Unknown
అరణ్య పర్వము- ప్రథమాశ్వాసము-9
భీమసేన ధర్మరాజుల సంవాదము
ఆ.
బాహుబలము మెఱసి పరులసంపదలు సే, కొనఁగ లావు లేనికుత్సితుండు
నియత దుఃఖవృత్తి నిర్వేదపరుఁడగుఁ, గాక నీకుఁ దగునె? కౌరవేంద్ర.౨౪౧
తే.
తగిలి నిత్యంబు నేకాంతధర్మ నిరతుఁ, డగుట యుక్తమె పురుషున కట్టివాని
వెలయ ధర్మకామంబులు విడుచుఁ బ్రాణ,విగతుసుఖదుఃఖములు రెండు విడుచునట్లు.౨౪౪
ధర్మ కామములు అని కాక అర్ధ కామములు అని వుండాలేమో అని ఓ చిన్న సందేహం.
సీ.
ధర్మ కామంబులు దఁఱుగంగ నర్థార్థి యగువాఁడు పతితుఁ డౌ నర్థ సేవ
నర్థార్థముగఁ జేయునతఁ డుగ్రవనములో గోరక్ష సేయునక్కుమతిఁ బోలు
నర్థధర్మములకు హానిగాఁ గామార్థి యగునాతఁ డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు నట్లు కామంబుతో హాని బొందు
ఆ.
నర్థధర్మములు మహాబ్ధిమేఘములట్టు, లుభయమును బరస్పరోదయమ్ము
లిట్లు గాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే, వించువాఁడు సర్వ విత్తముండు.౨౪౫
వ.
భవదాచరితం బైన యీధర్మం బర్థకామంబులక కాదు నీకును నీ బాంధవులకును బాధాకరంబు దాన యజ్ఞ సత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు జగంబులు ధర్మమయంబులు ధర్మువునకు మిక్కిలి యొం డెద్దియు లే దయినను నర్థార్థంబు గానిధర్మువు క్షత్రియుల కయుక్తంబు.౨౪౬
ఉ.
శత్రుల నాజి నోర్చుటయు సర్వ భయంబులఁ బొంద కుండఁగా
ధాత్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాచుటయుం బ్రియంబుతోఁ
బాత్రుల కర్థ మీగియును బ్రాహ్మణపూజయుఁ జువ్వె యుత్తమ
క్షత్రియధర్మముల్ సుగతికారణముల్ విపులార్థమూలముల్.౨౪౭