Unknown
ఆది పర్వము-పంచమాశ్వాసము-6
కుంతీదేవి యందు ధర్మరాజు జననము
వ.
అని పుత్త్రముఖావనలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించినఁ గుంతియుం కొండుకనాఁడు దుర్వాసుని చేతం బడసిన మంత్రంబు తెఱంగు పతి కెఱింగిచి యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె నే వేల్పు నారాధింతు నాన తిమ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె. 91

ఈ వరం గురించి కుంతి పాండురాజుకు చెప్పినది కాని తా నా వరాన్ని మునుపే ప్రయోగించి చూచితినని గాని తత్ఫలితాన్న గాని కుంతి పాండురాజునకు చెప్పినట్లు ఎక్కడా లేదు. అలా జరిగితే కథే వేఱుగా ఉండేదేమో.
క.
లలితాంగి యెల్లలోకం, బులు ధర్మువునంద నిలుచుఁ బలుపుగ ధర్ముం
దలఁపుము యాతఁడె వే, ల్పులలోపలఁ బెద్ద ధర్మువున సత్యమునన్. 92

లోకాలన్నీ ధర్మం నందే నిలుస్తాయి. ధర్మానికి ఆధారమైన ధర్మమూర్తి యమధర్మరాజు. ఆతడే వేల్పులందరిలో పెద్దవాడు కూడా. అందుచేత ధర్మరాజుని తలపమన్నాడు పాండురాజు.
వ.
అని నియోగించినఁ గుంతియు బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన నా ధర్ముండును యోగమూర్తిధరుం డై వచ్చి వరం బిచ్చినం గుంతియు దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93

ఇప్పుడు మునుపటి వలె సద్యోగర్భం కాక మామూలుగానే గర్భాన్ని దాల్చి 9 నెలలకు బదులుగా సంవత్సరం పాటు గర్భాన్ని ధరించిందన్నమాట.
ఉ.
శాత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుఁగొంద నైంద్ర న
క్షత్ర యుతుండు గా శశిప్రకాశజయోన్నత మైన యష్టమిన్
మిత్రముఖగ్రహప్రతతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మ మూర్తి యై. 94
ఆ విధంగా ధర్మరాజు కుంతికి అష్టమి నాడు ఇంద్రనక్షత్రంలో ఆభిజిత్ లగ్నంలో పుట్టాడన్నమాట.
క.
కురుకులవిభుఁ డగు ధర్మ, స్థిరమతి యగు నీతఁ డనుచు ధృతిఁ జేసి యుధి
ష్ఠిరుఁ డనునామముఁ దా ను, చ్చరించె నాకాశవాణి జనవినుతముగాన్. 97

ఆకాశవాణి ఆ పుత్రునకు యుధిష్టిరుడు అనే పేరు పెట్టిందట.