Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-3
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
అనఘుల శాస్త్రవిధిజ్ఞుల, ననురక్తులఁ బితృపితామహక్రమమున ప
చ్చినవిప్రుల మంత్రుల, గా, నొనరించితె కార్యసంప్రయోగము పొంటెన్.27

పాపరహితులను, శాస్త్రవిధిజ్ఞులను, అనురాగము గలవారిని పితృపితామహక్రమమున వచ్చిన విప్రులను మంత్రులుగా నియమించుకోవాలట.
క.
రాజునకు విజయమూలము, రాజితమంత్రంబు సుస్థిరంబున దానిన్
రాజాన్వయ రక్షించితె ధ, రాజనులకుఁ గర్ణ గోచరము గాకుండన్. 28

ప్రసిద్ధమగు రహస్యము (సీక్రెట్ సర్వీస్) రాజులవిజయానికి మూలమైనది.
దానిని ఎవ్వరికీ తెలియకుండగా రాజయినవాడు రక్షించుకోవాలి.
క.
ధీరుఁడు ధర్మాధర్మవి, శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీశ్రితవదనస,రోరుహుఁడనఁ జనునె నీ పురోహితుఁ డధిపా.29

ఇక్కడ పురోహితుని లక్షణాల్ని చెపుతున్నాడు. పురోహితునికి పై లక్షణాలన్నీ
ఉండాల్సిందే. అతడు ధీరుడై, ధర్మాధర్మ విశారదుడై, బహు శ్రుతులను
చదివినవాడై, సమచిత్తుడై, సరస్వతీ దేవి అతని ముఖాన్ని
ఆశ్రయించుకొనివున్నదైనవాడై ఉండాలట. నీ పురోహితు డటువంటివాడే కదా.
క.
జననుత నీయజ్ఞములం, దనవరతనియుక్తుఁ డయినయాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁ డై యేమఱ కుం,డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్.30

నీ యజ్ఞములను ఎల్లకాలము నిర్వహించడానికి నియుక్తుడైన యాజ్ఞికుఁడు
ప్రయోగాలు చేయుటలో సిద్ధహస్తుడై తన పనులను ఎప్పుడూ సమబుద్ధితో
చేస్తూ ఉన్నాడా.
క.
నానావిధరణవిజయమ, హానిపుణు లవార్యవీర్యు లనఁ దగువారిన్
సేనాధ్యక్షులఁ జేసితె, నీ నమ్మినవారి మాననీయుల హితులన్.31

నానా విధములయిన యుద్ధాలలో మహా నిపుణులై వారింపనలవికాని
వీరులనతగువారిని సేనాధ్యక్షులుగా చేసుకొన్నావా? వారు నీకు
నమ్మినవారు, మాననీయులు, హితులే కదా?
చ.
చ.
కడుఁ జనువాఁడు నై పురుషకారియు దక్షుఁడు నైనమంత్రి పెం
పడరఁగ రాజపుత్రుల మహాధనవంతులఁ జేసి వారితో
నొడఁబడి పక్ష మేర్పడఁగ నుండఁడుగా ధనమెట్టివారికిం
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్.32

ఇక్కడ గుణవంతుడైన మంత్రి లక్షణాన్ని వర్ణిస్తున్నాడు.