Unknown
ఆదిపర్వము-అష్టమాశ్వాసము-1
ఆ.
కీర్తిలేనివానికిని జీవనంబు ని,రర్థకంబుచూవె యవనిమీఁద
నిత్యమయినధనము నిర్మల కీర్తియ, యట్టి కీర్తి వడయుట శ్రమంబె
31

పాండవులకు ద్రుపదుని తోడి చుట్టరికం వలన బలం పెరిగింది. ఇటువంటి సమయంలో వారిని నిర్జించటం ఎలాగ అని ఆలోచించిన దుష్టచతుష్టయం ధృతరాష్ట్రునితో మంతనం చేసి పాండవుల మీదికి దండెత్తుదామని నిర్ణయిస్తారు. ధృతరాష్ట్రుడు అందరితో ఆలోచించి చేద్దామని అందరినీ పిలిపించి అడుగుతాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో నా వరకూ నాకు కౌరవపాండవులిరువురూ సమానులే.పితృపైతామహంబయిన రాజ్యం నీకెట్లో వారికీ అట్లే . అందుచేత వారి అర్థరాజ్యం వారికివ్వటం మంచిది. అలా చేస్తే నీకు కీర్తి కలుగుతుంది అంటూ పై విధంగా అంటాడు. కీర్తిలేనివాని జన్మ వ్యర్థము. భూమి మీద నిత్యమయినది కీర్తి మాత్రమే. అటువంటి నిర్మలమైన కీర్తిని పొందుట తేలిక కాదు.
క.
ఇలఁ గీర్తి యెంతకాలము, గలిగి ప్రవర్తిల్లె నంత కాలంబును ని
త్యుల కారె కీర్తిగల పు,ణ్యులు కీర్తివిహీనుఁ డెందునుం బూజ్యుండే. 32

ఈ భూమి మీద కీర్తి యెంతకాలము కలిగి ప్రవర్తించితే అంత కాలము నిత్యులై వుంటారు. కీర్తి విహీనుడెక్కడా పూజనీయుడు కాడు.
వ.
కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గనరక నిమిత్తంబులు గావున నపకీర్తి పరిహరించి పైతృకం బగు రాజ్యంబు పాండవుల కిచ్చి వారితోడ బద్ధ ప్రణయుండ వయి కీర్తి నిలుపుమనిన భీష్ము పలుకులకు సంతసించి 33

ద్రోణాదులందరూ వారినే బలపరచగా ధృతరాష్ట్రుడు వారికి అర్ధరాజ్యం ఇచ్చెదనని చెప్పి పాండవులను సగౌరవంగా ద్రుపదుని పురం నుండి హస్తినాపురానికి పిలిపిస్తాడు.
Unknown
ఆది పర్వము సప్తమాశ్వాసము

వశిష్ఠు వలనఁ కల్మాషపాదుండు శాపవిముక్తిఁ జెందుట
చ.
గుణముల నొప్పి బ్రాహ్మణులకుం గడు భక్తుండ వై సమస్త ధా
రుణి ప్రజ గూర్పఁగా విగతరోషుఁడ వై సుఖముండు మింక బ్రా
హ్మణుల కవజ్ఞ సేయక శమత్వము చేకొను మింద్రుఁడైన బ్రా
హ్మణుల కవజ్ఞ సేసి యవమానముఁ బొందుఁ ప్రతాపహీనుఁడై. 129

కల్మాషపాదుడు వశిష్ఠుని వలన శాపవిముక్తిని పొందిన తరువాత వానితో వశిష్ఠుడు పై విధంగా అంటాడు.

గుణములతో ప్రకాశిస్తూ బ్రహ్మణులకు భక్తుడవై సమస్త ధారుణి ప్రజలను పాలిస్తూ రోషాన్ని విడిచిపెట్టి ఇకనుంచి సుఖంగా ఉండు. బ్రాహ్మణులకు అవజ్ఞ సేయక శమత్వాన్ని పొందు. ఇంద్రుడి వంటి గొప్పవాడైనా బ్రాహ్మణులకు అవజ్ఞ చేసినచో్ ప్రతాపహీనుడై అవమానాన్ని పొందుతాడు.

