమలమైన చారిత్రశిక్షకు ఉపాధ్యాయుడు వంటిది, వంశాన్ని కొనసాగించటానికి మూలమైనది, సద్గతిని పొందటానికి ఊతం, గౌరవాన్ని పొందటానికి ఉన్న ఒకేఒక కారణం,
ఉన్నతమైన స్థిరమైన గుణములనే మణులకు స్థానము, హృదయానికి సంతోషం కలిగించేది. భార్యయే కాని భర్తకు ఇంకోటేదీ ప్రియమైనది కానేరదు. భార్య, పిల్లలు గలవానికి ఎటువంటి సమయంలో గానీ ఎటువంటి కష్టమైనా గానీ పోరాములలో చుట్టుముట్టిన వంతలెల్లా కూడా దూరమౌతాయి. అంటూ ఇంకా ఇలా అంటుంది. (సశేషం)
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౫

కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట

చ.
నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

సత్యము యొక్క గొప్పతనాన్ని ఎంతో బాగా వివరించిన పద్యం. మనందరం రోజూ మననం చేసుకోవాల్సిన పద్యం. శకుంతల దుష్యంతునితో సత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన పద్యం.

ఎట్టి సాధ్వులకును బుట్టినయిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు
వ.
కావున నీ విక్కుమారుం దోడ్కొని నీ పతిపాలికి నరుగు మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడు వంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుం డై యున్న యా రాజుం గనుంగొని. ౬౭

కణ్వ శిష్యులు తోడురాగా భరతునితో శకుంతల దుష్యంతుని రాజసభకు వచ్చింది.
క.
గురునాశ్రమంబునను ము, న్నరుదుగఁ బతివలనఁ గనినయనురాగము నా
దరణము ననుగ్రహంబును, గరుణయు సంభ్రమము నపుడు గానక యెదలోన్
. ౬౮

పూర్వం కణ్వాశ్రమం లో అరుదుగా నైనా పతివలన కనిన అనురాగము కానీ, ఆదరణ కానీ, అనుగ్రహం కానీ, కరుణ కానీ, సంభ్రమం కానీ ఆతని మొహంలో కనిపించక అప్పుడామె మనసులో ఇలా అనుకొందట.
క.
ఎఱుఁగఁడొకొనన్ను నెఱిఁగియు, నెఱుఁగనియట్లుండునొక్కొ యెడ దవ్వగుటన్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు, మఱవరె బహుకార్య భారమగ్నులు గారే.
౬౯

నన్ను ఎఱగడా? ఎఱగనట్లున్నాడా? చాలాకాలం అయింది కాబట్టి ఒకవేళ మఱచిపోయాడా ? రాజులు తెలివిలేని వారు కాబట్టి మఱిచిపోయారేమో ఎన్నోకార్యాలలో నిమగ్ను లై ఉండటం చేత.
చ.
తలఁపగ నాఁడు పల్కిన విధం బెడఁ దప్పఁగ వీడెనొక్కొ చూ
డ్కులు విరసంబు లై కరము క్రూరము లై ననిమిత్త మేమియో
కలయఁగ బల్కరించి రుపకారులు నై రని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాధులన్.౭౦

ఆరోజు పలికిన మాటల్ని విడిచిపెట్టేసాడా ఏమిటి? ఇతని చూపులు విరసంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు. కడు క్రూరంగా కూడా వున్నాయి. కారణం ఏమిటో తెలియదు. రాజులు మనల్ని పలకరించారు, మనకు ఉపకారం చేసారు అని వారిని బుద్ధిమంతులైన వారు నమ్మి ఉండకూడదు. ఎందుకంటే వారు నవ ప్రియులు. ఎప్పుడూ కొత్తంటే పడిచస్తారు కనక. అనుకుంది ఆవిడ.
వ.
అని తలంచి చింతా క్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున ౭౧
ఇంకా మనసులో ఇలా అనుకుందట.
క.
మఱచినఁ దలఁపింపఁగ నగు, నెఱుఁగని నాఁ డెల్ల పాట్ల నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని, కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే. ౭౨

నిజంగా మర్చిపోతే గుర్తు చేయవచ్చు, ఎరక్కపోతే ఎలాగోలా తెలుసుకొనేలా చేయొచ్చు. తెలిసి వుండికూడా తెలియనట్లుగా ఉండే దుర్మార్గుడికి తెలియచెప్పటం ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు.
వ.
అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నా పూర్వవృత్తాంతం బెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. ౭౩
క.
జననాథ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి,చ్చిన వరము దలంప వలయుఁ చిత్తము లోనన్. ౭౪

వేట నెపంతో కణ్వాశ్రమమునకు వచ్చినపుడు నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకో మహారాజా అన్నది.
క.
బాలార్క తేజుఁ డగు నీ,బాలుఁడు నీ కొడుకు వీనిఁ బౌరవకులర
త్నాలంకారు నుదారగు,ణాలయు యువరాజుఁ జేయు మభిషేకమునన్. ౭౫

ఈ బాలుడు నీ కొడుకు. అందుచేత వరము ఇచ్చిన విధంగా వీనికి యౌవరాజ్యపట్టాభిషేకం జరిపించాల్సింది. అన్నది.
వ.
అనిన విని దుష్యంతుడు దాని నంతయు నెఱింగియు నెఱుంగని వాఁడపోలె ని ట్లనియె.౭౬

ఇక్కడ కథను కొంత మార్చి కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలాన్ని వ్రాసారు. మునీశ్వరు శాపం వలన దుష్యంతుడు మరచినట్లుగా వ్రాయటం జరిగింది. వ్యాస భారతంలో ఎలా ఉన్నదో నాకు తెలియదు.
క.
ఏ నెఱుఁగ నిన్ను నెక్కడి, దానవు మిన్నకయ యనుచితంబులు వలుకం
గా నేల యరుగు మంబురు, హానన యెందుండి వచ్చి తందులకు వడిన్. ౭౭

నేను నిన్ను ఎఱగనే ఎఱగను పొమ్మన్నాడు. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు.

ఇటువంటి శకుంతలల కథలు అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో ఎన్నెన్నో... అలా కొనసాగుతూనే ఉన్నాయి.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౪

దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొనఁ గోరుట

ఆ.వె.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు

పతులకడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె.౬౬

ఎటువంటి పతివ్రతలకైనా పుట్టినింటిలో ఎక్కువకాలం ఉండటం తగదు. సతులకు ఉండాల్సిన చోటు వారి వారి భర్తల యింటిలోననే. సతులకు ఏడుగడ కూడా పతులే అవుతారు. ఇవి శకుంతలను భర్త దగ్గరకు పంపేటప్పుడు కణ్వమహర్షి పలికిన పలుకులు.

శకుంతల ముని కన్యకాదు క్షత్రియ కన్య అని వినినంతనే దుష్యంతుండు మదనాతురుం డయి తనయం దక్కోమలి యనురాగం బుపలక్షించి యి ట్లనియె.
ఉ.
ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా
భామిని నాకు భార్య వయి భాసురలీల న శేషరాజ్యల

క్ష్మీ మహనీయసౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా

దామలతుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుట్టిమంబులన్.
౫౪
అనిందిత ఇందుపాద=దూషింపరాని చంద్రకిరణములవలె
సీ.
బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రాజాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు నను నెనిమిది వివాహములయందుఁ

గడుఁ బ్రసస్తములు సత్క్షత్త్రవంశ్యులకు గాంధర్వ రాక్షసములు ధర్మయుక్తి

నీకును నాకును నెమ్మిఁ బరస్పరప్రేమంబు కాముండు పెంపఁ దొడఁగెఁ.

