Unknown
ఆది పర్వము-షష్టాశ్వాసము-11
క.
మనుజులకు నెవ్విధంబున, ననతిక్రమణీయ మైనయాపద్విషయం
బున సంతాపింపగాఁ, జన దని యెఱిఁగియును దగునె సంతాపింపన్. 254

మనుష్యులకు ఏ విధంగా నైనా దాటరాని ఆపద వచ్చినపుడు, బాధపడి లాభం లేదని యెఱిగినపుడు, భాధపడటం ఎందుకు?
వ.
ఆ రక్కసునకు నే నశనం బయ్యెద మీరు వగవకుండుఁడు భార్యయందుఁ బడయంబడునపత్యంబు నాయందు మున్న పడసితి రేనును ఋణవిముక్త నయితిం బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు మఱి యట్లుంగాక. 255
ఆ.
పురుషుకంటె మున్నుపరలోక మే గిన, సతియ నోఁచినదియు సతులలోనఁ
బురుషహీన యైనఁ బరమపతివ్రత, యయ్యు జగము చేతఁ బ్రయ్యఁబడదె.256

భర్తకంటె ముందు చనిపోయిన భార్య నోచినదే నోము, భర్త లేని స్త్రీ పరమ పతివ్రత యైనా లోకములో దూషింప బడుతుంది గదా.
ఆ.
పడిన యామిషంబు పక్షు లపేక్షించు, నట్లు పురుషహీన యయినయువతిఁ
జూచి యెల్లవారుఁ జులుక నపేక్షింతు, రిదియుఁ బాపమనక హీనమతులు. 257

క్రిందపడిన మాంసాన్ని పక్షులపేక్షించినట్లుగా భర్తలేని యువతిని చూచి పాపమని తలచకుండా అందరూ హీనమైన మతి కలవారై తేలికగా కావాలనుకుంటారు.
ఆ.
సతి విముక్త యయినఁ బతికిఁ బునర్దార, సంగ్రహంబుసేఁత శాస్త్రమతము
పతివిముక్త యయినసతి కన్యపురుష సం,గ్రహముసేఁత లోకగర్హితంబు.258

భార్య చనిపోయినవాడు తిరిగి వివాహం చేసుకోవటం శాస్త్రాలంగీకరించాయి. కాని భర్తపోయిన స్త్రీకి పునర్వివాహం లోకంచే నిందింపబడుతుంది.
వ.
కావున నేను భవద్విహీన నయి యొక్కనిముషం బేనియు జీవింప నేర నేర్చితి నేనియు నిక్కుమారుల రక్షింపనేర నెట్లనిన శూద్రులు వేదశ్రుతిం బ్రార్ధించు నట్లు కులాచార సదృశులు గానివా రిక్కన్యం బ్రార్ధించినం దత్ప్రతీకారంబు సేయను నిక్కుమారునందు గుణాధానంబు సేయను నాకొలంది గాదు మత్పరోక్షంబునం బునర్దారపరిగ్రహంబు సేసి గృహస్థధర్మంబులు నగ్నిహోత్రంబునుం బుత్త్రులను రక్షించునది యనుచు మరణ వ్యవసాయంబునం దున్న తల్లిని దండ్రిం జూచి కూఁతు రి ట్లనియె.259
గుణాధానము=మంచిగుణములు కలిగి ఉండేట్లుగా చేయటం
కొలది=శక్యము
ఆ.
ఒలసి యెంతకాల ముండిన నేను మీ, దానఁ గాను యొరులధనమ నన్ను
నెన్నఁ డయిన నొరుల కిచ్చుచో నసురకు, భోజనముగ నిచ్చి పుచ్చుఁ డిపుడ. 260

ఎంతకాలం నేను మీతో కలసివున్నా నేను పరాయి యింటికి వెళ్ళాల్సిన దాన్నేగాని మీ సొమ్మును కాదుగదా. అందుచేత నన్ను రాక్షసుని కాహారంగా పంపండి నేను వెడతాను అంటుంది కూతురు.
వ.
మీకు నాయందయ్యెడు ద్రౌహిత్రలాభంబునకంటె మీరిద్దఱు జీవించిన ననేక పుత్త్రపౌత్త్రలాభం బగు దానం జేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు.262
తే.
బాలుఁడొక్కండు కొండొకకోల చేతఁ
బట్టికొని యేన రక్కసుఁ గిట్టి చంపి
చులుక వత్తు మీరేడ్వఁగావలవ దనుచుఁ
గలయ నూరార్చెఁ దన తొక్కుఁ బలుకు లొప్ప. 263

ఓ చిన్న బాలుడు ఆ రక్కసుని నేను ఛంపేసి తిరిగి వస్తాను మీరెవ్వరూ ఏడవకండి అని చేతిలో ఓ పుల్లను పట్టుకొని వూపుతూ తన చిన్న చిన్నపలుకులతో వారిని ఓదార్చేడట.
వ.
వానియవ్యక్తవచనంబులు విని యందఱు నేడ్పుడిగిన నయ్యవసరంబునం గుంతీదేవి వారల డాయంబోయి. 264