మారు వేషంలో నున్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని దక్కించుకుంటాడు. అప్పుడు కర్ణుడు అర్జునునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. అలాగే శల్యుడు కూడా మారువేషంలో నున్నభీముని చేతిలో ఓడిపోతాడు. ఆ సందర్భం లోనివి ఈ పద్యాలు.
క.
నా యెదురఁ జక్క నై యని, సేయఁగ భార్గవునకును శచీవరునకుఁ గౌం
తేయుఁ డగు విజయునకుఁ గా, కాయతభుజశక్తి నొరుల కలవియె ధరణిన్.200

ఆ.
పరశురాముఁడొండె హరుడొండె నరుఁడొండె, గాకయొరులు గలరె కర్ణునోర్వ
బలిమి భీముఁడొండె బలదేవుఁడొండె గా, కొరులు నరులు శల్యునోర్వఁ గలరె. 205

తరువాత అర్జునుడు ద్రౌపదిని తెచ్చి తల్లికి భిక్షను తెచ్చామని నివేదించగా ద్రౌపదిని చూడకుండానే ఆమె మీరయిదుగురూ ఉపయోగించండని పలికింది. కుంతీదేవి మాట ప్రకారం పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడాలని తలుస్తారు. పాండవులు తమ స్వస్వరూపాల్ని తెలియజేసి ఆ విషయం ద్రుపదునికి తెలియ పరచగా అతడిలా అంటాడు.
క.
ఒక్క పురుషునకు భార్యలు, పెక్కం డ్రగు టెందుఁ గలదు పెక్కండ్రకు నా
లొక్కత యగు టేయుగముల, నెక్కథలను వినియు నెఱుఁగ మెవ్వరివలనన్. 244

ఒక పురుషునికి పెక్కుమంది భార్యలు ఉండటం సహజం కాని పెక్కండ్రకు ఒక్క కన్య భార్యగా వుండటం ఎక్కడా కనీ వినీ యెఱుగం అంటాడు.
అప్పుడు వ్యాసులవారక్కడికి వేంచేసి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతమంతా ద్రుపదునికి తెలియజేసి పాండవుల నైదుగురినీ ద్రౌపది పెళ్ళి చేసుకోవచ్చని చెప్తాడు. అప్పుడు ద్రుపదునితో వ్యాసులవారి సమక్షంలో ధర్మరాజిలా అంటాడు.
చ.
నగియును బొంకునందు వచనంబు నధర్మువునందుఁ జి త్తముం
దగులదు నాకు నెన్నఁడును ధర్ము వవశ్యము నట్ల కావునన్
వగవక మాకు నేవురకు వారిజలోచనఁ గృష్ణ నీఁ దగుం
దగ దను నీవిచారములు దక్కి వివాహమొనర్పు మొప్పుగాన్. 252
వ.
మఱియుం దొల్లి గౌతముం డయిన జటిలుఁ డను ఋషికూఁతురు తపఃప్రభావంబున నేడ్వురు ఋషులకు నొక్కతియ భార్య యయ్యె ననియును దాక్షాయణి యను ముని కన్యక యేక నామంబునఁ బ్రచేతసు లనంబరఁగిన పదుండ్రకు నొక్కతియ భార్య యయ్యె ననియును గథల వినంబడు అని అంటాడు. తరువాత వ్యాసుల వారి అనుమతితో పాండవులయిదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.
నగియును=పరిహాసమునకు
శ్రీమదాంధ్రమహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసం సమాప్తం.
Unknown
వశిష్ఠ విశ్వామిత్రుల వివాదము
ఆ.
పరులవలన బాధ వొరయ కుండఁగ సాధు, జనులధనము గాచు జనవిభుండు
కరుణ దప్పి తాన హరియించువాఁ డగు, నేని సాధులోక మేమి సేయు. 104

పూర్వం కన్యాకుబ్జాన్ని గాధిపుత్త్రుడైన విశ్వామిత్రు డనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడోసారి తన పరివారంతో సహా వేటకు వెళ్ళి అలసినవాడై వశిష్ఠాశ్రమానికి రాగా వశిష్ఠులవారు అతనికీ పరివారానికీ తన దగ్గఱనున్న నందిని అనే ధేనువు సహాయంతో షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేస్తాడు. విశ్వామిత్రుడు తాను ఆదేశపు రాజు కాబట్టి తనకా గోవు నిమ్మని అడిగి వశిష్ఠునిచే నిరాకరించబడతాడు. అప్పుడు తాను బలవంతంగా నైనా ఆ గోవును తనతో తీసుకెళ్ళగలనని పలికి విశ్వామిత్రుడు బలవంతంగా గోవును తనతో తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఆ సందర్భంలో చెప్పబడినది పై పద్యం.

రాజు సాధుజనుల ధనాన్ని రక్షించటం తన ధర్మంగా కలవాడు. అట్టి రాజు తానే కరుణ లేకుండా సాధుజనుల ధనాన్ని అపహరింప తలిస్తే సాధుజనులు పాపం ఏమి చేయగలుగుతారు అని భావం.