ఆ.వె.
గాన నెడయుఁ జేయఁగా నేల గాంధర్వ, విధివివాహమగుట వినవె యుక్త
మనిన లజ్జఁ జేసి యవనతవదనయై, యాలలితాంగి యిట్టులనియెఁ బతికి.
౫౫

ఉన్న ఎనిమిది రకాలైన వివాహాలలో గాంధర్వము, రాక్షసము అనే రకాలు క్షత్రియులకు ఉత్తమమైనవి అందుచేత మనమిద్దరం గాంధర్వ విధిని వివాహమాడదాం అంటాడామెతో దుష్యంతుడు. దానికామె జవాబుగా
క.
కరుణానిరతులు ధర్మ, స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం
తురు వారు వచ్చి నీ కి, చ్చి రేని పాణిగ్రహణము సేయుము నన్నున్
.౫౬
వ.
అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె.౫౭
తే.
తనకుమఱితాన చుట్టంబు తాన తనకు, గతియుఁదన్నిచ్చుచోఁ దానకర్తయనఁగ
వనజనేత్ర గాంధర్వ వివాహమతిర,హస్యమును నమంత్రకమునునగుచు నొప్పు.

తనకు మఱి తానే చుట్టమనీ, తనకు తానే గతి యనిన్నీ, తననిచ్చుకొనేటప్పుడు తానే కర్త యని, గాంధర్వ వివాహం అతి రహస్యంగా జరగాల్సి ఉన్న క్రతువనీ, దానికి మంత్రాలతో ప్రమేయం లేదనీ చెపుతాడు.
వ.
అని దుష్యంతుండు గాంధర్వ వివాహస్వరూపంబు సెప్పి శకుంతల నొడంబరచిన నది యి ట్లనియె.౫౬
చ.
నరనుత నీ ప్రసాదమున నా కుదయించిననందనున్ మహీ
గురుతరయౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో
నిరుపమదాన య ట్లయిన నీకును నాకును సంగమం బగున్.౫౯
మంచి తెలివితేటలతో వరాన్ని బాగానే అడిగింది శకుంతల.
వ.
అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దానికోరిన వరం బిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రా నస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహామునిపాలికిం బుత్తెంచెద నని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె నిట శకుంతలయుఁ దన చేసినదాని మునివరుం డెఱింగి యలిగెడునో యని వెఱచుచుండె నంత నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులుగొని చనుదెంచి లలిత శృంగారభావంబున లజ్జావనత వదనయు నతిభీతచిత్తయునై యున్న కూఁతుం జూచి తన దివ్యజ్ఞానంబున నంత వృత్తాంతంబు నెఱింగి క్షత్త్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె.౬౧
తే.
తల్లి నీకులగోత్ర సౌందర్యములకుఁ, దగినపతిఁ గంటి దానికిఁ దగఁగ గర్భ
మయ్యె నీదుగర్భమునవాఁడఖిలభువన, వహన మహనీయుఁడగు చక్రవర్తి సుమ్ము.౬౨
వ.
నీధర్మ చరితంబునకు మెచ్చితి నీవు గోరిన వరం బిచ్చెద వేఁడు మనిన శకుంతలయు నాచిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను నా కుద్భవిల్లెడు పుత్త్రుండు దార్ఘాయురారోగ్యైశ్వర్యబల సమన్వితుండును వంశకర్తయుఁ గావలయు ననిన నమ్మహాముని కరుణించి దానికోరిన వరం బిచ్చి యఛాకాలవిథుల గర్భసంస్కార రక్షణంబులు సేయించి యున్నంత వర్ష త్రయంబు సంపూర్ణం బైన శకుంతలకు భరతుం డుదయించి కణ్వ నిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుండయి పెరుఁగుచుఁ గరతలాలంకృతచక్రుండును జక్రవర్తి లక్షణ లక్షితుండును సింహ సంహననుండును దీర్ఘ బాహుండును ననంతజవసత్త్వ సంపన్నుండు ను నై పరఁగుచు.౬౩
మూడు సంవత్సరాలు గర్భంలో ఉన్నాడట భరతుడు. బాప్ రే.
మ.
అమితోగ్రాటవి లోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖ
డ్గ మదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁ డై కణ్వాశ్రమోపాంతభూ
జములం దోలిన కట్టుచుం బలిమి మై శాకుంతలుం డొప్పె వ
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానా శైశవ క్రీడలన్.౬౪

ఎక్కువ దుర్గమమైన అడవులలో సంచరించే అడవి పందులను, పాములను, పులులను, ఖడ్గమృగాల్ని, మదించిన ఏనుగుల్ని పట్టి తెచ్చి కణ్వాశ్రమ సమీపంలోని చెట్లకు కట్టివేసి గొప్ప బలంతో శాకుంతలుడు మదించిన ఏనుగులూ వగైరాలనెక్కి ఆడుతూ శైశవ క్రీడలతో అందగించాడట.
వ.
ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దన మహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందలి మును లెల్ల నాతనికి సర్వ దమనుం డనునామంబుఁ జేసిరి. కణ్వమహా మునియు నక్కుమారు నుదార తేజో రూప విక్రమ గుణంబులకు సంతసిల్లి వాఁ డఖిల భువన యౌవరాజ్యాభిషేకంబునకు సమర్థుండగు(సమయం బరుగు) దెంచె నని విచారించి యొక్కనాఁడు గూఁతున కి ట్లనియె. ౬౫
ఆ.వె.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు

పతులకడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె.౬౬











Unknown
ఆది పర్వము-చతుర్ధాశ్వసము-3

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమం బెఱింగించుట

మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
.49

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయంలోనిదీ పద్యం.

దుష్యంతుడు అలా తనవారిని బయటనే నిలిపివుంచి కణ్వమహాముని దర్శనార్థం ఆశ్రమం లోనికి ప్రవేశిస్తాడు. అక్కడతనికి మునీశ్వరుని దర్శనం కాలేదు కాని తన్వి, పయోజదళాయతాక్షి, సంకుల మిళితా ళినీల పరికుంచిత కోమల కుంతల ఐన శకుంతల దర్శనం అవుతుంది.
ఆమె దుష్యంతుని నెఱింగి ఆసన అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి కుశలం బడుగుతుంది. అప్పుడామెతో దుష్యంతుడు--
ఉ.
క్రచ్చఱ వేట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందుఁ బోయిరొకొ వా రనినన్ విని యా లతాంగి వా

రిచ్చటనుండి యీక్షణమ యేగిరి కానకుఁ బండ్లు దేర మీ

వచ్చు టెఱింగిరేని జనవల్లభ వారును వత్తు రింతకున్.
౨౭

వేటకోసమై వచ్చి కణ్వమహామునుల దర్శనంకోసం వచ్చాను. వారు యెక్కడకు వెళ్ళారో యిచట లేరు అనగా నామె వారిప్పుడే పండ్లు తేవటానికని అడవికి వెళ్ళారు. మీరొచ్చినట్టు తెలిసినవారై యిప్పుడే తిరిగి వస్తూంటారు. వారు వచ్చేవరకూ ఓ ముహూర్తకాలం వేచివుండాల్సిందని ప్రార్థిస్తుంది. ఆమె వినయానికి సంతసించి ఆమె రూపగుణ విశేషాలచే సంచలితుం డైన రాజు ఆమెను నీ వెవ్వరి కూతురవు యిట్టి గుణసుందరిని నీవు ఇక్కడికెలా వచ్చేవు అని అడుగుతాడు. దానికి శకుంతల
క.
జగతీ వల్లభ యే న,త్యగణితధర్మ స్వరూపుఁ డని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం, డగు కణ్వమునీంద్రు నాత్మజ ననినన్
.౨౯
చ.
ఇది ముని కన్యక యేని మఱియేలొకొ యీ లలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలు కింతను నమ్మ నేర న

య్యెద విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు నంచుఁ దా

నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్.
౩౦
వ.
ఇట్లు దుష్యంతుం డాశకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె.౩౧
తే.
ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వ రేతుఁ, డైన కణ్వమహాముని యనఘచరితుఁ
డట్టిముని కెట్లు గూఁతుర వైతి దీని, నాకు నెఱుగంగఁ జెప్పుము నలిననేత్ర
.౩౨

ఈమె మునికూతురనని అంటున్నది. అదే నిజమయితే మఱి నా మనస్సు ఈమె యందు ఎలా లగ్నం అవుతుంది? ఈమాట నమ్మదగినదిగా లేదు. ఈ ముని విజితేంద్రియుడని చాలాసార్లు విన్నాను కదా. అసలు నిజమేమిటో తెలుసుకోవాలి అని దుష్యంతుడు మనసులో అనుకున్నాడు. అలా అనుకొని ఆమెతో ఇలా అన్నాడు.
కణ్వులవారు ఉత్తమమైన ఆశ్రమాన్ని పాటించేవారు, మరియు ఊర్ధ్వరేతస్కుడూ అని విని ఉన్నాం. అటువంటి అనఘ చరితుడూ పుణ్యాత్మునకు నీవు కుమార్తె వెలా అయ్యావు.
వ.
అని యడిగిన నా రాజునకు శకుంతల యి ట్లనియె.౩౩
క.
ఇక్కమలాక్షి శకుంతల, యెక్కడియది దీనిజన్మ మెవ్విధ మని త
మ్మొక్క మునినాథు డడిగిన, నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్.
౩౪
వ.
నా జన్మ ప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పిన విధంబు చెప్పెదఁ జిత్తగించి విను మని యా దుష్యంతునకు శకుంతల యి ట్లనియె.౩౫

శకుంతల మేనకా విశ్వామిత్రుల కథను దుష్యంతునకు చెపుతుంది.

