Unknown
సభా పర్వము-ప్రథమాశ్వాసము-౭
నారదుఁడు ధర్మరాజును రాజనీతివిషయములం గొన్నిటి నడుగుట
క.
చోరభయవర్జితముగా, ధారుణిఁ బాలింతె యధికధనలోభమునం
జోరుల రక్షింపరుగా, వారలచే ధనము గొని భవధ్భృత్యవరుల్.౪౨

దొంగలవలని భయం లేకుండా ప్రజలను పరిపాలిస్తున్నావా? నీ భృత్యులు చోరులనుండి ధనాన్ని గ్రహించి వారిని రక్షించటం లేదుగదా!
క.
ధరణీనాధ భవద్భుజ, పరిపాలిత యైన వసుధఁ బరిపూర్ణము లై
కర మొప్పుచున్నె చెఱువులు, ధరణి కవగ్రహభయంబు దనుకకయుండన్.౪౩
అవగ్రహ=వానలేమివలని
తనుకక
=కలుగక
రాజా! నీరాజ్యంలో చెఱువులన్నీ నీటితో నిండి ఉన్నాయా! వానలేమి భయం లేకుండా అంతా సుభిక్షంగా ఉన్నారుగదా.
చూడండి చెఱువుల ప్రాముఖ్యత. ఈ రోజుల్లో ఎన్నో ఎన్నెన్నో చెఱువులు కబ్జా అయిపోయి , లేక పూడిపోయి ఉండి వ్యవసాయానికేమాత్రం ఉపయోగపడకుండా ఉంటున్నాయి.
క.
హీను లగు కర్షకులకును, భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న,నూనముగా ఋణము లిత్తె యుత్తమబుద్ధిన్.౪౪

పేదవారైన రైతులకు ధాన్యాన్ని,విత్తనాల్ని అలాగే వర్తకులకు అనూనముగా ఉత్తమ బుద్ధితో ఋణములను ఇస్తున్నావు కదా.
క.
పంగుల మూకాంధుల విక,లాంగులను నబాంధవుల దయం బ్రోతె భయా
ర్తుం గడిఁదశత్రునైనను, సంగరరంగమునఁ గాతె శరణంబనినన్.౪౫

కుంటి,మూగ,అంధ వికలాంగులను, బంధువులెవ్వరూ లేనివారిని దయతో బ్రోచుచున్నావు గదా ! ఆపద కలిగించిన శత్రువునైనా సరే శరణు వేడితే రక్షిస్తున్నావుగదా!
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౨
పాండవ ధార్తరాష్ట్రుల భేదకారణ సంగ్రహము
సీ.
వదలక కురుపతి వారణావతమున లక్కయిల్ గావించి యక్కజముగ
నందఱఁజొన్పి యం దనలంబు దరికొల్పఁ బనిచిన బాండునందను లెఱింగి
విదురోపదిష్ట భూవివరంబునం దపక్రాంతులై బ్రదికి నిశ్చింతులైరి
ధర్మువు నుచితంబుఁ దప్పని వారల సదమలాచారుల నుదితసత్య
ఆ.వె.
రతుల నఖిలలోకహిత మహారంభుల, భూరిగుణుల నిర్జితారివర్గు
లై వెలుంగువారి దైవంబ రక్షించు, దురితవిధుల నెపుడుఁ బొరయ కుండ
.౧౪
పాండవులు ఎలాంటివారో వారిని దైవం ఎందులకు కాపాడుతుందో పై పద్యం చివరి మూడు పాదాలలోను వ్యాస మహర్షి వివరించటం జరిగింది.
శా.
నారాయణ పాండవేయగుణమాహాత్మ్యామల జ్యోత్స్నఁ జి
త్తానందం బొనరించుచున్ జనుల కర్థాంశుప్రకాశంబుతో
మానై సాత్యవతేయ ధీవనధి జన్మ శ్రీమహాభారతా
ఖ్యానాక్యామృతసూతి యొప్పు నిఖిలాఘధ్వాంత విధ్వంసి యై.౨౧
ధీవనధి=బుద్ధియనెడి సముద్రమునుండి
అమృతసూతి=చంద్రుడు
అఘధ్వాంత=పాపమనెడి చీఁకటి
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-1
భారత మహిమము

వ.
ఆ వైశంపాయనుండును నఖిలలోకవంద్యుండయిన కృష్ణద్వైపాయనమునీంద్రునకు నమస్కారముసేసి విద్వజ్జనంబుల యనుగ్రహంబు వడసి.

సీ.
కమనీయధర్మార్ధ కామమోక్షములకు నత్యంత సాధనంబయిన దాని
వేడ్కతోఁ దవిలి తన్ వినుచున్న వారల కభిమత శుభకరం బయిన దాని
రాజులకఖిల భూరాజ్యాభివృద్ధినిత్యాభ్యుదయ ప్రదం బయిన దాని
వాఙ్మనఃకాయప్రవర్తితానేక జన్మాఘనిబర్హణం బయిన దాని
ఆ.వె.
సత్యవాక్ప్రబంధ శత సహస్రశ్లోక, సంఖ్య మయిన దాని సర్వలోక
పూజ్య మయినదాని బుధనుత వ్యాస మ,హాముని ప్రణీత మయినదాని.౯
తవిలి= ఆసక్తి కలిగి
అఘనివర్తకంబు=పాపనివర్తకము

ధర్మార్థ కామమోక్షాలకి సాధనం, వినేవారికి శుభాల్నిచ్చేది, రాజులకు భూరాజ్యాభివృద్ధినిచ్చేది, వాక్ మనఃక్కాయములచే చేయబడిన అనేక పాపాల్ని నివర్తింప జేయగలిగేది, లక్షశ్లోకాత్మకమైనది, సకల లోకాలలో పూజింపబడేది, వ్యాస ప్రణీతమయినదీ ఈ మహాభారతము.
శా.
ఆయుష్యం బితిహాస వస్తు సముదాయం బై హికాముష్మిక
శ్రేయః ప్రాప్తి నిమిత్త ముత్తమ సభాసేవ్యంబు లోకాగమ
న్యాయైకాంత గృహంబు నాఁ బరఁగి నానావేద వేదాంత వి
ద్యాయుక్తం బగుదానిఁ జెప్పఁ దొడఁగెం దద్భార తాఖ్యానమున్.౧౧
ఇతిహాసము=పూర్వకథలనెడి
ఆఖ్యానమున్=కథను
ఆయుస్సును పెంపొందించగలిగేది, పూర్వకథల సముదాయంతో కూడి ఐహికాముష్మిక శ్రేయాల్ని కలుగజేయటానికి కారణమైనది, ఉత్తమ సభా సేవ్యమయినది, ఆగమశాస్త్రాలకు గృహము వంటిదిగా ప్రసిద్ధినొంది - అన్ని వేదవేదాంతవిద్యల కాటపట్టయినట్టి మహాభారత కథను చెప్పడం మొదలుపెట్టాడు.