ఆ.
ఎట్టిరాజులును మహీసురో త్తము లెదు, రరగు దెంచునప్పు డధిక భక్తి
నెరఁగి ప్రియము వలికి తెరు విత్తు రిట్టిద, ధర్ము వీవు దీనిఁ దలఁప వెట్టు. 112

ఇక్ష్వాకుకుల సంభవుడైన కల్మాషపాదు డనే రాజు వేటకు పోయి అలసినవాడై వశిష్ఠాశ్రమమునకు వస్తూ వుంటాడు. దారిలో అతని కెదురుగా వశిష్ఠపుత్త్రు డైన శక్తి మహాముని వస్తూంటాడు. రాజు ననే అహంభావంతో కల్మాషపాదుడు ఆ మహా మునికి దారి ఇవ్వకపోగా తనకు దారి ఇవ్వలేదని అహంకారంతో తెరువు తొలగమని అంటాడు. అప్పుడు శక్తి మహాముని అతనితో పై విధంగా అంటాడు.

ఎటువంటి గొప్పరాజులైనా మహీసురోత్తములు (సద్బ్రాహ్మణులు) ఎదురుగా వచ్చుచున్నప్పుడు అధికమైన భక్తితో ఎరిగి వారికి ప్రియము పలికి దారి ఇస్తారు. ఇదే ధర్మం, కాని నీవు దీనిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు ? అని అడిగాడు. ఇటువంటి సూక్తులు భారతం నిండా కోకొల్లలుగా ఉన్నాయి. ఏరుకోవటమే మన కర్తవ్యం.
Unknown
ద్రౌపదీ స్వయంవరం
ఉ.
మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్క యింట ను
గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా
నానరనాయకుండు విని యాతతశోకమహానలజ్వల
న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రి పురోహిత విప్రసన్నిధిన్. 22

పాండవులు కుంతీ సహితముగా లక్కయింటిలో అగ్నికి ఆహుతి అయ్యారని బ్రాహ్మణులు చెప్పగా విని ద్రుపదమహారాజు మిక్కిలి దుఃఖాన్ని పొందాడట. అర్జునునకు ద్రౌపది నిచ్చి వివాహం చేద్దామనుకున్నాను, ఇప్పుడెలాగ అని దుఃఖ పరవశుడై ఉన్న ద్రుపదునకు అతని పురోహితుడు నేను నుపశ్రుతిలో(ఓ రకమైన అంజనం లాంటిది) చూచాను, పాండవులు క్షేమంగానే ఉన్నారు. ద్రౌపదికి నీవు స్వయంవరం చాటించు, పాండవులు ఎక్కడవున్నా అప్పటికి తప్పక తిరిగి వస్తారు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పాడు. అలాగే ద్రుపదుడు మత్స్యయంత్రాన్ని నిర్మింపజేసి దానిని ఛేదించినవానికి ద్రౌపది భార్య కాగలదని స్వయంవరం ప్రకటిస్తాడు. ఈలోగా పాండవులు ఏకచక్రపురాన్నుండి బయలుదేరి ద్రుపదుని పురానికి వస్తుండగా వారికి వ్యాసుల వారి దర్శనం లభిస్తుంది. వారిని చూచిన వ్యాసుడు వారితో ఇలా అన్నాడట.
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35
సీ.
తా నొక్క మునికన్య దనకర్మవశమునఁ బతి బడయంగ నోపక యుపేత
దౌర్భాగ్యయై ఘోరతప మొనరించిన దానికి శివుఁడు ప్రత్యక్షమయ్యు
వేఁడుము వర మన్న వేడ్కతోఁ బతిదాన మని యేనుమాఱు లయ్యబల వేఁడె
న ట్లేని నీకు దేహాంతరంబునఁ బతు లగుదు రేవురు పరమార్థ మనియు
ఆ.
హరుఁడు కరుణ నిచ్చె నది యిప్డు పాంచాల, పతికిఁ గృష్ణ యనఁగఁ బంకజాక్షి
యుద్భవిల్లి పెరుఁగుచున్నది తత్స్వయం, వరము సేయుచున్నవాఁడు వాఁడు.36
యుపేతదౌర్భాగ్య =దురదృష్టముతో కూడినది