రాజర్షియై, బ్రహ్మర్షి భావము బడసియున్న విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేస్తున్న సమయాన దేవేంద్రుడు ఆతని తపస్సునకు వెఱచి మేనక అనే అప్సరసను పిలిచి ఆతని తపస్సును భగ్నం చేయమని నియమిస్తాడు. దానికి ఆమె వశిష్ఠునంతవానిని అనపత్యుడవు గమ్మని శపించినంతటి ఉగ్రకోపిష్టి యైన విశ్వామిత్రుని కడకు నన్ను పంపించటం న్యాయం కాదంటూనే నాశక్తికొలది ప్రయత్నిస్తానని చెప్పి మేనక మందమలయానిలం తోడుగా విశ్వామిత్రుని తపోవనం చేరుతుంది. తరువాత కథ మామూలే. విశ్వామిత్రుని దీక్ష భగ్నమై విశ్వామిత్ర మేనకల సంయోగంతో వారిద్దరికీ ఓ ఆడశిశువు జన్మిస్తుంది. మేనక ఆ కన్యకను మాలిని అనే నదీతీరంలో వదలిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు కూడా ఆ శిశువును విడిచిపెట్టి వెళ్ళిపోగా
ఆ.
చెలఁగి లేవ నేడ్చు చిఱుతుక దానిఁ గ్ర,వేయాద ఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు, కొని శకుంతతతులు గూడి యుండె.౪౭
చెట్టుపలఁ=ఱెక్కల చేత
వ.
అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుం జని యమ్మాలినీపులినతలంబుమన శకుంతరక్షిత యై యున్న కూతుఁనత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణశశిరేఖయుం బోలినదాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటం జేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి.
మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘయుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.
4౯
వ.
అనం బరగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటం జేసి గురుల మిదియును మాచే నభివర్ధిత యగుటం జేసి మాకు హృదయానందని యైన కూఁతురని కణ్వమహామును లమ్మునికిఁ జెప్పినవిధం బంతయు సవిస్తరంబుగా శకుంతల సెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున. ౫౦
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౨

దుష్యంత మహారాజు చరిత్రము

వ.
ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలులుండు పుట్టె వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టెఁ బుట్టి యనన్య సాధారణ గుణయుక్తుండై.
శా.
ఆ దుష్యంతుఁ డనంత సత్త్వుఁడు సమస్తాశాంత మాతంగమ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్తమై యుండఁగా

నాదిత్యాంశుసమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాది క్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.
౮
ఆదిత్యాంశుసమీర దుర్గమ=సూర్యరశ్మి గాలియు జొరరాని

ఆ దుష్యంత మహారాజు ఓ పర్యాయం అడవికి వేటకు వెళ్ళి మృగాలను వేటాడుతూ వేట తమకంలో పరివారానికి దూరమై కొద్ది పరిజనం మాత్రమే వెంట రాగా ఓ పుణ్యనదీ తీరంలో వివిధసురభికుసుమ ఫల భారవినమ్రతరులతా గుల్మ పరిశోభితం బయిన యొక్క వనంబు గని ఆ వన సౌందర్యమునకు ముగ్ధుడై ప్రవేశించు నపుడు ఆతనిపై చల్లని గాలివిసరి సేదతీర్యటమే కాకుండా లతలయెక్క పువ్వులు అక్షతలు చల్లి దీవించినట్లుగా అయిందట.

మానిని.
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల ని మ్మగుఠావుల జొంపములన్
బూచిన మంచి యశోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం

గాచి బెడంగుగఁ బండిన యా సహకారములం గదళీ తతులం

జూచుచు వీనుల కిం పెసఁగన్ వినుచున్ శుకకోకిలసుస్వరముల్.౨౦
సహకారములం=తియ్యమామిళ్ళ చేతను

చిగిరించిన గోరంట్లతోనూ, బాగా పూచిన అశోకములతోనూ, సురపొన్నలు పొన్నలతోనూ గేదగి పూవులతోనూ బాగుగా పండిన తియ్యమామిడి పండ్లతోను, అరటి పండ్లతోనూ ఒప్పుతున్న చెట్లనూ లతలనూ చూస్తూ, చిలుకల మరియు కోకిలల కుహూరావాల్ని వింటూ ముందుకు సాగాడు.

కవిరాజవిరాజితము.
చని చని ముందట నాజ్యహనిర్ధృతసౌరభధూమలతాతతులం
బెనఁగిన మ్రాకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లై నను బా

యని మధుప ప్రకరంబులఁ జూచి జనాధిపుఁడంత నెఱింగెఁ దపో

వన మిది యల్ల దె దివ్యమునీంద్రు నివాసము నా నగు నంచు నెదన్.
౨౧

ముందుకు వెళ్ళగా వెళ్ళగా అక్కడ నేతితో కూడిన హవిస్సులను అగ్నిలో వేల్చగా వెలువడిన ధూమముతో నిండిన లతలతో వున్న చెట్లకొమ్మల మీద పూవులు లేకున్ననూ పాయని తుమ్మెదలగుంపును చూచి దుష్యంతుడు ఆ ప్రదేశము ఒక ముని ఆశ్రమమని ఎదురుగా కనిపించేది ఆ దివ్యమునీంద్రుని నివాసమని గ్రహించాడు. ఇంకా లోనికి వెళ్ళగా అక్కడ వినిపిస్తున్న హోత్ర స్వాహా శబ్దాల్ని, విద్వత్సంభాషణలను మరియు గోష్ఠీనినాదాల్ని బట్టీ దానిని కణ్వమహాముని ఆశ్రమంగా యెఱిగిన వాడై అందు.
సీ.
శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులును గరికరశీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి వానిఁ జెంది సుఖం బున్న సింహములును
భూసురప్రవరులు భూతబలుల్ దెచ్చి పెట్టు నీవారాన్న పిండతతులు
తే.
గడఁగి భక్షింప నొక్కటఁ గలసియాడు, చున్న యెలుకలుఁ బిల్లులు నొండు సహజ
వైరివర్గంబులయు సహవాసమపుడు, సూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది.౨౪

అక్కడ చిలుకలు శ్రవణ సుఖంగా సామగానాన్ని చేస్తుండగా కదలకుండా ఆగానాన్ని వింటూవున్నాయట ఏనుగులు.
ఆ ఏనుగులశీతల ఛాయలోని చల్లని నీటితుంపరల గాలికి ఆసపడి ఆ ప్రక్కనే సుఖంగా కూర్చున్నాయట సింహాలు. బ్రాహ్మణులు భూత బలుల కోసం తెచ్చి పెట్టిన నీవారాన్న పిండములను తినడానికై చేరిన యెలుకలు పిల్లులు తమ తమ జాతి వైరాలను విడిచి ఒక్కచో స్నేహంతో మెసలుతున్నాయట. ఈ దృశ్యాల్ని చూచి ఆ ముని శక్తికి అబ్బురపడుతూ
ఈ కశ్యపప్రజాపతి పుత్త్రుండైన కణ్వమునీశ్వరులకు నమస్కరించి వస్తాను మీరంతా ఇక్కడే వుండండని తన పరివారానికి నియమించి కణ్వమునీంద్రుల ఆశ్రమంలోనికి ప్రవేశిస్తాడు దుష్యంతుడు.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-౧

