Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట

చ.
ుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

సత్యము యొక్క గొప్పతనాన్ని ఎంతో బాగా వివరించిన పద్యం. మనందరం రోజూ మననం చేసుకోవాల్సిన పద్యం. శకుంతల దుష్యంతునితో సత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన పద్యం.

ఎట్టి సాధ్వులకును బుట్టినయిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు
వ.
కావున నీ విక్కుమారుం దోడ్కొని నీ పతిపాలికి నరుగు మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడు వంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుం డై యున్న యా రాజుం గనుంగొని. ౬౭

కణ్వ శిష్యులు తోడురాగా భరతునితో శకుంతల దుష్యంతుని రాజసభకు వచ్చింది.
క.
గురునాశ్రమంబునను ము, న్నరుదుగఁ బతివలనఁ గనినయనురాగము నా
దరణము ననుగ్రహంబును, గరుణయు సంభ్రమము నపుడు గానక యెదలోన్
. ౬౮

పూర్వం కణ్వాశ్రమం లో అరుదుగా నైనా పతివలన కనిన అనురాగము కానీ, ఆదరణ కానీ, అనుగ్రహం కానీ, కరుణ కానీ, సంభ్రమం కానీ ఆతని మొహంలో కనిపించక అప్పుడామె మనసులో ఇలా అనుకొందట.
క.
ఎఱుఁగఁడొకొనన్ను నెఱిఁగియు, నెఱుఁగనియట్లుండునొక్కొ యెడ దవ్వగుటన్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు, మఱవరె బహుకార్య భారమగ్నులు గారే.
౬౯

నన్ను ఎఱగడా? ఎఱగనట్లున్నాడా? చాలాకాలం అయింది కాబట్టి ఒకవేళ మఱచిపోయాడా ? రాజులు తెలివిలేని వారు కాబట్టి మఱిచిపోయారేమో ఎన్నోకార్యాలలో నిమగ్ను లై ఉండటం చేత.
చ.
తలఁపగ నాఁడు పల్కిన విధం బెడఁ దప్పఁగ వీడెనొక్కొ చూ
డ్కులు విరసంబు లై కరము క్రూరము లై ననిమిత్త మేమియో
కలయఁగ బల్కరించి రుపకారులు నై రని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాధులన్.౭౦

ఆరోజు పలికిన మాటల్ని విడిచిపెట్టేసాడా ఏమిటి? ఇతని చూపులు విరసంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు. కడు క్రూరంగా కూడా వున్నాయి. కారణం ఏమిటో తెలియదు. రాజులు మనల్ని పలకరించారు, మనకు ఉపకారం చేసారు అని వారిని బుద్ధిమంతులైన వారు నమ్మి ఉండకూడదు. ఎందుకంటే వారు నవ ప్రియులు. ఎప్పుడూ కొత్తంటే పడిచస్తారు కనక. అనుకుంది ఆవిడ.
వ.
అని తలంచి చింతా క్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున ౭౧
ఇంకా మనసులో ఇలా అనుకుందట.
క.
మఱచినఁ దలఁపింపఁగ నగు, నెఱుఁగని నాఁ డెల్ల పాట్ల నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని, కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే. ౭౨

నిజంగా మర్చిపోతే గుర్తు చేయవచ్చు, ఎరక్కపోతే ఎలాగోలా తెలుసుకొనేలా చేయొచ్చు. తెలిసి వుండికూడా తెలియనట్లుగా ఉండే దుర్మార్గుడికి తెలియచెప్పటం ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు.
వ.
అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నా పూర్వవృత్తాంతం బెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. ౭౩
క.
జననాథ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి,చ్చిన వరము దలంప వలయుఁ చిత్తము లోనన్. ౭౪

వేట నెపంతో కణ్వాశ్రమమునకు వచ్చినపుడు నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకో మహారాజా అన్నది.
క.
బాలార్క తేజుఁ డగు నీ,బాలుఁడు నీ కొడుకు వీనిఁ బౌరవకులర
త్నాలంకారు నుదారగు,ణాలయు యువరాజుఁ జేయు మభిషేకమునన్. ౭౫

ఈ బాలుడు నీ కొడుకు. అందుచేత వరము ఇచ్చిన విధంగా వీనికి యౌవరాజ్యపట్టాభిషేకం జరిపించాల్సింది. అన్నది.
వ.
అనిన విని దుష్యంతుడు దాని నంతయు నెఱింగియు నెఱుంగని వాఁడపోలె ని ట్లనియె.౭౬

ఇక్కడ కథను కొంత మార్చి కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలాన్ని వ్రాసారు. మునీశ్వరు శాపం వలన దుష్యంతుడు మరచినట్లుగా వ్రాయటం జరిగింది. వ్యాస భారతంలో ఎలా ఉన్నదో నాకు తెలియదు.
క.
ఏ నెఱుఁగ నిన్ను నెక్కడి, దానవు మిన్నకయ యనుచితంబులు వలుకం
గా నేల యరుగు మంబురు, హానన యెందుండి వచ్చి తందులకు వడిన్. ౭౭

నేను నిన్ను ఎఱగనే ఎఱగను పొమ్మన్నాడు. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు.

ఇటువంటి శకుంతలల కథలు అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో ఎన్నెన్నో... అలా కొనసాగుతూనే ఉన్నాయి.