ఓ మునికన్య తన కర్మవశాన్ని భర్తను బడయలేక పతి కొఱకై శివుని గూర్చి గొప్ప తపస్సు చేస్తుంది. శివుడామెకి ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా పతి దానమిమ్మని 5 సార్లు కోరుతుంది. తరువాతి జన్మలో నీకు 5గురు భర్తలు కలుగుతారని శివుడు అదృశ్యుడౌతాడు. ఆమె ఈ జన్మలో ద్రౌపదిగా పుట్టి పెరుగుతోంది. ఆమెకు తండ్రి స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరు ద్రుపదుని పురానికి వెళ్ళండి . మీకు శుభమౌతుంది. అని వ్యాసుడు తన దారిని తాను వెళ్తాడు.
పాండవులు ద్రుపదుని పురానికి వెళ్తూ దారిలో అంగారపర్ణుడనే గంధర్వుని అర్జునుడు ఓడిస్తాడు. ఆ గంధర్వుని నుండి హయములను గ్రహించి అతనికి తన అనలాస్త్రాన్ని ఇస్తాడు అర్జునుడు. ఆ గంధర్వుని అర్జునుడు నీవు మమ్ములను ఏల అదిరి పలికావని అడగ్గా అతడిలా అంటాడు.
ు.
ఇంతులగోష్ఠి నున్నయతఁ డెంతవివేకము గల్గెనేని న
త్యంతమదాభిభూతుఁ డగు ధర్మువు దప్పుఁ బ్రియం బెఱుంగఁ డే
నెంతవివేకి నయ్యును సహింపక యింతులయొద్దఁ బల్కితిన్
వింతయె కాముశక్తి యుడివింపఁగ శక్యమె యెట్టివారికిన్. 59

ఆడవారిగోష్ఠిలో ఉన్న మగవాడు ఎంత వివేకి యైనా సరే అత్యంత మదాన్ని కలిగినవాడవుతాడు. వాడికిక ఒళ్ళూ పై తెలియదు . ధర్మాన్ని తప్పుతాడు. ప్రియాన్ని తెలుసుకోలేడు. నా పరిస్థితీ అదే , కాముని శక్తి పోగొట్టడం ఎంతవారికీ సాధ్యం కాదు గదా, అంటాడు అంగారపర్ణుడు.
Unknown
ఆది పర్వము-సప్తమాశ్వాసము-1
క.
ధర్మసుతుఁ డున్నచోటను, ధర్మువునకు హాని గలదె ధారుణి నైనన్
ధర్మువ తాత్పర్యముగా, నిర్మలమతి నెగడునది వినీతాత్ముల రై. 35

ఈ వాక్యాన్ని వ్యాసులవారు పాండవులతో అన్నారు. పాండవులు ఏకచక్రపురాన్ని విడిచి పెట్టి ద్రుపదుని పురానికి వెళ్ళేదారిలో వారికి వ్యాసమహర్షుల వారి దర్శనం అవుతుంది. ఆ సందర్భంగా అన్నమాటలు ఇవి.
ద్రుపదునికి పుత్రకామేష్టి యజ్ఞం చేయగా అందు అగ్నిదేవుని వలన .
క.
జ్వాలాభీలాంగుఁడు కర, వాలబృహచ్చాపధరుఁడు వరవర్మ కిరీ
టాలంకారుఁడు వహ్నియ, పోలె రథారూఢుఁ డొక్కపుత్త్రుఁడు పుట్టెన్. 18
వ.
మఱియు. 19
తరలము.
కులపవిత్ర సితేతరోత్పలకోమలామలవర్ణి యు
త్పలసుగంధి లసన్మ హోత్పలపత్ర నేత్ర మదాలికుం
తులవిభాసిని దివ్య తేజముఁ దాల్చి యొక్క కుమారి త
జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్. 20
వ.
ఇట్లు పుట్టిన కొడుకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జన వినుతంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి సంతసిల్లి యాజునకు యథోక్త దక్షిణ లిచ్చి బ్రాహ్మణులం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేద పారగుం జేయించి యున్నంత నక్కన్య యిపుడు వివాహసమయ ప్రాప్త యయిన. 21
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-12
వ.
ఆ బ్రాహ్మణునికి గుంతి యిట్లనియె నయ్యా దీనికి సంతాపింప వలవ దీయాపద దలుగునట్టి యుపాయంబు గంటి నీకుం గొడు కొక్కరుండ వాఁడును గడుబాలుండు బలిగొనిపోవ నర్హుండు గాఁడు నా కేవురు గొడుకులు గలరు వారలలో నొక్కరుం డారక్కసునకు భవదర్థంబుగా బలి గొనిపోయెడు ననిన దాని విన నోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని యిట్లనియె. 272
మధ్యాక్కర.
అతిధియై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు
హితముగా రక్కసువాతఁ ద్రోవ నెట్లొడంబడుదు
మతి నవమానింపఁగా దనిన విప్రుమరణంబు దలఁచు
టతిపాతకము పాతకములలో బ్రహ్మహత్యయుఁ బెద్ద. 273