పూరుని వంశ క్రమము

పూరుడు(కౌసల్య)---జనమేజయుడు(౩ అశ్వమేధములు చేసెను, భార్య అనంత)---ప్రాచిన్వంతుడు(ప్రాక్ దిగ్విజయం చేసి ప్రాచీనాంశుడు గా పిలవబడ్తాడు. భార్య నశ్మకి)--- సంయాతి(వరాంగి)--- నహంయాతి(భానుమతి(కృతవీర్యపుత్రి)) --- సార్వభౌముడు(కేకయరాజపుత్త్రి సునంద) ---- జయత్సేనుడు(వైదర్భి యైన సుశ్రవశ) ---- నవాచీనుడు ( విదర్భరాజపుత్త్రి మర్యాద) ---- నరిహుడు(ఆంగి)---- మహాభౌముడు(ప్రసేనుని పుత్త్రిక సుపుష్ట) --- అయుతానీకుడు (పృథుశ్రవసుని పుత్త్రిక కామ) ---అక్రోధనుడు( కాళింగి యైన కరంభ) --- దేవాతిథి( వైదేహి యైన మర్యాద) ఋచీకుడు(ఆంగి యైన సుదేవ) ---ఋక్షుండు(దక్షక పుత్త్రియైన జ్వాల) ---మతినారుడు పుట్టి
క.
ఇమ్ముగ సరస్వతీ తీ,రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధి మా
ర్గమ్మున సద్గుణ సముదా, య మ్మెసఁగఁగఁ జేసె సత్త్రయాగము నిష్టన్.
౩
క.
అతనికి సరస్వతీ నది, మతి ననురక్త యయి వాని మానుగఁ దనకుం
బతిఁ జేసికొనియె ధర్మ, స్థితి నయ్యిరువురకుఁ ద్రసుఁడు ధీరుడు పుట్టెన్.
౪

నదికీ రాజుకూ వివాహం జరగడం ఇదో వింత. నదులు స్త్రీ రూపాల్ని ధరించడం - ఇంకా గంగాదేవి విషయంలో కూడా మునుముందు చూడబోతాం.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౬

ఇంద్రుడు యయాతిని స్వర్గలోక భ్రష్టుం జేయుట

యయాతి మహారాజు పూరుని రాజ్యాభిషిక్తుని చేసిన తరువాత తపోవనమునకేగి శిలోంఛవృత్తి నవలంబించి వేయి సంవత్సారాలు తపస్సు చేసాడు. తరువాత నిరాహారుడయి ౩౦ సంవత్సరాలు, వాయుభక్షకుడుగా వుంటూ పంచాగ్ని మధ్యంలో వుంటూ ఒక సంవత్సరము, నీటిలో ఏకపాదము మీద నిలబడి ఇంకొక్క సంవత్సరము తపస్సు చేసి దివ్యవిమానంలో స్వర్గలోకం చేరి దేవర్షిగణ పూజితు డై, అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షి పూజితుండై అనేక కల్పములు అక్కడ గడిపి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రుడు అప్పుడతడిని ఈవిధంగా అడిగాడు.
శిలోంఛవృత్తి=ఱాళ్ళపైనిగింజల నేఱికొనుజీవనముచే
క.
ఏమితపం బొనరించితి, భూమీశ్వర పుణ్యలోక భోగంబులఁ దే
జోమహిమ ననుభవించితి, సామాన్యమె శత సహస్రసంవత్సరంబుల్.
౨౦౮
వ.
అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె.౨౦౯
క.
సుర దైత్య యక్ష రాక్షస, నర ఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భా
సురతపములు నా దగు దు,ష్కర ఘోరతపంబు సరియుఁ గా వమరేంద్రా
.౨౧౦
వ.
అని తన తపోభిమానంబున మహర్షు లతపంబు లవమానించి పలికిన నయ్యయాతి గర్వంబునకు సహింపక యింద్రుం డలిగి నీకు దేవలోక సుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తి యయ్యె నీ గర్వంబు నిన్నింత సేసె నింక నధోలోకంబున కరుగుమనిన వాఁడును మనుష్యలోకంబునకుం బోవనోప నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకుఁ బ్రసాదింపు మని యింద్రు ననుమతంబు వడసి.౨౧౧
సద్భువనంబున=సత్ భువనంబున=సత్ అనులోకమున
తే.
అంతరిక్షంబు నఖిల దిగంతములును
వెలుగఁ జనుదెంచునాతని విమల దీప్తి
సూచి సద్గణములు గడుఁ జోద్యమంది
రురుతరద్యుతి యిదియేమియొక్కొ యనుచు.౨౧౨

యయాతి స్వర్గాన్నుండి వచ్చేటప్పుడు అతనిని ఆవరించి ఉన్న కాంతిని అందరూ అబ్బుర పడుతూ చూచారట.
వ.
అంత నయ్యాయతి దౌహిత్రులైన యష్టకుండును బ్రతర్ధనుండును వసుమంతుండును నౌశీరనుం డయినశిబియు నను వారలు సద్భువుననివాసులు దమయొద్దకుం జనుదెంచిన యయాతి నధిక తేజోమయు ననంతమూర్తిం గని నిసర్గ స్నేహంబున నభ్యాగతపూజల సంతుష్టుం జేసి నీ వెవ్వండ వెందుండి యేమికారణంబున వచ్చితని యడిగిన వారలకు
నయ్యయాతి యి ట్లనియె.౨౧౩

అప్పుడు యయాతి వారికి తాను నహుష పుత్త్రుడు పూరుని తండ్రి యైన యయాతిగా పరిచయం చేసుకొని యింద్రుని తోడి తన సంభాషణని వివరించి తాను సురసిద్ధ మునీంద్రుల తపశ్చరణలు తన తపముతో సరిగావని చెప్పడాన్ని వివరించి,
చ.
అమరవిభుండు దాని విని యల్గి మదంబున ను త్తమావమా
నము దగునయ్య చేయ నని నన్ను నధోభువన ప్రపాతసం
భ్రమ వివసాత్ముఁ జేసె నదిపాడియ యెందును నల్పమయ్యు ద
ర్పము బహుకాలసంచిత తపః ఫలహాని యొనర్పకుండునే.౨౧౭

దర్పము ఎంతహానిని కలిగిస్తుందో చెపుతాడు.

అప్పుడు వారు అతనికి తమను అతని దౌహిత్రులుగా పరిచయం చేసుకుని అతనిని సకల ధర్మాధర్మములు, సుగతి దుర్గతి స్వరూపములు, జీవుల గర్భోత్పత్తి ప్రకారము,వర్ణాశ్రమ ధర్మముల గురించి వివరించమని కోరతారు.

ఆ.
సర్వభూతదయకు సత్యవాక్యమునకు, నుత్తమంబు ధర్ము వొండెఱుంగ
నొరులనొప్పి కోడ కుపతాప మొనరించు, నదియ కడు నధర్మ మనిరి మునులు.౨౧౯

సర్వ భూతములయందు దయ, సత్యవాక్యము వీనిని మించిన ధర్మం ఇంకొకటి తనకు తెలియదన్నాడు.ఇతరులకు నొప్పిని బాధను కలిగించటాన్ని కడు అధర్మమన్నారు పెద్దలు.
ఆ.
వేదవిహిత విధుల నాదరించుట యూర్థ్వ, గతికిఁ దెరువు విధులఁ గడచియెందు
నాఁగఁబడిన వాని లోగఁగఁ జేయుట, యధమగతికి మార్గమనిరి మునులు.౨౨౦

