Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-8
పాండవులు వారణావతంబునకు పోవుట
ఆ.
ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147

ఈ మాటల్ని ధర్మరాజు కుంతీదేవితో అంటాడు. ఆ సందర్భం యేమిటంటే....

ధృతరాష్ట్రుఁడు ధర్మరాజును యువరాజుగా చేసిన తర్వాత ఒకరోజు దుర్యోధనుడు (కణికనీతిని వినిన తరువాత) తండ్రితో-- వీరులైన వారని నేను పాండవులంటే భయపడుతూ ఉంటాను. దానికి తోడు నీవు ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా చేసావు. పైగా ప్రజలందరూ కూడా ధర్మరాజు గుణగణాలచే ఆకర్షితులైనవారై ఆతడే రాజు కావాలని ఆకాంక్షిస్తారు. అలా అతడు రాజైతే ఆతరువాత రాజ్యం వారివారి కుమారులకే చెదుతుంది. మాకు రాజ్యం దక్కదు. కావున నీవేదో ఒక ఉపాయం పన్ని పాండవులను ఈ చోటనుండి దూరంగా వెళ్ళేలా చెయ్యి అంటాడు. వారిని దూరంగా వారణావత నగరానికి పంపిస్తే మంచిదంటాడు. దానికి భీష్మ ద్రోణ విదుర అశ్వత్థామ కృపాచార్యులు మొదలగువారు ఒప్పుకోరేమో అని ధృతరాష్ట్రు డంటే వారందరూ ఒప్పుకుంటారు ఎలా అంటే అశ్వత్థామ నా కిష్టుడు నాతోనే ఉంటాడు , ద్రోణుడు కొడుకును వదలలేడు, బావ ద్రోణుడిని తన చెల్లెలిని విడువలేక కృపాచార్యులును నావద్దే ఉంటారు. భీష్ముడు మధ్యస్థుడు, పాండవులతో వెళ్లడు, మనతోనే ఉంటాడు. విదురుడొక్కడూ ఏమీ చేయలేడు. అందుచేత పాండవులను వారణావతానికి పంపించమంటాడు. అందరూ వారణావతాన్ని గురించి బాగా పొగడేలా చేస్తాడు. దానితో పాండవులు కూడా దాని గురించి కుతూహులాన్వితు లవుతుంటారు. అలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి మీరు కుంతితోను మీ పరివారంతోనూ కలసి కొంతకాలం వారణావతంలో నివసించి తిరిగొస్తే బాగుంటుందని అక్కడకు వెళ్ళమని కోరతాడు. వారు దానికి ఒప్పుకుంటారు.

దుర్యోధనుడు విరోచనుడనే వాడిని ఒక లాక్షాగృహం పాండవులకొరకు వారణావతంలో నిర్మించమని పంపిస్తాడు. ఆ గృహంలో పాండవులు నిదురిస్తుండగా వారిని ఆ యింటితో సహా బూడిద చెయ్యాలనేది అతని సంకల్పం. విరోచనుడు అలాగే లాక్షాగృహాన్ని నిర్మిస్తాడు.

పాండవులు వారణావత గమనోన్ముఖులై నపుడు ప్రజలు ఇలా ప్రవర్తించారట.
సీ.
ఇప్పాండుపుత్త్రుల నేలొకో ధృతరాష్ట్రుఁ డేకత మనుపంగ నిచ్చగించె
నిది యధర్మం బని యెఱిఁగి గాంగేయాదు లేల వారింపరో యెఱుఁగరొక్కొ
పితృపితామహూలచే భృతపూర్వమైక్రమాగత మైన రాజ్యంబుఁ గరము నెమ్మి
బాండుసుతజ్యేష్ఠు భరతకులశ్రేష్ఠు ధర్మజుఁ బూన్పక ధర్ము వుడిపి
ఆ.
యేల వృద్ధరాజు లెడసేసిరో పార్థు, నరిగినెడక మనము నరిగి యతని
యున్న చోన ప్రీతి నుండుద మిందుండ, నేల యనుచుఁ బౌరు లెల్లఁ దెరలి. 143

అలా ఆరోజుల్లో మంచివాడైన రాజుని అనుసరించి పోవటానికి ప్రజలు ఉత్సాహపడుతుండేవారు.
వ.
తనపిఱుందన వచ్చువారిం బ్రియపూర్వకంబున నూరార్చి పితృవచనంబు సేయకునికి ధర్మవిరుద్ధంబు గావున వారణావతంబునకుం బోయి వచ్చెద మని యందఱం గ్రమ్మఱించి చనుచున్న ధర్మనందను పిఱుంద నొక్కింతనేల యరిగి విదురుం డొరులు వినియును నెఱుంగ రానివచనంబుల బహుప్రకారవచన రచనావిశారదుండైన యుధిష్ఠిరున కెల్ల కార్యంబులు గఱపి కొడుకులం గౌఁగిలించుకొని కుంతీదేవికి మ్రొక్కి పాండురాజుం దలంచి బాష్పపూరితనయనుం డై క్రమ్మఱి చనియె నిట కుంతియు ధర్మరాజు డాయ వచ్చి యిట్లనియె. 144
తే.
విదురుఁడేతెంచి యొరులకువినియు నెఱుఁగ,గానియట్లుండఁ బలికినిన్ గఱపెబుద్ధి
నట్ల చేయుదు నంటి వీ వతనిమతము, సెప్పనగునేని యెఱుఁగంగఁ జెప్పుమయ్య.145

విదురుడు ఇతరులు వినినా వారికర్థం కాని రీతిలో నీకేమిటో చెప్పాడు. నీవూ అలానే చేస్తానని అన్నావు. చెప్పేవిషయమైతే అదేదో చెప్పమని కుంతి ధర్మరాజుని అడిగింది.
వ.
అనిన నగుచు ధర్మతనయుండు విదురువచనంబుల యభిప్రాయంబులు దల్లి కి ట్లని చెప్పె.146

ఎల్ల కార్యగతులు నెఱుఁగుదు రయినను, నెఱుఁగఁ జెప్పవలయు నెఱిఁగనంత
పనియు లేక మిమ్ముఁ బాపినకురుపతి, హితుఁడపోలె మీఁద నెగ్గుసేయు
. 147
వ.
కావున మీర లేమఱక విషాగ్నులవలన నప్రమాదులరై యెఱుక గలిగి యుండునది యని బుద్ధి కఱపి మఱియు దుర్యోధనుచేసెడు దుష్క్రియలిమ్ముగా నెఱింగి వానికిం బ్రతీకారంబు సెప్పి పుత్తెంచద ననియె నని చెప్పిన విని విదురు బుద్ధికి దమవలని నెయ్యంబునకు సంతసిల్లుచుఁ బాండవులు కతిపయి ప్రయాణంబుల వారణావతంబున కరుగునంత. 148