Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౩
శల్యుఁడు ధర్మరాజుకు ఇంద్రుడు శచీసమేతంగా పడిన కష్టాల్ని ఇలా చెప్తాడు.
పూర్వం దేవతల్లో మాన్యుడైన త్వష్ట అనేవాడు ఇంధ్రునికి కీడు చేయ దలచి విశ్వరూపుడనే మూడు తలలవాణ్ణి సృష్టించాడు. అతడు ఇంద్రపదవికోరి తపస్సు చేస్తాడు. ఇంద్రుడు మామూలుగా అప్సరసల్ని పంపి తపస్సు భగ్నం చెయ్యాలనుకుంటాడు. అది సాధ్యం కాకపోయే సరికి ఇంద్రుడతడిని చంపివేసి ఎవ్వరికీ తెలియదుగదా అనుకుంటాడు. కాని ఓ ఏడాది గడిచేసరికి భూతగణములాక్రోశము చేయగా ఇంద్రుడో విషమవ్రతం చేసి తద్వారా తనుచేసిన బ్రహ్మహత్యా పాపాన్ని సముద్ర తరు ధరణీ స్త్రీజనములందు విభాగించి పెట్టి (ఇలా కూడా చేయొచ్చన్నమాట) నిజకల్మషాన్ని బాపికొని ఉండగా త్వష్ట కోపించి
తే.
అనపరాధుఁ దపోనిధి నధిక శాంతి, యుక్తుఁ జంపినపాపాత్ము నుఱుక పట్టి
మ్రింగఁ జాలెడువాని నుత్తుంగ దేహు, నేను సృజియింతుఁ జూడుఁడీ యీ క్షణంబ.౧౨౧

అని వృత్రుడనేవాణ్ణి సృష్టించి ఇంద్రునిమీదకు యుద్ధానికి పంపుతాడు.వృత్రుడు ఇంద్రుణ్ణి మింగివేస్తాడు.అప్పుడు దేనతాగణము అతనికి ఆవులింత కలిగేలా చేస్తారు. అప్పుడు ఇంద్రుడు సంకుచిత దేహుడై బయట పడతాడు.
తరువాత యుద్ధంలో గెలువలేక గెలిచే ఉపాయం చెప్పమని విష్ణుదేవుణ్ణి అడుగుతారు. అప్పుడు కొంతకాలం తర్వాత ఇంద్రుని వజ్రయుధపు అంచును ఆశ్రయిస్తానని అప్పుడింద్రుడతణ్ణి సంహరించవచ్చని చెప్పి ప్రస్తుతానికి వారిద్దరూ స్నేహం చేస్తే మంచిదని చెప్తాడు. అప్పుడు మునులందరూ వృత్రుడిని చేరి ఇలా అంటారు.
క.
భుజబల దుర్జయుఁ డింద్రుం, డజయ్యుఁడవు నీవు నీకు నతనికి మీలో
విజయము దక్కదు మీ రే,చి జగంబులు నొవ్వ రణము సేయఁగ నేలా.౧౩౩
క.
మైత్రీ సౌఖ్యముఁ బోలునె, శాత్రవ మెమ్మెయిఁ దలంప శక్ర శ్రీకిం
బాత్రమ వై యొప్పుగఁద,న్మిత్రుఁడ వగు మిదియ మేలు మీ యిద్దఱకున్.౧౩౪

పైగా సత్పురుష సాంగత్యము సంభవించినపుడు చేయకుండా వుండటం నీతిగాదని అంటారు. అప్పుడు వృత్రుడు వారినుంచి ఆర్ద్రమైనదానివలన గాని శుష్కమైనదాని వలన గాని పగలుకాని రాత్రికాని తరువువల్లకాని పాషాణము వల్లకాని శస్త్రాస్త్రముల వల్లగాని చావు లేకుండా వుండే వరం ఇస్తే ఇంద్రునితో స్నేహం గా వుంటానంటాడు. దానికి అందరూ అంగీకరిస్తారు.
ఒకరోజు సాయంకాలం వృత్రుడు సముద్రతీరానున్నపుడు, ఇంద్రుడు రాత్రి పగలూ కాని అసుర సంధ్యాసమయంలో
ఆర్ద్రమూ శుష్కమూ కాని సముద్రపు నురుగును వజ్రాయుధం అంచుకు పట్టించి వృత్రుని మెడ నరకగా అదే సమయంలే వజ్రాయుధపు అంచుని విష్ణువు ఆవహించి ఉండి వృత్రుడిని చంపగలుగుతాడు. వృత్రుడిని చంపిన బ్రహ్మహత్యా పాతకం ఇంద్రుడిని ఆవహించటం చేత దేవలోక సింహాసనార్హత కోల్పోతాడింద్రుడు.