వేదాలలో విధించబడిన కార్యములను చేయుట పైగతి నొందడానికి మార్గమని మునులు చెప్పారు. నిషేధింపబడిన వానిని ఆచరించుట అధమగతికి మార్గమని కూడా చెప్పారు.
వ.
మఱియు గర్భ యోనియందు ఋతుపుష్పరససంయుక్తం బగుచు రేతంబు గాడ్పు చేతం బ్రేరేపితం బయి కలసిన నందుఁ బంచతన్మాత్రలు పొడ వయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవులయి యుద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు దుష్కృతబాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధివిరహితంబు లైన తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు. సుకృత బాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱచి బుద్ధియుక్తు లై మనుష్య యోనులందుఁ బుట్టి యుక్తాచారులును దత్త్వవిదులును నయి దేవత్వంబును పొంది విశుద్ధ జ్ఞానులయి ముక్తులగుదురు మఱి యుక్తాచారులెవ్వరనిన గురుశుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం దప్రమత్తులయి శమదమశౌచంబులు దాల్చి యవిప్లుత బ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును బాపంబునకుఁ బరోపతాపంబునకు వెఱచి ధర్మ్యంబైన విత్తంబున నతిథులం బూజించుచుయజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును నియతాహారులై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును వనంబులనుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబులనుండి శరీరధారణార్థంబు నియతస్వల్పభోజనులయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాలంక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగ విసర్జితులయి యేక చరు లయి యనేకనికేతను లయినయతులును ననువీరలు దమతమ పుణ్యాచారంబులలం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబులవారిని దమ్మును నుద్ధరింతురు గావున.౨౨౧
స్త్రీ గర్భంలో ఋతుకాలమందలి పుష్పరసంతో రేతస్సు గాలిచేత ప్రేరేపింపబడి కలిసిన అందు పంచతన్మాత్రలు రూపాన్ని పొంది క్రమంగా అవయవాలేర్పడి పుట్టినవాడై చెవులద్వారా శబ్దాన్ని, కన్నులద్వారా రూపాన్ని, ముక్కు ద్వారా వాసనని, నాలుక ద్వారా రుచిని, చర్మం ద్వారా స్పర్శను, మనస్సు ద్వారా సర్వాన్ని తెలుసుకుంటూ పూర్వము చేసిన కర్మలవలన పాపాల్ని పుణ్యాల్ని చేస్తూ పాపకర్మలు యెక్కువగా చేస్తే పుణ్యకర్మలని హరిస్తూ బుద్ధి లేని జంతుజాలంలో పుడుతూ పుణ్యకర్మాచరణం అధికంగా చేస్తే అవి పాపకర్మలను హరించగా బుద్ధిని కలిగుండే మానవ జన్మ పొందుతూ యుక్తాచారులూ తత్త్వవిదులూ అయితే దేవత్వాన్ని పొందుతూ ఉంటారు. యుక్తాచారు లెవరయ్యా అంటే ౧. గురుశుశ్రూష చేస్తూ నిత్యమూ అధ్యయన అగ్ని కార్యాలలో జాగరూకులయి శమదమశౌచాల్నితాల్చి సడలని బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించేబ్రహ్మచారులును, ౨.పాపానికి ఇతరుల కపకారం చేయడానికి భయపడుతూ ధర్మమార్గంలో మాత్రమే సంపాదించిన ధనంతో అతిథులను పూజిస్తూ యజ్ఞాల్ని చేస్తూ పరులు ఇవ్వని ధనాన్ని పరిగ్రహించక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును, ౩. తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ అన్ని సంగాల్ని విడిచి జయింపబడిన ఇంద్రియాల్ని కలిగిన వానప్రస్థులును, ౪. అడవులలో నివసిస్తూ గ్రామ వస్తువులనుపయోగించకుండా గ్రామాల్లో ఉంటూ శరీరాన్ని నిలబెట్టుకోడానికి మాత్రమే సరిపడే ఆహారాన్ని స్వీకరిస్తూ నగర ప్రవేశాన్ని పరిహరించి కామక్రోధాల్ని పొందకుండా శౌచాల్ని పాటిస్తూ అన్ని ద్వందాల్ని ఒడిసి పట్టి వివర్జితులయి ఏకచరులయి అనేక గృహాల్ని కలిగిన యతీశ్వరులును--అనబడే వీరంతా తమ తమ పుణ్యాచారాల్ని బట్టి అటు పది తరాల్ని యిటు పది తరాల్ని తమనూ ఉద్ధరించుదురు. కావున.
క.
మానాగ్నిహోత్రమును మఱి, మానాధ్యయనమును మానమౌనంబును వి
జ్ఞానమున మానయజ్ఞము, నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్.221
మాన=గౌరవింపదగిన
గౌరవింపదగిన యజ్ఞము, అధ్యనము, మౌనము, యజ్ఞము ఇవి నాలుగూ యథార్థమయినవి. అని యయాతి వారికి ఉపదేశిస్తాడు.
ఆది పర్వము తృతీయాశ్వాసము సమాప్తము.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౫

ఇంద్రుడు స్వర్గానికి వచ్చిన యయాతితో యిట్లనియె.
క.
కొడుకు జవ్వనంబు గొని నీవు నిజరాజ్య, భూరిభరము వానిఁ బూన్చునప్పు
డతని కెద్ది గఱపి తని యడిగిన హరి, కయ్యయాతి యిట్టు లనుచుఁ బలికె.౨౦౨

పూరుడిని రాజ్యాభిషిక్తుడిని చేసినప్పుడు అతనికి ఏమేం బుద్ధులు కరపావో చెప్పమంటా డింద్రుడు యయాతిని.

యయాతి పూరునకు బోధించిన నీతులు
క.
ఎఱుక గలవారిచరితలు, గఱచుచు సజ్జనులగోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిగినవానిని, మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.౨౦౩

పెద్దల చరిత్రలు తెలుసుకుంటూ, సుజనులతోడి సంభాషణల్లో పాలుపంచుకుంటూ ధర్మాన్ని తెలుసుకుంటూ, తెలుసుకున్న దానిని మంచిబుద్ధితో ఆచరిస్తూ ఉండాలి.
క.
ఇచ్చునది ధనము పాత్రున, కచ్చుగ నొరు వేఁడ కుండునది యభిముఖు లై
వచ్చినయాశార్ధుల వృథ, పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్.౨౦౪

పాత్రుడైన వానికే ధనాన్ని ఇవ్వాలి. అపాత్రదానం కూడదు. ఇతరులనెప్పుడూ యాచించకుండా వుండాలి. ఆశించి వచ్చిన వారిని వృథ పుచ్చకుండా సర్వభూతములకు హితమైన వానినే చేస్తూ ఉండాలి.
క.
మనమునకుఁ బ్రియంబును హిత, మును బథ్యముఁదథ్యమును నమోఘమధురం
బును బరిమితమును నగుపలు, కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్.౨౦౫

సభలలో మాట్లాడవలసిన విధానాన్ని నిర్దేశిస్తున్నాడు చూడండి.
మనసుకు ప్రియాన్ని హితాన్ని కలిగించేవి, పథ్యమయ్యేవి, తథ్యమయ్యేవి, అమోఘమైనవి, మధురమైనవి, పరిమితమైనవి, అయ్యే పలుకులనే ధర్మయుతముగా ఒప్పేటట్లుగా సభలలో పలకాలి.
సీ.
వదన బాణాసన వ్యక్తముక్తము లై న పలుకు లన్కడువాఁడి బాణతతులఁ
బరమర్మ లక్ష్యముల్ పాయక భేదించు చుండెడు దుర్జనయోధవరుల
కడ నుండకున్నది కరుణ యార్జవ మక్షజయము సత్యంబును శమము శౌచ
మను వీని యెద నిల్పునది శత్రుషడ్వర్గజయ మందునది శుద్ధశాంతబుద్ధి
తే.
మదముఁ గామంబు గ్రోధంబు మత్సరంబు
లోభమును మోహమును నను లోని సహజ
వైరి వర్గంబు నొడిచినవాఁడ యొడుచు
నశ్రమమంబున వెలుపలి యహితతతుల.౨౦౬
ఉన్నది=ఉండునది
ఆర్జవము=ఋజుభావము
అక్షజయము=ఇంద్రియజయము
ఒడిచిన=ఓడించిన
నోటినుండి వెలువడే బాణాల్లాటి మాటలతో ఇతరుల మర్మ లక్ష్యాలను భేదించే చెడ్డవారి దగ్గర ఉండకూడదు. మనసులో ఎప్పుడూ కరుణ, ఋజు భావము, ఇంద్రియజయము, సత్యం, శమము, శౌచము- వీనినే నిలుపుకోవాలి. శుద్ధమైన శాంతబుద్ధితో అరిషడ్వర్గాలను జయించాలి. మదము, కామము, కోపము, అసూయ, లోభము, మోహము అనే మనలోని సహజమైన శత్రువర్గాన్ని ఓడించినవాడే బయటి అహితాల్నికూడా శ్రమ లేకుండా జయించగలుగుతాడు.