మీరు మాకు అతిథులు. అలా అతిథులై వచ్చినవారిని నా కొరకై రక్కసుబారికి అప్పగించటానికి నేనెలా ఒప్పుకుంటాను. పాపాలన్నిటిలోకి విప్రుమరణము, అందులోనూ బ్రహ్మణ హత్య మరీ మరీ పాపము . అని అంటూ మనం మొదట్లో అనుకున్న విషయాన్ని చెపుతాడు.
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274
వ.
మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యొరులచేతం జేయబడుటం జేసి నాకుం బాతకంబు లేదు దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడనోప ననినఁ గుంతి యిట్లనియె. 275
క.
ఏనును దీనిన తలంచి మ,హీనుత విప్రవధ యెద సహింపక మఱి నా
సూను సమర్పించితి మ, త్సూను వధింపంగ రక్కసునకు వశంబే. 276
క.
ఖలు నసుర నోర్వనోపెడు, బలయుతుఁగా నెఱిఁగి కొడుకుఁ బంచితిఁ గా కి
మ్ముల శతపుత్త్రులు గల ధ,న్యుల కైన ననిష్టుఁ డగుతనూజుఁడు గలఁడే. 277
వ.
ఈతని చేతన తొల్లియుఁ బెక్కెండ్రసురలు నిహతు లయిరి వీఁడు మహా బలవంతుండు మంత్రసిద్ధుండని భీముం బిలిచి యీబ్రాహ్మణునాపదం దలిగి నాకు మనఃప్రియంబు సేయు మనిన వల్లె యని భీముం డారక్కసుఁ జంపం బూనె.
తరువాతది బకాసురవధ కథ.
ఆది పర్వము షష్టాశ్వాసము సమాప్తము.
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
వ.
ఇట్లడిగినఁ గుంతీదేవికి నవ్విప్రుం డిట్లనియె. 266
సీ.
ఏ నేమి సెప్పుదు దీని నెవ్వరికిని మానుషంబునఁ దీర్పఁ రానిదాని
నయినను జెప్పెదఁ బ్రియహితవచన యీ ప్రోలికి నామడ నేల నల్ల
యమునానదీగహ్వరమున బకుం డనురక్కసుం డుండు వాఁ డక్కజముగ
నిందులకాఁపుల నందఱ దొల్లి యల్వరుస మ్రింగుచు నున్నఁ బరమసాధు
ఆ.
లగుధరామరేంద్రు లగణితజపహోమ, దానవిధులఁజేసి వానివలనఁ
గ్రమము వడసి యొక్క సమయంబుఁ జేసిరి, యొనర దాని తెఱఁగు వినుము తల్లి. 266
వ.
నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెండెనుపోతులం బూనిన శకటంబున నపరిమిత భక్ష్యపిశితమిశ్రాన్నం బునిచికొని పోయిన దానిని వానిని నయ్యెనుపోతులను భక్షించుచు. 268
పిశితమిశ్ర=మాంసముతోఁ గలిసిన
ఆ.
మనుజభక్షకుఁ డిదియ తనకు నప్పనముగా, నొరులవలనిబాధ వొరయకుండ
దీనిఁ గాచుచుండు నీనాఁటి రాజును, దలపఁ డసుర నోర్వ బలిమి లేమి. 269
ఉ.
పోలఁగ ధర్మ శీలుఁ డయి భూరిబలాధికుఁ డై న ధారుణీ
పాలకురక్ష మున్ వడసి భార్యను బుత్త్రుల నర్థయుక్తితో
నోలిన మేలుగాఁ బడసి యూళ్ళుల నున్నది యట్లు గానినా
డేల గృహస్థవృత్తి సుఖ మేగి వనంబున నున్కి కష్టమే. 270
క.
అరి యని విప్రులచేతను, ధరణీశులు పోఁకయును మొదలుగాఁ గొన రె
వ్వరు నిప్పాపుఁడు మానిసి, నరిగొనియెడు భక్షణార్థి యై విప్రులచేన్. 271
అరి=కప్పము
వ.
పెద్దకాలంబునకు నీయిలువరుస నేఁడు మాకు వచ్చె నిచ్చిఱుతవాని నారాక్షసునకు భక్ష్యంబుగాఁ బుచ్చనోప నేన పోయెద నని దుఃఖించి పలికిన బ్రాహ్మణునకుఁ గుంతి యిట్లనియె.272
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
క.
మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైనయాపద్విషయం
బున సంతాపింపగాఁ, జన దని యెఱిఁగియును దగునె సంతాపింపన్. 254

మనుష్యులకు ఏ విధంగా నైనా దాటరాని ఆపద వచ్చినపుడు, బాధపడి లాభం లేదని యెఱిగినపుడు, భాధపడటం ఎందుకు?
వ.
ఆ రక్కసునకు నే నశనం బయ్యెద మీరు వగవకుండుఁడు భార్యయందుఁ బడయంబడునపత్యంబు నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక. 255
ఆ.
పురుషుకంటె మున్నుపరలోక మే గిన, సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత, యయ్యు జగము చేతఁ బ్రయ్యఁబడదె.256

