Unknown
శాంతి పర్వము-ప్రథమాశ్వాసము-1 బ్రహ్మాస్త్రదానమునకు అర్హుల గురించి ద్రోణుడు కర్ణునితో--

తే.
వ్రతసమన్వితభూసురవర్యుఁ డొండె, నిరుపమానతపఃపుణ్యనృపతి యొండెఁ
గాని యన్యులు బ్రహ్మాస్త్రదానమునకుబాత్రములు గారు నీకు నీఁ బాడిగాదు.19

వ్రతములను ఆచరించు బ్రాహ్మణుడుగాని, గొప్ప తపఃపుణ్యఫలము కలిగిన రాజు గాని , వీరిరువురు తక్క ఇతరులు బ్రహ్మాస్త్ర దానమునకు అర్హులు కారు.అందుచేత నీకు ఇవ్వటం న్యాయం కాదు. అందుచేత ద్రోణుడు కర్ణునకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పలేదు. కర్ణుడు తరువాత దానిని పరశురాముని దగ్గర పడసినా ఆయన ఇచ్చిన శాపం వలన అది అతనికి ఉపయోగపడలేదు.
నారదుడు ధర్మరాజాదులకు కర్ణుని చావునకు చెప్పిన కారణాలు:
చ.
వినుము నరేంద్ర విప్రుఁ డలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనము చేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁ డర్ధరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్ర రా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డటఁ జంపెఁ గర్ణునిన్.35

రాజా విను.కర్ణుని చావునకు ౭ కారణాలు ఉన్నాయి.
౧.బ్రాహ్మణ శాపము-కర్ణుడు పరశురాముని యొద్ద విద్యాభ్యాసము చేస్తున్నప్పుడు ఒక మహా ద్విజుని ఆవుదూడ కర్ణుని బాణం తగిలి చనిపోతుంది. దానితో అతడు కోపించి శాపమివ్వటం చేత యుద్ధంలో కర్ణుని రథచక్రాలు భూమిలో దిగబడి పోతాయి.
౨.పరశురాముని శాపము- బ్రహ్మాస్త్రం కోసమని కర్ణుడు పరశురామునితో తాను బ్రాహ్మణుడనని అబద్ధమాడి విద్యాభ్యాసం చేస్తుండగా- గ్రస్తుడు అనే రాక్షసుడు కీటకరూపంలో కర్ణుని తొడ క్రిందిభాగాన్ని తొలుస్తుండగా గురునిద్రాభంగానికి వెరచి కర్ణుడు తన తొడమీద తల పెట్టుకుని నిద్రిస్తున్న గురువును నిద్ర లేపడు. తరువాత విషయాన్ని గ్రహించిన భార్గవుడు కర్ణుడు బ్రాహ్మణుడు కాదని అతని ముఖతః తెలుసుకొని నేర్చుకున్న విద్య సమయానికి అతనికి ఉపయోగపడదని శాపం ఇస్తాడు.
౩.ఇంద్రుని వంచన- ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడు.
౪. కుంతి వరమనికోరి కర్ణునకు తన జన్మ వృత్తాంతం చెప్పి అర్జునిని మీది కోపాన్ని తగ్గేలా చేసింది.
౫. భీష్ముడు కర్ణుని అర్థ రథుడని ప్రకటించి అతనిని కించపరచాడు.
౬. శల్యుడు అనుచితమైనమాటలాడి సారధ్యం చేస్తున్నపుడు కర్ణుడిని బలహీన పరుస్తాడు.
౭. శౌరియే విధి అయ్యాడు.
ఈ పై కారణాలన్నింటి వలన అర్జునుడు కర్ణుని చంపగలిగాడు.

ధర్మరాజు స్త్రీలకు రహస్యరక్షణంబు లేకుండా శాపమిచ్చుట

కుంతీ దేవి కర్ణుని జన్మవృత్తాంతమును చివరివరకూ దాచిపెట్టడం వలన కలిగిన అనర్ధాన్ని తలపోసి ధర్మరాజు ---
తే.
అంగనాజనమ్ములకు రహస్యరక్ష, ణంబునందలిశక్తి మనంబులందుఁ
గలుగ కుండెడు మెల్లలోకముల నని శపించె నాధర్మ దేవతా ప్రియసుతుండు.41

స్త్రీలకు రహస్యాన్ని మనసులో దాచిపెట్ట గలిగిన శక్తి ఇదిమొదలుగా కలుగకుండా ఉండుగాక అని ధర్మదేవత ప్రియపుత్రుడైన ధర్మరాజు అన్ని లోకములవారికి శాపమిస్తాడు. అప్పటి నుండే 'ఆడవారి నోటిలో నువ్వుగింజ నానదు/దాగదు' అనే సామెత వాడుకలో కొచ్చిందనుకుంటాను.