ఇవీ యయాతి తన కొడుకునకు ఉపదేశించిన ఉపదేశాలు. మనందరం మన పిల్లలకు కూడా ఇవన్నీ చెప్దామా.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౪
యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట
క.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯

వ.
ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి కొడుకుల నెల్ల రావించి నాకు విషయసుఖతృప్తి లే కున్నయది గావున మీ యందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది యనిన విని యదుతుర్వసుద్రుహ్వ్యానులు దండ్రి కిట్లనిరి.
ఆ.
తగిలి జరయు రుజయు దైవవశంబున, నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యా రెంటిఁ జే, కొందురయ్య యెట్టికుమతులైన.౧౯౩
క.
నరలు గల కాము నైనను, దరుణులు రోయుదురు డాయ ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా, పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.౧౯౪
నరలు=తెల్లనివెండ్రుకలు

ముసలితనము, రోగము అనేవి దైవవశాత్తు కలిగితే వాటిని అనుభవించాల్సిందే కాని ఎరిగి ఎరిగి పూనుకొని మరీ ఆ రెండింటినీ ఎంత బుద్ధిహీనులైనా కోరి భరించ సిద్ధపడతారా?
తెల్లవెండ్రుకలు కలిగుంటే వాడు సాక్షాత్తు ఆ కాముడైనా సరే తరుణులు అసహ్యించుకుంటారు. ఎంత డబ్బున్న వాడైనా భరింపరాని ముసలితనాన్ని కలిగినవాడు కోరిన కోరికలకు వంచితుడు కాకతప్పదు గదా.
వ.
అని యొడంబడ కున్న నలిగి యయాతి యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ దుర్వసు వంశంబునవారు ధర్మాధర్మ వివేకశూన్యు లై సంకీర్ణ వర్ణ కిరాతులకు రాజులుగా ద్రహ్యువంశంబు వారు డుపప్ల వసంతార్యం బైన దేశంబునకు రాజులుగా జరాదూషకుండగుట ననువంశంబునవారు ముదియునంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగువారునుంగా శాపంబిచ్చి
యానలువురకుం గొండొకవాని శర్మిష్ఠా పుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాడు తండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై యయాతి యభిమతసుఖంబులు సహస్ర వర్షంబు లనుభవించి తృప్తుం డై పూరుజవ్వనంబు వానికి నిచ్చి తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞా విధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్త్రాది వర్ణ ముఖ్యుల నెల్ల రావించి మంత్రి పురోహితసామంతానంత పౌరజనసమక్షంబున సకల క్షోణీచక్ర సామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.౧౯౫
ఉడుపప్లవ సంతార్యంబు=పడవులు తెప్పలచే దాటదగినది
పంచత్వంబునకు=మరణమునకు
మ.
అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీయగ్ర సం
భవుఁ డత్యున్నత శక్తియుక్తుఁడు మహీభార ప్రగల్భుండు భా
ర్గవ దౌహిత్రుఁ డు పాత్రుఁ డీ యదుఁడు లోక ఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్ జఘన్యాత్మజున్.౧౯౬
జఘన్యాత్మజున్=నిందితసుతుని
పెద్దకొడుకు భార్గవుని మనుమడు ఉండగా వానిని కాదని నిందిత యైన శర్మిష్ఠ చివరికొడుకుకు రాజ్యం ఇవ్వడం ఎలా సబబు అని ప్రజలంతా అడిగారు రాజుగారిని.
వ.
అనిన వారల క య్యయాతి యి ట్లనియె.౧౯౭
క.
యదుఁ డగ్ర తనూజుఁడు నా, హృదయసముద్భవుఁడు వాఁ డయిన మద్వచనం
బిది యేటిది యని కడు దు,ర్మదుఁ డై చేయక కృతావమానుండయ్యెన్.౧౯౮

పెద్దకొడుకై ఉండీ దుర్మదు డై తండ్రి యాజ్ఞను పాలించకపోవటం చేత అవమానం పాలవ్వాల్సిన వాడవ్వాల్సి వచ్చింది అంటాడు.
అలా అంటూ ఈ విధంగా పైన చెప్పినట్లుగా అంటాడు.
క.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯
క.
పూరుఁడు గొండొక యయ్యును, భూరిగుణ జ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁ డు నవనీ
భార సహిష్ణుఁడు నాతఁడ, కోరిన కార్యంబుఁ దీర్చి కుశలుండగుటన్.౨౦౦
గొండొక=చిన్నవాడు
వ.
నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు శుక్రు వచనంబు నిట్టిద యని యయాతి ప్రకృత జనులనొడంబఱిచి పూరును రాజుగా చేసెను.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-13
క.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮
ఆ.
వారి జాక్షులందు వై వాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగ మందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప.!౫౮౪

ఇందులో మొదటి కంద పద్యం శ్రీమదాంధ్రమహాభారతం లో శర్మిష్ఠ యయాతి మహారాజుతో అంటుంది. రెండవ ఆటవెలది పద్యం వామనావతార ఘట్టంలో శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో అంటున్నది. మొదటిది మునివచనం అని శర్మిష్ఠ అంటుంది. రెండవది శుక్రాచార్యులు స్వయంగా చెప్పిన విషయం. "సత్యం వద " అనే వేదవాక్యానికిదో అపవాదం లాంటిది. దీనినే పెద్దలు శుక్రనీతిగా పరిగణిస్తారు.
శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో దేవయానికి దాసిగా నియమింపబడిన తర్వాత ఓ రోజు యయాతి మహారాజు అడవిలో దాహంతో తిరుగుతున్నపుడు అనిలు డనే దూత చేత దేవయాని దగ్గఱకు తీసుకొని రాబడతాడు. అప్పుడు దేవయానిని గుర్తించి, శర్మిష్ఠ గురించి అడగ్గా ఆమెను వృషపర్వుని పుత్రికగా తన దాసిగా పరిచయం చేస్తుంది. ఇంకా తమ పాత పరిచయాన్ని గుర్తు చేసి యయాతి తన దక్షిణ హస్తంతో దేవయాని దక్షిణ హస్తాన్ని పట్టుకొని రక్షించడం వలన తమ కిద్దరికీ ఇదివరకే పెళ్ళయినట్లే నంటూ తనను పెళ్ళిచేసుకోమని దేవయాని యయాతిని కోరుతుంది. దానికి యయాతి క్షత్రియుడైన తాను బ్రాహ్మణ కన్యను వివాహమాడ్డం ధర్మ విరుద్ధం అంటాడు. పైగా తాను వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడాల్సిన రాజు కాబట్టి అలా పెళ్ళిచేసుకోవటం భావ్యం కాదంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ వివాహం ధర్మ సమ్మతమేనంటే చేసుకుంటావు గదా అని అంటుందామె. అలాగే నంటాడతను. అప్పుడు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి అవివాహంలో అపక్రమదోషం లేకుండా వరమిస్తాడు. అలా వరమిచ్చి వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. శర్మిష్ఠను కన్యకాసహస్రంతో పాటుగా యయాతికి అంపకం పెడుతూ ఆమెకు అన్నపానభూషణాచ్ఛాదనమాల్యానులేపనాదుల సంతోషంబు సేయమని శయనవిషయంబున పరిహరించమని చెప్పి పంపిస్తాడు.
కాలక్రమంలో దేవయాని యందు యయాతికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు.