భర్తకంటె ముందు చనిపోయిన భార్య నోచినదే నోము, భర్త లేని స్త్రీ పరమ పతివ్రత యైనా లోకములో దూషింప బడుతుంది గదా.
ఆ.
పడిన యామిషంబు పక్షు లపేక్షించు, నట్లు పురుషహీన యయినయువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు, రిదియుఁ బాపమనక హీనమతులు. 257

క్రిందపడిన మాంసాన్ని పక్షులపేక్షించినట్లుగా భర్తలేని యువతిని చూచి పాపమని తలచకుండా అందరూ హీనమైన మతి కలవారై తేలికగా కావాలనుకుంటారు.
ఆ.
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార, సంగ్రహంబుసేఁత శాస్త్రమతము
పతివిముక్త యయినసతి కన్యపురుష సం,గ్రహముసేఁత లోకగర్హితంబు.258

భార్య చనిపోయినవాడు తిరిగి వివాహం చేసుకోవటం శాస్త్రాలంగీకరించాయి. కాని భర్తపోయిన స్త్రీకి పునర్వివాహం లోకంచే నిందింపబడుతుంది.
వ.
కావున నేను భవద్విహీన నయి యొక్కనిముషం బేనియు జీవింప నేర నేర్చితి నేనియు నిక్కుమారుల రక్షింపనేర నెట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్ధించు నట్లు కులాచార సదృశులు గానివా రిక్కన్యం బ్రార్ధించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు మత్పరోక్షంబునం బునర్దారపరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబులు నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది యనుచు మరణ వ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె.259
గుణాధానము=మంచిగుణములు కలిగి ఉండేట్లుగా చేయటం
కొలది=శక్యము
ఆ.
ఒలసి యెంతకాల ముండిన నేను మీ, దానఁ గాను యొరులధనమ నన్ను
నెన్నఁ డయిన నొరుల కిచ్చుచో నసురకు, భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ. 260

ఎంతకాలం నేను మీతో కలసివున్నా నేను పరాయి యింటికి వెళ్ళాల్సిన దాన్నేగాని మీ సొమ్మును కాదుగదా. అందుచేత నన్ను రాక్షసుని కాహారంగా పంపండి నేను వెడతాను అంటుంది కూతురు.
వ.
మీకు నాయందయ్యెడు ద్రౌహిత్రలాభంబునకంటె మీరిద్దఱు జీవించిన ననేక పుత్త్రపౌత్త్రలాభం బగు దానం జేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు.262
తే.
బాలుఁడొక్కండు కొండొకకోల చేతఁ
బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి
చులుక వత్తు మీరేడ్వఁగావలవ దనుచుఁ
గలయ నూరార్చెఁ దన తొక్కుఁ బలుకు లొప్ప. 263

ఓ చిన్న బాలుడు ఆ రక్కసుని నేను ఛంపేసి తిరిగి వస్తాను మీరెవ్వరూ ఏడవకండి అని చేతిలో ఓ పుల్లను పట్టుకొని వూపుతూ తన చిన్న చిన్నపలుకులతో వారిని ఓదార్చేడట.
వ.
వానియవ్యక్తవచనంబులు విని యందఱు నేడ్పుడిగిన నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి. 264
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-10
క.
ధృతి సెడి వేఁడెడువానిని, నతిథిని నభ్యాగతుని భయస్థుని శరణా
గతుఁ జంపఁగ నొడఁబడు దు,ర్మతి కిహముం బరముఁ గలదె మదిఁ బరికింపన్. 274

ఏకచక్రపురంలో బకాసురుని కాహారంగా కుంతి తనకుమారులలో ఒకరిని బ్రాహ్మణబాలునికి బదులుగా పంపిస్తానన్నపుడు ఆ గృహస్థు కుంతితో పై విధంగా అంటాడు. కథలోకి మనం వెళితే--

భీముడు కుంతితో ఇలా అంటాడు.
ఆ.
ఎఱిఁగి నాకుఁ జెప్పుఁడిదియేమి యెవ్వరి, వలన నింత య్యె వగవ నేల
యెంతకడిఁది యైన నిది యేను దీర్చి యీ, విప్రునకుఁ బ్రియంబు విస్తరింతు
. 246
వ.
అనిన గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె. 247
పరిదేవనంబు=రోదనము
క.
నలసారము సంసార మ, ఖిలదుఃఖావహము భయనికేతన మతిచం

