Unknown
ఆది పర్వము-ద్వితీయాశ్వాసము-౭
ఆస్తీకుఁడు సర్పయాగము నివారించుట
తక్షకుని విషాగ్నికి తన హర్మ్యంబుతో సహితముగ పరీక్షన్మహారాజు దగ్ధుడవుతాడు. తరువాత జనమేజయుడు ఉదంకునితో ప్రేరేపింపబడినవాడై సర్పయాగమున తక్షకాది కాకోదర సంహతిని అగ్నిలో పడి నాశనమయ్యేట్లుగా చేయదలచి పురోహితులను ఋత్విజులను పిలిచి వారితో ఇలా అంటాడు.
చ.
తన విషవహ్ని మజ్జనకుఁ దక్షకుఁ డెట్లు దహించె నట్ల యే
నును సహమిత్ర బాంధవజనుం డగు తక్షకు నుగ్ర హవ్యవా

హన శిఖిలన్ దహించి దివిజాధిపలోక నివాసుఁ డైన మ

జ్జనకున కీ యుదంకునకు సాధుమతంబుగఁ బ్రీతిఁ జేసెదన్.
౨౦౬

ఈవిధంగా యజ్ఞం ప్రారంభం అవుతున్నపుడు ఓ వాస్తుశాస్త్ర ప్రవీణుడు ఇది కడచననేరదని జోస్యంచెపుతాడు.
అయినా సరే అని యజ్ఞం ప్రారంభిస్తారు. తక్షకుడు ఇంద్రుని రక్షించమని వేడుకొంటాడు. వాసుకి చెల్లెలయిన జరత్కారువుని తన కొడుకు ఆస్తీకుని పంపించి ఆ యజ్ఞాన్ని ఆపుచేయించవలసినదని వాసుకి ప్రభృతులు కోరతారు. అప్పుడు తల్లి యనుజ్ఞనొంది ఆస్తీకుడు జనమేజయుని యాగశాల చేరుకుని జనమేజయుడిని ఆతని యజ్ఞాన్ని ఈ విధంగా స్తుతిస్తాడు.
మ.
రజనీనాథకులై క భూషణుఁడవై రాజర్షి వై ధారుణీ
ప్రజ నెల్లన్ దయతోడ ధర్మ చరితం బాలించుచుం దొంటి ధ

ర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్

విజయుం బోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పారీక్షతా
.౨౨౪
రజనీనాథ=చంద్ర
పారీక్షతా=పరీక్షత్పుత్రా
తరలము.
కువలయంబున వారికోరినకోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో

నవని రాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం

దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తు లైరి మహా ద్విజుల్
.౨౨౫
ఉ.
అమ్మనుజేంద్రుఁ డైన నలుయజ్ఞము ధర్మజురాజసూయయ
జ్ఞమ్ముఁ బ్రయాగఁ జేసిన ప్రజాపతి యజ్ఞముఁ బాశపాణి య

జ్ఞమ్మును గృష్ణుయజ్ఞము నిశాకరు యజ్ఞము నీ మనోజ్ఞ య

జ్ఞమ్మును నొక్కరూప విలసన్మహిమం గురువంశవర్ధనా
.౨౨౬
చ.
వితతమఖప్రయోగ విధివిత్తము లుత్తమధీయుతుల్ జగ
న్నుత సుమహాతపోధను లనుగ్రహనిగ్రహశక్తియుక్తు లీ

క్రతువున ఋత్విజుల్ కమలగర్భసమానులు పూర్వదిక్సతి

క్రతువున యాజకోత్తములకంటెఁ బ్రసిద్ధులు సర్వ విద్యలన్.
౨౨౭
విధివిత్తములు=కార్యము నెఱిఁగినవారు
పూర్వదిక్సతి=ఇంద్ర
శా.
విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృ
ష్ణద్వైపాయనుఁ డే గుదెంచి సుతశిష్యబ్రహ్మసంఘంబుతో

సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా

క్షాద్విష్ణుండవ నీవు భూపతులలోఁ గౌరవ్య వంశోత్తమా
.౨౨౮
ఉ.
ఆర్తిహర క్రియాభిరతుఁ డై కృతసన్నిధి యై ప్రదక్షిణా
వర్తశిఖాగ్ర హస్తముల వహ్ని మహాద్విజ దివ్యమంత్ర ని

ర్వర్తిత హవ్యముల్ గొనుచు వారిజ వైరికులేశ నీకు సం

పూర్తమనోరథంబులును
బుణ్యఫలంబులు నిచ్చు చుండెడున్.
ఆర్తిహర=దుఃఖమును దొలఁగించు
వారిజ వైరి=చంద్ర
(ఎవరినైనా మెప్పించి వారినుండి ఏ కోరికనైనా తీర్చుకోవాలంటే ఎలా మాట్లాడాలో ఇంతకంటె ఎక్కడా బాగా చెప్పుండరు)
వ.
అని జనమేజయుండు నాతనియజ్ఞ మహిమను ఋత్విజులను సదస్యులను నగ్నిభట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతులయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.౨౩౦
ఉ.
మానిత సత్యవాక్య యభిమన్యు కులోద్భవ శాంతమన్యుసం
తానుఁడ వై దయాభి నిరతస్థితి నీవు మదీయబంధుసం

తానమనోజ్వరం బుపరతంబుగ నాకుఁ బ్రియంబుగా మహో

ర్వీనుత సర్పయాగ ముడివింపుము కావుము సర్పసంహతిన్
.౨౩౧
శాంతమన్యుసంతానుఁడు =శాంతించిన కోప సమూహము గలఁవాడు
ఉపరతంబు=ఉడుగు
వ.
అనిన సర్వజనానుమతంబుగా జనమేజయుం డాస్తీక ప్రార్థనం జేసి సర్పయాగం బుడిగించె.౨౩౩
క.
ఒనర జరత్కారమునీం,ద్రునకు జరత్కారునకు సుతుం డైనమహా
మునివరు నాస్తీకుని ముద,మునఁదలఁచిన నురగభయముఁ బొందదు జనులన్.
౨౩౭
ఆది పర్వము - ద్వితీయాశ్వాసము సమాప్తం.