ఒకనాడు శర్మిష్ఠ సంప్రాప్త యౌవనయు ఋతుమతియు నై దేవయాని అదృష్టాన్ని తలచుకొని ఇలా అనుకుంటుంది.
క.
పతిఁ బడసి సుతులఁ బడయఁగ, నతివలు గోరుదురు గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను, సతులీ భార్గవికి భాగ్యసంపద నెనయే.౧౭౧
తరువోజ.
ఈరాజునంద నాహృదయంబు దవిలియెప్పుడు నుండు నన్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నట్టుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు.౧౭౨

దేవయాని యయాతిని ఎలా వివాహమయ్యిందో అలానే తను కూడా యయాతిని పెళ్ళాడాలనుకుంది శర్మిష్ఠ.
అవకాశం దొరకగానే నన్నేలిన దేవయానికి నీవు భర్తవు కాబట్టి నాకు కూడా నీవు భర్తవే ఆ దేవయానిని పరిగ్రహించినపుడే నేనామె ధనాన్నగుటచే నేనుభవత్పరిగ్రహంబనే అంటుంది. కావున తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమంటుంది. యయాతి ఇలా అంటాడు.
క.
లలితాంగి శయన మొక్కఁడు, వెలిగా రుచిరాన్న పాన వివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము, సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్.౧౭౬
సొలయక=వెనుదీయక
వ.
ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి నెట్లు బొంక నేర్తు ననిన శర్మిష్ఠ యయాతితో పైన చెప్పిన విధంగా అన్నదట.
క.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮

చెప్పొచ్చేదేంటంటే
శుక్రనీతి (అవసరార్ధం మార్పుచేసుకొనేది) శుక్రుని కూతురు కాపురానికే ఎసరు పెట్టిందన్నమాట.
క్రమక్రమంగా యయాతి వలన శర్మిష్ఠకు ద్రుహ్యనుపూరులనే ముగ్గురు కొడుకులు యయాతి పోలికలతో పుడతారు.
వారిని చూచి విషయం తెలుసుకొన్న దేవయాని తన తండ్రికి పిర్యాదు చేస్తుంది. శుక్రాచార్యులు కోపించి యయాతికి జరాభారపీడితుండవు కమ్మని శాపమిస్తాడు.
క.
ఋతుమతియై పుత్త్రార్థము, పతిఁ గోరినభార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన, నతనికి మఱి భ్రూణహత్య యగునంఢ్రు బుధుల్.౧౮౮
క.
దానికి భీతుఁడ నై య, మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడిసితి నెదలో, దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా.౧౮౯
వ.
ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను జరాభారంబుఁ దాల్ప నోపనని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి యట్లేని నీముదిమి నీకొడుడులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము నీవు విషయోపభోగతృప్తుండ వైన మఱి నీముదిమి నీవ తాల్చి వాని జవ్వనంబు వానికి నిచ్చునది. నీ ముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీ సహితుం డై తన పురంబునకు వచ్చి శుక్రు శాపంబున జరాభారంబుఁ దాల్చిన వానికి.౧౯౦
క.
తల వడఁక దొడఁగె నింద్రియ, ములగర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును, దలయేరును నుక్కిసయును దలకొనుదెంచెన్.౧౯౧

వళీపలితంబు=ముడుతలు నరయును
వగరును=ఉబ్బసమును
తలయేరును=తలనొప్పియును
ఉక్కిసయును=పొడిదగ్గును
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౨
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట

క.
అనుపమ నియమాన్వితు లై, యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సినవారికంటె నక్రో,ధనుఁడు గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్
.౧౪౬

గొప్ప నియమాలతోకూడి సాటిలేని దక్షిణలను ఇచ్చిన వారికంటే కోపిస్టి కానివాడు చాలా గొప్పవాడని తత్త్వవిధిజ్ఞులు అంటారు.
క.
అలిగిన నలుగక యెగ్గులు, వలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
వలుకక బన్నమువడి యెదఁ, దలఁపక యున్నతఁడ చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
౧౪౭

ఎదుటివారు కోపగిస్తే తను కోపగించకుండా వుండి, వాళ్ళేమయినా నిందావాక్యాలు పలికితే వానిని విననియట్లే ప్రతివచనములేమీ పలకకుండా ఉన్నవాడే లోకంలో ధర్మజ్ఞుడనబడతాడు.
వ.
ఇట్లు దేవయాని నుద్ధరించి యయాతి నిజపురంబువ కరిగె నిట దేవయానియు శర్మిష్ఠ సేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని యేను వృషపర్వుపురంబు సొర నొల్ల శర్మిష్ఠచేత నాపడిన యవమానంబు మదీయజనకున కెఱింగింపు మని పంచిన నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతంబంతయు శుక్రునకుం జెప్పిన శుక్రుండును నాక్షణంబ కోపఘూర్ణితబాష్పపూరితనయన యై యున్న దేవయానింగని యీ పై చెప్పిన విధంగా అన్నాడు.౧౪౫

శర్మిష్ఠ చేసిన అవమానాన్ని సహించి తిరిగి వృషపర్వుని రాజ్యంలో అడుగే పెట్టనని దేవయాని తండ్రికి వర్తమానం పంపిస్తే శుక్రాచార్యులవారు వెంటనే అక్కడికివచ్చికూతురిని అనునయిస్తూ పై చెప్పిన నీతివాక్యాలను చెప్తాడు.
వ.
కావున బుద్ధిగలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు శర్మిష్ఠ రాచకూఁతురు గొండొకయది దానితోడి దేమి రమ్మనిన దేవయాని యిట్లనియె.౧౪౮
క.
కడుననురక్తియు నేర్పును, గడఁకయుఁ గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడువివేకశూన్యుల, కడ నుండెడునంతకంటెఁ గష్టము గలదే.౧౪౯

అనురక్తి, నేర్పు, యత్నము కలవారిని ఊరికే నిందలు పలికే వివేకములేని వారివద్ద ఉండటం కంటే కష్టం ఇంకోటేదీ ఉండదు.
అందుచేత వృషపర్వుని రాజ్యంలో తానుండలేనని యెక్కడ కైనా వెళ్ళిపోతానంటుంది దేవయాని. అలాగైతే నీతోపాటే నేనూను అని వాళ్ళిద్దరూ బయలుదేరబోతారు. ఇదంతా చారులవలన విన్న వృషపర్వుడు వేగంగా అక్కడికి వచ్చి శుక్రాచార్యులను తమని వీడి పోవద్దని, వారేమి కోరితే అది యిస్తానని వరమిస్తాడు. అప్పుడు దేవయాని శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో కూడా తనకు దాసి కావాలని వరం కోరుతుంది. రాజు శర్మిష్ఠను పిలిచి ఆమెను కన్యకాసహస్రంతో పాటుగా దేవయానికి దాసిగా ఉండేట్లు ఏర్పాటు చేస్తాడు.
ఆరోజుల్లో బ్రాహ్మణులకు రాజులు అంత వినయవిధేయలతో ఉండేవారు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౧
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట
వ.
ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠ యను కన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి దేవయానీసహితంబు వనంబునకుం జని యొక్కసరోవరతీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టికొనిన మఱి దానిపరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యిట్లనియె.౧౩౪
కన్యకాసహస్రపరివృత యయి= వేయిమంది కన్యలను చుట్టనూ కలిగి ఉన్నదై
పరిధానంబులు=వస్త్రములు
సురకరువలిచేతం=సుడిగాలి చేత
ప్రేరితంబై=ప్రేరేపింపబడినవై
కడవఁ=దాటుటకు
క.
లోకోత్తర చరితుం డగు, నాకావ్యుతనూజ నీకు నారాధ్యను నేఁ
బ్రాకటభూసురకన్యక, నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా
.౧౩౫
లోకోత్తరమైన చరిత్ర కలిగిన శుక్రాచార్యుల కూతురనైన నేను నీకు ఆరాధనీయను. నేను నీ మైల చీరను ఎలా ధరిస్తాననుకొన్నావు. అని దేవయాని శర్మిష్ఠను అడిగింది.
వ.
అనిన శర్మిష్ఠ యి ట్లనియె.౧౩౬
క.
మాయయ్యకుఁ బాయక పని, సేయుచు దీవించి ప్రియము సేయుచు నుండున్
మీయయ్య యేటి మహిమలు, నాయొద్దనె పలుక నీకు నానయు లేదే.౧౩౭

విడిచిపెట్టకుండా మా అయ్యకు మీ అయ్య పనిచేసి దీవించి ప్రియమును చేస్తూ ఉంటాడు. మీ అయ్య మహిమలు నాదగ్గర చెప్పటానికి నీకు సిగ్గెలా లేదే అన్నది శర్మిష్ఠ దేవయానితో.
వ.
నా కట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజవాసంబున నుండె.౧౩౮.
ఎగ్గులాడి =నిందించి
ఇలా ఉండగా నహుషాత్మజు డైన యయాతి వేటాడుతూ వేటాడుతూ దప్పిగొని నీటికొఱకై దేవయాని పడియున్న నూతిదగ్గరకు వచ్చి నూతిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆమెను చూచి నీవెవరవు ఎవ్వరిదానవు అని అడుగుతాడు. అప్పుడామె అంతకు పూర్వం వేటకు వచ్చిన అతనిని చూచివున్నకారణంగా అతనిని గుర్తుపట్టి ఇలా అంటుంది.
తరలము.
అమర సన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి న య్యమరవీరుల చేత మర్దితు లైన దానవులన్ గత భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి య త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్.౧౪౨
వ.
దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్న దానను న న్నుద్ధరించి రక్షింపు మనిన నవ్విప్రకన్యకయందు దద్దయు దయాళుండై.౧౪౩

యయాతి ఆమెకు తన దక్షిణహస్తాన్ని చాచి ఆమెను బయటకు తీసి రక్షించి తన దారిని తాను వెళతాడు.

Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౦
దేవయాని కచుడు ఒకరినొకరు శపియించుకొనుట
కచుడు శుక్రాచార్యుల యొద్ద మృతసంజీవని విద్య నేర్చి శుక్రుడిని బ్రతికించిన తర్వాత చాలా కాలం గురుని సేవించి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళటానికి గురుని అనుమతి పొంది, దేవయానికి కూడా వీడ్కోలు పలకడానికి వస్తాడు. అప్పుడామె అతనితో--
ఉ.
నీవును బ్రహ్మచారివి వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్.౧౨౯

క.
ఆ కచుఁ డత్యంత విషా,దాకులుఁ డై లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె, నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్.౧౩౦
క.
గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థమ లోకధర్మపథ మిది దీనిం
బరికింపక యీపలుకులు, తరుణీ గురుపుత్రి నీకుఁ దగునే పలుకన్.౧౩౧
వ.
అనిన నాకచునకు దేవయాని కరం బలిగి నీవు నామనోరథంబు విఫలంబుగాఁ జేసినవాఁడవు నీకు సంజీవని పనిసేయ కుండెడుమని శాపం బిచ్చినఁ గచుం డేను ధర్మపథంబు దప్పనివాఁడను నీవచనంబున నాకు సంజీవని పనిసేయ దయ్యెనేని నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక మఱి నీవు ధర్మవిరోధంబు దలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్క్షణంబ.౧౩౨

క.
దేవగురునందనుం డమ, రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదీశించి సు, ధీవిభుఁ డొనరించు చుండె దేవహితంబుల్.133
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౯
యయాతి మహారాజు చరిత్రము
తే.
వర్ణధర్మముల్ గాచుచు వసుధయెల్ల, ననఘచరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్రి యైన, దేవయానిని దా నెట్లు దేవిఁ జేసె.౯౭
తే.
విపుల తేజంబునను దపోవీర్యమునను, జగదనుగ్రహనిగ్రహ శక్తియుక్తుఁ
డయినయట్టియయాతికి నలిగియేమి, కారణంబున శాపంబు కావ్యుఁడిచ్చె.౯౮

రాజైన యయాతి బ్రాహ్మణుడు గురుడు అయిన శుక్రాచార్యుని పుత్రిక నెలా పెళ్ళాడాడు.విపుల తేజస్కుడు తపోమహిమతో అనుగ్రహ నిగ్రహశక్తియుక్తుడైన యయాతికి ఏ కారణం వలన శుక్రుడు శాపమిచ్చాడు. అని అడిగాడు జనమేజయుడు వైశంపాయనుడిని.
వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు.
పూర్వం వృషపర్వుడనే దానవ పతికి శుక్రుడు ఆచార్యు డై దేవతలకు విరోధియైన ఆ దానవపతికి ప్రియాన్ని చేకూరుస్తుండే వాడు. దేవతలతో జరిగిన యుద్ధాలలో మరణించిన అందరు రాక్షసులను తన దగ్గర ఉన్న మృత సంజీవని అనే విద్య ద్వారా ఎప్పటికప్పుడు తిరిగి బ్రతికిస్తుండేవాడు. అలా చేయటం వలన రాక్షస సైన్యాన్ని జయించటం దేవతలకు అసాధ్యంగా ఉండేది. ఈ కారణం చేత దేవతలు అందరూ ఆ మృతసంజీవని విద్యను శుక్రాచార్యుల దగ్గరనుండి నేర్చుకొని రావడానికని బృహస్పతి కుమారుడైన కచుడిని నియోగిస్తారు. శుక్రాచార్యునికి అతని కూతురు దేవయాని అంటే విరీతమైన ఫ్రేమ అనీ ఆమె అనుగ్రహం పొంది ఆమె ద్వారా ఆ విద్యను శుక్రాచార్యుని వద్ద నుండి నేర్చుకుని రావలసిందని అతనిని పంపుతారు.
కచుడు శుక్రుని వద్దకు వెళ్ళి తనను బృహస్పతి కుమారునిగా పరిచయం చేసుకొని తనని శిష్యునిగా స్వీకరించి చదువు చెప్పమని ప్రార్థిస్తాడు. అతని వినయనిధేయతలు వగైరాలతో సంతృప్తి చెందిన శుక్రుడు అతనిని సేవిస్తే బృహస్పతిని సేవించినట్లేనని తలచి అతణ్ణి శిష్యుడుగా అంగీకరిస్తాడు.
సీ.
పని యేమి పంచినఁ బదపడి చేసెద ననక తన్ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురుచిత్తవృత్తికిఁ గడు ననుకూలుఁ డై వినయంబుతోడ
మనమునఁ జెయ్వులమాటల భక్తి నేకాకారుఁ ఢై మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁ డై ప్రియహితభాషణములఁ బుష్ప ఫలవిశేష
ఆ.
దానములను సంతతప్రీతిఁ జేయుచు, నివ్విధమునఁ బెక్కు లేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర, నెమ్మి వడసెఁ దనదు నేర్పు పేర్మి.౧౧౦

గురువును సేవించుకోవాల్సిన విధం విపులంగా తెలియజేయబడిందిక్కడ.

కచుడిలా గురువుగారికి ప్రియ శిష్యుడుగావటం సహించలేని దానవులు అతనినెలాగైనా మట్టు పెట్టాలని ఓసారి అడవికి వెళ్ళినపుడు అతనిని అడవిలో చంపివేసి ఓ చెట్టుకు కట్టివేసి తిరిగి వస్తారు. అందరితో పాటుగా కచుడు తిరిగి రాకపోవటం చూచి దేవయాని తండ్రికి ఆ విషయం తెలియపరుస్తుంది. దివ్యదృష్టితో జరిగినది తెలిసికొన్న శుక్రుడు అతనిని తన మృతసంజీవని విద్య ద్వారా బ్రతికిస్తాడు. ఈసారి ఇలా కాదని దానవులు కచుడిని చంపి దహనం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రునికిస్తారు. శుక్రుడది త్రాగుతాడు. సాయంత్రం మళ్ళీ దేవయాని గొడవ పెడితే శుక్రుడు కచునికోసం దివ్యదృష్టితో వెదకి వెదకి చివరకు సురతో కలిసి తన పొట్టలో ఉండడాన్ని గ్రహిస్తాడు. అప్పుడు శుక్రాచార్యులు మద్యసేవను నిరసిస్తూ ఇలా కట్టడి చేస్తాడు.
ఆ.
మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్, పరఁగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణమాత్రన, చెఱుచు మద్య సేవ సేయ నగునె.౧౨౦
క.
భూసురు లాదిగఁ గలజను, లీసుర సేవించి రేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు, చేసితి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్.౧౨౧

అని శుక్రాచార్యులు సురాపానము మహాపాపమని శపించి, కచునకు కడుపులో ఉండగానే మృతసంజీవనిని ఉపదేశించి తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి తనని అదే విద్య ద్వారా తిరిగి బ్రతికించమంటాడు. కచుడు ఆవిధంగానే చేస్తాడు.