చలము పరాధీనం బిం, దులజీవన మేల నమ్ముదురు తత్త్వవిదుల్.248
నలసారము=తృణమువంటి సారము గలది
ఈ జీవితం సారం లేనిది, దుఃఖాన్ని కలిగించేది, భయానికి స్థానం, చంచలమైనది, పరాధీనమైనది --తత్త్వవేత్తలయిన వారు దీనిని ఎలా నమ్ముతారు?
క.
ఆదిని సంయోగవియో, గాదిద్వంద్వములు దేహి యగువానికి సం
పాదిల్లక తక్కవు పూ, ర్వోదయకర్మమున నెట్టియోగికి నయినన్.
249
మొదటగా సంయోగవియోగాలనే ద్వంద్వాలు దేహికి తప్పవు. ఎటువంటి యోగికైనా సరే పూర్వజన్మకర్మలవల్ల ఇవి తప్పవు.
తరువోజ.
ఏనును బ్రజలును నీధర్మసతియు నేయుపాయంబున నిబ్బారిఁ గడవఁ
గానేర్తు మెయ్యది గర్జమిందుండఁగా దేగుదమయొండు గడ కని ముంద
రే నెంత సెప్పిన నెన్నండు వినద యిది యిట్టి దారుణ మిమ్మెయిఁ జేయఁ
గా నున్న విధి యేల కడవంగ నిచ్చుఁ గర్మవిపాకంబు గడవంగ లావె. 250

నేను నాపిల్లలు యీ నాభార్య యీ ఆపదనుంచి ఏ ఉపాయంతో గట్టెక్కగలం? ఇప్పుడేం చేయాలి ? మనం ఇక్కడుండొద్దు ఎక్కడికైనా వెళదామని నే ముందరే చెప్పాను, కాని యిది వినలేదు. ఇటువంటి దారుణం జరగాల్సి ఉండగా విధి ఎలా తప్పిస్తుంది? కర్మను తప్పించుకోవటం ఎవరి తరం !
సీ.
మంత్రయుక్తంబుగా మత్పరిణీత యై ధర్మచారిణి యగుదాని వినయ
వతిఁ బ్రజావతి ననువ్రత నెట్టు లసురకు భక్ష్యంబ వగు మని పనుప నేర్తు
ధర్మాభివృద్ధిగాఁదగు వడువునకు నీ నిల్లడ బ్రహ్మచే నిడఁగఁబడిన
యిక్కన్య యతిబాల యిం దుద్భవం బగు దౌహిత్రలాభంబు దలఁగ నెట్లు
ఆ.
దీనిఁ బుత్తు మఱి మదీయపిండోదక, నిధిఁ దనూజుఁ గులము నిస్తరించు
వానిఁ బితృగణంబువలని ఋణంబుఁ బా,చినమహోపకారిఁ జిఱుతవాని. 251
మంత్రయుక్తముగా నన్ను పెళ్ళాడి నాకు సహధర్మచారిణి యై వినయశీలి, పుత్త్రవతి, అనువ్రత అయిన ఈమెను ఆ రాక్షసుని కాహారంగా ఎలా పంపను? ధర్మాభివృద్ధి కాగా నీ వడువునకు బ్రహ్మచే భార్యగా నీబడిన యీ కన్యను మనుమలనిచ్చే దానిని అతి బాలను ఎలా పంపించను ? నాకు తిలోదకదానాలు వదలాల్సిన వాడు కులదీపకుడు అయిన చిన్నకుఱ్ఱవానిని ఎలా పంపించగలను.
ఆ.
ఎట్టు సూచి చూచి యిది పాప మనక య, య్యసురవాతఁ ద్రోతు నదయవృత్తి
నరిగి యేన యిప్పు డసురకు నాహార, మగుదు వారిఁ బుచ్చ నగునె నాకు. 252

చూచి చూచి ఈ పాపం నే చోయలేను. నేనే ఆ అసురకు ఆహారంగా వెళతాను
వ.
అని యాత్మపరిత్యాగంబునందుఁ గృతనిశ్చయుం డై యున్న బ్రాహ్మణుం జూచి బ్రాహ్మణి యి ట్లనియె. 253
Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-9
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్. 244

ఏకచక్రపురంలో పాండవులు తమ యింటి గృహస్థునకు కలిగిన కష్టాన్ని నివారించాలని కుంతి పాండవులకు చెపుతూ పై విధంగా అంటుంది.

పాండవులు జననీ సహితముగా వారణావతానికి వెళ్ళిన తరువాత దుర్యోధనునిచే నియమింపబడిన పురోచనుడు తాను నిర్మించిన చతుశ్శాలను వారికి చూపిస్తాడు. దానిలో వారు గృహప్రవేశం చేస్తారు. ధర్మరాజు ఆ గృహం లాక్షాగృహం అని గ్రహించి విదురుడు చెప్పిన ముందు జాగ్రత్త గుఱించి భీమునికి చెపుతాడు. భీముడు పురోచనునితో సహా ఆ గృహాన్ని వెంటనే తగలేద్దామంటాడు.

