Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-4
వేఁట వోయిన పాండురాజునకు శాపంబు గలుగుట
తే.
పఱవ నోపక యున్న మైమఱచి పెంటిఁ
బెనఁగి యున్నను బ్రసవింప మొనసియున్నఁ
దెవులుగొని యున్న మృగములఁ దివిరి యేయ
రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన. 53
ఎఱచి= మాంసము

పాండు రాజు కుంతీ మాద్రిలను వివాహమాడి దిగ్విజయము చేసి అనేకమంది రాజులను వశీకృతులుగా జేసికొని విపరీతమైన ధనమును సంపాదించి తెచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి అనేక దానములు చేస్తూ గొప్ప ప్రసిద్ధిని పొందుతాడు.

ఒకసారి తన ఇద్దఱు భార్యలతో కలసి అడవికి వేటకు వెళ్తాడు పాండురాజు. వేటాడుతూ వేటాడుతూ ఒక్కమృగం కూడా దొరకకపోయి కోపించి ఉండగా రెండు - ఒక మగ, ఒక ఆడ లేళ్ళు ఒకదానితో ఒకటి కలసి ఉండగా వాటిపై 5 బాణాలు ప్రయోగించి చంపుతాడు. అప్పుడు వానిలో ఒక లేడి అతనితో మనుష్యభాషలో నేను కిందము డనే మునిని, నేను నా భార్యతో కలసి మృగరూపంలో క్రీడిస్తుండగా మమ్మల్ని వధించావు. నీవు రాజువు కాబట్టి వేటాడటం దోషం కాదు. అయినప్పటికీ - పరుగు పెట్టడానికి అశక్తలై ఉన్నప్పుడూ, శరీరాన్ని మరచి పెంటితో కలసి ఉన్నప్పుడూ, ప్రసవించ డానికి సిద్ధంగా ఉన్నపుడూ, తెవులుకొని ఉన్నప్పుడూ - ఈ సమయాల్లో మృగ మాంసం ఆహారముగా జీవించే ఎఱుక కులం వారైనా గానీ మృగాల్ని వేటాడరు.
చ.
ఇనసమ తేజు లై ధరణి ధర్మపథంబు దప్పఁ ద్రొ
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి య
త్యనఘచరిత్ర యిట్లు దగునయ్య యధర్మువు సేయ నీ యెఱుం
గని నృపధర్మువుల్ గలవె కౌరవపుంగవ గౌరవస్థితిన్. 54

భరతవంశంలో పుట్టిన నీకు అన్ని ధర్మాలూ తెలుసు. ఇలా ధర్మం కాని పనిని చేయటం(పెంటితో కలసి మృగరూపంలో క్రీడిస్తున్న మమ్ము వధించటం) నీకు తగునా? అని అడుగుతాడు మనుష్యభాషలో.
వ.
అని తన్ను నిందించి పలికిన నా మృగంబు పలుకుల కలిగి పాండు రాజి ట్లనియె. 55
వ.
తొల్లి యగస్త్యమహా మునీంద్రుండు మృగమాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్ణయించె దీని నీకు నిందింపం దగునే యనుచున్న నామృగంబు బాణఘాతక్షతవేదన సహింప నోపక సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితివి గావున నీవునుం బ్రియసమాగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు మని నీ ప్రియయు నిన్ను ననుగమించు నని పాండురాజునకు శాపం బిచ్చి గతప్రాణములై పడియున్న మృగములం జూచి శోకించి పాండురాజు పరమనిర్వేదనపరుండయి . 57
క.
ఎట్టివిశిష్టకులంబునఁ, బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్
గట్టినకర్మ ఫలంబులు, నెట్టన భోగింప కుండ నేర్తురె మనుజుల్. 58

ఎంత గొప్పకులం లో పుట్టిన వారైనా సదసద్వివేకములు కలిగి ఉన్నప్పటికీ పూర్వం చేసిన కర్మ ఫలితాన్ని పొందకుండా వుండటం సాధ్యం కాదు గదా అనుకున్నాడు.