ధర్మరాజు అతడిని వారించి అలా చేస్తే భీష్మవిదురులకు కోపం రావచ్చని అగ్ని భయంతో మనం వేఱేచోటకు వెళ్ళితే మన ఆచూకిలోనే దుర్యోధనుడుంటాడు అనిచెప్పి అప్పటికా ఆలోచనని విరమింప చేస్తాడు. ఈలోగా విదురుఢు రాబోయే కృష్ణచతుర్దశినాటి రాత్రి లాక్షాగృహ దహనం జరుగుతుందని, జాగ్రత్తగా ఉండమని ఖనికు డనేవాడిని వారివద్దకు పంపి హెచ్చరిస్తాడు. ఖనికుడు పాండవులు క్షేమంగా బయటపడటానికి లాక్షాగృహం నుండి రహస్యమార్గాన్ని నిర్మించి పాండవులకది చూపించి జాగ్రత్తలు చెప్తాడు. పురోచనుడు పంపించిన నిషాద స్త్రీ తన ఐదుగురు పుత్త్రులతో లక్కయింటి ప్రక్కనే నిదురిస్తుండగా ఆ రాత్రి పురోచనుడు కూడా లక్కయింటిలోనే నిద్రిస్తుండగా భీముడు అర్ధరాత్రి సమయంలో పురోచనుని కంటె ముందే తాను మేల్కని లక్కయింటికి నిప్పుపెట్టి నిద్రిస్తున్న పాండవులను తల్లితో సహా తన భుజస్తంధాలమీద, చేతులతోనూ మోసుకుని రహస్య ద్వారం గుండా బయటపడి ఆవార్తను ఖనికుని ద్వారా విడురునికి చేరవేస్తాడు. లక్కయింటితో పాటుగా ఓక స్త్రీ ఐదుగురు మగవారు దహనమై పోవటంచేత పాండవులు , కుంతి చనిపోయారని అందరూ అనుకుని ఆ విషయం ధృతరాష్ట్రునికి చేరవేస్తారు. దుర్యోధను డావార్తవిని సంతోషపడతాడు. తన సేవకుడు పురోచనుడు కూడా ప్రమాదవశమున ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని భావిస్తాడు.

తరువాత నిద్రిస్తున్నపాండవులను తల్లిని భీముడు ఒక చెట్టుక్రిందికి చేర్చి వారికి నీళ్ళు తీసుకొని వచ్చి వారు తమంతట తాము మేల్కొనేదాక వేచి ఉందామనుకుంటాడు.

తరువాత కథ వ్యాసుడు వారిదగ్గఱకు వచ్చి వారికి హితోపదేశం చేసి రాగల కాలంలో ధర్మరాజు యుద్ధంలో కౌరవులను నిర్జించి సుఖంగా రాజ్యపాలన చేయగలడని కుంతీ దేవికి చెప్పి వారిని ఏకచక్రపురానికి వెళ్ళమని తరువాత తాను అక్కడికి వచ్చి వారిని తిరిగి కలుస్తానని చెప్పి వెళతాడు.

తరువాత భీమహిడింబల వివాహము, ఘటోత్కచుని జననము వగైరా జరుగుతాయి.

ఘటోత్కచుడు పుట్టిన వెంటనే పెద్దవాడయిపోయి తాను తన తల్లితో అరణ్యంలో నివసిస్తానని, పని కలిగినప్పుడు తనను తలచుకుంటే వస్తానని చెప్తాడు. తరువాత కుంతీ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళి అక్కడ ఓ బ్రాహ్మణుని గృహంలో తల దాచుకుంటారు. ఓరోజు ఆ హ్రాహ్మణుని యింటినుండి రోదనలు వినిపిస్తే కుంతి వారికి వచ్చిన కష్టాన్ని తొలగించి వారికి సహాయం చేయటం తమ ధర్మమని పాండవులకు చెపుతూ ఈ విధంగా పలుకుతుంది.
క.
కృత మెఱుఁగుట పుణ్యము స, న్మతి దానికి సమము సేఁత మధ్యము మఱి త
త్కృతమున కగ్గలముగ స, త్కృతి సేయుట యుత్తమంబు కృతబుద్ధులకున్ 244.

ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని గుర్తించగలగటం మంచి పని. మంచి మనసుతో దానికి సమంగా ఇతరులకు అవకాశం కలిగినపుడు తిరిగి ఉపకారం చేయటం మధ్యమమైనది. వారు చేసిన ఉపకారానికంటె ఎక్కువ ప్రత్యుపకారం మనం తిరిగి వారికి చేయటం ఉత్తమమం మనలాంటి చేయగలిగిన బుద్ధి కలిగిన వారికి.- అని కుంతీ దేవి తన పుత్త్రులతో అంటుంది.